*భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన
తెలంగాణకు భారీఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావొస్ పర్యటన సాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, బలాబలాలు, తమ ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెబుతామని తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అధికారిక బృందం వెళ్తున్న నేపథ్యంలో సంబంధిత వివరాలను ఆదివారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ ప్రకటనలో వెల్లడించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొనాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఆహ్వానం అందిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి అని స్పష్టం చేశారు. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి తో పాటు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి కూడా ఉన్నారు. విదేశీ, భారతీయ పారిశ్రామికవేత్తలను కలుసుకొని కొత్త ప్రభుత్వ విజన్ మరియు ప్రాధాన్యతలను వివరించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవకాశం ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్ గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది చక్కటి వేదిక అని పేర్కొన్నారు. మూడు రోజుల దావోస్ పర్యటనలో తాను, ముఖ్యమంత్రి కలిసి దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నామని వెల్లడించారు. తాము సమావేశం కాబోతున్న వారిలో నొవర్తీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓ లు, సీఎక్స్ఓ లు ఉన్నారని తెలిపారు. భారత్ కు చెందిన టాటా, విప్రో, హెచ్ సీఎల్ టెక్, జేఎస్ డబ్లు, గోద్రెజ్, ఎయిర్ టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో భేటీ అవ్వడమే కాకుండా సిఐఐ, నాస్కం వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో సమావేశం అవుతామని వివరించారు. దావోస్ పర్యటన విజయవంతం కావడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదని, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్ మరియు ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. తొలిసారి దావోస్ పర్యటనలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కిందని, ఆయనను వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో మాట్లాడవలసిందిగా ఆహ్వానించారని వెల్లడించారు. అక్కడ జరగబోయే చర్చగోష్టిలో పురోగమిస్తున్న వైద్యరంగంపై అభిప్రాయాలను పంచుకుంటారని తెలిపారు.
*అర్హులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతాయి
ఆరు గ్యారంటీలు, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయాక సహనం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అర్హులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన వెల్లడించారు. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తాం… బిఆర్ఎస్ నేతలు చూస్తూ కూర్చోండని ఆయన వ్యాఖ్యానించారు. 5 సంవత్సరాలలో అందరూ ఆశ్చర్యపోయే రీతిలో అబివృద్ది చేస్తామని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనుండి వారంలో రెండు రోజుల నల్గొండలోనే అందుబాటులో ఉంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య రాజకీయ ప్రక్రియలో గెలుపు, ఓటములను సమానంగా అంగీకరించే పరిణతి అవసరం. We may be personally defeated, but our principles never! అంటాడు ప్రఖ్యాత అమెరికన్ జర్నలిస్ట్ విలియమ్స్ లాయిడ్ గ్యారిసన్. దురదృష్టం కొద్ది ప్రతిపక్ష పార్టీ ఓటమిని, ప్రజాతీర్పును అంగీకరించలేకపోతోంది. ఓటమి అన్నది ఏదో ఒక ఎన్నికలో వచ్చేది కాదు, నాయకులుగా మనం కోల్పోయే సిద్ధాంత వైఫల్యం వల్ల కూడా అన్న సంగతిని ఏ నాయకుడు మరువకూడదు. బీఆర్ఎస్ పార్టీ విలువల్ని పూర్తిగా విడిచిపెట్టింది. అధికారంలో ఉండగా ప్రజాస్వేచ్ఛను హరించి, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి, అవినీతి, అక్రమాలకు వంతపాడి, నియంతృత్వ విధానాలు అవలంబించి, చెయ్యరాని తప్పులన్నీ చేసి.. ఇప్పుడు ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారపక్షం మీద ఎదురుదాడి చేస్తున్నది. వీటిని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ప్రజలకు వివరించేందుకు శ్వేతపత్రం విడుదల చేయడం ప్రధాన ప్రతిపక్షానికి మింగుడు పడటం లేదు. ఏమాత్రం సంయమనం పాటించకుండా, కనీస పరిణతి ప్రదర్శించకుండా స్టేట్మెంట్లు ఇచ్చారు. శ్వేతపత్రంలో మీరు తేల్చేది ఏంలేదు, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరంటూ ముందే హేళనగా మాట్లాడటం వారిలో గూడుకట్టుకున్న నియంతృత్వ భావజాలానికి నిలువెత్తు నిదర్శనం. శ్వేతపత్రం ద్వారా వారి బండారం మొత్తం తెలంగాణ ప్రజానీకానికి తెలియగానే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు స్వేదపత్రం పేరుతో, 420 హమీల పేరుతో హద్దులు దాటి ప్రవర్తించడం వారి మానసిక స్థితికి అద్దం పట్టింది. తెలంగాణకు దళితుడే ముఖ్యమంత్రి, కేజీటూపీజీ ఉచిత విద్య, ప్రతీ రైతుకు ఉచిత ఎరువులు, ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీళ్లు, ధాన్యానికి గిట్టుబాటు ధరలు అంటూ వందల అబద్ధాలు చెప్పి జనం నోట్లో మట్టికొట్టిన బీఆర్ఎస్ నాయకులు నెలరోజుల కాంగ్రెస్ ప్రభుత్వంపై పుస్తకాలమీద పుస్తకాలు తీసి బదనాం చేయాలనే రాక్షస ప్రయత్నం చేయడం వారికే చెల్లింది. అని వెంకట్ రెడ్డి అన్నారు.
*16న లేపాక్షిని సందర్శించనున్న ప్రధాని మోడీ
ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు. పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌ను సందర్శించనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్ జవహర్ రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ కూడా పాల్గొనే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీని ఆదేశించారు.
*పొన్నం ప్రభాకర్ పొలైట్‌గా మాట్లాడాలి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. చరిత్ర కలిగిన దేవాలయం శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, ఆలయ పూజారులు, అధికారులు గుట్టపై వున్న శివాలయం శిథిలావస్థలో వుందని తెలిపారు. దీంతో.. ఎంపీ నిధులు నుండి కొండపైన ఉన్న గుడి అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తా అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అయోధ్య రాముడి అక్షింతలపై రాజకీయం చేస్తున్నమంటున్న వారి మాటలను, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు బండి సంజయ్. అక్షింతల కార్యక్రమం కేవలం బిజెపి పార్టీది కాదు అన్ని పార్టీలకు అతీతం, వారికి కూడా ఆహ్వానం పంపామని ఆయన వెల్లడించారు. కేటీఆర్ కు ఉన్న అహంకారం మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఉందని, బీఆర్‌ఎస్ వాళ్ళు ఎది మాట్లాడితే మంత్రి పొన్నం ప్రభాకర్ అదే మాట్లాడుతాడన్నారు. కేటీఆర్ వల్ల బీఆర్‌ఎస్ ఎలా నాశనం అయిందో, రేపు పొన్నం ప్రభాకర్ అహంకార మాటలతో కాంగ్రెస్ పార్టీ అలాగే నాశనం అవుతుందని, నేను సంస్కారంతో మాట్లాడుతున్న, పొన్నం ప్రభాకర్ కూడా పోలైట్ గా మాట్లాడాలన్నారు బండి సంజయ్. బీఆర్‌ఎస్ నాయకుల దృష్టిలో నా కొడుకులు మంచి బట్టలు వేసు కోవద్దు, నా కొడుకులపై చిల్లర రాజకీయం చేస్తున్నారని, వారి వ్యవహార శైలితో బాధ కలుగుతుందన్నారు. కార్యకర్త కోరిక మేరకు ఓ కారు ప్రారంభం చేస్తే, వాళ్ళు బండి సంజయ్ దే అని ముడిపెట్టి చిల్లర రాజకీయం చేస్తున్నారన్నారు. పొన్నం ప్రభాకర్ మీద ఎన్ని కేసులు వున్నాయి, నా పై 100 కు పైగా కేసులు వున్నాయని, పొన్నం ప్రభాకర్ అధికారంలో వున్నం కదా అని అహంకారంగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ది చెప్తారన్నారు. కేంద్ర నాయకత్వం ఎక్కడ పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడే పోటీ చేస్తా, పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 350 సీట్లకు పైగా గెలువ బోతున్నం, గల్లీలో ఏ పార్టీ వున్న కేంద్రంలో మాత్రం మోడీ ప్రభుత్వమే వస్తుందన్నారు. ఎన్నికల వరకే రాజకీయం మాట్లాడాలి కాని, తరువాత అభివృద్ధి కోసం మాత్రమే పని చేయాలని ప్రధాని మోడీ సూచించారని బండి సంజయ్ అన్నారు.
*రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభమైంది.మణిపూర్‌లోని తౌబాల్ నుంచి ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ జెండా ఊపి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. 67 రోజుల్లో 110 జిల్లాల గుండా 6,700 కిలోమీటర్లకు పైగా యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను 2004 నుండి రాజకీయాల్లో ఉన్నానని, నేను మొదటిసారిగా భారతదేశంలోని పాలనా వ్యవస్థ కుప్పకూలిన రాష్ట్రానికి వెళ్లానని, మనం మణిపూర్ అని పిలిచే రాష్ట్రం గతంలో లాగా లేదు. కొంతకాలంగా మణిపూర్ రగులుతోంది.. ఇంతవరకు ప్రధాని మోడీ మణిపూర్ రాలేదు.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వివక్షకు మణిపూర్ ఉదాహరణ.. మణిపూర్‌కు గత విలువను, శాంతిని, గౌరవాన్ని తిరిగి తీసుకొస్తామని మాటిస్తున్నాం.. న్యాయ్ యాత్ర ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు.. అన్యాయ కాలంలో ఉన్నాం కాబట్టే న్యాయ్ యాత్ర.. దేశంలో సంపద, వ్యాపారాలు ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లాయి.. ధరలు పెరగడంతో కష్టంగా మారింది.. అణగారిన బాధలను పట్టించుకునే వారు లేరు.. ఈ సమస్యలనే న్యాయ్ యాత్రలో మేం ప్రశ్నిస్తాం.” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. రాజ్యాంగ ప్రవేశికను రక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్నారని వెల్లడించారు. బీజేపీ మతాన్ని రాజకీయాన్ని కలుపుతూ విద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. ప్రధాని మోడీ ఓట్లను అడిగేందుకు వచ్చారు.. కానీ ప్రజలు బాధలో ఉన్నప్పుడు రాలేదని ఆయన విమర్శించారు. రాహుల్ యాత్రతో దేశానికి ఏం ప్రయోజనమని కొందరు ప్రశ్నిస్తున్నారని.. ప్రజల కష్టాలు, అవసరాలు తెలుసుకోవడమే యాత్ర ఉద్దేశమని ఖర్గే వెల్లడించారు. మణిపూర్‌లో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. 15 రాష్ట్రాల మీదుగా 66 రోజుల పాటు సాగనుంది. మార్చి 21 వరకు కొనసాగి ముంబైలో ముగియనుంది. దాదాపు 100 లోక్‌సభ, 337 అసెంబ్లీ స్థానాలు కవర్ చేసేలా ఈ యాత్రను ప్లాన్ చేశారు. ఈ యాత్ర మొత్తం 6,713 కిలోమీటర్లు కొనసాగనుంది. ఈ యాత్ర ద్వారా నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.
*700కి పైగా “శవపరీక్షలు” నిర్వహించిన మహిళకు రామాలయ ఆహ్వానం..
అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా, సినీ, వ్యాపారవేత్తలు, సాధువులకు రామమందిర ట్రస్ట్ ఆహ్వానాలనున పంపింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుకకు అరుదైన వ్యక్తి ఆహ్వానం అందింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ సంతోషి దుర్గకు రామాలయ ట్రస్ట్ ఆహ్వానం పంపింది. 700కి పైగా పోస్టుమార్టంలలో సహాయపడిన మహిళా శవపరీక్ష సహాయకురాలిగా పనిచేసిన 35 ఏళ్ల మహిళ సంతోషి దుర్గను జనవరి 22న జరగబోయే రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. సంతోషి దుర్గ నర్హర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జీవన్ దీప్ కమిటీకి దాదాపుగా 18 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ సమయంలో 700కి పైగా శవపరీక్షల్లో ఆమె సాయపడ్డారు. ఆమె చేసిన కృషికి వివిధ సంఘాల నుంచి ఆమెకు ప్రశంసలు దక్కాయి. ఈ ఆహ్వానాన్ని తన జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించలేదని.. నా జీవితంలో నన్ను కూడా అయోధ్యకు పిలుస్తారని అనుకోలేదని, రాముడి ఆహ్వాన లేఖ పంపి నన్ను పిలిచారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ లేఖతో తాను ఆశ్చర్యపోయానని.. తన కళ్ల నుంచి ఆనందంతో కన్నీల్లు వచ్చాయని వెల్లడించారు. ఆహ్వాన పత్రం పంపినందుకు సంతోషి దుర్గ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తాను జనవరి18న నర్హర్‌పూర్ నుండి బయలుదేరి, అయోధ్యలోలో ప్రాణప్రతిష్ట జరిగే సమయానికి హాజరవుతానని, నర్హర్ పూర్ ప్రజల సంతోషం, శాంతి, అభివృద్ధి కోసం శ్రీరాముడిని ప్రార్థించాలని అనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. నర్హర్‌పూర్ BMO ప్రశాంత్ కుమార్ సింగ్ కూడా శ్రీమతి సంతోషిని అభినందించారు మరియు ఆమెకు అయోధ్య నుండి ఆహ్వాన పత్రం అందడం మాకు గర్వకారణమని అన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి రామాలయ ఉద్యమంలో పాల్గొన్న కరసేవకులు, న్యాయవాదులు, హిందూ సాధువులు, జైన-బౌద్ధ-సిక్కు వర్గాలకు చెందిన వ్యక్తులకు, గిరిజన సంఘాల నాయకులకు, మీడియా ప్రముఖులకు, నోబెల్ బహుమతి, భారతరత్న, పరమవీర చక్ర మరియు పద్మ అవార్డుల వంటి ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతలు, ముగ్గురు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వరకు , సైన్యం యొక్క త్రి-సేవల విశ్రాంత అధిపతులు, మాజీ రాయబారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, మేధావులు, క్రీడాకారులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు అందాయి.
*”చాయ్‌వాలా ప్రధాని, ఆటో డ్రైవర్ సీఎం”.. కాంగ్రెస్ మాజీ నేత ప్రశంసలు..
55 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న బంధాన్ని మిలింద్ దేవరా వదిలేశారు. మహారాష్ట్రలో కీలక కాంగ్రెస్ నేతగా ఉన్న మిలింద్ దేవరా ఈ రోజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన సీఎం ఏక్‌నాథ్ షిండే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తన శక్తిసామర్థ్యాలపై నమ్మకం ఉన్నందుకు శివసేనలో చేరినట్లు వెల్లడించారు. పార్టీలో చేరుతూ.. ‘‘మనం రోజూ చూస్తున్నాం ఒక చాయ్‌వాలా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రధాని అయ్యారు. ఆటోరిక్షా డ్రైవర్ దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఈ మార్పు భారతదేశ రాజకీయాలను మెరుగుపరుస్తుంది. మన సమానత్వపు విలువలను పునరుద్ఘాటిస్తుంది’’ అని ఆయన ప్రధాని మోడీ, సీఎం ఏక్‌నాథ్ షిండేలపై ప్రశంసలు కురిపించారు. దేశంలో అత్యంత కష్టపడే, అందరికి అందుబాటులో ఉండే సీఎం ఏక్‌నాథ్ షిండే అని అన్నారు. మహారాష్ట్రలో అనగారిని వర్గాలపై ఆయనకున్న అవగాహన, పాలన, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఆయన చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల దార్శనికత తనకు స్పూర్తినిచ్చాయని చెప్పారు. ముంబై, మహారాష్ట్రలకు సంపన్నమైన భవిష్యత్తు కోసం సీఎం షిండే ప్రయత్నాలకు మద్దతు ఇస్తానని వెల్లడించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ తీరుపై ఆయన మండిపడ్డారు. కీలకమైన రాజకీయ నిర్ణయాల సమయంలో తను పార్టీ పక్కనపెట్టినట్లు చెప్పారు. పదేళ్ల పాటు నేను వ్యక్తిగత హోదా, అధికారాన్ని ఆశించకుండా పనిచేశానని అన్నారు.
*పొంగల్ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది..
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ జాతీయ స్ఫూర్తిని పొంగల్ ప్రతిబింబిస్తోందని.. కాశీ-తమిళ సంగమం, సౌరాష్ట్ర-తమిళ సంగమంలోనూ అదే భావోద్వేగ అనుబంధం కనిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ నివాసంలో ఏర్పాటు చేసిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. తమిళనాడులోని ప్రతి ఇంట్లో పండుగ ఉత్సాహం కనిపిస్తోందని.. ప్రజలందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, సంతృప్తి ఉండాలని ఆకాంక్షించారు. భారతదేశ వైవిధ్యాన్ని ‘కోలం’ (రంగోలి)తో సమం చేస్తూ.. దేశంలోని ప్రతి మూల ఒకదానితో ఒకటి మానసికంగా కనెక్ట్ అయినప్పుడు, దేశం బలం కొత్త రూపంలో కనిపిస్తుందని ప్రధాని అన్నారు. “2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు ఈ ఐక్యతా భావన అతిపెద్ద బలం” అని ప్రధాన మంత్రి అన్నారు. నేను ఎర్రకోట నుండి పిలుపునిచ్చిన పంచప్రాన్ యొక్క ప్రధాన అంశం దేశ ఐక్యతను శక్తివంతం చేయడం, బలోపేతం చేయడం అని తెలిపారు. సన్యాసి కవి తిరువల్లూరును ఉటంకిస్తూ.. దేశ నిర్మాణంలో విద్యావంతులైన పౌరులు, నిజాయితీ గల వ్యాపారులు, మంచి పంటల ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. పొంగల్ సందర్భంగా కొత్త పంటను దేవుడికి సమర్పిస్తామని, ఈ పండుగకు ‘అన్నదాత రైతులు’ కేంద్రంగా నిలుస్తారని తెలిపారు. భారతదేశంలోని ప్రతి పండుగకు గ్రామం, పంట, రైతుతో అనుబంధం ఉంటుందని అన్నారు. మిల్లెట్స్ తమిళ సంప్రదాయాల మధ్య అనుబంధం ఆధారంగా గుర్తు చేసుకుంటూ.. ‘సూపర్ ఫుడ్ శ్రీ అన్న’ (మిల్లెట్స్) గురించి ‘కొత్త అవగాహన’ వచ్చిందని, చాలా మంది యువకులు మిల్లెట్లపై స్టార్టప్‌లను ప్రారంభించారని సంతోషం వ్యక్తం చేశారు. ముతక ధాన్యాలు పండించే మూడు కోట్ల మందికి పైగా రైతులు దీనిని ప్రోత్సహించడం ద్వారా నేరుగా లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా జాతి ఐక్యతను బలోపేతం చేసే సంకల్పానికి ‘మనల్ని మనం పునరంకితం చేసుకోండి’ అనే పిలుపుతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
*యాత్ర 2 లో పవన్ కళ్యాణ్, షర్మిల, నారా లోకేష్ పాత్రలు కనిపించవా!
ఈ ఏడాది సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోన్న సినిమాల్లో యాత్ర 2 ఒకటి. రాజకీయాల్లో పోరాట పటిమతో తిరుగులేని ప్రజా నాయాకుడిగా ఎదిగిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ఇచ్చిన మాట కోసం ఆయన చేసిన అసాధారణ పాదయాత్ర రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పాయనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2009 నుంచి 2019 వరకు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన మూవీ టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా యాత్ర 2ను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వై.ఎస్.జగన్ చేసిన ప్రామిస్‌ను ఎలా నిలబెట్టుకున్నారనేది ఈ సినిమా ప్రధానాంశం. యాత్ర 2 లోని ప్రధాన పాత్రలు గురించి ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి … వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. వై.ఎస్.భారతి రోల్‌లో కేతికా నారాయణన్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియా గాంధీ పాత్రలో సుసాన్నె బెన్నెట్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వై.ఎస్.షర్మిల పాత్రల్లో ఎవరు నటించారనే దానిపై పలు రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు యాత్ర 2 లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వై.ఎస్.షర్మిల పాత్రలు ఉండవు. తండ్రి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టటానికి జగన్ చేస్తున్న పోరాటం, తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధంలోని భావోద్వేగాన్ని ఆవిష్కరిస్తూ వై.ఎస్.జగన్ చేసిన పాదయాత్ర గురించి మాత్రమే యాత్ర 2 చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ రూపొందించారు. పాత్రల మీద దృష్టి పెడితే తాను చెప్పాలనుకున్న ఎమోషనల్ పాయింట్‌ను చెప్పలేమని భావించిన డైరెక్టర్ ముందు నుంచి తన ప్రణాళిక ప్రకారం యాత్ర 2ను తెరకెక్కించినట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.
