Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
రేపటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు.. తదితర కారణాల వల్ల ఆర్థిక లోటుతో ఇన్నా్ళ్లు కొంత ఆలస్యమైందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న నేపథ్యంలో.. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్ లో ఇవాళ (బుధవారం) సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుతో పాటు సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగిస్తున్నామని తెలిపారు. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో నిరాఘటంగా కొనసాగిస్తుందని కేసీఆర్ అన్నారు. మేము ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు అని సీఎం తెలిపారు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.

 

*బీజేపీ తీర్థం పుచ్చుకున్న జయసుధ
తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఇప్పటికే నుంచే వ్యూహాలను రచిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలను కమలం పార్టీలో చేర్చుకోవడంలో సఫలం అవుతుంది. అయితే, తాజాగా సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరారు. తరుణ్ చుగ్, కిషన్ రెడ్డిల సమక్షంలో ఆమె కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి చూడటం వల్లే బీజేపీ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. సంవత్సరం నుంచి బీజేపీ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను.. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.. కుల, మతాల పరంగా కాదు మంచి పని చెయ్యాలని కోరుకుంటున్నా.. క్రైస్తవుల వాయిస్ కోసం నేను పని చేస్తాను అని జయసుధ అన్నారు. ఎమ్మెల్యేగా నా పదవి కాలాన్ని పూర్తి చేశాను అని జయసుధ అన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో కనిపించక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.. రాజకీయాలంటే మీకు తెలుసు కదా.. సమయాన్ని గౌరవించాలి.. టైంను నమ్ముతా.. ఇప్పటికీ సినిమాలు నాకు రావడం అదృష్టం అని ఆమె అన్నారు. అప్పుడప్పుడు.. మంచి క్యారెక్టర్లు ఉంటే చేస్తున్నాను.. ఇక, సికింద్రాబాద్ నుంచి మళ్లీ పోటీ అనేది కేవలం రూమర్ మాత్రమేనని బీజేపీ నేత జయసుధ తెలిపారు. జయసుధ సికింద్రబాద్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని ఉన్నారు.. ఆమె బాలనటిగా సినిమాల్లోకి వచ్చారు.. 9 నంది అవార్డులు జయసుధ గెలుచుకున్నారు.. సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జయసుధ ఎమ్మెల్యేగా ఉన్నపుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. జయసుధ బీజేపీ పార్టీలో చేరటం మాకు చాలా లాభం.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. బీఆర్ఎస్ పార్టీ ఓడితెనే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది అని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు.

 

*మంత్రి అమర్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సీఎం విశాఖకు రాకపై మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరా పండగ రోజున విశాఖ ప్రజలకు బ్రహ్మాండమైన కానుక ఉంటుందని ఆయన తెలిపారు. విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్న కల దసరాతో తీరుతుందని పేర్కొన్నారు. అటు పార్టీని వీడిన నాయకులపై మంత్రి అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి చేసి, జగన్‌ను సీఎంను చేయాలని తపించిన వ్యక్తులు ఎవరూ కూడా వైసీపీని వీడి బయటకు వెళ్లలేదన్నారు. అవసరం, అధికారం, పదవులు, భవిష్యత్తు కోసం వచ్చిన వాళ్లే పార్టీ నుంచి వెళ్లిపోయారని మంత్రి అమర్‌నాథ్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి అన్యాయం చేసిన నలుగురు ఎమ్మెల్యేలపై వేటేసిన ధైర్యం జగన్ మోహన్ రెడ్డిది అని మంత్రి గుడివాడ అన్నారు. ముందు నుంచి పార్టీ కోసం పని చేసిన వాళ్లకు, జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకున్న వాళ్ళకు అన్యాయం జరగదని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా కోలా గురువులు బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ నాథ్, మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ విశాఖ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధాని, విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించారు. అయితే సీఎం జగన్ కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయంతో పాటు సీఎంవో‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ దసరాకు విశాఖకు సీఎం వెళ్తారని అటు మంత్రులు సైతం చెప్పారు. ఇందులో భాగంగా మంత్రి అమర్‌నాథ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

 

*రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. తమకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఎన్నికల్లో ముందుకు ఎలా వెళ్లాలన్న దానిపై కారు​ పార్టీ దృష్టి సారించింది. అదే సమయంలో తెలంగాణ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం.. లాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయింది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మరోవైపు రేపటి(గురువారం) నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాల్లో విపక్షాలపై దాడి చేసేందుకు అధికార పార్టీ నేతలు రెడీ అవుతున్నారు. తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ రెడీ చేసుకుంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే టార్గెట్‌గా ముందుకు సాగుతుంది. ఇలాంటి చాలా అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అధికార పార్టీకి ఇదే చివరి అసెంబ్లీ సమావేశం. ఎందుకంటే సెప్టెంబరు రెండు లేదా మూడో వారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆగస్టు 18 తర్వాత ఏ రోజైనా బీఆర్​ఎస్​ తొలి విడత ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన పలువురు అంటున్నారు. తొలి జాబితాలోనే 85 నుంచి 90 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను నిర్ణయించే ఛాన్స్ ఉంది. తొలి విడత ప్రకటించిన తర్వాత మిగిలిన నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు విపక్షాలకు ఆయుధంగా మారనున్నాయి. భారీ వర్షాలు, వరదలతో పంటలు నీట మునిగి రైతులు నష్టపోవడంపై ప్రస్తుతం రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే టాఫిక్ పై అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ జరుగనుంది. ఇదే అంశంపై ప్రభుత్వంపై విపక్షాలు విమర్శల దాడి చేసేందుకు ఛాన్స్ ఉంది. ఈ ఇష్యూని తమకు అనుకూలంగా మార్చుకుని.. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేయాలని యోచిస్తోంది. ఇంతలా వర్షాలు కురిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థికసాయం పైనా వివరాలను రెడీ చేస్తోంది. మొత్తానికి రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు రచ్చ రచ్చగా జరిగే అవకాశం ఉంది.

 

*హర్యానా సీఎం వివాదస్పద వ్యాఖ్యలు..
హర్యానా సీఎం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరినీ రక్షించడం ప్రభుత్వ యంత్రాంగం వల్ల కాదని అన్నారు. హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగాలు ప్రతి ఒక్కరినీ కాపాడలేవని అన్నారు. రాష్ట్ర పౌరులు సంయమనం పాటించాలని, శాంతిని కాపాడాలని కోరారు. కొన్నిసార్లు సైన్యం, పోలీసులు ఇందుకు హామీ ఇవ్వలేకపోవచ్చని చెప్పారు. హర్యానాలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్‌ చేశారు. మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది క్షతగాత్రులు కాగా.. వారిలో డిప్యూటీ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్‌, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు స‌హా పది మంది పోలీసులు ఉన్నారు. హర్యానా అల్లర్లు మంగళవారం రాత్రి గురుగ్రామ్‌ను తాకడంతో తాజాగా ఢిల్లీ అప్రమత్తం అయ్యింది. అల్లర్లలో జరిగిన నష్టానికి పరిహారాన్ని ఎవరిస్తారని మీడియా అడిగిన ప్రశ్నలకు ఖట్టర్ వివాదాస్పదంగా మాట్లాడారు. అల్లర్లకు కారణమైనవారే నష్టాన్నిభర్తీ చేస్తారని అన్నారు. ప్రభుత్వం నష్టాన్నంతటికీ పరిహారాలు ఇవ్వబోదని.. కేవలం నష్టపోయిన ప్రభుత్వ ఆస్తులకు మాత్రమే పరిహారాన్ని కేటాయిస్తామని తెలిపారు. ప్రైవేట్ ఆస్తులకు ప్రభుత్వం జవాబుదారీ కాదని వెల్లడించారు. హర్యానాలో అల్లర్లకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంఘాలు ర్యాలీలు నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప‍్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. మతపరమైన విద్వేష ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేసింది. సీసీటీవీలతో నిఘాను మరింత పెంచాలని ఆయా ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

 

*సహజీవనంపై అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు..
దేశంతోపాటు.. ప్రపంచ వ్యాప్తంగా సహజీవనం పెరిగిపోతోంది. కుటుంబ వ్యవస్థలోకి రాకుండా.. సమస్యల సుడిగుండంలో ఉండకూడదనే ఉద్దేశంతో కొందరు ఈ సహజీవనం వైపు వెళుతున్నారు. సహజీవనం నేపథ్యంలో కొన్ని సంవత్సరాల తరువాత గొడవల కారణంగా హత్యలు జరుగుతున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహజీవనంపై అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనాన్ని వివాహపరమైన సంబంధంగా పరిగణించేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధం, అనైతికమని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. 18 ఏళ్లలోపు ఉన్న అబ్బాయి.. వయస్సులో తన కంటే పెద్దదైన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణంతో నేర విచారణ నుంచి రక్షణ పొందలేడని, వారి చర్యలు చట్టపరమైనవి కాదని జస్టిస్‌ వివేక్‌ కుమార్‌ బిర్లా, జస్టిస్‌ రాజేంద్ర కుమార్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. కొద్దిరోజుల క్రితం ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అబ్బాయి ఇంట్లోంచి వచ్చి ప్రయాగ్‌రాజ్‌లో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అమ్మాయి కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారి ఆచూకీ తెలియడంతో అమ్మాయి కుటుంబసభ్యులు ఇద్దరిని బలవంతంగా వారి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తప్పించుకున్న అమ్మాయి.. జరిగిన ఘటన మొత్తాన్ని అబ్బాయి తండ్రికి తెలియజేసింది. దీంతో ఆయన అబ్బాయి తరపున కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దాంతోపాటు అబ్బాయిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని అమ్మాయి మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్‌ న్యాయస్థానం 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం అనైతికమని వ్యాఖ్యానించింది. ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా జీవించేందుకు హక్కు ఉంటుందని, అయితే.. వారు మేజర్లు అయి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నమోదైన కేసులో అబ్బాయిపై మోపిన నేరానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా, నేరం జరిగిందనే అభిప్రాయానికి రాలేమని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై సమగ్ర విచారణ చేయాలని దర్యాప్తు అధికారిని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది.

 

*వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్లో మార్పులు
ఇండియా వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ నిర్వహణ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు తెలపడంతో మార్పులు చేశారు.ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 15న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్ జరిగే గుజరాత్‌లో అదే రోజు విజయదశమి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. దీంతో మ్యాచ్ కు భద్రత కల్పించడం కష్టంగా మారుతుందని.. తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐని కోరాయి. దీంతో బీసీసీఐ.. ఐసీసీకి ప్రతిపాదనలు పంపింది. దీనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా అంగీకారం తెలపింది. దీంతో ఐసీసీ షెడ్యూల్ మార్పునకు ఓకే అనేసింది. ఒక్కరోజు ముందుగానే అక్టోబర్ 14న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. మరోవైపు.. అంతకంటే ముందు పాకిస్తాన్ టీమ్ ఆడాల్సిన మ్యాచ్ తేదీలను కూడా మార్చారు. అందులో భాగంగానే అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరిగే పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్ తేదీని కూడా మార్చారు. ఆ మ్యాచ్ ను అక్టోబర్ 10వ తేదీన జరుగనుంది. దానికి ఇరు జట్లు అంగీకరించాయి. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ నవంబర్ 19 వరకు మొత్తం 46 రోజుల పాటు జరుగనుంది. తొలి మ్యా్చ్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. టీమిండియా తన తొలి మ్యాచును అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం పది టీమ్‌లు పాల్గొననున్నాయి. ఒక జట్టు మిగతా 9 టీమ్‌లతో లీగ్ దశలో తలపడనుంది. లీగ్ దశ ముగిసే సరికి టాప్-4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

 

*బీసీసీఐ కీలక నిర్ణయం.. అమెజాన్, గూగుల్కు మీడియా హక్కులు..!
ఇండియాలో క్రికెట్ అంటే పడి సచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఐపీఎల్, టీ20 మ్యాచ్లంటే క్రికెట్ లవర్స్ టీవీలు, ఫోన్లకే అతుక్కుపోతారు. అంతేకాకుండా భారత్, ఇతర జట్ల మధ్య మ్యాచ్ ఉంటే.. స్టేడియాల్లో కిక్కిరిసిపోతారు. దీంతో బీసీసీఐ భారీ లాభాన్ని ఆర్జిస్తుంది. అంతేకాకుండా ఇతర కంపెనీలు కూడా విపరీతమైన ఆదాయాలను పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. బీసీసీఐ తన ఆదాయ ప్రణాళికలో అమెజాన్, గూగుల్ వంటి కంపెనీలను చేర్చుకోడానికి ప్రణాళికను రూపొందిస్తుంది. ఇప్పటికే ఐపీఎల్ మీడియా హక్కులను విక్రయించి భారీ లాభాలను ఆర్జించిన బీసీసీఐ.. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు యొక్క ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌ల నుండి సంపాదించాలని ప్లాన్ చేస్తుంది. తన బిడ్డింగ్ ద్వారా 750 మిలియన్ డాలర్లను ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ హక్కులను పొందే కంపెనీలు.. ఐదేళ్ల క్రితం ఎంత విలువ ఉందో అంతే విలువ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. మరోవైపు ద్వైపాక్షిక సిరీస్ లో 102 మ్యాచ్ లు ఉండవచ్చు.ఈ మ్యాచ్‌ల మీడియా హక్కుల రేసులో అమెజాన్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలను చేర్చుకోవాలని భావిస్తోన్న బీసీసీఐ.. వేలం ప్రక్రియను రెండు వారాల పాటు వాయిదా వేసింది. మరోవైపు ఐపీఎల్, షార్ట్ ఫార్మాట్ క్రికెట్ మ్యాచ్‌ల మీడియా హక్కులను కొనుగోలు చేయడానికి కంపెనీలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. 2023 ఐపీఎల్ యొక్క వెబ్ టెలికాస్ట్ హక్కులను రిలయన్స్ కంపెనీ జియో సినిమా కొనుగోలు చేసింది. టీవీ హక్కులు స్టార్ ఇండియా వద్దనే ఉన్నప్పటికీ.. ఈ డీల్‌తో బీసీసీఐ భారీగానే సంపాదించింది.

 

*భోళా ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఎన్టీవీలో ఎక్స్ క్లూజివ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అవుతున్నాడు. వాల్తేరు వీరయ్య హిట్ తో మంచి జోష్ మీదున్న చిరంజీవి భోళా శంకర్‌ సినిమాను ఆగస్టు 11, 2023 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజా సమాచారం మేరకు భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ వారాంతంలో అంటే ఆదివారం నాడు ఘనంగా నిర్వహించేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఆరో తేదీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎన్టీవీలో ఎక్స్ క్లూజివ్ గా లైవ్ లో వీక్షించవచ్చు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ ఆయన సోదరి పాత్రలో నటించింది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విడుదల తేది దగ్గరపడుతుండడంతో టీమ్ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టగా సూర్యపేట సమీపంలోని రాజుగారి తోట అనే రెస్టారెంట్‌ లో తెలుగు సినీ హిస్టరీలోనే అతిపెద్ద కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపుగా 126 ఫీట్ ఎత్తులో ఉన్న కౌటౌట్ అక్కడి వారందరినీ ఆకట్టుకుంటోంది. ఇక మరోపక్క ఈ సినిమాకు పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫర్ డడ్లీ వంటి వారు మీడియాకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో సినిమా యూనిట్ జోరు పెంచబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో జరిగే అవకాశాలు ఉండగా విజయవాడలో కూడా జరిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. ‘భోళా శంకర్’ నిర్మాత, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకరకు విజయవాడ అంటే సెంటిమెంట్ అని అందుకే అక్కడ ప్లాన్ చేశారని అంటున్నారు. ఇక మరో పక్క సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది, ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకి u/a సర్టిఫికేట్ జారీ చేశారు.

Exit mobile version