*వైఎస్సార్ ఉండి ఉంటే తెలుగు రాష్ట్రాలు మరోలా..
హైదరాబాద్ లో ‘రైతే రాజైతే…’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని సంయుక్తంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, ఎన్ రఘువీరా రెడ్డిలు సంయుక్తంగా రాశారు. అయితే, ‘రైతే రాజైతే’ పుస్తకాన్ని దిగ్విజయ్ సింగ్ ఆవిష్కరించారు. తొలి పుస్తకాన్ని సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, సీపీఐ నారాయణ, మాజీ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు, వైఎస్సార్ సన్నిహితులు, అభిమానులు హాజరైనారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు నేను ఏఐసీసీ ఇంచార్జ్ గా ఉన్నాను.. అప్పుడది ఛాలెంజింగ్ టాస్క్ అంటూ ఆయన వ్యాఖ్యనించారు. కేవీపి.. వైఎస్సార్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు.. యువతకు.. మహిళల కోసం ఉపయోగపడ్డాయి.. రెండు రూపాయలకు కిలో బియ్యం, మైనారిటీ రిజర్వేషన్, ఫీజ్ రీయంబర్మెంట్స్ ఇచ్చారు అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కరువు ప్రాంతాలుగా ఉన్న వాటిని జలయజ్ఞంతో బాగు చేశారు.. ఇది ఆయన విజన్ కు నిదర్శనం అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. వైఎస్సార్ పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు.. అందరి వాడు.. ఒక స్ట్రాటజిస్ట్.. పాలిటిక్స్ ని, పథకాలను మెయింటైన్ చేయడం ఒక ఆర్ట్.. కాంగ్రెస్ పడిపోతున్న సమయంలో పాదయాత్రతో అధికారంలోకి తెచ్చారు.. కాంగ్రెస్ పెద్దల పాలసీలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాడు.. మంచి చేశాడు.. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉంటె దేశంలోని సమస్యల కోసం పోరాడేవాడు అంటూ దిగ్గిరాజా పేర్కొన్నాడు.
*శంషాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ లో మరో సారి భారీగా డ్రగ్స్ ని అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అడ్డగా కొనసాగుతున్న డ్రగ్స్ దందాకి అధికారులు ఫుల్ స్టాప్ పెట్టారు. లావోస్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన నలుగురు మహిళల నుంచి 5 కిలోలకు పైగా కోకాన్ ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 50 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ని పట్టుకున్నట్టు డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. నలుగురు లేడీస్ హ్యాండ్ బ్యాగులతో పాటు ఒక సూట్ కేస్ లోని కింది భాగంలో ఈ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. లావోస్ నుంచి సింగపూర్ మీదుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు నలుగురు మహిళలు చేరుకున్నారు. ఈ నలుగురి దగ్గర అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో వారిని తనిఖీలు చేయగా డ్రగ్స్ బయట పడ్డాయి. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లోని కింది భాగంలో డ్రగ్స్ ని ఆమార్చారు. అదే మాదిరిగా ట్రాలీ బ్యాగ్ లో అడుగు భాగంలో డ్రగ్స్ పెట్టారు. మొత్తం నాలుగు హ్యాండ్ బ్యాగ్స్ తో పాటు ఒక ట్రాలీబాగాలో ఐదు కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, సింగపూర్ నుంచి వచ్చే విమానాల తనిఖీలు తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సింగపూర్, అక్కడి నుంచి ఢిల్లీకి.. అక్కడి నుంచి లోకల్ ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకున్నారు. లోకల్ ఫ్లైట్లో హైదరాబాద్ కి వచ్చిన తర్వాత నలుగురు మహిళల కదలికలపైన అధికారులకు డౌట్ రావడంతో వారి చెక్ చేయడంతో ఈ డ్రగ్స్ గుట్టు బయట పడింది. దీంతో నలుగురు మహిళలని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ కు తీసుకువచ్చిన డ్రగ్స్ ఎవరికి ఇస్తున్నారనే దానిపైన అధికారులు విచారణ చేస్తున్నారు. తమకు లావోస్ ఎయిర్ పోర్ట్ లో కొంత మంది కలిసి కొన్ని డబ్బులు ఇచ్చి దీనిని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో డెలివరీ చేయాలని చెప్పినట్లుగా అధికారులు సదరు మహిళలు వెల్లడించారు. అయితే లాగోస్ లో మహిళలకు డ్రగ్స్ ఇచ్చిన వారెవరు హైదరాబాద్ లో డ్రస్సు తీసుకునే వారు ఎవరు అనేదానిపై అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. డ్రగ్స్ దందాను కట్టడి చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడే చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్ద మొత్తంలో డ్రగ్స్ హైదరాబాద్ కు చేరుకోవడంపై ఆందోళన వ్యక్తం అవుతుంది.
*తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
సెప్టెంబరు 18వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పటికే ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సామాన్య భక్తులకు పెద్దపీఠ వేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 18 నుంచి 26వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 17వ తారీఖు ఆదివారం నాడు అంకురార్పణ- రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జరుగనున్నాయి. ఇక, 18 నాడు సోమవారం రోజు బంగారు తిరుచ్చి ఉత్సవం-మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగనున్నాయి. ధ్వజారోహణం(మీన లగ్నం) – సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల వరకు జరుగుతాయి. పెద్దశేష వాహనం – రాత్రి 9 నుంచి 11 గంటల వరకు కొనసాగుతుంది. 19వ తారీఖున మంగళవారం నాడు చిన్నశేష వాహనం – ఉదయం 8 నుంచి 10 గంటలకు వరకు.. అలాగే స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు.. హంస వాహనం – రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగనున్నాయి. ఇక, 20వ తారీఖు బుధవారం రోజు సింహ వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.. స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు.. ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు కొనసాగనున్నాయి.
*వన్ నేషన్ -వన్ ఎలక్షన్‌పై కమిటీ ఏర్పాటు
వన్ నేషన్-వన్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శనివారం (సెప్టెంబర్ 2) నోటిఫికేషన్ విడుదల చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రక్రియపై స్పీడ్ పెంచిన కేంద్రం.. ఈ క్రమంలోనే రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, సుభాష్ సింగ్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారీ ఉన్నారు. ఈ కమిటీ పేరును హై లెవెల్ కమిటీ అని.. ఇంగ్లీష్ లో HLC అని పిలుస్తారు. లా అండ్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ నితిన్ చంద్ర ఇందులో భాగం కానున్నారు. నితేన్ చంద్ర హెచ్‌ఎల్‌సి కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు. దీంతో పాటు కమిటీ సమావేశంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరుకానున్నారు. నిజానికి వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరుగనున్నాయని అర్థం.
*బాలాసోర్ రైలు ప్రమాదంపై సీబీఐ చార్జిషీటు..
బాలాసోర్ రైలు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అధికారులు అరెస్ట్ అయ్యారు. వారిపై ఐపీసీ 304, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు వారు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది. సీనియర్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంతా, సెక్షన్ ఇంజినీర్ మహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌లపై హత్య, సాక్ష్యాలు ధ్వంసం వంటి నేరపూరిత అభియోగాలు మోపింది. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలుస్తూ బాలాసోర్ రైల్వే ప్రమాదంలో 290 మంది మరణానికి కారణమైంది. వేలాది మంది గాయపడ్డారు. కాళ్లు, చేతులు కోల్పోయిన వందలాది మంది వికలాంగులుగా మారారు. మరోవైపు ఈ మూడు రైళ్ల ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉండవచ్చని రైల్వే శాఖ అనుమానించింది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సీబీఐ దర్యాప్తు కోరారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు మూడు రైళ్ల ప్రమాదంపై దర్యాప్తు జరిపారు. మానవ తప్పిదమే ప్రధాన కారణమని తేల్చారు. బహనగా స్టేషన్ సమీపంలోని గేటు నెంబర్ 94 లెవెల్ క్రాసింగ్ వద్ద మరమ్మతు పనులను ఎల్‌సి గేట్ నంబర్ 79 సర్క్యూట్ రేఖాచిత్రాన్ని ఉపయోగించి మహంత చేసినట్లు సీబీఐ ఆరోపించింది. కానీ మహంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ టెస్టింగ్ నిర్వహించలేదని, ఇంటర్‌లాకింగ్ ఇన్‌స్టాలేషన్ కూడా ప్రణాళికాబద్ధంగా లేవని.. ఈ కారణాల వల్లనే మూడు రైళ్లు ఢీకొన్నాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది.
*స్లీప్ మోడ్‌లోకి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. సిద్ధమవుతున్న ఇస్రో
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ఒక్కసారిగా ప్రపంచంలో ఇస్రో, భారత్ కీర్తి పెరిగాయి. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన అమెరికా, రష్యా, చైనాల తరువాత నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ని దించిన తొలిదేశంగా భారత్ నిలిచింది. ఇప్పటికే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు తమ పనిని ప్రారంభించాయి. ఇదిలా ఉంటే చంద్రుడిపై సూర్యరశ్మి తగ్గిపోతుండటంతో రోవర్, ల్యాండర్లు రెండింటిని స్లీప్ మోడ్ లోకి పంపేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. చంద్రుడి దక్షిణ ధృవంపై 14 రోజుల వరకు మాత్రమే సూర్యుడి కాంతి పడుతుంది. మరో 14 రోజుల పాటు కఠిక చీకటి, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు పూర్తిగా సూర్యకాంతిపై ఆధారపడే సోలార్ సెల్స్ తో పనిచేస్తుంటాయి. అయితే ప్రస్తుతం దక్షిణధృవంపై సూర్యకాంతి తగ్గుతుండటంతో రానున్న రోజుల్లో ల్యాండర్, రోవర్లను స్లీప్ మోడ్ లోకి పంపేందుకు ఇస్రో సమాయత్తం అవుతుంది. దీనిపై ఇస్రో చీఫ్ సోమనాథ్ కూడా ప్రకటన చేశారు. మరోవైపు రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి నేలపై తిరుగుతోంది. అక్కడి నేలలోని మూలకాలను విశ్లేషిస్తోంది. చంద్రుడి ఉపరితలంపై ఆక్సిజన్, సల్ఫర్ తో పాటు ఐరన్, క్రోమియం, సిలికాన్ వంటి మూలకాలు ఉన్నట్లు చంద్రయాన్-3 ప్రయోగంతో తెలిసింది. రోవర్ 100 మీటర్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. దీనిపై ఇస్రో ట్వీట్ కూడా చేసింది.
*ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్
రూ.538 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కోర్టులో హాజరుపరచగా సెప్టెంబర్ 11 వరకు రిమాండ్ విధించింది. కెనరా బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదు చేశారు.గోయల్ (74)ను ముంబైలోని తన కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద శుక్రవారం రాత్రి ఈడీ అరెస్టు చేసింది. శనివారం ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. కెనరా బ్యాంక్ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మేలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. రుణం మొత్తంలో కొంత భాగాన్ని సంబంధిత కంపెనీలకు కమీషన్‌గా మళ్లించడం ద్వారా జెట్ ఎయిర్‌వేస్ బ్యాంకును రూ. 538.62 కోట్లను మోసం చేసిందని బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొంది. కంపెనీ ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఈ లావాదేవీలు మోసపూరితమైనవని, రుణ మొత్తం నుంచి నిధులను మళ్లించడంలో పాల్గొన్నట్లు వెల్లడైంది. సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో గోయల్‌పై మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనపై ఆరోపణలు చేసింది. ఈ ఏడాది మేలో గోయల్ నివాసం, కార్యాలయాలు సహా ముంబైలోని ఏడు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. సంబంధిత కంపెనీలకు చెల్లించిన కమీషన్‌లుగా చూపబడిన జెట్ ఎయిర్‌వేస్ ఖర్చులలో కొంత భాగాన్ని వాస్తవానికి గోయల్ కుటుంబం, స్కామ్‌లో పాల్గొన్న ఇతర వ్యక్తుల వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. గోయల్, ఒక ప్రవాస భారతీయ వ్యాపారవేత్త, ఏప్రిల్ 1992లో జెట్ ఎయిర్‌వేస్‌ను స్థాపించారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎయిర్‌లైన్ 2019 ఏప్రిల్‌లో కార్యకలాపాలను నిలిపివేసింది. కంపెనీ ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉంది.
*కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా
దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించిన వివరాలను బ్యాంక్ సెప్టెంబర్ 2న ఎక్స్ఛేంజీలకు ఒక కమ్యూనికేషన్‌లో తెలిపింది. అయితే ఉదయ్ కోటక్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రతిపాదిత వారసుడి కోసం బ్యాంక్ ఆర్బీఐ ఆమోదం కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యంతర ఏర్పాటుగా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా డిసెంబర్ 31 వరకు ఆర్‌బీఐ, బ్యాంక్ సభ్యుల ఆమోదానికి లోబడి ఎండీ అండ్ సీఈవోల బాధ్యతలను నిర్వహిస్తారని పేర్కొంది. వ్యవస్థాపకుడిగా తాను కోటక్ బ్రాండ్‌తో చాలా అనుబంధాన్ని కలిగి ఉన్నానని ఉదయ్ కోటక్ వెల్లడించారు. సంస్థకు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్యమైన వాటాదారుగా సేవను కొనసాగిస్తానని.. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా వద్ద అత్యుత్తమ నిర్వహణ బృందం ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాపకులు వెళ్లిపోయినా కానీ సంస్థ శాశ్వతంగా ముందుకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ సాక్స్ వంటి సంస్థలు ప్రపంచంలో ఆధిపత్యాన్ని చెలాయించటం చూశానని ఆయన తెలిపారు. దేశంలో గొప్ప ఆర్థిక సంస్థను సృష్టించాలనే కలతోనే తాను 38 సంవత్సరాల క్రితం కోటక్ మహీంద్రాను ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల కార్యాలయంలో కేవలం ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభించానని ఉదయ్ కోటక్ గుర్తుచేసుకున్నారు.
*ధర్మసంస్థాపన చేయడానికి ఉస్తాద్ వచ్చేశాడోచ్ ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకొక రాజకీయ ప్రచారాలు చేస్తూ రెండు పడవలపై పవన్ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక నేడు పవన్ పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉదయం నుంచి పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది పవన్ మూడు చిత్రాలు నుంచి అప్డేట్స్ ఇచ్చి ఫాన్స్ ను ఖుషీ చేశారు మేకర్స్. ఇప్పటికే ఉదయం హరిహర వీరమల నుంచి పోస్టర్ రిలీజ్ అవ్వగా.. ఓజీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి పవన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్లో విజయ్ హీరోగా నటించిన తేరి సినిమాకు ఉస్తాద్ రీమేక్ గా తెరకెక్కుతుంది. గతేడాది పవన్ బర్త్ డేకి ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. ఇక ఈసారి హరీష్ కేవలం పోస్టర్ తోనే సరిపెట్టాడు. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఊర మాస్ లుక్ లో కనిపించాడు. లుంగీ కట్టుకుని ఒక దిమ్మ మీద కూర్చుని చేతిలో రక్తం అంటిన కత్తిని సీరియస్ లుక్ లో చూస్తూ కనిపించాడు. ఇక వెనుక ముస్లిం గ్యాంగ్ ఆయనను చూస్తూ ఉండడం విశేషం. ఇక దీనికి క్యాప్షన్ గా ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అంటూరాసుకొచ్చారు. అంటే ధర్మసంస్థాపన చేయడానికి చెప్పకనే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి ఈ చిత్రంతో హరీష్ పవన్ మరో హిట్ ను అందుకుంటారేమో చూడాలి.
