NTV Telugu Site icon

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
మైనార్టీ, బీసీలకు సెపరేట్ గా డిక్లరేషన్ ఇచ్చామని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మైనార్టీ డిక్లరేషన్ రూపొందించింది సల్మాన్ ఖుర్షిద్ అని తెలిపారు. అయితే కేటీఆర్ మాత్రం.. మోకాలికి, బోడిగుండుకు ముడి పెట్టి మాట్లాడుతున్నాడని విమర్శించారు. మైనార్టీలను బీసీలలో కలుపుతారా.. బుర్ర ఉందా అని మండిపడ్డారు. బీసీలలో 136 కులాల్లో వర్గీకరణ చేసి చట్టం చేశారన్నారు. బేసిక్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా ఇలాంటి అడ్డదిడ్డంగా మాట్లాడరని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడితే సరిపోతుందని తెలిపారు. మాదిగలకు మోసం చేసే ప్రయత్నం మోడీ చేశారని అన్నారు. డిసెంబర్ 4 నుండి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టండి.. మద్దతు ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు. కండిషన్ లేకుండా రాహుల్ గాంధీ మద్దతు ఇస్తారని తెలిపారు. చట్టాలను తమ చేతిలోకి తీసుకుంటే కేసీఆర్.. కేటీఆర్ బయట తిరగలేరని రేవంత్ విమర్శించారు. రాజకీయ పార్టీలు చేసే పని.. పోలీసులు చేయకండని సూచించారు. మేము చేసే పనులు.. మీరు చేస్తే, డిసెంబర్ 9 తర్వాత.. మీరు చేసిన పనులపై విచారణ చేస్తామని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు భయపడకండని తెలిపారు. వచ్చే అసెంబ్లీ మొదటి సమావేశంలోనే కేసులు ఎత్తివేసే బిల్లు పెడతామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. వ్యవసాయంకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ చెబుతుంది.. ఇవ్వడంలేదని నిరూపిస్తే అమర వీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయడానికి హరీష్ రావు, కేటీఆర్ సిద్ధమా అని రేవంత్ సవాల్ చేశారు. 6 నెలల నుండి 24 గంటల కరెంట్ ఇచ్చారో చూద్దామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని.. ఉచిత విద్యుత్ పై మాది పేటెంట్ హక్కు అని రేవంత్ రెడ్డి అన్నారు.

 

*పురంధేశ్వరి ‘సెలెక్టివ్‌ అటెన్షన్‌’ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారు..
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదిగా తీవ్రంగా మండిపడ్డారు. ‘‘పురందేశ్వరి గారు ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారు. తనకు కావాల్సిన వాటినే నమ్ముతారు. వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోరు. దృష్టంతా ‘బావ’సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడం పైనే పచ్చపార్టీ ఆరోపణలను నిర్దారించుకోకుండా రిపీట్ చేయడం ‘సెలెక్టివ్ అటెన్షన్’ లక్షణమే’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. “అనుకుల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీన్ని ‘జెండా పీకేయడం’ అని ఎందుకు అనకూడదో బాకా మీడియా క్లారిటీ ఇవ్వాలి. ఏపీలో కూడా మిత్ర పక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపి 100 స్థానాల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేదు.” అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

*కర్ణాటక హమీలకే దిక్కులేదు, తెలంగాణలో ఏం చేస్తారు..? సిద్ధరామయ్యపై ఆగ్రహం..
కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కీలకమైన ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వాగ్ధానాలు చేస్తున్నారని సిద్దరామయ్యపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల ప్రచారంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాత్కాలిక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అని, డూప్లికేట్ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అని విమర్శించారు. తెలంగాణ రైతులకు ఇప్పటికే 24 గంటల విద్యుత్ ఉంటుందని, అక్కడికి వెళ్లి 5 గంటల కరెంటు ఇస్తామని ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం అని కుమారస్వామి అన్నారు. కర్ణాటకలో 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. అయితే తెలంగాణలో రెండు లక్షల పోస్టులను భర్తీ చేస్తామని సిద్ధరామయ్య, డీకేలు హమీలు ఇచ్చారని కుమారస్వామి విమర్శించారు. 2013-18 వరకు సీఎంగా సిద్ధరామయ్య ఉన్నప్పటి నుంచి ఖాలీలు అలాగే ఉన్నాయని వెల్లడించారు. ఇటీవల తన నియోజకవర్గంలో సమావేశాన్ని ఏర్పాటు చేశానని.. ఒక తాలూకాలో 28 నుంచి 30 మంది వ్యవసాయ అధికారులు, సిబ్బంది అవసరమైతే.. కేవలం ముగ్గురు వ్యక్తులే ఉన్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాన్-ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే శక్తి పథకానికి సంబంధించి.. బస్సులు, సిబ్బంది కొరత తనను తలదించుకునేలా చేస్తుందని మాజీ సీఎం అన్నారు. తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు రూ. 4000 ఇస్తామని కాంగ్రెస్ హమీ ఇస్తోందని, కర్ణాటకలోని మహిళలకు కేవలం రూ.2000 ఇచ్చే గృహలక్ష్మీ పథకం గురించి మాట్లాడారు. కర్ణాటకలో విద్యుత్ రంగంలో తరుచూ లోడ్ షెడ్డింగ్ జరుగుతోందని తెలిపారు.

 

*అఘోరగా మారిన మాజీ సీఎం భార్య..
క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార్ స్వామి భార్య రాధిక కుమారస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఒక నటి. ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా ఆమె తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. రాధికా.. తెలుగువారికి కూడా సుపరిచితమే. తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు, అవతారం లాంటి సినిమాల్లో నటించింది. అయితే ఇక్కడ ఆశించిన ఫలితాన్ని అనుకోలేకపోయింది. అందుకే.. తమిళ్ లోనే అమ్మడు సెట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్ర‌స్తుతం ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో అజాగ్ర‌త్త‌..భైరాదేవి చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో ఆమె శ‌క్తివంత‌మైన పాత్ర‌లు పోషిస్తుంది. భైరా దేవి అనే సినిమాలో రాధికా అఘోరాగా నటిస్తోంది. శ్రీజై ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందిస్తున్నాడు. ఇక నేడు రాధికా పుట్టినరోజుతో పాటు దీపావళీ పండుగ కావడంతో రాధికా పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో ఆమె రాధికా అఘోరా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో రాధిక త్రిశూలం చేత పట్టుకుని కనిపించగా.. బ్యాక్ గ్రౌండ్‌లో అఘోరాలు కూడా కనిపిస్తున్నారు. పోలీస్ పాత్రలో రమేష్ అరవింద్ కనిపిస్తున్నాడు. లేడీ అఘోర పాత్రను మెయిన్ లీడ్‌గా పెట్టి సినిమా తీయడం ఇదే మొదటిసారి. అందుకే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమా రాధికాకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

 

*ఫిన్లాండ్‌కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని విక్రయించనున్న ఇజ్రాయిల్..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయిల్ పలు దేశాలకు తన ఆయుధాలను విక్రయిస్తోంది. ఇటీవల నాటోలో కొత్త సభ్యుడిగా చేరిన ఫిన్లాండ్ దేశానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయిల్ తన డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని ఫిన్లాండ్‌కి విక్రయించడానికి 340 మిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నట్లు ఆదివారం ప్రకటించింది. దీనిని చారిత్రక ఒప్పందంగా ఇజ్రాయిల్ పేర్కొంది. ఇజ్రాయిల్, యూఎస్ కంపెనీలు కలిసి ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. క్రూయిజ్ క్షిపణలు, విమానాలు, డ్రోన్లను కూడా ఈ వ్యవస్థ అడ్డుకోగలదని ఇజ్రాయిల్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతకుముందు సెప్టెంబర్ నెలలో తన యూరో 3 హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థను జర్మనీకి విక్రయించడానికి 3.5 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది. తాజాగా ఫిన్లాండ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. లాంగ్ రేంజ్ యూరో 3 సిస్టమ్‌ని ఇజ్రాయిల్, దాని మిత్ర దేశం అమెరికా కంపెనీలు కలిసి సంయుక్తంగా డెవలప్ చేశాయి. గతేడాది ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత యూరప్‌లోని నాటో వైమానిక రక్షణను బలపరిచేందుకు జర్మనీ, ఇజ్రాయిల్‌తో ఈ డీల్ కుదుర్చుకుంది. మిత్రదేశాలతో కలిసి నిరోధక వ్యవస్థలను కొనుగోలు చేయాలని కోరడంతో ఈ ఒప్పందం జరిగింది. కొత్తగా నాటోలో చేరిన ఫిన్లాండ్ కూడా విమానాలు, రాకెట్లు, క్షిపణులకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసే ప్రణాళికను ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న కారణంగా యూరోపియన్ యూనియన్‌లో ఇజ్రాయిల్ ఆయుధాలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

 

*గాజా ఆస్పత్రిలో బందీలుగా ఉంచిన హమాస్ కమాండర్‌ని హతమార్చిన ఇజ్రాయిల్..
గాజాపై ఇజ్రాయిల్ సైన్యం విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లు ఆస్పత్రుల మాటున ఉన్న హమాస్ తీవ్రవాదుల్ని అంతం చేసేందుకు ముమ్మరదాడుల్ని నిర్వహిస్తోంది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. ఈ ఆస్పత్రిని హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్‌గా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇక్కడి నుంచే హమాస్ టన్నెల్ వ్యవస్థ మొదలవుతోందని, ఆస్పత్రులను హమాస్ రక్షణగా ఉపయోగించుకుంటోదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే అల్ షిఫా ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు ఐడీఎఫ్ సిద్ధమైంది. గాజా ఆస్పత్రిలో 1000 మంది వ్యక్తుల్ని, రోగుల్ని బందీలుగా ఉంచుకుని, వారు తప్పించుకోకుండా ప్రయత్నించిన సీనియర్ హమాస్ కమాండర్‌ని వైమానిక దాడిలో చంపినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. అహ్మద్ సియామ్ హమాస్‌కి చెందిన నాజర్ రద్వాన్ కంపెనీలో కమాండర్ అని.. ఉగ్రవాద దాడుల్లో పౌరులను మానవకవచాలుగా ఉపయోగించుకున్నారని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విట్టర్)లో వెల్లడించింది. మరోవైపు అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయిల్ దాడుల వల్ల పసిపిల్లలు, ఇతర రోగులు చనిపోతున్నారని హమాస్ నేతృత్వంలోని ఆరోగ్యశాఖ ఆరోపించింది. ఇద్దరు నవజాత శిశువులు మరణించినట్లు తెలిపింది. కరెంట్ సౌకర్యం లేకపోవడం వల్ల డజన్ల కొద్దీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారని తెలిపింది. కాగా, తమ లక్ష్యం గాజాలో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ అని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ అన్నారు. అతనిని చంపాలని పాలస్తీనియన్లకు పిలుపునిచ్చారు. అలా అయితే యుద్ధం ఆగిపోతుందని అన్నారు. తాము యాహ్యా సిన్వార్‌ని ఖచ్చితంగా హతమారుస్తామని అన్నారు. యూరప్‌తో పాటు అరబ్ దేశాలు కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని ఇజ్రాయిల్‌ని కోరుతున్నప్పటికీ.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇందుకు తిరస్కరిస్తున్నారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయిల్ పై విరుచుకుపడ్డారు. ఇజ్రాయిల్ భూభాగంలోకి వచ్చిన ఉగ్రవాదులు 1400 మందిని క్రూరంగా హతమార్చారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్, గాజా స్ట్రిప్ పై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 11 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.

 

*ఇన్వెస్టర్లపై కాసుల వర్షం.. ఒక్క సెకనులో రూ.3 లక్షల కోట్ల లాభం
ఈరోజు దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన ప్రారంభం కనిపించింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీఎస్‌ఈ ప్రధాన సూచీ 65,418.98 పాయింట్లకు చేరుకుంది. దీని వల్ల ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు. అయితే మార్కెట్ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే 345.26 పాయింట్ల లాభంతో 65,235.78 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో టాప్ 30 షేర్లు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. ఇటు.. ఐటీ కంపెనీల్లో మంచి వృద్ధి కనిపిస్తోంది. మరోవైపు, నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా పెరుగుదతో 19500 పాయింట్లకు పైగా పెరుగుదలతో ట్రేడవుతోంది. స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ రెండింటిలోనూ మంచి వృద్ధి కనిపిస్తోంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 364 పాయింట్ల లాభంతో 65,268.84 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో 65,418.98 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ నిఫ్టీ 113.10 పాయింట్ల లాభంతో 19,538.45 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కాగా, నేడు నిఫ్టీ 19,547.25 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కోల్ ఇండియా షేర్లలో దాదాపు 4 శాతం పెరుగుదల కనిపిస్తోంది. యూపీఎల్ షేర్లు ఒకటిన్నర శాతానికి పైగా పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. ఒఎన్‌జిసి, ఇన్ఫోసిస్, ఎన్‌టిపిసి షేర్లు ఒక శాతానికి పైగా పెరిగాయి. బీపీసీఎల్, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈలో ఇన్ఫోసిస్, విప్రో షేర్లలో మంచి పెరుగుదల కనిపిస్తోంది. రిలయన్స్ షేర్లు రూ.2329 కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయి. టాటా గ్రూపునకు చెందిన టైటాన్, టీసీఎస్, టాటా స్టీల్ షేర్లలో పెరుగుదల ఉంది. స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిన తీరు వల్ల మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఇన్వెస్టర్లు రూ.3 లక్షల కోట్లు ఆర్జించారు. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.3,20,29,232.24 కోట్లుగా ఉంది. కాగా ఈరోజు మార్కెట్ ప్రారంభమైన వెంటనే మార్కెట్ క్యాప్ రూ.3,23,38,359.97 కోట్లకు చేరుకుంది. అంటే ఒక్క సెకనులో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.3,09,127.73 కోట్లు పెరిగింది. ఇది పెట్టుబడిదారుల ఆదాయం.

 

*కోహ్లీ రికార్డుల పరంపర.. మరో సచిన్ రికార్డు సమం
ఈ వరల్డ్ కప్లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్ పై సెంచరీ సాధించి 49వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా.. సచిన్ రికార్డును కూడా సమం చేశాడు. తాజాగా.. నెదర్లాండ్స్ తో ఆడిన మ్యాచ్ లో కోహ్లీ మరో రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ లో 51 పరుగులు చేసిన కోహ్లీ ప్రస్తుత ప్రపంచ కప్‌లో.. ఏకంగా 7 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. దీంతో ఒక ప్రపంచ కప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన కోహ్లీ చేరాడు. 2003 వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ మొత్తం 7 అర్ధ సెంచరీలు నమోదు చేయగా.. తాజాగా విరాట్ కూడా ఆ జాబితాలో చేరాడు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో విరాట్ మరో హాఫ్ సెంచరీ సాధిస్తే.. ఒక ప్రపంచ కప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు. మరోవైపు ఈ జాబితాలో.. 2019 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ కూడా 7 సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్ లో 51 పరుగులతో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడి 594 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లీ తర్వాత.. ఈ జాబితాలో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ క్వింటన్ డికాక్(591) ఉన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు సెమీస్ మ్యాచ్‌లు ఆడనుండడంతో వీరిద్దరిలో ఎవరు టాప్ స్కోరరుగా నిలవనున్నారో చూడాలి. ఇక సెమీస్ ఫైనల్ మ్యాచ్ లు ఈనెల 15న భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. 16న సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగనుంది.