Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*పాకిస్తాన్పై భారత్ ఘన విజయం.. ఇండియా ఆల్రౌండ్ షో
వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపొందింది. దీంతో వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచింది. టీమిండియా బ్యాట్స్ మెన్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(86), శ్రేయాస్ అయ్యర్(53) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించింది. మొదటగా బౌలింగ్ తీసుకున్న భారత్ బౌలర్లలో అత్యుత్తమ ప్రదర్శన చూపించి పాకిస్తాన్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. మరోవైపు బ్యాటింగ్ లో కూడా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి నుంచి దూకుడుగానే ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎంతో సులువైన లక్ష్యాన్ని భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ 86, గిల్ 16, విరాట్ కోహ్లీ 16, శ్రేయాస్ అయ్యర్ 53, కేఎల్ రాహుల్ 19 పరుగులు చేశారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ 2, హసన్ అలీ ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్ కప్ లలో పాకిస్థాన్ పై ఇది భారత్ కు 8వ విజయం. ఏ వరల్డ్ కప్ లో ఇరు జట్లు తలపడినా భారత్ దే పైచేయిగా వస్తోంది. ఆ ఆనవాయతీని రోహిత్ సేన కూడా కొనసాగించింది. ఇక, ఈ వరల్డ్ కప్ లో భారత్ తన తదుపరి మ్యాచ్ ను అక్టోబరు 19న బంగ్లాదేశ్ తో ఆడనుంది.

*ప్రవళిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణం.. పోలీసుల ప్రకటన
ప్రవళిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మీడియా సమావేశం ద్వారా కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. అశోక్ నగర్‌లో స్టూడెంట్ ప్రవళిక ఆత్మహత్యపై దర్యాప్తు చేశామని సెంట్రల్ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. వరంగల్‌కు చెందిన ప్రవళిక 15 రోజుల క్రితమే హాస్టల్‌లో చేరిందని.. గ్రూప్స్‌ ప్రిపేర్‌ కావడానికి నగరానికి వచ్చిందని విచారణలో తెలిసిందన్నారు. గత కొన్నాళ్లుగా శివరామ్ అనే వ్యక్తితో ప్రవళిక ప్రేమలో ఉందని, ప్రవళిక ప్రేమించిన అబ్బాయికి వేరే అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ జరిగిందని డీసీపీ వెల్లడించారు. ప్రవళికను మోసం చేసి శివరామ్‌ మరొకరితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని.. శివరామ్ చేసిన మోసాన్ని ప్రవళిక జీర్ణించుకోలేక పోయిందని చెప్పారు. అది తట్టుకోలేకే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రవళిక ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలుసని సెంట్రల్‌ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. “వరంగల్ చెందిన ప్రవల్లిక గ్రూప్స్ ప్రిపేర్ కోసం నగరారానికి వచ్చింది. 15 రోజులుగా హాస్టల్‌లో ఉంది. ప్రవళిక రూమ్‌మేట్స్‌ సంధ్య, అక్షయ, శ్రుతి ప్రవళిక రూంలో ఉన్నారు. ప్రవళిక మాట్లాడేది కాదు. నిన్న రాత్రి రూంలో ప్రవళిక సూసైడ్ చేసుకుందని 8:30 సమాచారం వచ్చింది. ఆమె ఫ్రెండ్స్‌ను విచారించాం. స్టూడెంట్స్, పొలిటికల్ లీడర్స్ ధర్నా చేశారు . అర్దరాత్రి పోస్ట్ మార్టం చేసి ప్రవళిక రూంలో పంచనామా చేశాం. సూసైడ్ నోట్ రాసి ఉంది. మొబైల్ ఫోన్ సీజ్ చేసాము. ప్రవళిక అబ్బాయితో చాటింగ్ చేసి ఉంది. శివరామ్ రాథోడ్ అనే యువకుడితో ప్రవళిక చాటింగ్ చేసి ఉంది. ప్రవళిక లవ్ సింబల్స్‌తో రాసిన లెటర్స్ సీజ్ చేసాము నిన్న ఉదయం అశోక్ నగర్‌లో బాలాజీ దర్శన్ హోటల్ వద్ద టిఫిన్ చేశారు సీసీ కెమెరా ఫుటేజ్ సీజ్ చేసాము. అమ్మాయి ప్రవళికని శివ రామ్ రాథోడ్ అనే యువకుదు చీటింగ్ చేశాడు. వేరే అమ్మాయితో శివ రామ్ రాథోడ్ అనే యువకుడు ఎంగేజ్ మెంట్ కుదిరింది. ప్రవళిక తమ్ముడు కూకట్‌పల్లిలో ప్రణయ్ డిగ్రీ చేస్తున్నాడు . ప్రవళిక పేరెంట్స్‌కి కూడా ప్రవళిక ప్రేమ వ్యవహారం తెలుసు. లవ్ లెటర్ & సీసీ కెమెరా ఫుటేజ్ & మొబైల్ ఫోన్& పూర్తి ఎవిడెన్స్ సూసుడ్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం పంపాము. అమ్మాయి గ్రూప్స్ అప్లయ్ చేయలేదు. శివరాం రాథోడ్‌పై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తాం. శివరాం రాథోడ్ సీడీఆర్ కలెక్ట్ చేస్తాం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తాం. ధర్నా చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన నాయకులపై కేసులు నమోదు చేశాం.” అని పోలీసులు తెలిపారు.

*చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ప్రభుత్వ వైద్యుల ప్రకటన
రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. ఆయనకు చల్లటి వాతావరణం అవసరమని వారు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యలో ప్రభుత్వ వైద్యులతో కలిసి జైళ్ల శాఖ డీఐజీ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు మాట్లాడుతూ..” చంద్రబాబు వేసుకునే మందులు మాకు చూపించారు. అవి చూసిన తర్వాతే మిగతా మందులను ఆయనకు సూచించాం. చంద్రబాబును చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని జైలు అధికారులకు సూచించాం. చంద్రబాబుకు అన్ని రకాల పరీక్షలు చేశాం.. హాస్పటల్‌కు తరలించాల్సిన అవసరం లేదు.. చంద్రబాబు 67 కేజీల బరువు ఉన్నారు.. చంద్రబాబుకు పర్సనల్‌ డాక్టర్‌ సలహా మేరకు పరీక్షలు చేశాం చంద్రబాబుకు స్టెరాయిడ్స్‌ ఏమీ ఇవ్వడం లేదు.. ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు వైద్య సేవలు అందించమని చంద్రబాబు చెప్పారు.. ఇప్పుడున్న వాతావరణంలో ప్రతి ఒక్కరికి కూడా డీహైడ్రేషన్‌ ఉంటుంది. చల్లటి ప్రదేశం లేకుంటే మేము ఇచ్చిన మందులు ఎంతవరకు పని చేస్తోయో తెలియదు.” అని ప్రభుత్వ వైద్యులు వివరించారు. జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ మాట్లాడుతూ.. “వైద్యుల నివేదికను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిస్తున్నాం.. చంద్రబాబుకు అవసరమైతే అత్యవసర వైద్యం అందించడానికి వైద్య బృందం సిద్ధంగా ఉన్నారు.. వైద్యుల రిపోర్టును ఏమి తగ్గించి చెప్పం.. కోర్టుకు ఇచ్చిన రిపోర్టులో మార్పు ఉండదు.. కోర్టు ఆదేశాల మేరకు ఫ్యామిలీ డాక్టర్ మెడిసిన్ ఇమ్మంటే ఇస్తాం.. నిబంధనల ప్రకారమే ములాకత్‌లకు అనుమతిస్తున్నాం. చంద్రబాబు లాంటి ప్రముఖ వ్యక్తి ఆరోగ్యం, భద్రత విషయంలో అప్రమత్తంగా ఉన్నాం. జైలులో ఏసీ పెట్టేందుకు ప్రిజన్‌ రూల్స్‌ ఒప్పుకోవు. ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే అప్పుడు పరిశీలిస్తాం”అని పేర్కొన్నారు.

*అమిత్ షా-లోకేష్ భేటీపై స్పందించిన పురంధేశ్వరి.. ఏమన్నారంటే?
అమిత్ షా-లోకేష్ భేటీపై పురంధేశ్వరి స్పందించారు. లోకేష్‌ను అమిత్ షా పిలిచారా..? లేక లోకేష్ అడిగారా..? అనేది అప్రస్తుతమని.. వారిద్దరి మధ్య భేటీ జరిగిందన్నారు. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారు..? ఏయే బెంచ్‌ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని ఆమె వెల్లడించారు. కిషన్ రెడ్డి నన్ను పిలిచారని లోకేష్ అన్నారని.. దాని గురించి ఆయన్నే అడగాలని పురంధేశ్వరి చెప్పారు. చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయమని ఆమె తెలిపారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో వాస్తవం ఎంతుందో తేల్చాల్సింది కోర్టులేనని ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చంద్రబాబుపై కేసులు కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి.. సబ్ జుడిస్ కిందకు వస్తాయన్నారు. మద్యం విషయంలో ప్రభుత్వం తీరును తప్పు పట్టానని.. తనను వైసీపీ నేతలు తప్పుబట్టారన్నారు. తాను చేసిన కామెంట్లను తప్పు పడుతూ కేవలం 18.7 శాతం మంది మాత్రమే మద్యం తాగుతున్నారని అధికార పార్టీ నేతలు చెప్పారని పురంధేశ్వరి పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలవన్నీ అవాస్తవాలేనని ఆమె అన్నారు. నేషనల్ ఫ్యామ్లీ హెల్త్ సర్వే ప్రకారం మద్య వినియోగదారుల సంఖ్య 1.29 కోట్ల మంది అని, క్రిసెల్ సర్వే ప్రకారం 34.5 శాతం మేర 1.80 కోట్ల మంది మద్యం వినియోగదారులు ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 40 లక్షల మంది మాత్రమే మద్య వినియోగదారులు ఉన్నారంటూ కాకి లెక్కలు చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా మద్యం విషయంలో మేం ఉద్యమించామని పురంధేశ్వరి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 12 లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలకు లైసెన్సులిచ్చారని.. ప్రస్తుతం ఉన్న మద్యం కంపెనీల యజమానులు గతంలో ఎవరు..? ఇప్పుడెవరో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక మద్యం కంపెనీ తయారీదారులను బెదిరించి ఓనర్ షిప్ మార్చుకున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న మద్యం కంపెనీ ఓనర్ల పేర్లు సాయంత్రానికల్లా బయటపెట్టే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి ఉందా అంటూ ఆమె సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే మద్యం అమ్మకం, తయారీదారులపై కేసులు పెడతామని జగన్ చెప్పారని.. మద్యం కంపెనీలపై కేసులు పెట్టే దమ్ము ఈ ప్రభుత్వానికుందా అంటూ ప్రశ్నించారు. మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నలు గుప్పించారు.

*రెండు నెలలు ఓపిక పట్టండి.. నిరుద్యోగులకు రేవంత్ భరోసా
తెలంగాణ ప్రజలు మరో రెండు నెలలు ఓపిక పట్టండి.. డిసెంబర్ 9న ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. నిర్దిష్టమైన ఆలోచనలతో, ప్రణాళిక బద్దంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. డిసెంబరు 9 నుంచి యువత జీవితాల్లో వెలుగులు తెస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ గద్దె దిగడమే అన్ని సమస్యలకు పరిష్కారమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని.. ఆరు హామీలతో పాటు, ఇది రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మరో హామీ అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. పర్యటన వివరాలు రేపు మధ్యాహ్నం వరకు అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అందులో 58 పేర్లను మాత్రమే ప్రకటించనున్నారు. నిన్న దాదాపు సగం మంది అభ్యర్ధులపై ఆమోదం లభించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన అభ్యర్దుల పేర్లను త్వరలోనే ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తామని ఆయన అన్నారు.

*రేపు 58 పేర్లతో కాంగ్రెస్ తొలి జాబితా.. మరో రెండ్రోజుల్లో మిగిలిన పేర్లు
ఈ ఎన్నికల్లోనైనా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మూడుసార్లు సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల పేర్లను కొలిక్కి తెచ్చారు. అయితే దీనికి పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఏఐసీసీ ఆమోదం తర్వాత అభ్యర్థుల ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కీలక ప్రకటన చేశారు. రేపు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందులో 58 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ ఉంటుందన్నారు. మిగతా అభ్యర్థులను మరో రెండ్రోజుల్లో ఖరారు చేస్తామని పేర్కొన్నారు. గెలుపు, విధేయతకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. మరోవైపు వామపక్షాలతో పొత్తులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. పొత్తులపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయితే రేపు అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లిస్ట్‌లో ఎవరి పేర్లు ఉంటాయి.. అధిష్టానం ఎవరికి హ్యాండ్ ఇవ్వనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

*ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌పై ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రభావం చూపిస్తుందా..?
ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి యుద్ధానికి దారి తీసింది. ముందు హమాస్ మొదలు పెడితే, ఇప్పుడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ పాలస్తీనా గాజా ప్రాంతంలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ యుద్ధం రెండు కీలక ఒప్పందాలను ప్రభావితం చేస్తోంది. ఇజ్రాయిల్-అమెరికా-సౌదీ అరేబియా మధ్య ఒప్పందాన్ని ప్రభావితం చేసింది. అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేయాలనే అమెరికా లక్ష్యాన్ని ఈ యుద్ధం దెబ్బతీసింది. ప్రస్తుతానికి ఈ ఒప్పందానికి సౌదీ బ్రేక్ వేసింది. ఇదిలా ఉంటే మరో కీలక ప్రాజెక్టు అయిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్(IMECC)ఈ యుద్ధం పెద్ద అవాంతరాన్ని ఏర్పరిచింది. ఇటీవల భారత్ నిర్వహించిన జీ20 సదస్సులో సౌదీ, యూఏఈ, ఇండియా, అమెరికా వంటి దేశాలు ఈ ఎకనామిక్ కారిడార్ పై చర్చించాయి. ఇందులో ఇజ్రాయిల్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(GTRI) సహవ్యవస్థాపకుడు అజయ్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ.. యుద్ధం ఈ ప్రభావితం చేయవచ్చని అన్నారు. ఈ యుద్ధం ప్రాంతీయంగా పరిమితమైనప్పటికీ.. ఇది భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేయొచ్చని ఆయన తెలిపారు. IMEEC ప్రాజెక్టు భారత్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, యూరప్ దేశాలను భారీ నౌకా ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులతో అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టు యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయిల్, గ్రీస్ గుండా యూరప్ ని అనుసంధానిస్తుంది. భారత్, యూఏఈ, అమెరికా, సౌదీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ వంటి ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుపై అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. వీటిపై ఆయా దేశాలు సంతకం చేశాయి. యూరప్, ఆసియాల మధ్య రవాణా, కమ్యూనికేషన్ లింక్ ని మెరుగుపరచడంతో పాటు చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి కౌంటర్ గా ఈ ప్రాజెక్టులు చేపట్టాయి. ప్రస్తుత ఇజ్రాయిల్-పాలస్తీనా సంక్షోభం ఈ ప్రాజెక్టును ఆలస్యం చేసే అవకాశం ఉంది.

*హమాస్ కీలక కమాండర్‌ని హతమార్చిన ఇజ్రాయిల్.. మిగతా వారికి ఇదే గతని వార్నింగ్..
గత శనివారం ఇజ్రాయిల్‌పై క్రూరమైన మారణకాండకు నాయకత్వం వహించిన హమాస్ ఉగ్రసంస్థ కమాండర్‌ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చాయి. డ్రోన్ దాడిలో టాప్ కమాండర అలీ ఖాదీని డ్రోన్ దాడిలో చంపినట్లు శనివారం ఐడీఎఫ్ ప్రకటించింది. ఇతను హమాస్ అత్యంత ముఖ్యమైన ఎలైట్ గ్రూప్ ‘నుఖ్బా’ ఫోర్సుకి చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్టోబర్ 7న గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించిన ఉగ్రవాద బృందానికి అలీ ఖాదీ చీఫ్. ‘‘ఖచ్చితమైన ఐడీఎఫ్, ఐఎస్ఏ నిఘా సమాచారం మేరకు ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ విమానం హమాస్ ‘నుఖ్బా’ కమాండో ఫోర్స్2కి చెందిన కంపెనీ కమాండర్ అలీ ఖాదీని హతమార్చింది. ’’ అంటూ ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. 2005లో ఇజ్రాయిల్ పౌరులను కిడ్నాప్, హత్యలకు పాల్పడిన అలీ ఖాదీని ఇజ్రాయిల్ అరెస్ట్ చేసింది. అయితే గిలాడ్ షాలిత్ ఖైదీల మార్పిడిలో భాగంగా విడుదల చేయబడ్డాదని ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఇజ్రాయిల్ లో అక్టోబర్ 7న అమానవీయ, అనాగరికమైన పౌరుల ఊచకోతకు అలీ ఖాదీ నాయకత్వం వహించాడు, మేము అతడిని అంతమొందించాం. మిగతా హమాస్ ఉగ్రవాదులందరికీ ఇదే గతి పడుతుందని ఐడీఎఫ్ హెచ్చరించింది. ఇప్పటికే హమాస్ వైమానికి దళానికి చీఫ్ గా ఉన్న మరో ఉగ్రవాది హమాస్ వైమానిక దళాల చీఫ్ మురాద్ అబు మురాద్‌ని హతం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది. గతంలో ఎప్పుడు లేనంతగా ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం మొదలైంది. గత శనివారం హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 1300 మంది చనిపోగా, వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. హమాస్ ఉగ్రవాదులు 150 మంది వరకు ఇజ్రాయిలీలను బందీలుగా తీసుకుని గాజాకు తరలించారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడి చేస్తోంది. ఈ దాడిలో వేల సంఖ్యలో మంది చనిపోయారు.

*కెనడాలో ఉంటున్న వారికి గుడ్ న్యూస్.. తల్లిదండ్రులతో నివాసం ఇక సులువు..
కెనడాలో ఉంటున్న భారతీయులతో పాటు అక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. కెనడాలో ఉంటున్న వారు ఇకపై తమ తల్లిదండ్రులతో ఎక్కువ రోజులు గడిపేలా సూపర్ వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. ఇమ్మిగ్రేషన్, శరణార్థుల పౌరసత్వ మంత్రిత్వ శాఖ, ప్రజా భద్రత మంత్రిత్వ శాఖల ఆదేశాల మేరకు కొత్త నిబంధనలు ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వచ్చాయి. కెనడాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వ్యక్తులు, కెనడా పౌరుల తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలు తాత్కాలికంగా కెనడాలో నివసించేందుకు ఈ సూపర్ వీసా ఉపయోగపడనుంది. ఈ వీసాతో 10 ఏళ్ల పాటు తమ పిల్లలు, మనవళ్లతో వారు కెనడాలో నివాసం ఉండొచ్చు. అనేక సార్లు కెనడా వచ్చీ వెళ్లొచ్చు. గతంలో ఈ అవకాశం ఒకసారి ప్రవేశానికి కేవలం 2 ఏళ్లు మాత్రమే గరిష్టంగా నివాసం ఉండే వీలుండేది. ప్రస్తుతం దీన్ని 10 ఏళ్లకు పెంచారు. సాధారణంగా విజిటర్ వీసా మీద వస్తే గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే నివాసం ఉండేందుకు వీలుండేది. ఎక్కువ కాలం పాటు ఉండాలంటే వీసాను పొడగించుకోవాలి. వీటికి ఫీజులు చెల్లించాలి. ఇదంతా లేకుండా ఇప్పుడు ఎక్కువ కాలం ఉండేందుకు ఈ సూపర్ వీసా ఉపయోగపడుతుంది. కెనడాలో ఉండే వ్యక్తులు వారి తల్లిదండ్రుల్ని, గ్రాండ్ పేరెంట్స్ ని ఆహ్మానించవచ్చు. అయితే దీనికి ముందు సదరు వ్యక్తికి వారిని పోషించే స్తోమత ఉందని ఆదాయ ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. కెనడాలో ఉండే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.

 

*ప్రమాదం ముంగిట భారత్, పాక్ 220 కోట్ల మంది.. ఘోరమైన వేడితో ముప్పు..
ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం పెరగడం, వాతావారణ కాలుష్యం వెరిసి భూమి సగటు ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. దీంతో హిమనీనదాలు కరుగుతున్నాయి. కొన్నేళ్లలో అంటార్కిటికాలోని మంచు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని, దీంతో తీర ప్రాంతాల్లోని నగరాలకు ముప్పు ఉందని పరిశోధకలు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కన్నా 2 డిగ్రీ సెల్సియస్ పెరిగే, ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్తాన్ లోని సింధూలోయలో నివసించే దాదాపుగా 220 కోట్ల ప్రజలను వేడి ఉక్కిరిబిక్కిరి చేయవచ్చని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పీర్ రివ్యూడ్ జర్నల్ లో ప్రచురితమైన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(పీఎన్ఏఎస్) పరిశోధన వెల్లడించింది. ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్తాన్, చైనా, సబ్-సహారా ఆఫ్రికాలు ప్రధానంగా అధిక తేమతో కూడిన వేడి గాలులకు ప్రభావితం అవుతాయని తెలిపింది. అధిక తేమ కలిగిన హీట్ వేవ్స్ చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే గాలి అధిక తేమను గ్రహించగలదు. ఈ పరిమితి మానవ శరీరం చమటలు త్వరగా ఆవిరయ్యే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తర్వాత చమట త్వరగా ఆవిరి కాకపోవడంతో శరీర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉండదు. పరిశోధనలో చెప్పబడిన ప్రాంతాలు తక్కువ-మధ్య ఆదాయ దేశాలు కావడంతో ఏసీలు లేదా ఉష్ణోగ్రతలు తగ్గించే పరికరాలను వాడే స్థోమత ఉండకపోవడ పోవచ్చని పరిశోధకులు తెలిపారు. సాధారణంగా మానవులు తేమ, వేడి కలయికను కొంతవరకు మాత్రమే భరించగలడు. ఈ పరిమితిని దాటినప్పుడు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. వడదెబ్బ, గుండెపోటు వంటి వాటికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. భూమి యెక్క ప్రపంచ ఉపరిత ఉష్ణోగ్రతలు ఇప్పటికే 1.15 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. పారిశ్రామిక విప్లవం తరువాత అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేశాయి. 2015లో 196 దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక విప్లవం పూర్వస్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ కి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్(ఐపీసీసీ) ప్రకారం.. ఈ శతాబ్ధం చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు దాదాపుగా 3 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలకు దారి తీయచ్చని అంచనా వేసింది. సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే 2019 స్థాయిలతో పోలిస్తే, 2030లో ఉద్గారాలను సగానికి తగ్గించాలని ఐపీసీసీ చెప్పింది. తాజాగా పరిశోధనలు చేసిన బృందం 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగితే ఏలాంటి ప్రభావం ఉంటుందని పరిశోధనలు జరుగుతున్నాయి.

 

Exit mobile version