Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*ఏపీ ప్రభుత్వంపై అమిత్‌షా తీవ్ర విమర్శలు
మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృధ్ధిపై విశాఖ రైల్వే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభకు అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వంలో 12లక్షల కోట్లు అవినీతి జరిగిందన్నారు. మోడీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదన్నారు. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో చిక్కుకుపోయిందని విమర్శలు గుప్పించారు అమిత్‌షా. దేశ అంతరంగిక భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. మన దేశ సరిహద్దులు తాకే ప్రయత్నాన్ని కూడా శత్రు దేశాలు చేయకుండా కట్టడి చేయగలిగామన్నారు. ప్రపంచ దేశాలు మోడీ జపం చేస్తున్నాయని.. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి కాదని ఆంధ్రప్రదేశ్‌తో పాటు 131 కోట్ల మందికి దక్కుతున్న గౌరవమన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది… అది చూసి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుని ప్రజలను మభ్య పెడుతున్నారన్నారన్నారు కేంద్ర మంత్రి అమిత్‌షా. పేదలకు కేంద్రం ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యంపై ముఖ్యమంత్రి తన బొమ్మ వేసుకుంటున్నారన్నారు. విశాఖలో భూ మాఫియా,అక్రమ మైనింగ్, ఫార్మా కంపెనీలలో తప్పులు జరుగుతున్నాయని మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల30వేల కోట్లు ఏపీకి వస్తే ఆ డబ్బు అంతా ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో నిధులు అవినీతికి గురయ్యాయని ఆరోపించారు. 450కోట్ల రూపాయలతో వైజాగ్ రైల్వే స్టేషన్ అభివృద్ధి., కడప, కర్నూల్ ఎయిర్ పోర్టులు ప్రారంభించింది మోడీ ప్రభుత్వంలోనే అని ఆయన తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు లభించాయని.. విశాఖ, అనంతపురంలో మల్టీ పర్పస్ లాజిస్టిక్ పార్క్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాకినాడ దగ్గర బల్క్ డ్రగ్ పార్క్‌కు అనుమతి ఇచ్చామన్నారు. 300సీట్లతో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఏపీ నుంచి 20పార్లమెంట్ సీట్లు గెలిపించడం ద్వారా బీజేపీ విజయానికి సహకరించమని అమిత్‌షా అభ్యర్థించారు.

*చికెన్ ప్రియులకు షాక్.. కొండెక్కిన కోడి ధరలు..!
చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్ లాంటిది. చికెన్ ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. గత 15 రోజులుగా చికెన్ ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలంగాణ‌ రిటైల్ మార్కెట్లో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ.310 ఉండగా.. స్కిన్ చికెన్ కు రూ.260 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. అటు ఏపీలోనూ చికెన్ ధ‌ర‌లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. హైద‌రాబాద్ రిటైల్ మార్కెట్ లో చికెన్ ధర రికార్డు స్థాయికి చేరుకుంది. సాధారణంగా వేసవిలో విపరీతమైన వేడి లేదా ఉష్ణోగ్రత కారణంగా కోళ్లు చనిపోవడం, చికెన్ సరఫరా లేకపోవడం వల్ల ధ‌ర‌లు పెరుగుతుంటాయి. అయితే, ఇప్పటివ‌ర‌కు కొన‌సాగిన వేస‌వి ప‌రిస్థితులు, పెళ్లిళ్లు, దావ‌త్ ల సీజ‌న్ కార‌ణంగా చికెన్ ధ‌ర‌లు కొండెక్కాయి. గత 15 రోజులుగా చికెన్ ధరలు మారుతూ వస్తున్నాయి. నాన్ వెజ్ ప్రియులకు ముక్క లేనిది ముద్ద దిగదు అన్నట్లుగా.. గత ఆదివారం హైదరాబాద్ లో 50 లక్షల కిలోల చికెన్ అమ్ముడుపోయినట్లు చికెన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల బ్రాయిలర్ చికెన్ ధరలు మండిపోతున్నాయి. అక్కడ కూడా కిలో 350 వరకు పెరిగాయి. మండే ఎండ‌లు పౌల్ట్రీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీయ‌డంతోనే ఈ ప‌రిస్థితులు ఏర్పడ్డాయ‌ని పౌల్ట్రీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. గడచిన రెండు వారాల్లో ఎండల తీవ్రతకు రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దీంతో రిటైల్ మార్కెట్‌లో కోడి మాంసం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం, రిటైల్ మార్కెట్‌లో బోన్‌లెస్ చికెన్ ధరలు కిలోకు 500 నుండి ₹600 వరకు ఉన్నాయి. 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు తట్టుకోలేక ప్రతిరోజూ కనీసం 20 శాతం కోళ్లు చనిపోతున్నాయి. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంద‌ని పౌల్ట్రీ వ‌ర్గాలు తెలిపాయి.

*శిరీష కేసులో కొత్త ట్విస్ట్.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కామాపూర్‌లో దారుణ హత్యకు గురైన శిరీష కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పరిగి పోలీసులు.. తాజాగా శిరీష బావ అనిల్‌ను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. శనివారం రాత్రి ఫోన్ విషయంలో అనిల్, శిరీష మధ్య గొడవ జరగడం.. ఈ క్రమంలోనే అనిల్ కోపంతో శిరీషను కొట్టడంతో.. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అలా వెళ్లిన శిరీష.. ఇంటికి కీలోమీటర్ దూరంలో ఉన్న నీటి కుంటలో శవమై తేలింది. దీంతో.. శిరీషని అనిల్ హత్య చేసి ఉంటాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో శిరీష తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీకాంత్‌లను కూడా ప్రశ్నించారు. మరోవైపు.. పరిగి డీఎస్పీ కరుణ సాగర్ ఈ కేసు గురించి కొన్ని కీలక వివరాల్ని మీడియాతో పంచుకున్నారు. శిరీష హత్య కేసుని తాము వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలోనే ఈ కేసులో ఒక ట్విస్టును బయటపెడతామని, ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని తెలిపారు. శనివారం సాయంత్రం శిరీషపై చెయ్యి చేసుకున్న శిరీష అక్క భర్త అనిల్‌‌పై తమకు అనుమానం ఉందన్నారు. అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని.. శిరీష తండ్రిని, అన్నను ఇప్పటికే ప్రశ్నించామని చెప్పారు. అనిల్‌ను ఇంటరాగేషన్ చేస్తున్నామన్నారు. అతను పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడని తెలియజేశారు. శనివారం రాత్రి 10 గంటలకు శిరీష ఇంట్లో నుంచి బయటకు వెళ్లిందని, హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. శిరీష రెండు కళ్ళను షార్ప్ కత్తితో పొడిచినట్లు గుర్తించామని, గొంతుపై కట్టినట్లు ఉన్నాయని డీఎస్పీ కరుణ సాగర్ తెలిపారు. అనిల్ కొట్టడంతో.. శిరీష మనస్థాపానికి గురై, ఇంటి నుంచి బయటకు వెళ్లిందని చెప్పారు. శిరీషను కేవలం ఒకరే హతమార్చి ఉంటారని తాము భావించడం లేదన్నారు. ఈ కేసుకి సంబంధించి తాము పలు ఆధారాలు, లీడ్స్ సేకరించామన్నారు.

*అత్యంత తీవ్రంగా బిపార్జాయ్
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపార్జాయ్ తుఫాన్’ తీవ్రరూపం దాల్చింది. అత్యంత తీవ్రమైన తుఫానుగా మారింది. ఈ తుఫాన్ ఉత్తర దిశగా కదులుతూ కల్లోలం సృష్టిస్తోంది. ముఖ్యంగా గుజరాత్ ప్రాంతానికి తీవ్ర ముప్పు ఏర్పడింది. జూన్ 15 గుజరాత్ లోని కచ్ జిల్లా, పాకిస్తాన్ లోని కరాచీ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. సౌరాష్ట్ర, కచ్ తీరాలకు వాతావరణ కేంద్రం తుపాను హెచ్చరికలు జారీ చేసింది.తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన అత్యంత తీవ్రమైన తుఫాను బిపార్జోయ్ గత ఆరు గంటల్లో గంటకు ఎనిమిది కి.మీ వేగంతో ఈశాన్య దిశగా కదులుతోందని, ముంబైకి పశ్చిమాన 550 కి.మీ, దక్షిణాన 450 కి.మీ దూరంలో ఉదయం 11.30 గంటలకు కేంద్రీకృతం అయింది. పోర్‌బందర్‌కు నైరుతి, దేవభూమి ద్వారకకు నైరుతి-నైరుతి దిశలో 490 కి.మీ., నలియాకు నైరుతి-నైరుతి దిశలో 570 కి.మీ, కరాచీ (పాకిస్థాన్)కి దక్షిణంగా 750 కి.మీ ఐఎండీ తెలిపింది. జూన్ 14 ఉదయం వరకు తుఫాను దాదాపు ఉత్తరం వైపుగా కదిలి, తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి, జూన్ 15 మధ్యాహ్నం సమయంలో గుజరాత్‌లోని మాండ్వి, సౌరాష్ట్ర, కచ్, పాకిస్తాన్ లోని కరాచీల మధ్య తీరాన్ని దాటనుంది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 5-135 కి.మీ వేగంతో 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గరిష్ట వేగం 63-88 kmph పరిధిలో ఉన్నప్పుడు తుఫాన్ గా, గంటకు 89 మరియు 117 కిమీ వేగంతో గాలు వీస్తే తీవ్రమైన తుఫానుగా, 118 మరియు 165 కిమీల ఉంటే చాలా తీవ్రమైన తుఫానుగా, 166 మరియు 220 కిమీల మధ్య గాలులు వేగం ఉంటే అత్యంత తీవ్రమైన తుఫానుగా వర్గీకరిస్తారు.గుజరాత్‌లోని కచ్, దేవభూమి ద్వారక, పోర్‌బందర్, జామ్‌నగర్, రాజ్‌కోట్, జునాగఢ్, మోర్బీలతో సహా పలు జిల్లాలకు ఐఎండీ భారీ వర్షపాత హెచ్చరిక జారీ చేసింది. తూర్పు-మధ్య, పశ్చిమ-మధ్య, ఉత్తర అరేబియా సముద్రంలో చేపల వేట కార్యకలాపాలను జూన్ 15 వరకు పూర్తిగా నిలిపివేయాలని హెచ్చరించింది. జూన్ 15న గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పరిస్థితులను ఎదుర్కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

*కేజ్రీవాల్ స్ట్రాంగ్ వార్నింగ్.. నెక్స్ట్ మీరే..!
న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో మహా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆయన ఫైరయ్యారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్-జి ద్వారా కేంద్రానికి ప్రభుత్వాన్ని నడిపించే నియంత్రణను సమర్థవంతంగా మంజూరు చేసే కేంద్రం ఆర్డినెన్స్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ఆర్డినెన్స్‌తో ఢిల్లీ ప్రజలను అమానిస్తోందన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ప్రజాస్వామ్యం ఉందని ఆ ఆర్డినెన్స్‌ చెబుతోందంటూ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఢిల్లీని కేంద్రమే నడుపుతుందని చెబుతున్నారని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ..దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని..ఢిల్లీ ప్రజలు ఒంటరిగా లేరని వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నా అని కేజ్రీవాల్ చెప్పారు. అంతేకాకుండా భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు తమ వెంట ఉన్నారని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌ల అరెస్టుల గురించి మాట్లాడుతూ..దేశ రాజధానిలో పనులు నిలిపివేయడానికే వారిని అరెస్టు చేశారన్నారు. అయినప్పటికీ తమ వద్ద వందమంది సిసోడియాలు, జైనులు ఉన్నారని, వారు తమ పనిని కొనసాగిస్తారని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.

*పాకిస్తాన్‌లోకి వెళ్లిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం.. కారణం ఇదే..
అమృత్‌సర్ నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ పాకిస్తాన్ లోకి వెళ్లింది. ప్రతికూల వాతావరణం కారణంగా లాహోర్ సమీపం వరకు వెళ్లి తిరిగి భారత భూభాగంలోకి వచ్చింది. భారత గగనతలంలోకి తిరిగి వచ్చే ముందు పాకిస్తాన్ లోని గుజ్రాన్ వాలా వరకు వెళ్లిందని పాక్ మీడియా పేర్కొంది. ఫ్లైట్ రాడార్ ప్రకారం.. 454 నాట్ల వేగంతో భారత విమానం శనివారం రాత్రి 7.30 గంటలకు లాహోర్ కు ఉత్తర దిశగా ప్రవేశించి రాత్రి 8.01 గంటలకు భారతదేశానికి తిరిగి వెళ్లినట్లు అక్కడి డాన్ వార్తా పత్రిక నివేదించింది. అయితే ఈ వ్యవహారంపై విమానయాన సంస్థ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌ల డేటా ప్రకారం, రాత్రి 7:45 గంటలకు అమృత్‌సర్ నుండి టేకాఫ్ అయిన వెంటనే విమానం దాని మార్గం నుండి తప్పుకుంది. ఇండిగో విమానం గుజ్రాన్‌వాలా మీదుగా ప్రయాణించి, పంజాబ్‌లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ నగరానికి సమీపంలో భారత గగనతలానికి తిరిగి వచ్చింది. బ్యాడ్ వెదర్ కారణంగా ఇలా జరిగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఇలా వేరే దేశ భూభాగంలోకి వెళ్లేందుకు అంతర్జాతీయంగా అనమతించబడిందని ఇది సాధారణమే అని సివిల్ ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. ఇలాగే మే నెలలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(పీఐఏ)కి చెందిన ఓ విమానం ఇలాగే భారత గగనతలంలో 10 నిమిషాల పాటు ప్రయాణించింది. పాకిస్తాన్ లో భారీ వర్షాల కారణంగా, వాతావరణం బాగా లేకపోవడంతో భారత గగనతలంలోకి పాక్ విమానం ప్రవేశించింది. PK248 అనే విమానం మే 4న మస్కట్ నుంచి లాహోర్ లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో భారీ వర్షం కారణంగా పైలట్ ల్యాండింగ్ చేయలేకపోయాడు. విజిబిలిటీ సరిగ్గా లేకపోవడంతో బోయింగ్ 777 విమానం భారత గగనతలంలోకి వచ్చింది.

*చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
జపాన్‌లో జరిగిన 2023 మహిళల జూనియర్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ దక్షిణ కొరియాను ఓడించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో 2-1 స్కోరుతో ఓడించి తొలిసారి ఆసియా కప్ ఛాంపియన్‌గా అవతరించింది. భారత్ తరఫున అన్నూ (22′), నీలం (41′) గోల్ చేశారు. కొరియా తరపున పార్క్ సియోన్ ఏకైక గోల్ చేసింది. ఈ కీలకమైన మ్యాచ్ లో జట్టు యొక్క సమిష్టి కృషి విజయానికి దారితీసిందని హాకీ ఇండియా పత్రికా ప్రకటన తెలిపింది. అంతకుముందు, లీగ్‌లో భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లీగ్‌లో 4 మ్యాచ్‌లు ఆడగా, భారత్ 3 గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. లీగ్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో 22-0తో ఉజ్బెకిస్థాన్‌ను ఓడించింది. ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొన్నాయి. భారత జట్టుతో పాటు, చైనా, కొరియా, జపాన్, మలేషియా జట్లను కలిగి ఉన్న ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా అండర్-21 హాకీ టోర్నమెంట్‌లో మరో నాలుగు జట్లకు నేరుగా ప్రవేశం లభించింది. మిగిలిన ఐదు జట్లు, కజకిస్తాన్, హాంకాంగ్, చైనీస్ తైపీ, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా గత ఏడాది అక్టోబర్‌లో కజకిస్తాన్‌లో జరిగిన మహిళల జూనియర్ కప్ ద్వారా టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. హాకీ ఇండియా ప్రెసిడెంట్ పద్మశ్రీ డా. దిలీప్ టిర్కీ భారత జూనియర్ మహిళల జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు ప్రశంసించారు. భారత జూనియర్ మహిళల జట్టు ఆసియా కప్‌ను కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. అలాగే ఈ ఏడాది చివర్లో జరిగే జూనియర్ ప్రపంచ కప్‌లో ఈ గెలుపు బలమైన పునాదిగా ఉపయోగపడుతుందంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా వారి విజయాన్ని గుర్తించేందుకు, హాకీ ఇండియా ఆటగాళ్లకు మంచి నగదు పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించింది.

*వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత ఆస్ట్రేలియా
ఈసారైనా ఐసీసీ కప్ లు గెలుస్తుందన్న ఇండియా ఆశలు ఆవిరైపోయాయి. వరుసగా రెండుసార్లు ఫైనల్ లో తలబడినా.. కప్ లు సొంతం చేసుకోవడం ఇండియా వల్ల కాలేదు. అయితే ముందునుంచి దూకుడుగా ప్రదర్శించిన ఆస్ట్రేలియా WTC FINALలో విజేతగా నిలిచింది. 209 పరుగుల తేడాతో విక్టరీ అందుకున్న ఆసీస్.. డబ్ల్యూటీసీ టైటిల్ గెలుపొందిన రెండో జట్టుగా రికార్డులకెక్కింది. అయితే నాలుగో రోజు ఆశలు రేపిన టీమిండియా.. ఐదో రోజు కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఐదో రోజు తొలి సెషన్ లో 63.3 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. చివరి రోజు టీమిండియా గెలువాలంటే 280 పరుగులు కావాలి. అందుకు ఆస్ట్రేలియా గెలువాలంటే 7 వికెట్లు పడగొట్టాలి. బ్యాటింగ్, బౌలింగ్ బలాబలాల్లో గెలుపు ఆసీస్ నే వరించింది. 3 వికెట్ల నష్టానికి 164 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. మరోవైపు తొలి సెషన్లోనే భారత బ్యాటర్లు విఫలమవ్వడం గమనార్హం. క్రీజులో విరాట్ కోహ్లి, అజింక్య రహానే ఉండటంతో భారత్ విజయంపై ధీమాతో ఉంది. పోరాడితే కనీసం మ్యాచ్ డ్రా అవుతుందని భావించారు. కానీ తొలి గంటలోనే భారత ఓటమి ఖాయమైంది. ఒకే ఓవర్లో విరాట్ కోహ్లి (49), రవీండ్ర జడేజా (0)ను ఔట్ చేసిన స్కాట్ బోలాండ్ భారత్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అంజిక్య రహానే క్రీజ్‌లో ఉండటం.. ఓవల్‌లో హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ సాధించిన శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్‌‌కు రావాల్సి ఉండటంతో భారత అభిమానుల్లో ఏదో మూలన ఆశలున్నాయి. కానీ స్టార్క్ బౌలింగ్‌లో రహానే (46) వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాసేపటికే శార్దుల్ ఠాకూర్ కూడా డకౌట్‌గా వెనుదిరగడంతో ఆసీస్ విజయం ఖాయమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్కాట్ బోలాండ్‌కు మూడు, మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కాయి.

*ఆహాను టేకోవర్ చేసిన అల్లు అర్జున్.. హోస్ట్ గా గ్రాండ్ ఎంట్రీ..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. బన్నీ ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అన్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈయన హోటల్ రంగంలో కి అడుగుపెట్టి విజయవంతంగా రెస్టారెంట్స్ ను నడిపిస్తున్నాడు. ఇక ఇంకోపక్క థియేటర్ రంగంలోకి అడుగుపెట్టి అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ను నిర్మించాడు. జూన్ 14 న ఈ థియేటర్ ఓపెన్ అవుతోంది. ఇక ఇవే కాకుండా ఆహా ఓటిటీని కూడా నడిపించే బాధ్యత తీసుకున్నాడు. మొదటి నుంచి కూడా అల్లు అరవింద్ తో పాటు ఆహా బిజినెస్ వ్యవహారాల్లో బన్నీ పాలుపంచుకుంటూ ఉంటాడు. ఆహా ను పైకి తీసుకెళ్లడానికి తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆహా తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఆహాలో ఎటువంటి ప్రోగ్రాం కు గెస్ట్ గా రావాలి అన్న బన్నీ ముందు వాలిపోతారు. ఈ మధ్యనే తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ ఫైనల్ కు బన్నీ గెస్టుగా హాజరయిన విషయం తెల్సిందే. ఇకపోతే ఈసారి ఆహా.. బన్నీతో అంతకుమించి ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. ఆహా కోసం బన్నీ హోస్ట్ గా మారనున్నట్లు సమాచారం అందుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే మేకర్స్ అందివ్వనున్నారు. ఇక ప్రస్తుతం ఒక హింట్ ను మాత్రం వదిలారు. అదేంటంటే.. ఆహా ఒరిగినల్స్.. ప్రొడక్షన్ నెం 1 అంటూ బన్నీ పోస్టర్ తో కూడిన ఒక పోస్ట్ ను రిలీజ్ చేశారు. అందులో బన్నీ.. గన్ పట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక దీనికి క్యాప్షన్ గా.. ” ఆయన కలం నుంచి పుట్టే ఒక్కో మాట.. ఏకే 47 నుంచి వచ్చిన తూటాకన్నా పవర్ ఉంటుంది. మాటల్లో చెప్పలేని మాంత్రికుడు.. మీకు అర్ధమవుతుందా..? ఎవరో.. అంటూ రాసుకొచ్చారు. అంతే మొదటి గెస్ట్ త్రివిక్రమ్ అని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఇప్పటివరకు పర్సనల్ ఇంటర్వ్యూ ఎవరికి ఇచ్చింది లేదు. బన్నీ, త్రివిక్రమ్ ను ఇంటర్వ్యూ చేసి ఆ పర్సనల్స్ అన్ని బయటికి లాగుతాడని అంటున్నారు. మరి అసలు ఈ పోస్టర్ ఏంటి..? దీని కథాకమీషు ఏంటి అనేది తెలియాలంటే.. మేకర్స్ చెప్పేవరకు ఆగాల్సిందే.

Exit mobile version