*తెలంగాణలో వీఆర్ఏలను ఇతర శాఖలకు పంపేందుకు రంగం సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలను ఇతర శాఖలకు పంపేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను నేడు (మంగళవారం) రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జారీ చేశారు. జిల్లాలు, శాఖలు, పోస్టు కేటాయించేందుకు అవసరమైన సమాచారాన్ని పంపాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు లాస్ట్ గ్రేడ్ సర్వీస్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి బాధ్యతలను అర్హతలను బట్టి కేటాయించనున్నారు. శాఖల వారీగా, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను వెంటనే పంపాలని నవీన్ మిట్టల్ తెలిపారు. వీఆర్ఏలకు, 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు శాఖల కేటాయింపు ప్రక్రియను మార్గదర్శకాల ప్రకారం చేపట్టాలన్నారు. ఈ ఏడాది జూన్ 31 నాటి వయస్సును ప్రామాణికంగా తీసుకోనున్నాట్లు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ అన్నారు. తెలంగాణ స్టేట్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం కారుణ్య నియామకాలు చేపడతారు.. వీఆర్ఏల అర్హతలను బట్టి జిల్లాల వారీగా రెగ్యులర్, సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా జిల్లాలో ఖాళీగా ఉన్న కొలువుల ఆధారంగానే కేటాయింపు ఉంటుంది అని అన్నారు. ఒకవేళ ఇతర జిల్లాలకు కేటాయిస్తే ఆ జాబితాను విడుదల చేయాలి అని నవీన్ మిట్టల్ తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆ జిల్లా కలెక్టర్ కి రిపోర్ట్ చేయొచ్చు.. నియామకపు ఉత్తర్వులు జారీ కాగానే వీఆర్ఏలను వెంటనే ఆయా మండల తహశీల్దార్లు వారిని రిలీవ్ చేయాలి అని చెప్పారు. ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే ఎలాంటి సిఫారసులు చెల్లవు అని పేర్కొన్నారు. వారికి కేటాయించినట్లుగా రిపోర్టింగ్ ఆఫీసర్ కి రిపోర్ట్ చేయాల్సిందేన్నారు. 61 సంవత్సరాలు నిండిన వారు వారి కుటుంబ సభ్యులకు ఎన్వోసీ పత్రాలను సమర్పించాలన్నారు. కారుణ్య నియామకపు పత్రాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోనున్నారు. కుటుంబ సభ్యుల విద్యార్హతలను బట్టి పోస్టింగ్ ఉంటుంది. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియ మొత్తం ఈనెల ఐదో తేదీలోపు పూర్తి చేయాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అఫిడవిట్, కుటుంబ సభ్యుల నుంచి ఎన్వోసీ పత్రం వంటివి తీసుకోనున్నారు. వాటితో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, విద్యార్హతల ధృవపత్రాలు, ఎన్వోసీలు, కుల, ఆదాయ ధృవపత్రాలు, ఆధార్ కార్డులాంటివి కూడా ప్రతి వీఆర్ఏ జత చేయాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.
*తెలంగాణ వ్యాప్తంగా తహశీల్దార్ల బదిలీలు..
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఇవాళ (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్-2 పరిధిలోని వారిని బదిలీ చేశారు. ప్రధానంగా నల్లగొండ జిల్లా వారిని యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకి, మేడ్చల్ జిల్లా నుంచి జనగామ, మేడ్చల్ నుంచి రంగారెడ్డికి, సూర్యాపేట జిల్లా నుంచి జనగామ, వనపర్తి జిల్లా నుంచి నాగర్ కర్నూలుకు, వికారాబాద్ జిల్లా నుంచి నాగర్ కర్నూలుకు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి, గద్వాలకు, సంగారెడ్డి జిల్లా నుంచి మహబూబ్ నగర్, వికారాబాద్‌కి బదిలీలు చేశారు. అంటే సొంత జిల్లాల్లో తహశీల్దార్లు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించకుండా రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చర్యలు తీసుకున్నారు. అయితే ప్రస్తుత తహశీల్దార్లలో కొందరు మాత్రం బదిలీ కాలేదు. దానిపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. ప్రస్తుత పోస్టు నుంచి మరో స్థానానికి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంది.. కానీ వారు అదే స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం. వారికి మినహాయింపు ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదు అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అవి నగర శివారులోని మండలాలు కావడంతో ఇప్పటికే పలు అనుమానాలకి దారి తీస్తున్నాయి. ఇక, తెలంగాణలో ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ బదీలీలు జరిగినట్లు తెలుస్తోంది.
*జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
ఏపీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ BS3 వాహనాలను BS4గా మార్చి నడుపుతున్నారని అభియోగాలకు గానూ ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ కేసును సీబీఐకి విచారణకు అప్పగించాలని పిటిషన్ వేశారు. 2020, అక్టోబర్ 12న తెలంగాణ రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోలేదని తన పిటిషన్‌లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలిపారు. తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ప్రతివాదులైన తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కమిషనర్, డీజీపీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభాకర్ రెడ్డిని నోటీసుల్లో హైకోర్టు ఆదేశించింది.
*సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ, నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం పార్ధసారధి రెడ్డి, నేహా శ్రీవాత్సవ, అభిషేక్‌లు కలిశారు. సీఎంతో వారు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు. నగరీకరణ, పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో ఎంపిక చేసిన 4 నగరాల్లో విశాఖకు చోటు కల్పించడం శుభపరిణామమని సీఎం అన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌పోర్ట్ – సీపోర్ట్ కనెక్టివిటీ రోడ్, ఆదానీ డేటా సెంటర్, మూలపేట పోర్టు, ఇనార్బిట్ మాల్, సబ్‌మెరైన్ మ్యూజియం ఇలా అనేక విధాలుగా విశాఖపట్నాన్ని అభివృద్ది చేసి అంతర్జాతీయంగా, ప్రపంచ పటంలో పెట్టే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వం చేస్తుందన్నారు. అంతేకాక ఏపీలో నూతనంగా నిర్మిస్తున్న సీపోర్టులు, వ్యవసాయం, వైద్య ఆరోగ్యరంగం, విద్యారంగం, నాడు నేడు, నవరత్నాలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు ఇలా ప్రతి విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ది, ప్రభుత్వ పనితీరును నీతి ఆయోగ్ బృందం అభినందించింది. ఇదంతా కూడా డాక్యుమెంటరీ రూపంలో తమకు అందజేయాలని ముఖ్యమంత్రిని కోరింది. ఏపీకి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని నీతి ఆయోగ్ బృందం వెల్లడించింది.
*హర్యానాలో ఆగని హింసాకాండ
హర్యానాలో హింసాకాండ ఆగడం లేదు. రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి పెద్ద దుమారం రేగింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ హింసలో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. 30 మందికి గాయాలయ్యాయి. అంతేకాకుండా సుమారు 120 వాహనాల్లో మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ హింసను నియంత్రించేందుకు నుహ్ లో 144 సెక్షన్, కర్ఫ్యూ అమలు చేశారు. 70 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నుహ్ హింసపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిచారు. సోమవారం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల వెనుక “కుట్ర” ఉందని తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని, అనేక చోట్ల ఘర్షణలు జరిగాయని, హింస వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో హింసాకాండ చెలరేగడంతో.. హర్యానాలోని ఇతర ప్రాంతాల నుండి కూడా అదనపు బలగాలను తరలిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి తెలిపారు, “సీనియర్ ఐపిఎస్ అధికారులు వారు మోహరించిన ప్రాంతాలలో శాంతిభద్రతలను కాపాడాలని ఆదేశించారు. ఇదిలావుండగా.. నుహ్ జిల్లాలో ఆగస్టు 2 (బుధవారం) వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఘర్షణలు జరిగిన ఒకరోజు తర్వాత జిల్లాలో నిషేధాజ్ఞలు అమలు చేశారు. నుహ్ జిల్లాలో సోమవారం అల్లర్లు చెలరేగగా.. ఆందోళనకారులు ఒకరిపై మరొఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అంతేకాకుండా నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మరో వర్గం ప్రజలు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్‌లో సంచరించిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు సమాచారం.
*బంగాళాఖాతంలో అల్పపీడనం.. దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. బంగ్లాదేశ్ లోని ఖేపుపారాకు తూర్పు-ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు తూర్పున 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తన బులెటిన్ లో పేర్కొంది. బంగ్లాదేశ్ తీరంలో ఈశాన్య బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి మంగళవారం ఉదయం 8.30 గంటలకు బంగ్లాదేశ్ తీరంలో ఈశాన్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఫలితంగా ఆగస్టు 3 నుంచి 6 వరకు వాయవ్య భారత దేశంలో వర్షపాతం పెరుగుతుందనీ.. రాబోయే మూడు రోజుల్లో కొంకణ్ తీరం, దానిని ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే, రాబోయే ఐదు రోజుల పాటు ద్వీపకల్ప భారతంలో వర్షపాతం తగ్గుతుందని అంచనా వేసింది. గంగానది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో ఆగస్టు 1 నుంచి 5 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రయివేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. దేశంలోని తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ ఈ సీజన్ మొదటి అర్ధభాగంలో భారీ లోటును కూడబెట్టుకున్నాయి. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ, సీజనల్ లోటును తగినంతగా తగ్గిస్తుందని స్కైమెట్ వెదర్ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షపాతం సాధారణ పరిధిలోనే ఉంటుందనీ, దీర్ఘకాలిక సగటులో 94 నుంచి 106 శాతం మధ్య ఉంటుందని ఐఎండీ పేర్కొంది. అంటే రుతుపవనాల సీజన్ ద్వితీయార్ధంలో వర్షపాతం 100 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. జూలైలో సాధారణం కంటే 13 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బుధవారం మధ్యాహ్నం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది మంగళవారం సాయంత్రానికి వాయువ్య దిశగా పయనించి బంగ్లాదేశ్ తీరాన్ని ఖేపుపరాకు తూర్పుగా దాటే అవకాశం ఉందనీ, ఆ తర్వాత మరో 24 గంటల్లో గంగా నది పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని బులెటిన్ లో స్పష్టం చేసింది.
*నితీశ్ సర్కార్‌కు ఊరట.. కులగణనకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
దేశంలో జనాభా లెక్కల్లో కులాల వారీగా కుల గణన చేపట్టాలని దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా చేపట్టే జన గణనలో కూడా కుల గణనను ప్రత్యేకంగా చేపట్టాలని అన్ని రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు కేంద్రానికి వస్తున్నాయి. అయితే గత ఏడాది(2022)లోనే దేశంలో జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేశారు. ఈ ఏడాది కూడా జనాభా లెక్కలు చేపట్టే అవకాశం కనిపించడం లేదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కులగణననుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా బీహార్‌లో ఈ ఏడాది జనవరిలో కుల గణన ప్రారంభమైంది. రెండో విడత సందర్భంగా కొందరు కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మంగళవారం పాట్నా హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. నితీశ్ సర్కార్‌కు పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కులగణనకు మార్గం సుగమం అయింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పట్నా హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది జనవరిలో బిహార్ ప్రభుత్వం కులగణనను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మొదటి దశ సర్వే జనవరి 7-21 తేదీల మధ్య ముగిసింది. రెండో సర్వే ఏప్రిల్ 15న మొదలై మే15తో ముగియాల్సి ఉండగా.. మే 4న పాట్నా హైకోర్టు సర్వేపై స్టే విధించింది. మంగళవారం కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె. వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి వాటిని కొట్టేసింది. అయితే, పాట్నా హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్ల తరపు న్యాయవాది దిను కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ కులాల వారి అభ్యున్నతికి పాటుపడేందుకు వీలుగా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల గురించి సమాచారం తెలుసుకునేందుకు బిహార్‌లో కులగణన చేపట్టనున్నట్లు గతేడాది సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో రెండు దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అప్పట్లో ప్రకటించారు.
*బీజింగ్‌లో భారీ వర్షాలు.. 11 మంది మృతి
వర్షాలు భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతు రుతుపవనాల నేపథ్యంలో భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతోపాటు.. వరదల మూలంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేల సంఖ్యలో నిరాశ్రయులు అయ్యారు. ఇండియాతోపాటు అమెరికా, చైనాలోనూ భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌లో భారీవర్షాల కారణంగా వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. భారీ వర్షాలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని నగరం బీజింగ్‌లో వరదల కారణంగా 11 మంది మృతి చెందగా.. 27 మంది వరదనీటిలో గల్లంతయ్యారు. నగరాన్ని వరద ముంచెత్తడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ మేరకు మంగళవారం స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. చైనా దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో బాధితులను పాఠశాలలు, రైల్వే స్టేషన్లు వంటి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బీజింగ్ కొంతవరకు పొడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇంతటి భారీ వర్షపాతం నమోదవ్వడం అసాధారణం. ఉత్తర చైనాలోని చాలా ప్రాంతాల్లో వరదలు చాలా అరుదు. ఈ అసాధారణ పరిస్థితి కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 50 ఏళ్లలో ఎన్నడు లేనంతగా ఉత్తర ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. గత నెలలో వరదల కారణంగా చాంగ్ కింగ్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో 15 మంది మరణించారు. లియానింగ్‌లోని వాయువ్య ప్రావిన్స్‌లో దాదాపు 5,590 మందిని ఖాళీ చేయించాల్సి వచ్చింది. హుబేలో తుపాను కారణంగా కొందరు వాహనాల్లో చిక్కుకుపోయారు. చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. 1998లో చైనాలో భారీ వరదలు సంభవించాయి. దీని వల్ల 4,150 మంది మృతి చెందారు. ఎక్కువగా యాంగ్జీ నది పరివాహక ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 2021లో హెనాన్ రాష్ట్రంలో వరదల కారణంగా 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
