Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

*తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వీవోఏల గౌరవం వేతం పెంపు..
ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)లో విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీవోఏ)లుగా పని చేస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీవోఏల గౌరవ వేతనం పెంచుతూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు జీవో జారీ అయింది. యూనిఫాం కోసం నిధుల విడుదలకు.. రెనివల్ విధాన సవరింపునకు.. సీఎం అంగీకారం తెలిపారు. జీవిత బీమా అమలు చేయాలనే విజ్జప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సబంధించి మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై ప్రకటించాలని మంత్రి హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశాడు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతీ రాథోడ్ లతో కలిసి మహిళా సంఘాల సహాయకులతో మంత్రి హరీశ్ రావు సమావేశమైయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలు వారికి ఆయన వెల్లడించారు. జీతాలు పెంచుతూ జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులు.. మహిళా సంఘాల ప్రతినిధులకు ఉత్తర్వుల కాపీని మంత్రులు అందజేశారు. అయితే, ప్రస్తుతం వీవోఏలకు రూ. 3,900 గౌరవ వేతనం ఇస్తుండగా.. దానిని రూ. 5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు వెల్లడించారు. దీంతో అదనపు సాయం రూ. 3 వేలు కలిపి వీవోఏలు నెలకు 8 వేల రూపాయలు అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 17 వేలకు పైగా వీవోఏలకు లబ్ది పొందనున్నారు. ఇక, గత కొంతకాలంగా తమ గౌరవ వేతనం పెంచాలి.. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి రూ. 26 వేలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని వీవోఏలు డిమాండ్ చేశారు. 20 ఏళ్లు వీవోఏలుగా పనిచేస్తున్న రూ. 3,900 ఇస్తూ.. 20 రకాల పనులు చేయిస్తున్నారని, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని వీవోఏలు ఆరోపించారు.

 

*షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే తప్పకుండా ఆహ్వానించాల్సిందే..
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ( గురువారం ) కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భట్టి నివాళులు ఆర్పించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దర్శనికత, ఆయన ఆలోచనలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లాలి అని తెలిపాడు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానించాల్సిందేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకే ధారపోశారు అని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి నాయకుడి బిడ్డ కాంగ్రెస్ లోకి రావడం మంచి పరిణామమే.. నా పాదయాత్ర మార్చి 16న మొదలై జులై 2న ముగిసింది. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్నా.. నాకు సంహరించిన వారితో కలిసి తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని బయలుదేరామని భట్టి అన్నారు. అయితే, దారి మధ్యలో ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధిని దర్శించడం జరిగింది అని భట్టి విక్రమార్క తెలిపారు. వైఎస్సార్ గారితో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా రాజశేఖర్ రెడ్డితో కలిసి ముందుకు సాగాను అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీ పార్టీలకు ప్రజలు తగిన బుద్ది చెబుతారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

*వీఆర్‌ఏలకు గుడ్‌న్యూస్‌.. రూ. 500 డీఏ మంజూరు చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో వీఆర్‌ఏలకు జగన్‌ సర్కారు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా వీఆర్‌ఏలు ఎదురుచూస్తున్న అంశంపై ఇవాళ శుభవార్త అందించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో తొలగించిన ఓ ఆర్ధిక ప్రయోజనాన్ని వారికి తిరిగి కల్పించడంతో పాటు దాన్ని పెంచాలని కూడా నిర్ణయించింది. ఏపీలో వీఆర్‌ఏలకు రూ.500 డీఏ మంజూరు చేస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన 300 రూపాయల డీఏ పునరుద్ధరణకు వీఆర్ఏలు విజ్ఞప్తి చేయగా.. ఆ అభ్యర్థనలపై సీఎం జగన్‌ స్పందించారు. 300 రూపాయల డీఏను పునరుద్ధరించటమే కాకుండా 500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫైల్‌పై సంతకం పెట్టినట్లుగా ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామి రెడ్డి వెల్లడించారు. గతంలో డీఏ 300 రూపాయలు డీఏ ఇచ్చేవారు. గత ప్రభుత్వం ఈ డీఏను రద్దు చేసిందని ఆయన తెలిపారు. వీఆర్‌ఏలకు డీఏను పునరిద్దరించవలసిందిగా ముఖ్యమంత్రిని కలిసి కోరగా.. . అందుకు ముఖ్యమంత్రి వెంటనే స్పందించి డీఏ తిరిగి మంజూరు చేసేలా ఫైల్ సర్కులేట్ చేయమని అధికారులను ఆదేశించారన్నారు. ఆ విధంగా సర్కులేట్ అయిన ఫైల్‌లో DA ను 300 రూపాయలకు బదులుగా 500 రూపాయలు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ సంతకం కూడా చేశారు. దీంతో వీఆర్ఏలకు ఇకపై రూ.500 డీఏ అందబోతోంది. ఈ నేపథ్యంలో వీఆర్ఏలకు డీఏ మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్ కు , రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు, సీఎస్, ఇతర అధికారులకు ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

 

*కౌలు రైతులకు ‘వైఎస్సార్‌ రైతు భరోసా’.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్‌
రేపు(శుక్రవారం) కౌలు రైతులకు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. రైతుల ఖాతాల్లో వర్చువల్‌గా సీఎం జగన్‌ నగదు జమ చేయనున్నారు. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది. మొత్తం 1,46,324 మందికి లబ్ది చేకూరనుంది. ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఆర్థిక సహాయం వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో 109.74 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జమ చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న సాగుదారులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్న రాష్ట్ర సర్కారు.. 2023–24 సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయాన్ని సెప్టెంబర్‌ 1న అందించనుంది. ఇవాళ(గురువారం) జరగాల్సిన కార్యక్రమం రేపటికి వాయిదా పడిన విషయం తెలిసింది. రేపు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా సాయాన్ని జమ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో భూయజమానులకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టు­బడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తోంది. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవాదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అందజేస్తోంది.

 

*”వన్ నేషన్-వన్ ఎలక్షన్”.. బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం..?
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతుందా..? ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనుందా..? అంటే ఔననే ఊహాగానాలే వినిపిస్తున్నాయి. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనే ఆలోచనలో కేంద్ర ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గురువారం రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు వెల్లడించారు. అయితే ఈ సమావేశాల ఎజెండా ఏమిటనేది ఇప్పటి వరకు తెలియదు. జమిలీ ఎన్నికల ఆలోచనతో కేంద్ర ఉన్నట్లు తెలుస్తోంది. పలు సందర్భాల్లో జమిలీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది, లా కమిషన్ కూడా దీన్ని అధ్యయనం చేసింది. సాధారణంగా అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇలా కాకుండా అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ మొదటినుంచి భావిస్తోంది. ప్రస్తుతం మరికొన్ని నెలల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్థాన్, మిజోరాం ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, ఆ తరువాత వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల కోసమే కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిందనే అంతా అనుకుంటున్నారు.

 

*ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఎలాంటి సమస్యలున్నా.. క్షణాల్లో పరిష్కారం
ఈపీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ చందాదారుల వ్యక్తిగత వివరాలను వేగంగా సరి చేసుకునేందుకు కొత్త నింబధనలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు తండ్రి పేరు ఎక్స్ అని ఉందని, డేటా బేస్‌లో ఉన్న పేరుతో దరఖాస్తులోని చందాదారుడు, తండ్రి పేరు సరిగ్గా లేదు.. ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టారు.. లాంటి కారణాలతో ఈపీఎఫ్ క్లెయిమ్‌ల తిరస్కారానికి అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకుంది. బ్యాంకులకు ఆర్‌బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను ఈపీఎఫ్ఓ అమలు చేస్తూ ఈ- కేవైసీని తీసుకువచ్చింది. ఈపీఎఫ్ ఖాతాదారుడి వ్యక్తిగత వివరాల్లో ఏదైనా మార్పులు పేరుతో జరిగే మోసాలను నియంత్రించేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. వ్యక్తిగత వివరాల్లో మార్పుల కోసం దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా అప్లికేషన్ కేటగిరీ ఆధారంగా చిన్న చిన్న సవరణల్ని వారం రోజుల్లో పెద్ద సవరణలను 15 రోజుల్లోగా పరిష్కరించాలని గడువు పెట్టింది. నిబంధనలు పాటించని అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఈపీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలను అప్డేట్ కోసం ఖాతాదారులు ప్రతి రోజూ రీజల్ ఆఫీసుల చుట్టూ తిరగుతున్నారని గుర్తించారు. అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలన్నా.. ఏదో ఒక కారణంతో అప్లికేషన్లను ఈపీఎఫ్ అధికారులు తిరిగి పంపించేస్తున్నారు.. దీంతో పర్సనల్ వివరాల సవరణ కోసం ఉద్యోగులు సంబంధిత యజమానితో సంతకం చేయించి, రీజనల్ ఆఫీసులో జాయింట్ డిక్లరేషన్లు అందిస్తున్నారు. ఇలా వచ్చిన ఫిర్యాదులపై ఈపీఎఫ్ఓ వెంటనే చర్యలు తీసుకోకపోడవడం, అప్లికేషన్ పరిష్కారానికి సరైన సమయం లేకపోడవంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారంతో పాటు మరింత పారదర్శక సేవల కోసం నూతన విధానం తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈపీఎఫ్ ఖాదాదారుడి పేరు, లింగం, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేరు, బంధుత్వం, వివాహస్థితి, ఉద్యోగం వదిలిపెట్టడానికి కారణం, జాతీయత, ఆధార్ నంబర్ మార్చుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. అయితే, వివాహానికి సంబంధించి మాత్రమే రెండుసార్లు మార్పు చేసుకునే ఛాన్స్ ఉంది. మిగతా వివరాలన్నీ ఒకసారి సవరిస్తారు. ఏదైన అత్యవసర పరిస్థితుల్లో ఒకటికి మించి సవరణ చేయాల్సిన పరిస్థితుల్లో రీజనల్ కమిషనర్లు నిర్ణయం తీసుకుంటారు. దరఖాస్తులను రెండు కేటగిరీలుగా విభజించనున్నారు. పేరులో రెండు అక్షరాల్లోపు, ఇంటిపేరు, పెళ్లి తర్వాత మహిళ ఇంటి పేరు మార్పులాంటివి చిన్న సవరణలుగా.. అంతకన్నా ఎక్కువైతే పెద్ద సవరణగా లెక్కిస్తారు. చిన్న వాటికి రెండు, పెద్ద వాటికి మూడు ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. సకాలంలో దరఖాస్తుల్ని పరిష్కరించుకుంటే EPPOIGMS పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

 

*చైనా కన్నా ఎక్కువ.. తొలి త్రైమాసికంలో 7.8 వృద్ధి
ఆర్థికవృద్ధిలో ఇండియా దూసుకుపోతోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం చివరిదైన జనవరి-మార్చి త్రైమాసికంలో 6.1 శాతం జీడీపీ వృద్ధిరేటు నమోదైంది. 2022-23 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 13.1 శాతం గ్రోత్ రేట్ నమోదైంది. అక్టోబరు-డిసెంబర్‌లో జిడిపి వృద్ధి 4.5 శాతంగా ఉంది. అధిక ప్రైవేటు వినియోగం మరియు ఇన్వెస్ట్మెంట్స్, ద్రవ్యోల్భణంలో వేగంగా పెరుగుదల ఈ ఏడాది కనిపించింది. ఈ ఆర్థిక సంవత్సరం( ఏప్రిల్ 1-మార్చి 31) మొదటి త్రైమాసికం ఏప్రిల్-జూన్ నెలలో చైనా వృద్ధిరేటు కేవలం 6.3 శాతంగా నమోదైంది. ఇదే కాలానికి భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థగా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న జూలై-సెప్టెంబర్ త్రైమాసిక వృద్ధి గణాంకాలు నవంబర్ 30న విడుదల కానున్నాయి. గతేడాది 2.4 శాతంతో పోలిస్తే వ్యవసాయ రంగంలో 3.5 శాతం వృద్ధిరేటు నమోదు చేయగా.. తయారీ రంగంలో వృద్ధి 6.1 శాతం నుంచి 4.7 శాతానికి పడిపోయింది. అంతకుముందు ప్రభుత్వం 2023 టాప్ 10 ఆర్థిక వ్యవస్థ జీడీపీ వృద్ధిరేటును అంచనా వేసింది. భారతదేశం జీడీపీ నంబర్ వన్ స్థానంలో ఉంటుందని, భారత జీడీపీ వృద్ధి 5.9 శాతం, చైనా జీడీపీ 5.2 శాతం, అమెరికా జీడీపీ 1.6 శాతం ఉంటుందని అంచనా.

 

*బిగ్ బ్రేకింగ్.. సమంతను దారుణంగా మోసం చేసిన మేనేజర్.. ?
స్టార్ హీరోయిన్స్.. కుటుంబం, స్నేహితులు కన్నా ఎక్కువ నమ్మేది మేనేజర్స్ ను మాత్రమే. పారితోషికాలు, సినిమాలు, ఈవెంట్స్ .. అన్ని వారి చేతిలోనే ఉంటాయి. అయితే.. అంతగా నమ్మినవారిని మేనేజర్స్ మోసం చేయడం అత్యంత బాధాకరమైన విషయం. ఈ మధ్యనే హీరోయిన్ రష్మికను మేనేజర్ మోసం చేసిన విషయం తెల్సిందే. ఆమెకు తెలియకుండా రూ. 50 లక్షల వరకు సదురు మేనేజర్ కాజేసాడని, అది సహించలేని రష్మిక అతడిని పనిలో నుంచి తీసేసిందని వార్తలు వచ్చాయి. ఇక అందులో ఎలాంటి నిజం లేదని, తాము ప్రొఫెషనల్ గానే విడిపోతున్నామని రష్మిక ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలిపింది. ఇక ఆ ఘటన ఇంకా మరువకముందే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా అతని చేతిలో మోసపోవడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం సామ్.. సినిమాలను ఆపేసి రెస్ట్ తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆమె.. ఖుషీ సినిమా ప్రమోషన్స్ కు కూడా హాజరుకాలేకపోయింది. అన్ని ఇంటర్వూస్ లో పాల్గొనకుండా.. కేవలం కొన్ని ఇంటర్వూస్ కు మాత్రమే పరిమితమయ్యింది. ఇక తాను ప్రమోషన్స్ కు రానప్పుడు.. తనకోసం ఖర్చుపెట్టిన డబ్బు .. నిర్మాతలకు అధిక భారంగా మారుతుందని తెలిసి.. తన పారితోషికంతో రూ. 1 కోటిని తిరిగి ఇచ్చేయాలని మేనేజర్ కు తెలిపిందట.. కానీ, సదురు మేనేజర్ మాత్రం ఆమెకు తెలియకుండా మైత్రీ మూవీ మేకర్స్ వద్దకు వెళ్లి.. కోటి రూపాయలు క్యాష్ గా ఇవ్వమని కోరాడట. అంత మొత్తాన్ని క్యాష్ గా ఇవ్వలేమని వారు చెప్పడంతో తన ఫ్రెండ్ అకౌంట్ ఇస్తాను అని చెప్పడంతో అనుమాం వచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ సమంతకు ఇన్ఫార్మ్ చేయడంతో ఈ మోసం బయటపడిందని తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా తన కుటుంబ సభ్యుడు అని నమ్మిన వ్యక్తి తనను మోసం చేయడంతో సామ్ ఈ విషయాన్నీ జీర్ణించుకోలేకపోతోందని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని తెలియాలంటే.. సామ్ ఓపెన్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Exit mobile version