*మద్యం వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి.. అమిత్ షాకు పురంధేశ్వరి ఫిర్యాదు
ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కలిశారు. ఏపీలో మద్యం వ్యవహారంపై అమిత్ షాకు పురంధేశ్వరి వివరించారు. ఏపీలో మద్యం అమ్మకాల్లో అవినీతి జరుగుతుందంటూ.. లిక్కర్ అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోం మంత్రిని కోరారు. అమ్ముడవుతున్న కల్తీ మద్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా భారీ అవినీతికి మద్యం అమ్మకాన్ని ఉపయోగించుకుంటున్నారని అన్నారు. మద్యం అమ్మకాల ద్వారా ముఖ్యమంత్రితో పాటు ఆయన అనుచరులు కోట్ల రూపాయల కొల్లగొడుతున్నారని ఆమె ఆరోపించారు. మొదట్లో ఆంధ్రప్రదేశ్‌లో వేలం పద్ధతిలో మద్యం దుకాణాలకు అనుమతులు ఉండేవి, ఇప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణాలను రన్ చేస్తుందన్నారు. మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు అవినీతి నెలకొందని, మద్యం తయారీ కంపెనీలను వైసీపీ నేతలే నిర్వహిస్తున్నారని విమర్శించారు. సరైన పద్ధతిలో మద్యం తయారు చేయకపోవడం వల్ల మందు తాగేవాళ్ల ఆరోగ్యం పాడవుతుందని పేర్కొన్నారు. ఒక మద్యం సీసాను 15 రూపాయలకు తయారుచేసి రూ.600 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నారని అమిత్ షాకు పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారం నగదు రూపంలోనే జరుగుతుందన్నారు. ఏపీలో ప్రతిరోజు 80 లక్షల మంది మద్యం తాగుతున్నారని.. ఒక్కొక్కరు సరాసరిన 200 రూపాయలు మద్యం కోసం వెచ్చిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఏపీలో లిక్కర్ అమ్మకాల్లో భారీ అవినీతి జరుగుతోందని.. నగదు రూపంలో అమ్మకాలు భారీ అవినీతికి కారణం అవుతోందని ఆమె పేర్కొన్నారు. సంవత్సరంలో మొత్తం రూ.57,600 కోట్లు లిక్కర్ అమ్మకాల ద్వారా వస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 32 వేల కోట్లు మాత్రమే చూపిస్తుందని ఆరోపించారు. సంవత్సరానికి 25 వేల కోట్ల భారీ అవినీతి జరుగుతోందని ఆమె ఫిర్యాదు చేశారు. అమాయక ప్రజల జీవితాలను పణంగా పెట్టి భారీగా దోచుకుంటున్నారని అమిత్ షాకు అందజేసిన లేఖలో పేర్కొన్నారు.
*చంద్రబాబుకు రేపు కీలకం
టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం అత్యంత కీలకంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులకు సంబంధించి కోర్టుల్లో ముఖ్యమైన తీర్పులు రేపే వెల్లడికానున్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు దాఖలు చేసిన పలు పిటిషన్లపై తీర్పులు, విచారణలు రేపే ఉండడం గమనార్హం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు తన క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల ఈ పిటిషన్‌లో వాదనలు విన్న జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దాంతో, సుప్రీంకోర్టులో రేపటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ కూడా రేపు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ కూడా రేపు విచారణకు రానుంది. ఇక, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో రేపు తీర్పు వెలువడనుంది. ఈ కేసులో ఇటీవల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మూడు పిటిషన్లలో న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. మరి చంద్రబాబుకు ఈ కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందో, లేదోనని అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. ప్రధానంగా అందరికీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పైనే ఉత్కంఠ ఉంది. సుప్రీం కోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతాయి.. ఎలాంటి తీర్పు వస్తుందని అందరిలో ఆసక్తి పెరిగింది.
*బాయ్ ఫ్రెండ్ ను కలువనివ్వడంలేదని తల్లికి విషమిచ్చిన అమ్మాయి
ఈ రోజుల్లో ప్రేమికులు ప్రేమ కోసం ఎంతటిదానికైనా తెగిస్తున్నారు. ప్రేమ కోసం కన్నతల్లిదండ్రులనే కడతేరుస్తున్నారు యువతీ యువకులు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ ను కలువనివ్వడం లేదని ఓ టీనేజ్ అమ్మాయి తల్లికి విషమిచ్చింది. రాయ్ బరేలీలో నివసించే సంగీత యాదవ్ (48) అనే మహిళకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. కొంతకాలంగా ఆ అమ్మాయి ఓ అబ్బాయితో చనువుగా ఉంటోంది. ఈ విషయం గమనించిన సంగీతా యాదవ్… ఆ యువకుడితో తిరగొద్దు.. కలుసుకోవద్దని చెప్పింది. దీంతో తన తల్లిపై కోపం పెంచుకుంది బాలిక. బాయ్ ఫ్రెండ్ కు, తనకు మధ్య తల్లి అడ్డుగా ఉందని భావించిన బాలిక.. తల్లిని అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసింది. అయితే బాలిక తన బాయ్ ఫ్రెండ్ కు మార్కెట్ నుంచి విషం తీసుకుని రావాలని చెప్పింది. ఆ తర్వాత తల్లి తాగే టీలో విషం కలిపి ఇచ్చింది. దీంతో టీ తాగిన సంగీతా యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయితే.. ఈ పరిణామంతో భయపడిపోయిన బాలిక ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పింది. దాంతో వారు సంగీతా యాదవ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆమె ప్రాణాలకు ముప్పులేదని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు టీనేజ్ అమ్మాయి, ఆమెకు సహకరించిన ప్రియుడిపై సెక్షన్ 328 కింద కేసు నమోదు చేశారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, పరారీలో ఉన్న బాయ్ ఫ్రెండ్ కోసం గాలింపు చేపట్టారు.
*భారత వైమానిక దళం ధైర్యానికి ప్రధాని మోడీ సెల్యూట్..
భారత వైమానిక దళం 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు (ఆదివారం) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా వైమానిక దళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. వారి గొప్ప సేవ, త్యాగం మన గగనతల భద్రతకు భరోసానిస్తుందని అన్నారు. భారత వైమానిక దళం యొక్క ధైర్యసాహసాలు, నిబద్ధత, అంకితభావానికి భారతదేశం గర్విస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత వైమానిక దళం ధైర్యానికి సెల్యూట్ చేస్తూ ప్రధాని మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఓ వీడియోను షేర్ చేశారు. భారత వైమానిక దళ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 8 న జరుపుకుంటుంది. అయితే ఈసారి జరుపుకునే వేడుకల్లో ఒక ప్రత్యేకత ఉంది. భారత వైమానిక దళం యొక్క 91వ వార్షికోత్సవం సంగం నగరంలో మొదటిసారిగా జరుపుకుంటున్నారు. అందుకోసం ఆదివారం ఉదయం 7.40 గంటలకు బమ్రౌలీలో వైమానిక యోధుల కవాతు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైమానిక దళం నూతన జెండాను కూడా ఆవిష్కరించారు. దానిని అత్యంత వైభవంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిపేందుకు ప్రయాగ్‌రాజ్‌లో చాలా కాలంగా సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అన్ని యుద్ధ విమానాలు దీని కోసం సాధన చేస్తున్నాయి.
*ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఖండించిన కాంగ్రెస్
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని కాంగ్రెస్ ఖండించింది. పాలస్తీనా ప్రజల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో విశ్వసిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ఏ విధమైన హింస నుండి పరిష్కారం రాదని.. దాడిని ఇండియా ఖండించిందని, ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ అన్నారని కాంగ్రెస్ పేర్కొంది. నిన్న(శనివారం) ఇజ్రాయెల్ దాడిపై బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ముంబై ఉగ్రదాడితో సహా దేశవ్యాప్తంగా జరిగిన వివిధ ఉగ్రవాద సంఘటనల ఉదాహరణలను ఉటంకిస్తూ.. ఇజ్రాయెల్ ఈ రోజు ఎదుర్కొంటోందని బీజేపీ తెలిపింది. 2004-14 మధ్య భారతదేశం అదే ఎదుర్కొంది. ఎప్పటికీ క్షమించవద్దు, ఎప్పటికీ మర్చిపోవద్దు అని బిజెపి పేర్కొంది. బీజేపీ విడుదల చేసిన వీడియోలో ‘ప్రతి ఉగ్రవాద దాడిని ఆపడం చాలా కష్టం’ అని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కూడా చేర్చారు. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌తో భారత్‌కు వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌లో ఉగ్రవాద దాడులపై ప్రధాని మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో భారతదేశం ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తుందని అన్నారు. హమాస్ దాడుల తర్వాత.. ఇజ్రాయెల్ భారతదేశానికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. భారత్‌కు ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిల్లాన్ భారతదేశం నైతిక మద్దతును ప్రశంసించారు. మరోవైపు ఇజ్రాయెల్ కు అండగా.. భారత్, అమెరికా, బ్రిటన్‌లు నిలుస్తున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్ హమాస్‌కు మద్దతు ఇస్తున్నాయి. దీంతో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ పాలస్తీనాకు మద్దతు పలికాయి.
*విరాట్ కోహ్లీ డకౌట్ కావాలి.. మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగియగా.. ప్రస్తుతం భారత్ ఛేజింగ్ చేస్తోంది. టీమిండియా ఆరంభంలోనే మూడు వికెట్స్ కోల్పోగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ అతడికి అండగా క్రీజులో ఉన్నాడు. భారత్ ఈ ఇద్దరిపైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుత ప్రపంచకప్ జట్టులో ఉన్న భారత్ ఆటగాళ్లలో చెపాక్‌లో సెంచరీ చేసిన రికార్డు విరాట్ కోహ్లీకి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ కావాలని కోరుకున్నాడు. అంతేకాదు ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడాల్సి వస్తే.. సెంచరీ చేయొద్దని కోరుకున్నాడు. బొరియా మజూందార్ షోలో మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ… ‘నేను నిజమే చెబుతున్నా. వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయితే చూడాలనుంది. తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ చేసినా పర్లేదు. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడాల్సి వస్తే మాత్రం సెంచరీ చేయొద్దని కోరుకుంటా. ఫైనల్లో కూడా విరాట్ డకౌట్ కావాలి’ అని వింత వ్యాఖ్యలు చేశాడు. అయితే కోహ్లీ ఈ మ్యాచులో ఇప్పటికే డబుల్ డిజిట్ స్కోర్ చేశాడు. దాంతో మైకేల్ క్లార్క్ ఆశ నెరవేరకుండా పోయింది. విరాట్ కోహ్లీపై మైకేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కూడా కురిపించాడు. ‘విరాట్ కోహ్లీ క్లాస్ బ్యాటర్. అతడు జీనియస్ మాత్రమే కాదు గొప్ప యోధుడు కూడా. వన్డేల్లో విరాట్ అత్యుత్తమంగా ఆడుతాడు. టెస్టు, టీ20 ఫార్మాట్‌లోనూ అదరగొట్టినా.. వన్డే క్రికెట్‌లో వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ప్లేయర్’ అని క్లార్క్ పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్లో కోహ్లీ ఇప్పటివరకు 13 వేలకు పైగా రన్స్ చేశాడు. ఇందులో 47 సెంచరీలు ఉన్నాయి. ప్రపంచకప్ 2023లో 50 సెంచరీల మార్క్ అందుకున్నా ఆశ్చర్యం లేదు.
*భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా.. యువ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్ర చేస్తున్నారు. దసరా కానుకగా ఈ నెల 19న భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఈరోజు హన్మకొండలో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ చేశారు.
*ఈ సారి టార్గెట్ 3000 కోట్లు అంటున్న దర్శకుడు అట్లీ..
కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ నుంచి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించాడు.లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్ లు గా నటించారు. జవాన్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు.అలాగే జవాన్ సినిమా లో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ ముఖ్య పాత్రలు పోషించారు.పక్కా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీని షారుఖ్ ఖాన్ హోం బ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కించారు.సెప్టెంబర్ 7 న గ్రాండ్ గా విడుదల అయినా జవాన్ సినిమా అద్భుతమైన టాక్ దూసుకెళ్తుంది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.. ఇటీవలే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. జవాన్ సినిమాకు ముందు కేవలం తమిళ్ డైరెక్టర్ గా వున్న అట్లీ.. జవాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు..జవాన్ పలు ప్రాంతాల్లో ఇప్పటికీ విజయవంతంగా స్క్రీనింగ్ అవుతోంది. జవాన్ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న అట్లీ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసి హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఓ ఇంటర్వ్యూ లో అట్లీ ని తన తర్వాతి ప్రాజెక్ట్ గురించి అడుగగా.. జవాన్ రూ. 1,100 కోట్లకు పైగా వసూలు చేసిందని.. తన తదుపరి ప్రాజెక్ట్ కనీసం రూ. 3,000 కోట్లు వసూలు చేయాలి. ఇది జరగాలంటే కచ్చితంగా షారుఖ్ ఖాన్, విజయ్ కలిసి నటింపజేయాలి.. అని అట్లీ ఎంతో ధీమాగా చెప్పాడు.తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నాడని ఇటీవలే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి అట్లీ ముందుగా అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడా..లేదంటే విజయ్-షారుఖ్ ఖాన్ సినిమా చేస్తాడా. అనేది మాత్రం తెలియాల్సి వుంది.
