Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్.. 41 మంది కార్మికులు సురక్షితం..
ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. ర్యాట్-హోల్ మైనింగ్ ద్వారా టన్నెల్ లోపలికి మార్గాన్ని ఏర్పాటు చేసి, చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించడానికి ఆపరేషన్ నిర్వహించారు. తాజాగా 41 మంది కార్మికులను సురక్షితంగా టన్నెల్ నుంచి బయటకు తీసుకువచ్చారు. 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులకు విముక్తి లభించింది. చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్( NDRF ) యొక్క మూడు బృందాలు సొరంగం లోకి వెళ్లి కార్మికులను రెస్క్యూ చేశారు. నవంబర్ 12న ఉత్తర కాశీలోని టన్నెల్ కుప్పకూలింది. దీంట్లో కార్మికులు చిక్కుకుపోయారు. ప్రస్తుతం బయటకు వచ్చిన కార్మికులన ఆరోగ్యం దృష్ట్యా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇందుకోసం 41 అంబులెన్సులను సిద్ధం చేశారు. వారిని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్యాలిసౌర్‌లో ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య సదుపాయాలను చేరుకోవడానికి ‘గ్రీన్ కారిడార్’ ద్వారా తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కార్మికులను ఘనంగా స్వాగతించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు దేశంలోని నిపుణులతో పాటు అంతర్జాతీయ నిపుణులు కూడా రంగంలోకి దిగి ఆ రెస్క్యూను విజయవంతంగా ముగించారు. ముందుగా అమెరికా నుంచి వచ్చిన ఆగర్ మిషన్ సాయంతో శిథిలాలను డ్రిల్లింగ్ చేసి, కార్మికుల్ని రక్షించాలని అనుకున్నప్పటికీ మిషన్ సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఆ తర్వాత వర్టికల్ డ్రిల్లింగ్ ద్వారా రెస్క్యూ చేయాలని అనున్నారు. చివరకు పురాతన పద్దతైన ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా కార్మికులు ఉన్న ప్రాంతానికి సొరంగాన్ని చేశారు. ప్రస్తుతం ఈ మార్గం ద్వారా కార్మికులు బయటకు వస్తున్నారు. కార్మికులు బయటకు రావడంతో స్థానికులు స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

*సైలెంట్‌ పీరియడ్ మొదలైంది.. ఈ 48 గంటలు చాలా కీలకం..
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రచారం చేయొద్దని సూచించారు. అంతేకాకుండా.. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయొద్దని తెలిపారు. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాతే ఒపీనియన్ పోల్ ప్రసారం చేయాలని చెప్పారు. ఈవీయం ర్యాన్డ్ మైజేషన్ పూర్తి చేస్తామని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. ఈ 48 గంటలు చాలా కీలకమని.. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. పోలింగ్ సందర్భంగా అభ్యర్థికి ఒక వాహనానికే అనుమతినిచ్చారు. ఇదిలా ఉంటే.. రేపు ఈవీఎం, ఎన్నికల సామగ్రి పంపిణీ ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. ఈవీఎంల పంపిణీ, రవాణాకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు వెళ్లొచ్చని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ తెల్లవారుజామున 5.30కి మాక్ పోలింగ్ ఉంటుంది సీఈఓ వికాస్ రాజ్ చెప్పారు. హోమ్ ఓటింగ్ 27178 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని.. అందులో సీనియర్ సిటీజన్లు 15999 మంది ఉన్నారని తెలిపారు. ఈరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారని చెప్పారు. 7571 పోలింగ్ స్టేషన్లలో ఎక్కువ మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని.. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేశామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.

 

*రాష్ట్రంలో తొలిసారి తీసుకొచ్చిన హోమ్‌ ఓటింగ్ విధానం సక్సెస్
తెలంగాణలో ఎన్నికల సంఘం తొలిసారిగా అమలు చేసిన హోమ్‌ ఓటింగ్‌ విధానం విజయవంతమైంది. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం చాలా బాగా ఉపయోగపడింది. గతంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయేవారు. ఈ హోమ్‌ ఓటింగ్‌ ద్వారా వారంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా హోమ్‌ ఓటింగ్‌ను తెచ్చామని.. ఈ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల 178 మంది అర్హత కలిగిన వారు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. 80ఏళ్లు పైబడిన వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు హోమ్‌ ఓటింగ్‌ విధానం ద్వారా నుంచి ఇంటి వద్దే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఈ ప్రక్రియను చేపట్టారు. ఎన్నికల సిబ్బంది, బీఎల్వో, పోలీసులతో కూడిన బృందం వారి ఇళ్లకు వెళ్లి బ్యాలెట్‌ రూపంలో రహస్యంగా ఓటు వేయించారు.

 

*బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందన్నారు. అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయని తెలిపారు. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చన్నారు. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు అవకాశముందని స్పష్టం చేశారు.

 

*చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే తీవ్ర చర్యలు ఉంటాయి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది… ఈ క్రమంలో హైదరాబాద్ లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య అన్నారు. 2,400 మంది రౌడీ షీటర్స్ బైండోవర్ చేశామని సీపీ పేర్కొన్నారు. మరోవైపు.. 7 జోన్లలో 1600 మంది రౌడీ షీటర్స్ పై నిఘా పెట్టామని తెలిపారు. అంతేకాకుండా.. 2 లక్షలు వాహనాలు చెక్ చేశామని.. ఎన్నికల విధుల కోసం భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు.. 45 వేల మంది రాష్ట్ర పోలీసులు, 3వేల మంది ఇతర శాఖల సిబ్బంది, 50 కంపెనీల స్పెషల్ పోలీసులతో బందోబస్త్ ఉంటుందని సీపీ సందీప్ శాండిల్య పేర్కొ్న్నారు. హైదరాబాదులో ఇప్పటివరకు 63 కోట్ల రూపాయల నగదు సీజ్ చేసామని సీపీ సందీప్ శాండిల్య అన్నారు. కేంద్ర రాష్ట్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా బెదిరింపులకు దౌర్జన్య పాల్పడితే వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీసు అధికారులపై చర్యలు ఉంటాయని చెప్పారు. చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని సీపీ పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఎన్నికల తాయిళాలు పంచితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

*భారత్‌తో పాటు 6 దేశాలకు శ్రీలంక ‘ఉచిత టూరిస్ట్ వీసాలు’
శ్రీలంక దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టూరిజంపై ఆ దేశం మరింత దృష్టి పెట్టింది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం టూరిస్టులను ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే పర్యాటకులను అట్రాక్ట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. భారత్ నుంచే శ్రీలంకకు ఎక్కువ పర్యాటకులు వెళ్తున్న క్రమంలో మన దేశానికి చెందిన పౌరులకు ‘ఫ్రీ టూరిస్ట్ వీసా’లను మంజూరు చేయనున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషషన్ శాఖ కొలంబోలో ప్రకటించింది. 2019 ఈస్టర్ పేలుళ్లు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య తగ్గింది. దీంతో ప్రధానంగా ఈ రంగంపైనే ఆధారపడిన శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అయితే తాజాగా భారత్‌తో పాటు చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత టూరిస్ట్ వీసాలను జారీ చేయాలని అక్టోబర్ నెలలో ఆ దేశ క్యాబినెట్ల నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అమలు చేయనుంది. మొదటి 30 రోజుల పాటు ఉచిత వీసాలు అందించే పైలట్ ప్రాజెక్ట్ మార్చి 31, 2024 నుంచి అమలులోకి వస్తుందని శ్రీలంక ప్రకటించింది. ప్రయాణికుల రాక తర్వాత డ్యూయల్ ఎంట్రీ స్టేటస్ ఇవ్వబడుతుంది. 30 రోజుల వీసా వాలిడిటీతో ద్వీప దేశంలో 30 రోజులు స్టే చేయవచ్చు. శ్రీలంకకు భారత్ టూరిస్టులు ఎక్కువగా వెళ్తుంటారు. అక్టోబర్ 2023లో ఆ దేశానికి 28,000 భారత టూరిస్టులు వెళ్లారు. ఇండియా టాప్ పొజిషన్‌లో ఉంటే.. 10,000 మందితో రష్యా రెండో స్థానంలో నిలిచింది. ఈ తర్వాత యూకే ఉంది. 2019లో ఈస్టర్ బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లింది. ఈ ఘటనలో 270 మంది మరణించారు. ఇందులో 11 మంది భారతీయులు ఉన్నారు. 500 మంది గాయపడ్డారు.ఆ తర్వాత నుంచి క్రమంగా పర్యాటకుల సంఖ్య తగ్గింది. గతేడాది శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆహారం, మెడిసిన్స్, ఇంధనం ఇలా అన్నింటికి ఇబ్బందులు పడింది.

 

*వీసా కార్యాలయంలో పోర్న్ వీడియో కలకలం
ఓ వీసా కార్యాలయంలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. వెయిటింగ్ హాల్లో అమర్చిన టీవీలో పోర్న్ వీడియో దర్శనం ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంత షాక్‌కు గురైన సంఘటన పాకిస్తాన్ కరాచీలోని యూకే వీసా ఆఫీసులో చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ కరాచీలో గెర్రీ విసా సెంటర్‌కు జనం క్యూ కట్టారు. వీసా ఇంటర్య్వూకి హాజరైన అభ్యర్థులు అక్కడ వెయిటింగ్ హాల్లో క్యూలు కట్టారు. అక్కడ అమర్చిన టీవీలో అడల్ట్ కంటెంట్ వీడియో రావడంతో అక్కడే దూరంగా ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానికి జూమ్ చేసి చూడగానూహ్యం అసభ్యకరమైన వీడియో ప్లే అవ్వడం కనిపించింది. దీనిని అతడు ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వీసా ఆఫీసులో పోర్న్ వీడియో రావడంతో అక్కడ ఉన్న వారంత ఖంగుతిన్నారు. ఇదేంటని కొందరు అక్కడ ఉన్న అధికారులు ప్రశ్నించడంతో వారు అలర్ట్ అయ్యారు. వెంటనే టీవీ స్వీఛ్చాఫ్ చేయించారు. కాగా ఇలా పబ్లిక్ ప్లేస్ పోర్న్ వీడియో ప్లే అవ్వడంపై అంతా షాక్ అవుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని, అయినా ఆఫీసు టీవీల్లో ఇలాంటి వీడియో రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా పబ్లిక్ ఏరియాలోని టీవీల్లో ఇలాంటి వీడియో రావడం ఇది ఫస్ట్ టైం కాదు. రీసెంట్‌గా ఇండియాలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. గత మార్చిలో బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లోని టీవీలో ఇలాంటి ఘటనే జరిగింది. రైలు షెడ్యూల్‌ను ప్రకటించడానికి ప్లాట్‌ఫారమ్‌పై అమర్చిన టెలివిజన్‌లో అడల్ట్ వీడియో ప్లే అయ్యింది. ఈ ఘటన సోషల్ మీడియాలోనూ హాట్‌టాపిక్ అయ్యింది.

 

*పాకిస్తాన్‌లో పరువు హత్య.. అబ్బాయితో డ్యాన్ చేసిందని అమ్మాయిని హతం చేసిన కుటుంబం..
ఇస్లాం ప్రాతిపదికగా ఏర్పడిన పాకిస్తాన్‌లో కొందరు మతఛాందసవాదాన్ని తలకెక్కించుకుంటున్నారు. దీంతో అక్కడ అమ్మాయిలు, మహిళల స్వేచ్ఛకు పరిమితులు ఉంటున్నాయి. ఇదే కాకుండా పరువు హత్యల విషయంలో పాకిస్తాన్ టాప్ పొజిషన్‌లో ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న, ప్రేమించుకుంటున్న అక్కడ అమ్మాయిలను సొంత బంధువులు, కుటుంబ సభ్యులే క్రూరంగా హత్య చేస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి, అబ్బాయితో డ్యాన్స్ చేసిందందుకు అత్యంత దారుణంగా హత్యకు గురైంది. సొంత కుటుంబమే ఆమెను చంపేసింది. పాకిస్తాన్ లోని కోహిస్తాన్ ప్రాంతంలో 18 ఏళ్ల అమ్మాయిని చంపేశారు. అబ్బాయితో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతోనే అమ్మాయిని హత్య చేశారు. అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో అబ్బాయి హత్యను నిరోధించగలిగారు. స్థానిక మతపెద్దల ఆదేశాలతోనే అమ్మాయిని హత్య చేసినట్లు సమాచారం. అదే వీడియోలో కనిపించిన మరో అమ్మాయిని కూడా హత్య చేయాలని జిర్గా ఆదేశించింది. ఆ అమ్మాయి హత్య జరిగే లోపే పోలీసులు రక్షించారు. పరువు హత్యలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కొన్ని హక్కుల సంఘాలు పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న క్రమంలో అమ్మాయి హత్య పాక్ వ్యాప్తంగా దుమారం రేపింది. జిల్లా పోలీస్ అధికారి ముక్తియార్ తనోలి మాట్లాడుతూ.. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాలిక కుటుంబీకులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెతో డ్యాన్స్ చేసిన బాలుడు అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ వీడియోలో ఉన్న మరో యువతికి ప్రాణహాని లేదని వారితో వెళ్లాలని కోరుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. 2011లో కుటుంబ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తికి చప్పట్లు కొట్టిన వీడియో వైరల్ కావడంతో జిర్గా మరణశిక్ష విధించడంతో ఐదుగురు మహిళల్ని హత్య చేశారు. ఈ ఘటన పాకిస్తాన్ లో సంచలనంగా మారింది. ముగ్గురు అన్నాదమ్ముల్ని కూడా హత్య చేశారు. తన ప్రాణాలకు అపాయం ఉందని 2012లో చెప్పిన మరో సోదరుడు అఫ్జల్ కోహిస్తానీని 2019లో అబోటాబాద్ లో కాల్చి చంపారు.

 

*సలార్ కథ లీక్ చేసేసిన ప్రశాంత్ నీల్..
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ సిరీస్ డైరెక్ట్ చేసి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అనగానే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిజంగా ఉందో లేదో తెలియదు కానీ కేజీఎఫ్ సిరీస్ కి సలార్ సినిమాకి లింక్ ఉందని ప్రచారం కూడా మొదలవడంతో ఆ అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతూ వెళ్లాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూ ఈనెల 22వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా కే జిఎఫ్ సిరీస్ తో లింక్ అయి ఉంటుందా? ఒకవేళ ఉంటే కేజిఎఫ్ ముందు జరిగిన కథ లేక తర్వాత జరిగిన కథనా? అనే విషయాల మీద రకరకాల చర్చలు జరుగుతున్న క్రమంలో ఈ సినిమా కథ ఏమిటి అనే విషయం మీద దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా కథ ప్రాణ స్నేహితులైన ఇద్దరు బద్ధ శత్రువులుగా ఎలా మారారు? అనే అంశాన్ని బేస్ చేసుకుని ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి ఫ్రెండ్షిప్ అనేది ఒక కోర్ ఎమోషన్ గా ఉంటుందని ఆయన వెల్లడించారు. సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ లో మొదటి భాగం కథ చెబుతామని ఆ తర్వాత పూర్తి కథ రెండో సినిమాలో పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈ సలార్ సినిమా గురించి జరిగిన ఎన్నో ప్రచారాలకు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చినట్టు అయింది. సో ఈ మాటలను బట్టి చూస్తే ఈ సినిమాకి కేజేఎఫ్ సిరీస్ కి లింక్ అయితే లేదనే చెప్పాలి. అయితే దర్శకుడు తన ఇంటెలిజెన్స్ తో ఏదో ఒక లింక్ క్రియేట్ చేసినా చేయచ్చు.

Exit mobile version