Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణకు హైదరాబాద్ వాతావారణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండ్రోజుల పాటు పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 158 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసింది. ఇటు హైదరాబాద్‌లోనూ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం నుంచి వాతావరణం చల్లబడుతూ ఉంది. భారీ వర్షసూచన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నాడు ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగాం జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. సోమవారం కూడా వివిధ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ వారంలో రాష్ట్రంలో వర్షభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

 

*రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు: కిషన్ రెడ్డి
దేశవ్యాప్తంగా ఈశాన్యరాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు మినహా.. మైదాన ప్రాంతాల్లో అతితక్కువ రైల్వే నెట్‌వర్క్ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఈ 75 ఏళ్లలో తెలంగాణలో రైల్వేవ్యవస్థను అభివృద్ధి చేసే ప్రయత్నం చిత్తశుద్ధితో, పూర్తిస్థాయిలో జరగలేదని ఆయన తెలిపారు. 66 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతంలోని జిల్లాల్లో రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు సీరియస్ గా ప్రయత్నాలేమీ జరగలేదని ఆరోపించారు. వెంటవెంటనే ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు సంపూర్ణంగా మోడీ ప్రభుత్వం కృషిచేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా అందించాల్సిన తమవంతు సహకారాన్ని అందించడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్, ఇతర రైల్వే విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. రైల్వే కనెక్టివిటీలో భాగంగా హైదరాబాద్- యాదాద్రి లైన్ మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రతి యేటా 55 కిలోమీటర్లు రైల్వే లైన్ వేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ స్వంయంగా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ప్రారంభించారని కిషన్ రెడ్డి తెలిపారు. 2022లో తెలంగాణ ప్రభుత్వం, నిర్లక్ష్యం సహాయ నిరాకరణ కారణంగా.. దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు నిలిచిపోయాయని కిషన్ రెడ్డి తెలిపారు. దాదాపు 15 కొత్త ప్రాజెక్టులకు (న్యూ లైన్స్ కోసం) ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) కు కేంద్రప్రభుత్వం ఓకే చెప్పిందని పేర్కొన్నారు. దీంతోపాటుగా 8 డబ్లింగ్ లైన్లకు, 3 ట్రిప్లింగ్ లైన్లు, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు పచ్చజెండా ఊపిందని.. ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయన్నారు. సర్వే పూర్తవగానే DPR ల పనులు ప్రారంభిస్తారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

 

*ప్రేమోన్మాది ఘాతుకం
హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి అక్కా తమ్ముడిపై శివకుమార్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంఘవి, పృథ్వీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనను చూసి శివకుమార్‌ను స్థానికులు ఓ గదిలో నిర్భందించారు. వివరాల్లోకి వెళ్తే.. కొంతకాలంగా సంఘవి, శివకుమార్‌ మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. అయితే ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడేందుకు నిందితుడు శివకుమార్‌ సంఘవి ఇంటికి వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని సంఘవిపై ఒత్తిడి చేశాడు. దీంతో వారి మధ్య మాటమాట పెరగడంతో వాగ్వాదం మొదలైంది. దీంతో ఇంట్లోనే ఉన్న తమ్ముడు పృథ్వీ అక్కడకు రాగానే.. తన వెంట తెచ్చుకున్న కత్తితో సంఘవి, పృథ్వీపై దాడి చేశాడు. సంఘవి మేడ, మొహం మరియు చేతులపై తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకోవడానికి వెళ్లిన తమ్ముడు పృథ్వీపై కూడా కత్తితో దాడి చేయడంతో లోపల ఘర్షణ జరిగి ఇంట్లో ఉన్న అద్దాలని పగలగొట్టారు. గాయపడిన అక్క తమ్ముడూ కిందకు పరిగెత్తడం చూసి పక్కింటి వారు కర్రలతోపైకి వచ్చి నిందితుడిని పట్టుకుని ఓ గదిలో ఉంచారు. తీవ్ర గాయాలైన అక్కాతమ్ముడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ చింటూ మృతి చెందాడు. కామినేని ఆస్పత్రిలో సంఘవి చికిత్స పొందుతుంది. సంఘవి, పృథ్వీ ఎల్బీనగర్ లో రూమ్ లో ఉంటూ చదువుకుంటున్నారు. సంఘవి హోమియోపతి చదువుతుండగా.. పృథ్వీ బీటెక్‌ పూర్తి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

*తేజస్ యుద్ధ విమానాల ఒప్పందం.. భారత్‌కు అర్జెంటీనా ఏం ఇస్తుందో తెలుసా?
తేజస్ యుద్ధ విమానాల ఒప్పందంపై భారత్, అర్జెంటీనా శరవేగంగా కసరత్తు చేస్తున్నాయి. అర్జెంటీనా అభ్యర్థన మేరకు, తేజస్‌లో అమర్చిన బ్రిటిష్ భాగాలను మార్చే పనిని కూడా భారత్ ప్రారంభించింది. ఇదిలా ఉంటే అర్జెంటీనా కూడా భారతదేశం యొక్క తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్, ఆకాష్ క్షిపణి వ్యవస్థపై కన్నేసింది. అయితే ఈ ఒప్పందం కోసం చాలా చర్చలు జరగాల్సి ఉంది. వీటన్నింటి మధ్య అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ 18వ జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు రానున్నారు. జీ20 సదస్సుకు హాజరు కావాల్సిందిగా అర్జెంటీనాకు భారత్ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ఆయన భారత పర్యటనకు ముందు, వ్యూహాత్మక రంగాలలో ముఖ్యంగా రక్షణ, మైనింగ్, లిథియం రంగాలలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంపై చర్చలు ముమ్మరంగా జరగనున్నాయి. అర్జెంటీనా ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద లిథియం ఉత్పత్తిదారు. ఇది కాలక్రమేణా దాని లిథియం ఉత్పత్తిని వేగంగా పెంచుతోంది. భారతదేశం తన ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. దీని కోసం ముఖ్యంగా కావాల్సిన ఖనిజం లిథియం. ఇది బ్యాటరీల తయారీలో ఉపయోగించబడుతుంది. గని నుంచి లిథియం వెలికితీసి తర్వాత ఎగుమతి చేయడంలో భారత్ సహాయం కావాలని అర్జెంటీనా కోరుతోంది. ఇది అర్జెంటీనాతో పాటు భారత్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది. భారత్, అర్జెంటీనా మధ్య హై ప్రొఫైల్ సమావేశాల రౌండ్ ప్రారంభమైంది. బ్యూనస్ ఎయిర్స్‌లోని భారత రాయబారి దినేష్ భాటియా గత కొద్ది రోజులుగా ముఖ్యమైన సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో కాసా రోడాసాలో అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌తో సమావేశాలు కూడా ఉన్నాయి. కాసా రోసాడా అనేది అర్జెంటీనా అధ్యక్షుని కార్యాలయం. ఆగస్టు 24న, బ్రిక్స్ గ్రూపులో చేరనున్న ఆరు కొత్త దేశాల జాబితాలో అర్జెంటీనా చేర్చబడింది. ఇప్పటి వరకు భారత్, రష్యా, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా మాత్రమే ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్నాయి. బ్రిక్స్ గ్రూపు విస్తరణ సమయంలో భారత్ మద్దతు ఇవ్వడం పట్ల అర్జెంటీనా సంతోషం వ్యక్తం చేసింది. అర్జెంటీనా అధ్యక్షుడే తమ దేశం అభివృద్ధికి ఏ అవకాశాన్ని వృథా చేయనివ్వమని చెప్పారు.

 

*భూమి వైపు దూసుకొస్తున్న “సౌరతుఫాన్”
సూర్యుడి నుంచి వెలువడిన సౌరతుఫాన్ భూమి వైపు వేగంగా దూసుకొస్తోంది. సెప్టెంబర్ 3 అంటే ఈ రోజున భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని Spaceweather.com నివేదించింది. సూర్యుడి నుంచి వెలువడిన కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CME) భూవాతావరణంపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. సూర్యుడిపై భారీ విస్పోటనాల తర్వాత ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడుతుంటాయి. ఇవి విశ్వంలో ప్రయాణిస్తుంటాయి. ఒక కరోనల్ మాస్ ఎజెక్షన్ ఖచ్చితంగా భూవాతావరణాన్ని చేరుతుందని, మరో రెండు తప్పవచ్చని అంచనా స్పేస్ వెదర్ అంచనా వేసింది. ఆగస్టు 30న ‘కానియన్ ఆఫ్ ఫైర్’ మ్యాగ్నెటిక్ ఫిలమెంట్ విస్పోటనం తర్వాత సూర్యుడి నుంచి ఈ సౌరతుఫానులు బయలుదేరాయి. అయితే వీటి ప్రభావం పెద్దగా ఉండనప్పటికీ.. భూ అయస్కాంత తుఫానులకు దారితీయనుంది. వీటి ప్రభావం కారణంగా అమెరికాలోని న్యూయార్క్, మిన్నెసోటా, వాషింగ్టన్, ఉత్తర యూఎస్ రాష్ట్రాల్లో అరోరాలు కనిపించవచ్చని నివేదిక పేర్కొంది. అంతకుమందు నానాకు చెందిన సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ (SOHO) సెప్టెంబర్ 1 న సూర్యుని నుండి ఒక ప్రకాశవంతమైన పసుపు మెరుపు వెలువడినట్లు నివేదిక తెలిపింది. సూర్యుడిపై భారీ పేలుళ్ల వల్ల ఇవి ఏర్పడుతుంటాయి. సూర్యుడి నుంచి శక్తి ఆవేశిత కణాల రూపంలో అంతరిక్షంలోకి వెళ్తుంది. సోలార్ సైకిల్ ప్రతీ 11 సంవత్సరాలకు ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడి ధృవాలు మారుతుంటాయి. అంటే ఉత్తర ధృవం దక్షిణంగా, దక్షిణ ఉత్తరంగా మారుతుంటాయి. ఈ సమయంలో సూర్యుడిపై మాగ్నిటిక్ ఫీల్డ్ గందరగోళంగా ఉంటుంది. భారీ స్థాయిలో పేలుళ్లు ఏర్పడుతాయి. ప్రస్తుతం సూర్యుడు తన సౌరచక్రంలో తారాస్థాయికి చేరుకోవడంతో ఇలాంటివి సంభవిస్తున్నాయి. అయితే భూమికి సహజంగా ఉండే మ్యాగ్నిటిక్ ఫీల్డ్ ఈ సౌరతుఫానులను అడ్డుకుంటుంది. దీని వల్ల మానవులకు, భూమిపై ఉండే జీవజాలానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. దీని వల్ల ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద అరోరాలు ఏర్పడుతుంటాయి. కొన్ని సందర్బాల్లో రేడియో సిగ్నల్స్, శాటిలైట్లు, విద్యుత్ గ్రిడ్స్ కి ముప్పు కలిగించే ఆస్కారం కూడా ఉంటుంది.

 

*నేపాల్‌తో మ్యాచ్‌ రద్దయితే.. భారత్ పరిస్థితి ఏంటి?
దీర్ఘకాలం తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. దాంతో దాయాదుల మ్యాచ్‌తో అసలుసిసలు మజాను ఆస్వాదిద్దామనుకున్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. పల్లెకెలె వేదికగా శనివారం దాయాదుల మధ్య జరిగిన పోరులో వర్షం అంతరాయాల నడుమ భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఆపై వర్షం భారీగా పడడంతో.. పాక్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం కాకుండానే మ్యాచ్ రద్దయింది. ఇక సోమవారం (సెప్టెంబరు 4) పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌, నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్‌, నేపాల్ మ్యాచ్‌కూ వర్ష ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌ జరిగే సమయంలో 90 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం నుంచి అక్కడ వర్షం కురిసే ఛాన్స్‌ ఉంది. వర్షం ప్రభావంతో టాస్‌ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందట. మ్యాచ్‌ జరిగే సమయంలో జల్లులు ఆటకు అంతరాయం ఏర్పడే అవకాశముందని సమాచారం. ఇప్పటికే ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. నేపాల్ మ్యాచ్ కూడా రద్దయితే భారత్ పరిస్థితి ఏంటి? అని ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌ రద్దు కావడంతో.. ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరింది. గ్రూప్‌-ఏలో నేపాల్‌పై విజయం సాదించిన పాకిస్థాన్.. టీమిండియా మ్యాచ్ రద్దు అవడంతో వచ్చిన ఒక పాయింట్‌తో కలిపి (3 పాయింట్స్) సూపర్‌-4కు దూసుకెళ్లింది. నేపాల్‌తో మ్యాచ్‌ జరిగి.. రోహిత్ సేన విజయం సాధిస్తే మూడు పాయింట్లతో భారత్‌ సూపర్‌-4కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వరుణుడి ఆటంకంతో భారత్, నేపాల్ మ్యాచ్‌ కూడా రద్దయితే.. రెండు పాయింట్లతో భారత్ సూపర్-4కు అర్హత సాధిస్తుంది. అప్పుడు నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక సూపర్‌-4లో భాగంగా సెప్టెంబరు 10న భారత్, పాకిస్థాన్‌ మరోసారి తలపడతాయి.

 

*బంగ్లాదేశ్‌ బ్యాటర్ల శతకాల మోత.. ఆఫ్ఘనిస్తాన్‌ ముందు భారీ లక్ష్యం!
ఆసియా కప్‌ 2023లో భాగంగా లాహోర్‌ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ మెహిది హసన్‌ మీరజ్‌ (112; 119 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టార్ బ్యాటర్ నజ్ముల్‌ హసన్‌ షాంటో (104; 105 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో గుల్బదిన్‌ నైబ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు మొహమ్మద్‌ నైమ్‌ (28), మెహిది హసన్‌ మీరజ్‌ 60 పరుగుల భాగస్వామ్యం అందించారు. నైమ్‌ ఔట్ అనంతరం క్రీజులోకి వచ్చిన తౌహిద్‌ హ్రిదోయ్‌ డకౌటయ్యాడు. ఈ సమయంలో మీరజ్‌, నజ్ముల్‌ హసన్‌ షాంటో ఆఫ్ఘన్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ పరుగులు చేశారు. ఈ క్రమంలోనే సెంచరీలు చేశారు.112 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద మీరజ్‌ రిటైర్డ్‌ హర్ట్‌ కాగా.. 104 పరుగులు చేసి షాంటో రనౌటయ్యాడు. ముష్ఫికర్‌ రహీం (25), షకీబ్‌ అల్‌ హసన్‌ (32 నాటౌట్‌) రాణించారు. ఆసియా కప్‌ 2023 రేసులో ఉండాలంటే బంగ్లాదేశ్‌ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. ఎందుకంటే బంగ్లా తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌కు కూడా ఈ మ్యాచ్‌ కీలకమే. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ గెలిస్తే.. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో సంబంధం లేకుండా సూపర్‌-4కు చేరుకుంటుంది. ఇక తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన శ్రీలంక సూపర్‌-4 బెర్త్‌ దాదాపుగా ఖరారు చేసుకుంది. గ్రూప్‌-ఏ నుంచి పాకిస్తాన్‌ ఇప్పటికే సూపర్‌-4కు అర్హత సాధించింది. నేపాల్, భారత్ మ్యాచ్‌తో మరో జట్టు గ్రూప్‌-ఏ నుంచి సూపర్‌-4కు అర్హత సాధిస్తుంది.

 

*బిగ్ బాస్ 7 గ్రాండ్‌ లాంచ్‌.. ఎంట్రీతోనే కంటెస్టెంట్లకి అదిరిపోయే ఆఫర్
టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ గ్రాండ్గా లాంచ్ చేశారు నాగార్జున.. ఎప్పటిలాగే అదిరిపోయే సాంగ్ తో నాగ్ ఎంట్రీ ఇచ్చారు.. బిగ్‌ బాస్‌ తెలుగు ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్లని పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్‌ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు నేటి ఆదివారం(సెప్టెంబర్‌ 3) గ్రాండ్‌గా బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ని ప్రారంభించబోతున్నారు. ఈ సాయంత్రం ఏడు గంటల నుంచి ఈ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. బిగ్ బాస్ 6 వరకు ఉన్న సెట్, సెటప్ వేరు ఇప్పుడున్న సెటప్ వేరు.. ఇప్పటివరకు కనీసం సెట్ ను చూపించని నాగ్ ఇప్పుడు డైరెక్టర్ గా రివిల్ చేశారు.. హౌజ్‌లో కొత్త రూమ్‌లు, కొత్త విభాగాలు కూడా ఉండబోతున్నాయి. ప్రత్యేకంగా కెప్టెన్‌ రూమ్‌ ఉంటుందని తెలుస్తుంది. ఈ మేరకు హౌజ్‌ ఫోటోలను వదిలారు. అవన్నీ కాస్త కొత్తగా ఉందనిపిస్తుంది. అయితే ఈసారి పింక్‌ కలర్‌కి ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.. మొత్తానికి హౌస్ చాలా కలర్ ఫుల్ గా ఉంది.. ఇకపోతే ఉల్టాఫల్టా అంటూ నాగార్జున ప్రారంభం నుంచి చెబుతున్నారు. ఈ సారి లెక్క వేరే అంటున్నారు. అందరు ఊహించినట్టుగా ఉండబోదని, మా ఆట వేరే అంటున్నారు. దీంతో ఈ సీజన్‌పై ఆసక్తి ఏర్పడింది. ఎలా ఉండబోతుందనే ఇంట్రెస్ట్ అందరిలోనూ ఏర్పడింది.. అయితే దానికి అర్థం ఇప్పుడు దొరికేసింది.. ఈ సారి కంటెస్టెంట్లు ఎవరెవరనేది సస్పెన్స్ ఏర్పడింది. ఇందులో నటుడు శివాజీ రాబోతున్నారట. ఆయనతోపాటు శోభా శెట్టి,విష్ణు ప్రియా, ఆట సందీప్‌, అమర్‌ దీప్‌ చౌదరి, గౌతమ్‌ కృష్ణ, భోలే షావలి, టీవీ9 ప్రత్యూష, షకీలా, టేస్టీ తేజా, మహేష్‌ ఆచంట, అంబటి అర్జున్‌, అపూర్వ, సింగర్‌ దామిని భాట్ల పాల్గొనబోతున్నారు.. ఇకపోతే మొదటగా ప్రియాంక హౌస్ లోకి వచ్చింది.. హౌస్ లోకి రాగానే సూట్ కేసు ఇచ్చి అదిరిపోయే ఆఫర్ ను ఇచ్చారు.. మొదట్లోనే ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏంటా అని ఆలోచనలో పడ్డారు.. చూద్దాం ముందు ముందు ఎన్ని ట్విస్ట్ లు ఉంటాయో..

Exit mobile version