*అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ.. వైద్య సిబ్బంది సెలవులు రద్దు
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని విభాగాల అధిపతుల దగ్గర నుంచి మంత్రి హరీశ్ రావు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నాను. వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి, వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూస్తున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్య సంరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణులను ఆస్పత్రులకు తరలించాలని తెలిపారు. ఈనెల 20 నుంచి 26 వరకు అన్ని జిల్లాలో 327 మందిని, ఇవాళ 176 మందిని.. మొత్తంగా 503 మందిని హాస్పటల్లోని బర్త్ వెయిటింగ్ రూములకు సురక్షితంగా తరలించామని ఆయన పేర్కొన్నారు. గర్భిణుల వెంట వచ్చిన వారికి వసతితో పాటు భోజన సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈవిధంగా ముందస్తు చర్యలు తీసుకుంటూ గర్భిణుల సంరక్షణకు వైద్యారోగ్య శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది అని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సబ్ సెంటర్ స్థాయి నుంచి హైదరాబాద్ లోని ప్రధాన ఆస్పత్రుల వరకు వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉన్నారు అని ఆయన తెలిపారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశారు.. జిల్లా, ఏరియా, సీహెచ్సీ, ఎంసీహెచ్ ఆసుపత్రుల వారీగా ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని వైద్యారోగ్య మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాట్లు తెలిపారు. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర స్థాయిలో 24×7 స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119 ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. దీనికి అనుబంధంగా జిల్లా స్థాయిలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది.. పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తుందని మంత్రి వెల్లడించారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో డీపీహెచ్ పరిధిలోని సిబ్బందికి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మంజూరు చేసిన వారికి కూడా రద్దు చేసి, తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
*టెన్షన్ పుట్టిస్తున్న కడెం ప్రాజెక్టు గేట్లు
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటితో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. దీంతో ప్రమాదకర స్థాయికి నీటిమట్టాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు ప్రాజెక్టుల్లో సామర్థ్యానికి మించి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇక నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో స్థానికులకు వణుకు పుట్టిస్తున్నాయి. వరుసగా కురిసిన వానలతో జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ పట్టణమైతే పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. అటు కడెం ప్రాజెక్టు పరిస్థితి అయితే డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. ప్రాజెక్టుకు ఏకంగా 3 లక్షల క్యూసెక్కులకు చేరువలో ఇన్ ఫ్లో వస్తోంది. కడెం ప్రాజెక్టు అసలు సామర్థ్యం 3. 50 లక్షల క్యూసెక్కులుగా కాగా.. ప్రాజెక్టుకు ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులోని 16 గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. అయితే మరో రెండు గేట్లు మాత్రం మొరాయించాయి. ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు వైపు ఎవరినీ అనుమతించడం లేదు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. అయితే, కడెం ప్రాజెక్ట్ కు భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతుండటంతో గేట్ల పై నుంచి వరద నీరు వెళ్తుంది. దీంతో.. లక్ష 40 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్ లోకి చేరుకుంటుంది. దీంతో అధికారులు ఇప్పటికే అతి కష్టం మీద రెండు గేట్లను ఎత్తివేశారు. మొత్తం 18 గేట్లు ఉండగా అందులో 16 గేట్లు ఎత్తివేయగా.. ఇంకా రెండు గేట్లు తెరుచు కోలేదు.. ప్రాజెక్ట్ ఔట్ ఫ్లో 2 లక్షల 33 వేల 506 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు కు చెందిన మరో రెండు గేట్లు ఎత్తడం కోసం ప్రాజెక్ట్ వద్దకు నిపుణుల టీం చేరుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన టెక్నికల్ టీం.. కౌంటర్ వెయిట్ లేని ఆ రెండు గేట్లను ఎలా పైకి లేపాలి అనే దాన్ని ఎస్ఈ స్థాయి అధికారి పరిశీలిస్తున్నారు. చైన్ పుల్లింగ్ ద్వారా ఎత్తాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు.. ఉండగా.. ఇప్పటి వరకు 16 గేట్లు ఎత్తివేశారు. మరో రెండు గేట్లను సైతం పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు.
*కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ వాయిదా
కొల్లాపూర్‌లో ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ప్రియాంక గాంధీ బహిరంగ సభ మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ఈ సభను రద్దు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు చేరిక మరింత ఆలస్యమవుతుంది. కాగా ఈనెల 20న జరగాల్సిన సభను 30కి వాయిదా వేశారు. కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో సభకు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మరో రెండు రోజులు రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉండడంతో కాంగ్రెస్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జన సమీకరణ కూడా కష్టమయ్యే పరిస్థితి ఉండటంతో ఈ సభను రద్దు చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక సభకు సంబంధించిన తదుపరి తేదీని వెల్లడిస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఇక ఈసారి ఎలాగైనా తెలంగాణలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు రకాల డిక్లరేషన్ లను ప్రకటించి.. జనాల్లోకి తీసుకెళ్తోంది. ఇదే సమయంలో ఆపరేషన్ ఆకర్షన్ పై గురి పెట్టింది. అయితే, ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటంతో పాటు… పలు కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇక మాజీ మంత్రి జూపల్లితో పాటు ఇతర నేతలు కూడా పార్టీలోకి రాబోతున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో కొల్లాపూర్ వేదికగా జాయిన్ కావాలని నిర్ణయించారు. ఇప్పటికే వాయిదా పడగా… జులై 30న కూడా నిర్వహించే అవకాశాలు లేకపోవడంతో మరోసారి కూడా వాయిదా వేశారు. అయితే సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పనులు మొదలుపెట్టగా… సభకు ‘పాలమూరు ప్రజాభేరి’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే వచ్చే నెల ఐదో తేదీన సభను నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇక కొల్లాపూర్ సభ వేదికగానే మహిళల అభ్యున్నతి కోసం మహిళా డిక్లరేషన్ ప్రకటించాలని టీపీసీసీ చూస్తోంది. పెద్ద ఎత్తున చేరికలకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేష్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా చేరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరిత తదితర అనేక మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
*నీటమునిగిన సమ్మక్క సారలమ్మల గద్దెలు
భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు వస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వాగు ఉప్పొంగడంతో గ్రామం మొత్తం జలమయమైంది. అటు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ గిరిజన ఆలయంగా వెలుగొందుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం నీట మునిగింది. గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. అయితే, గోవిందరావు పేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో కోతకు గురైంది. దీంతో తాడ్వాయి, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లక్నవరం జలాశయం పరవళ్లు తొక్కుతూ ఉండటంతో సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరో వైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాజీపేట రైల్వే స్టేషన్, వరంగల్ బట్టల బజార్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. హనుమకొండ-వరంగల్ రహదారి బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నీరు భారీగా నిలిచిపోయింది. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధమవ్వగా, పంతిని దగ్గర ఊర చెరువు ఉప్పొంగడంతో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. మైలారం వద్ద భారీ చెట్టు కూలి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
*విజయవాడ-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు
తెలుగు రాష్ట్రాల్లో గతకొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, వాగులు, కుంటలు అలుగుపారుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. భద్రాచాలం దగ్గర గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. జలాశయాల్లో ప్రమాదకర స్థాయికి నీరు చేరటంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ (గురువారం) హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా వస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, జాతీయ రహదారిపై వందలాదిగా వెహికల్స్ రెండు వైపులా నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వరద ధాటికి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, కొందరు వాహనదారులు వరద నీటిలోనే నెమ్మదిగా ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారు. కీసర దగ్గర మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు నదులు కలుస్తాయి. దీంతో విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై కీసర వంతెన దగ్గర మూడు ఏర్లు కలిసి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. కుదిరితే ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అటు వరంగల్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురవడంతో కాజీపేట రైల్వే స్టేషన్ పూర్తిగా వరద నీటితో మునిగిపోయింది.
*హీరోల కొడుకులే హీరోలా.. వాళ్ళకి ఎందుకంత రెమ్యునరేషన్?
రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో వైసీపీ రాజ్యసభ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కీలక సూచనలు చేశారు. దీనికి సంబంధించిన చర్చ రాజ్యసభలో జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సినిమా బడ్జెట్లో అధిక భాగం హీరోల రెమ్యూనరేషన్లే అని వెల్లడించారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరోలు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఆయన అన్నారు. భారతీయ చలన చిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు కానీ బడ్జెట్లో మూడో వంతు బడ్జెట్ హీరోలు ఇతర అగ్రనటుల పారితోషకాలకే సరిపోతున్నాయని అన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సభలో సినిమాటోగ్రఫి మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు విజయసాయి రెడ్డి సూచించారు. ఇక సినిమా కోసం కష్టపడి పనిచేసే కార్మికులకు మాత్రం నామమాత్రపు జీతాలు ఇచ్చి సరిపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సినిమా అంటే హీరో ఒక్కడే కాదని స్పష్టం చేసిన ఆయన బడ్జెట్లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని, ఈ మేరకు కేంద్ర సినిమాటోగ్రఫీ చట్టాన్ని బలోపేతం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం అని వెల్లడించారు. హీరోల కొడుకులే ఎందుకు హీరోలు అవుతున్నారు అని ప్రశ్నించిన ఆయన దేశంలో ఎంతో మంది టాలెంట్ కలిగిన వారు ఉన్నారని ఆయన కామెంట్ చేశారు. హీరోల కుమారులే హీరోలు అవుతున్నారు. కానీ హీరోల కుమార్తెలు మాత్రం హీరోయిన్లు అవుతున్న ఉదంతాలు చాలా తక్కువ ఉన్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. హీరోలు అయ్యే హీరోల కుమారులకంటే అందగాళ్ళయిన అబ్బాయిలు దేశంలో లెక్కకు మించి ఉన్నా, టాలెంట్ ఉన్నవారు ఉన్నా వారికి హీరోగా అవకాశాలు ఎందుకు దక్కడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. చైనా కంటే ఎక్కువ జనాభా మన దగ్గర ఉన్నారు కానీ అక్కడ 80 వేల థియేటర్లు ఉంటే భారత్‌లో మాత్రం 8 వేల థియేటర్లు మాత్రమే ఉన్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. అంతేకాదు సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ పొందిన సినీ నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణ చేయాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
*మణిపూర్ మహిళల వేధింపుల ఘటన.. కేసు సీబీఐకి అప్పగింత
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అనంతరం అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించేందుకు కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. జాతుల మధ్య వైరంతో దాదాపు మూడు నెలలుగా మణిపూర్ అల్లకల్లోలమవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళలను నగ్నంగా చేసి ఊరిలో తిప్పిన ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ అమానవీయ ఘటనకు సంబంధించి వీడియో తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడంతోపాటు ఆ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించేందుకు కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కేసు విచారణను కూడా రాష్ట్రం బయట చేపట్టాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పొరుగు రాష్ట్రమైన అస్సాంలోని న్యాయస్థానంలో ఈ కేసు విచారణ చేపట్టాలని కోరనున్నట్లు తెలిపాయి. మరోవైపు ఈ ఘర్షణలకు కారణమైన మైతీ, కుకీ వర్గాలతోనూ కేంద్ర హోంశాఖ సంప్రదింపులు జరుపుతోందని.. రాష్ట్రంలో త్వరలో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చే ఈ చర్చల ప్రక్రియ తుదిదశలో ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మణిపుర్‌లో దాదాపు మూడు నెలలుగా జరుగుతోన్న ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మైతీ, కుకీ వర్గాల ప్రజలతోపాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘర్షణలు మొదలైన మే 3 నుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు అంచనా. అంతేకాకుండా రాష్ట్ర పోలీసులకు చెందిన వేల సంఖ్యలో ఆయుధాలను నిరసనకారులు దోచుకున్నట్లు సమాచారం. వీటన్నింటిపై సమగ్రంగా విచారణ చేపట్టాలనే సీబీఐకి కేసును అప్పగించినట్టు అధికారులు ప్రకటించారు.
*జమిలి ఎన్నికలు సాధ్యం కాదు.. పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం
దేశ వ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కేంద్రం ప్రకటించింది. ఒకేసారి జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జమిలి ఎన్నికలు అనే అంశం ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై.. సాధ్యాసాధ్యాలను లా కమిషన్ పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల కోసం ఆచరణాత్మక రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్‌ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. గత కొన్నేళ్లుగా చర్చనీయాంశమైన జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జమిలి ఎన్నికల నిర్వహణ కష్టమని పార్లమెంట్‌లో తేల్చి చెప్పింది. ప్రస్తుతం దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ మేరకు పార్లమెంట్‌లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. జమిలి ఎన్నికలపై పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికలతో లాభాలు ఉన్నప్పటికీ, ఒకేసారి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పని కాదని మేఘ్వాల్ తెలిపారు. జమిలి ఎన్నికలతో లాభాలున్నప్పటికీ అనేక అవరోధాలు కూడా ఉన్నాయని.. జమిలి ఎన్నికలు జరపాలంటే కీలకమైన 5 రాజ్యాంగ సవరణలు అవసరమని కేంద్ర మంత్రి అన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు అందుకు సమ్మతించాల్సి ఉంటుందని.. పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీప్యాట్‌ల అవసరం ఉంటుందన్నారు. ఒకేసారి అన్ని చోట్లా భద్రతా బలగాల మోహరింపు సాధ్యం కాకపోవచ్చని.. జమిలి ఎన్నికలపై న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలన చేసిందని.. సీఈసీ సహా భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిందని తెలిపిన కేంద్రమంత్రి.. తదుపరి విధాన రూపకల్పన జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర మేఘ్వాల్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలను జరపాలనే ప్రతిపాదన ఎంత వరకు సాధ్యమవుతుంది? అనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. అయితే.. ఈ అంశం గతంలోనూ రాజకీయ వివాదానికి తెరతీసింది. ఒకేసారి ఎన్నికలు జరిపితే.. పలు ప్రాంతీయ పార్టీల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని మేధావులు గతంలో అభిప్రాయపడ్డారు.
*ఏపీ సీఎం పవన్ తో నటించడం ఆనందంగా ఉందా.. ఏమన్నావో అర్ధమవుతుందా.. ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. రేపు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో తేజ్ సరసన కేతిక శర్మ నటిస్తుండగా.. ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఒక ఐటెం సాంగ్ చేసిన విషయం కూడా తెల్సిందే. రెండు రోజుల క్రితం బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా చిత్ర బృందం మొత్తం పాల్గొంది. ఆ ఈవెంట్ కు ఊర్వశీ కూడా హాజరయ్యింది. తాజాగా రేపు సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆమె చిత్రబృందానికి బెస్ట్ విషెస్ చెప్తూ ఒక ట్వీట్ వేసింది. ట్వీట్ అంతా బావుంది కానీ, ఒక్క విషయంలో మాత్రం ట్రోలర్స్ కు ఆహారంగా మారిపోయింది. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ ను సీఎం అని అంటూ సంభోదించింది. ” గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది. మా చిత్రం బ్రో ది అవతార్ రేపు జూలై 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. మరణం తర్వాత తన తప్పులను సరిదిద్దుకోవడానికి రెండవ అవకాశం ఇచ్చిన అహంకారి గురించిన కథ. అందర్నీ కలుద్దాం” అంటూ ట్వీట్ చేసింది. అంతే పవన్ ఫ్యాన్స్ ఊర్వశీని ఎత్తేస్తుంటే .. ట్రోలర్స్ మాత్రం.. పాప ఏమన్నావో తెలుస్తుందా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఫ్యాన్స్ అందరు సీఎం.. సీఎం.. సీఎం అని అరిచేసరికి పవన్ సీఎం అనుకున్నదేమో అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది.
*బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్.. ఆ పోస్టు షేర్ చేసి?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మామూలుగానే సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆయన టీం మాత్రం ఆయన సోషల్ మీడియా అకౌంట్లను యాక్టివ్గా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి ప్రభాస్ ఈ మధ్యనే ట్విట్టర్ లో ఎంట్రీ కూడా ఇచ్చారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రభాస్ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అయితే ముందు నుంచి ప్రభాస్ కి సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్ ఉండేది. ఇండియా వైడ్ అభిమానులు ఉండడంతో ప్రభాస్ ఫేస్బుక్ పేజ్ కి ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆయనకు ఫేస్బుక్ పేజీలో దాదాపు 24 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే కొద్దిసేపటి క్రితం స్టార్ హీరో ప్రభాస్ వాడుతున్న ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఆయన ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ‘humans being unlucky’ పేరుతో ఒక వీడియో షేర్ చేయగా ఆ వీడియో షేర్ చేసిన కొద్దిసేపటికి ప్రభాస్ టీం స్పందిస్తూ ఆయన ఫేస్బుక్ పేజీ నుంచి ఆ పోస్ట్ డిలీట్ చేసింది. నిజానికి గతంలో కూడా పలువురు సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాకర్లు హ్యాక్ చేసి వాటి నుంచి ఇబ్బందికరమైన అసభ్యకరమైన పోస్టులు షేర్ చేసేవారు. అయితే ప్రభాస్ ఫేస్బుక్ పేజీ నుండి షేర్ చేసిన కంటెంట్ సైంటిఫిక్ కంటెంట్ లా అనిపించడంతో కొంత మంది ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించిన అప్డేట్ అని కూడా భావించారు. కానీ అది హ్యాకర్ల పని అని తెలియడంతో వెంటనే ప్రభాస్ టీం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ప్రభాస్ టీమ్ స్పందిస్తూ ఆ పోస్ట్ ను సోషల్ మీడియాలో నుంచి తొలగించారు. అయితే అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిన కొంతమంది నెటిజన్లు ప్రభాస్ అకౌంట్ హ్యాక్ అయిందా ఏంటి అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.
