*కాంగ్రెస్ పార్టీనే పాలమూరు జిల్లాను పట్టించుకోలేదు..
దేవరకద్రలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, తుంగభద్ర నదులు పారే ఈ జిల్లాను సర్వనాశం కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. పాలమూరు జిల్లా ఒకప్పుడు పాలుగారిన జిల్లా.. అద్భుతమైన జిల్లాను సమైక్య రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితి ఉండేది.. గత సీఎంలు కూడా జిల్లాను దత్తత తీసుకున్నామని చెప్పి పునాది రాళ్లు వేశారు తప్ప.. పిడికెడు నీళ్లు తెచ్చవ్వలేదు అని ఆయన మండిపడ్డారు. పంటలు ఎండిపోయి వలవల్ల ఏడ్చి.. చాలా మంది వలసలు పోయారు అని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అలాంటి ఈ జిల్లాను ఏ పార్టీ పట్టించుకుంది..? మన గోస ఎవడైనా చూసిండా..? అన్నది ఆలోచించాలని గులాబీ బాస్ కేసీఆర్ సూచించారు. కృష్ణా, తుంగభద్ర నదులు పారే జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టించే గతి పట్టించింది ఏ పార్టీనో ఆలోచించాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు 50 ఏళ్ల పాటు కరువు అనుభవించారని ఆయన పేర్కొన్నారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ.. ఉన్న తెలంగాణను ఆంధ్రవలో కలిపి మన ప్రాజెక్టులను సమైఖ్య పాలకులు రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. గత పాలకులు ఒక్క ప్రాజెక్టు కూడా అడగలేదు అని కేసీఆర్ చెప్పారు. నేను రాజకీయల కోసం చెప్పడం లేదు.. ఈ ప్రాంతం ఏపీలో కలవకపోతే చాలా బాగుపడుతుంటే.. నష్టపోయింది.. చారెడ్ నీళ్లు కావాలని అడిగేతోడు లేడు అని ఆయన వ్యాఖ్యనించారు. మన తెలంగాణ బిడ్డ అంజయ్య సీఎం అయ్యాకు శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టు ముందకు నడిచింది. అయినా నీళ్లు రాలే..కర్ణాటకకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా దుర్మార్గం చేసింది. 2001లో గులాబీ జెండా ఎగిరేదాకా కర్ణాటకు నష్టపరిహారం ఇవ్వలేదు.. ఇక్కడ రైతాంగానికి నీళ్లు ఇవ్వలేదు.. ఇది చరిత్ర నేను చెప్పేది సత్యం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
*రేపు పుట్టపర్తి పర్యటనకు సీఎం జగన్.. రైతుల ఖాతాల్లో నగదు జమ
రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు. పుట్టపర్తి బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి రూ. 4,000 చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు. 53.53 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ.2,204.77 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. రేపు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి వర్చువల్‌గా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ నాలుగున్నర ఏళ్లలో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా- -పీఎం కిసాన్ పథకం కింద అందించిన మొత్తం సాయం రూ.33,209.81 కోట్లు. ఏటా 3 విడతల్లో రైతులకు రూ. 13,500 ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఏటా 13,500 చొప్పున 5 ఏళ్ళల్లో ఈ పథకం కింద ఒక్కో రైతుకు 67,500 రూపాయల లబ్ధి చేకూరింది. రేపు పుట్టపర్తికి సీఎం జగన్ రానున్న నేపథ్యంలో పోలీసులు.భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శాంతిభద్రతలకు ఆటంకాలు కలిగిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
*ఏపీలో జనసేన త్వరలో కనుమరుగు.. జనసైనికులు ఒకసారి ఆలోచించాలి..
విశాఖపట్నంలోని పాత గాజువాక జంక్షన్‌లో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఏపీలో త్వరలో కనుమరుగయ్యే పార్టీ జనసేన పార్టీ అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జనసైనికుల్లారా మీ శ్రమను డబ్బులు కోసం వేరే పార్టీలకు అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో ఒకపార్టీకి, కేంద్రంలో మరో పార్టీకి అమ్మేస్తున్నారని మంత్రి విమర్శించారు. జనసైనికులు ఒకసారి ఆలోచించాలని సూచించారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసు పెట్టాలన్నారు. చంద్రబాబు బడుగు బలహీన వర్గాల వారిని హీనంగా చూశారని.. కష్టం చెప్పుకోవడానికి వచ్చిన మత్స్యకారులతో అనుచితంగా మాట్లాడారని, అలాగే.. నాయీ బ్రాహ్మణులతో కూడా నీచంగా వ్యవహరించారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవహేళన చేశారని ఆయన గుర్తుచేశారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చట్టసభలు, కార్పొరేషన్ పదవుల్లో సీఎం జగన్ పెద్దపీట వేశారని సీదిరి అప్పలరాజు చెప్పారు. గతంలో మన పిల్లల బతుకులు మార్చాలన్న ఆలోచన ఏ నాయకుడికీ రాలేదని, కానీ.. జగన్ మాత్రం అమ్మఒడి అందించి పేదల చదువులు ఆగకుండా వారి బతుకుల్లో దీపాలు వెలిగించారని కొనియాడారు.
*కాంగ్రెస్-సీపీఐ మధ్య కుదిరిన పొత్తు
సీపీఐ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదిరింది. కొత్తగూడెం సీటు, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. మునుగోడులో స్నేహపూర్వక పోటీ కూడా ఉండొద్దని తేల్చి చెప్పింది. ఇక, సీపీఐ కార్యాలయంలో రేవంత్ రెడ్డి, దీపా దాస్ మూన్షిలు సీపీఐ నేతలు నారాయణ, కునమనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డిలో సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం సీపీఐ-కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య ఒక ఒప్పందానికి వచ్చామని ఆయన తెలిపారు. మోడీ, కేసీఆర్ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని ఆయన పేర్కొన్నారు. ఇండియా కూటమిని గెలిపించాలని పొత్తులు పెట్టుకున్నాము.. ఇక, సీపీఎంతో కూడా చర్చలు జరుగుతున్నాయి.. ఆ చర్చలు కూడా ఫలిస్తాయి అనుకుంటున్నాను అని టీపీసీసీ చీఫ్ చెప్పారు. నాకు ఆ ఆశ ఉంది.. తప్పని పరిస్థితులు వాళ్లకు చెప్పినం.. సహకరించండి అని ఆడిగాము.. పెద్ద మనసుతో అంగీకారం వ్యక్తం చేశారు.. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక, తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం పార్టీతో పాటు సీపీఐతో కలిసి పని చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సహకరించినదుకు ధన్యవాదాలు.. సమన్వయం కోసం కమిటీ.. చట్టసభల్లో సీపీఐ ఉండాలి.. సెక్యులర్ శక్తులకు మంచి ఇండీకేషన్ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. అలాగే, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఓ ప్రతిపాదన తో వచ్చారు అని ఆయన తెలిపారు. స్వతహాగా రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు అని ఆయన చెప్పారు. రాజకీయ అనివార్యత దృష్టితో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. సీపీఐ గొంతు అసెంబ్లీలో వినిపించాలి అనేది మా ఉద్దేశం.. కాంగ్రెస్ కి సానుకూల వాతావరణ ము ఉంది.. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి అని ఆయన అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మిత్రులుగా మారారు.. తెలంగాణలో ప్రజల ఫిర్యాదులు వినే పరిస్థితి లేదు.. ఆర్టీసీలో సంగం లేకుండా కేసీఆర్ చేశారు.. మోడీకి తక్కువేం కాదు కేసీఆర్.. నిర్బంధ ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు.. సీపీఎంతో కూడా మైత్రి ఉండాలి అని చర్చ చేస్తున్నామని కూనంనేని సాంబశివరావు చెప్పుకొచ్చారు. ఇక, సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం నిచ్చితార్థం జరిగింది.. ఇవాళ పెళ్లి జరిగింది అంటూ వ్యాఖ్యనించారు. కేసీఆర్ నుండి విముక్తి పొందాలి తెలంగాణ సమాజం.. సీట్లు ఎన్ని ఇచ్చారు అనేది కాదు.. మోడీ నుండి దేశం కాపాడాలి అని ఆయన కోరారు. అలాగే, చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్..మద్దతు ఇచ్చింది సీపీఐ.. మిత్రుత్వం కొనసాగుతుంది అని ఆయన పేర్కొన్నారు.
*రేపు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ ఇదే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది. కమలం పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ లను రంగంలోకి దించి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయనుంది. ఇక, తాజాగా రేపు రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మొదటిసారి మోడీ తెలంగాణకు వస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. రేపు (మంగళవారం) ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికంగా మారింది. అయితే, రేపటి మోడీ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5: 25 నుంచి 6: 15 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు. అలాగే, ఈ సభకు లక్ష మంది వరకు తరలించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి జనాలను తరలించడానికి కమలం పార్టీ నేతలకు ఇప్పటికే నేతలు దిశానిర్దేశం చేశారు. ఇక, ప్రధాని మోడీ రేపటి సభ తర్వాత మళ్లీ 11వ తేదీన పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.
*తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది..
ముషీరాబాద్ కు చెందిన నగేష్ ముదిరాజ్ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 2018లో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికలకు వచ్చింది అని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పరోక్షంగా ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నారు.. సమైఖ్య వాదులు, తెలంగాణ వ్యతిరేకులతో కాంగ్రెస్ జత కట్టింది.. వైఎస్ షర్మిల తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసింది అని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో తొమ్మిది ఏళ్లుగా కర్ఫ్యూ లేదు కరువు లేదు అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ను నమ్మితే రిస్క్ కాదా?.. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ లు చేసుకుంటుంది అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తుంది.. మళ్ళీ హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ మాత్రమే.. ఒక్క సారి, ఒక్క సారి అనుకుంటే ఆగం అయితరు.. కళ్ల ముందు ఉన్న అభివృద్ధి చూడండి.. మనసుతో కేసీఆర్ కు ఓటు వేయండి అని మంత్రి పిలుపునిచ్చారు. ముదిరాజ్ సామాజిక వర్గాన్ని రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకువస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.. ముదిరాజ్, గంగ పుత్రులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేసింది కేసీఆర్ సర్కార్ అని హరీశ్ రావు వెల్లడించారు. గాలి మాటలు నమ్మి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటు వేస్తే మీ బతుకులు ఆగం అవుతాయని ఆయన తెలిపారు.
*రేపు మిజోరం ఎలక్షన్స్.. 174 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 114 మంది కోటీశ్వరులే..!
రేపు మిజోరంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ అధికారంలోని ఎంఎన్ఎఫ్, ప్రతిపక్షంలోని జెడ్‌పీఎం, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉన్నది. అయితే, రెండు స్థానిక పార్టీల మధ్యే అసలైన పోటీ ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అక్కడ పోటీ చేసే 174 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 114 మంది (66 శాతం) కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపోర్ట్ పేర్కొంది. 2018 ఎన్నికల్లో 209 మంది అభ్యర్థుల్లో 116 మంది (56 శాతం) కోటీశ్వరులు ఉన్నట్లు తెలిపింది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ నుండి 40 మంది అభ్యర్థులలో 36 (90%), కాంగ్రెస్ నుండి 40 మంది అభ్యర్థులలో 33 (83%), జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ నుండి 40 మంది అభ్యర్థులలో 29 (73%) ఉన్నారు. బిజెపి నుండి 23 మంది అభ్యర్థులలో 9 మంది (39%), ఆప్ నుండి 4 మంది అభ్యర్థులలో 1 (25%), 27 మంది స్వతంత్ర అభ్యర్థులలో 6 (22%) మంది రూ. 1 కోటి కంటే ఎక్కువ విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. బిజెపికి చెందిన జెబి రువల్చింగా, లాంగ్ట్లై వెస్ట్ రూ. 90 కోట్లకు పైగా ఆస్తులతో అత్యంత సంపన్న అభ్యర్థులుగా ఉన్నారు. 55 కోట్లకు పైగా ఆస్తులతో సెర్చిప్ (షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడిన సీటు) నుండి కాంగ్రెస్‌కు చెందిన ఆర్ వన్‌లాల్ట్‌లుంగా పోటీ చేస్తున్నారు. అధికారంలో ఉన్న జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ నుండి చంపై నార్త్ (షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడిన స్థానం) నుండి పోటీ చేస్తున్న హెచ్ గింజలాలా ఆస్తులు రూ. 36 కోట్లకు పైగా ఉన్నాయి. ZPM నుండి తుయిచాంగ్ రూ. 35 కోట్లకు పైగా ఆస్తులతో ఉన్నారు. రిజర్వ్‌డ్ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. MNF పార్టీ నుంచి రాబర్ట్ రొమావియా రాయ్ట్, హచెక్ (రిజర్వ్ చేయబడిన స్థానం) నుండి పోటీ చేస్తున్నారు. వీరు రూ. 23 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. సెర్చిప్ స్థానం (ST) నుండి స్వతంత్ర అభ్యర్థి రామ్‌లున్-ఎడెనా అత్యంత పేదవాడిగా ఉన్నాడు. అతనికి రూ. 1,500 విలువైన చరాస్తులు మాత్రమే ఉన్నాయి. 40 మంది అభ్యర్థుల్లో అధికార ఎంఎన్‌ఎఫ్‌కు 36 మంది కోటీశ్వరులు ఉన్నారని నివేదిక పేర్కొంది. కాంగ్రెస్‌లో 33 మంది కోటీశ్వరులు ఉండగా, జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌కు 29 మంది ఉన్నారని నివేదిక పేర్కొంది. అత్యంత సంపన్న అభ్యర్థుల జాబితాలో జేబీ రువల్చింగా అగ్రస్థానంలో ఉన్న బీజేపీకి తొమ్మిది మంది కోటీశ్వరులు ఉన్నారని సమాచారం.
*ఒడిశాలో దారుణం.. రోడ్డు పక్కన శవమై కనిపించిన గర్భిణి
ఒడిశాలోని భద్రక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన 24 ఏళ్ల గర్భిణి మృతదేహం లభ్యమైంది. భండారిపోఖరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నపంగా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన కూతురు హత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భర్త, అతని కుటుంబ సభ్యులే ఆమెను హత్య చేశారని మహిళ తండ్రి ఆరోపించారు. తన కూతురిని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, దీనిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితమే మహిళకు పెళ్లయిందని.. తన భర్త ఇదివరకే ఒక పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆదివారం రాత్రి ఆమె కనిపించకుండా పోయిందని.. సోమవారం గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై కొన్ని గాయాలు ఉన్నాయని, అయితే మరణానికి గల కారణం పోస్టుమార్టం తర్వాత తెలుస్తుందని భండారిపోఖరి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ అజయ్ సుదర్శన్ బాగే తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
*ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి ప్రధాని మోడీ ఫోన్.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై చర్చలు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ వివాదంపై ప్రధాని మోడీ ఈరోజు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఘర్షణల ఫలితంగా ఎదురవుతున్న సవాలు పరిస్థితులపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ ప్రాంతంలో శాంతి మరియు సుస్థిరతను పునరుద్ధరించాలనే ఉమ్మడి లక్ష్యంతో, మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి మోడీ, రైసీ వ్యూహాలపై చర్చించారు. ఇదిలా ఉంటే.. చబహార్ ఓడరేవు సహా ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని స్వాగతిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియాలో తెలిపారుజ మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ ఇజ్రాయెల్-హమాస్ వివాదానికి సంబంధించి ఆదివారం ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 7 ఉదయం హమాస్ రాకెట్ దాడి ద్వారా ఇజ్రాయెల్‌లోకి చొరబడింది. ఆ తర్వాత.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. మేము యుద్ధం చేస్తున్నాము, అందులో మేము గెలుస్తామన్నారు. ఈ దాడిలో ఇప్పటివరకు 1,400 మంది ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ కూడా 200 మందికి పైగా మృతిచెందారు. అటు పాలస్తీనాకు చెందిన 10 వేల మందికి పైగా మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
*ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. 10వేలు దాటిన మరణాల సంఖ్య
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత నెలరోజులుగా ఈ వార్ నడుస్తుంది. ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు బలయ్యాయి. ఇప్పటివరకు 10 వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులను ఉటంకిస్తూ అల్ జజీరా నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. మరణాల సంఖ్య 10,022కి చేరుకుందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఈ దాడుల్లో 4104 మంది చిన్నారులు చనిపోయినట్లు పేర్కొన్నారు. ఎక్కువగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మృతిచెందినట్లు తెలిపింది. అయితే హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన 500కుపైగా రాకెట్లు గాజాపై ల్యాండ్ అయ్యాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెల్ దేశస్తులు మరణించారు. మరోవైపు పాలస్తీనియన్లపై దాడులను ఆపాలని అనేక దేశాలు ఇజ్రాయెల్‌ని డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ హమాస్‌ను అంతం చేసేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేస్తుండంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
