*ఏపీ విద్యా సంస్కరణలు భేష్.. నోబెల్ అవార్డు గ్రహీత ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయని నోబెల్ అవార్డు గ్రహీత ఫ్రొఫెసర్ మైకేల్ క్రేమెర్ ప్రశంసలు గుప్పించారు. గురువారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి మైకేల్ క్రేమెర్‌తో పాటు పాటు చికాగోలోని డీఐఎల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ క్యుపిటో బృందం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విద్యాభివృద్ధికి చేపడుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం నోబెల్ అవార్డు గ్రహీత మైకేల్ క్రేమెర్, చికాగో యూనివర్శిటీ బృందాన్ని సత్కరించారు. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ‘పర్సనలైజ్‌డ్ అండ్ అడాప్టివ్ లెర్నింగ్’ (Personalized and adaptive learning-PAL) ప్రాజెక్టు అమలు చేస్తున్న పాఠశాలలను ఈ బృందం సందర్శించనుంది. ‘పాల్’ ప్రాజెక్టు అమలులో ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రాముఖ్యతగా నిలిచిందన్నారు. మూడు రోజుల పాటు ఏలూరు జిల్లాలో వివిధ పాఠశాలలను సందర్శించనున్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ అమలు తీరు గురించి చికాగో యూనివర్శిటీ బృందం పరిశోధించడం ఆనందకరమన్నారు. ఇలాంటి పరిశోధనలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి ‘పాల్’ ప్రాజెక్టు చొరవ అపారమైనదని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీ కె.వి.శ్రీనివాసులురెడ్డి , శామో జాయింట్ డైరెక్టర్ బి.విజయ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
*చంద్రబాబుకు మంత్రి ఉషాశ్రీచరణ్ సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి ఉషాశ్రీచరణ్ సవాల్ విసిరారు. మీరు హెరిటేజ్ ఆస్తులు పేదలకు పంచుతారా?.. అలా చేస్తే నేను కొనుగోలు చేసిన భూములు కూడా పంచేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. తనది సంపన్న కుటుంబమని.. తాను భూములు కొంటే తప్పా అంటూ మంత్రి ప్రశ్నించారు. రెండు ఎకరాల నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించావ్ అంటూ మంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు, నారా లోకేష్ నుంచి బీసీలకు రక్షణ కావాలని ఆమె పేర్కొన్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు శిలాఫలకం వేసి మరచిపోయింది గుర్తులేదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. భైరవానితిప్ప ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దేనని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఇటీవల మంత్రి ఉషాశ్రీచరణ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు పలు ఆరోపణలు చేశారు. మంత్రి కబ్జాలకు పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ సవాల్ విసిరారు. అంతకుముందు కూడా చంద్రబాబుపై మంత్రి ఉషశ్రీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కళ్యాణదుర్గం పర్యటన నేపథ్యంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు మంత్రి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కళ్యాణదుర్గానికి ఏం చేశారని నిలదీశారు. కళ్యాణదుర్గం పర్యటనలో సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తే సహించేది లేదని మంత్రి ఉషాశ్రీ చరణ్ హెచ్చరించారు.
*సీఎం కేసీఆర్‌తో మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా సమావేశం
ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి భనవ్ చేరుకున్న సీఎం సంగ్మాను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించాడు. అనంతరం ఆయనకు కేసీఆర్ తేనీటి విందు ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. మేఘాలయ సీఎం సంగ్మాను కేసీఆర్ శాలువాతో సత్కరించి, మెమొంటో బహుకరించారు. అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మాకు సీఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు. అయితే, ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కె వంశీధర్ రావుతో పాటు ఇతరులు పాల్గొన్నారు.
*తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17 హీట్
తెలంగాణ రాజకీయాలు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఈ సారి సెప్టెంబర్ 17వ తారీఖున అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ పార్టీలు పోటాపోటీగా బహిరంగ సభలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో.. కమలం పార్టీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పెద్దు ఎత్తున సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. తుక్కుగూడ సభకు సోనియాగాంధీ వస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలపగా.. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవ వేడుకలకు గత ఏడాదిలాగే అమిత్ షా హాజరు అవుతారని సమాచారం. అయితే, ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని సిద్ధమయింది. దాదాపు పది లక్షల మంది ఈ సభకు హాజరు అవుతారని కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే వెల్లడించింది. తుక్కుగూడను అందుకు వేదికగా హస్తం నేతలు ఎంచుకున్నారు. ఆ తేదీ లేదా అంతకు ముందు రోజు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సీడబ్ల్యూసీ ) సమావేశాలు జరుగబోతున్నాయి. సోనియా గాంధీ సైతం తుక్కుగూడ సభకు హాజరు కానున్న నేపథ్యంలో.. ఈ సభను తెలంగాణ పీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇక. కాంగ్రెస్ తుక్కుగూడ సభకు పోటీగా కమలం పార్టీ సైతం హైదరాబాద్ లో సభ ఏర్పాటుకు ప్లాన్ చేసింది. పరేడ్ గ్రౌండ్‌లోనే తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను కిందటి ఏడాది తరహాలోనే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది.. ఈ క్రమంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు కమలం పార్టీ నేతలు తెలిపారు. వీలైనంత ఎక్కువ జనసమీకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దీంతో ఒకేరోజు.. అటు తెలంగాణ విమోచన దినోత్సవం.. ఇటు హైదరాబాద్ నగరంలో పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతుంది. ఇరు పార్టీలు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ.. పరస్పర విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
*రేపు ఢిల్లీకి అగ్ర దేశాల నేతలు..
సెప్టెంబరు 9 నుంచి న్యూఢిల్లీలో జరగనున్న G20 లీడర్స్ సమ్మిట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకుల కలయికకు సాక్ష్యమివ్వనుంది. జీ20 సమ్మిట్‌కు హాజరుకావడానికి అగ్ర దేశాల నేతలు రేపు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, నా ప్రధాని లీ కియాంగ్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తదితరులకు రెండు రోజుల పాటు దేశ రాజధానిలో అతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు, రష్యా ప్రెసిడెంట్ గైర్హాజరు కానున్న విషయం తెలిసిందే. జీ20 లీడర్స్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలకు చెందిన అగ్ర దేశాధినేతలు న్యూఢిల్లీకి చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు దేశ రాజధాని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తదితరులకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తారు.
*డీఎంకే పార్టీని టార్గెట్ చేసిన అన్నామలై
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. చివరకు ఆయన తండ్రి, సీఎం స్టాలిన్ కూడా కొడుకు వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా ఉదయనిధి వ్యాఖ్యలపై హిందూసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు డీఎంకే పార్టీతో పాటు ఆ పార్టీ ఇండియా కూటమిలో ఉండటంతో డీఎంకేని, కాంగ్రెస్, ఇండియా కూటమిని టార్గెట్ చేస్తోంది. ఇండియా కూటమి హిందుమతానికి ద్వేషిస్తోందని బీజేపీ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు సొంత రాష్ట్రం తమిళనాడులో డీఎంకే పార్టీని బీజేపీ చీఫ్ అన్నామలై ఏకి పారేస్తున్నాడు. సనాతనధర్మాన్ని ఉదయనిధి మలేరియా, డెంగీతో పోల్చడం, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా DMK పార్టీకి కొత్త నిర్వచనం చెప్పారు. D అంటు డెంగ్యూ.. M అంటే మలేరియా.. K అంటే కోసు(దోమ) అని ఆ పార్టీని విమర్శించారు. రాహుల్ గాంధీ ఒక రాష్ట్రంలో అమర్ గా, రెండో రాష్ట్రంలో అక్బర్ గా, మరో రాష్ట్రంలో ఆంథోనీగా మారారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తన వీడియోలో విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే పార్టీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని, బీజేపీ సనాతన ధర్మాన్ని రక్షిస్తామని పోటీ చేద్ధామని అన్నామలై సవాల్ విసిరారు. తమిళ ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూద్ధామని, 2024లో డీఎంకే తుడిచిపెట్టుకుపోతుందని, ఇది నేను చెప్పడం లేదని మీ కుమారుడు ఉదయనిధి చెబుతున్నారంటూ D అంటే డెంగీ అని, M అంటే మలేరియా అని, K అంటే కోసు(దోమ) అని అన్నారని సెటైర్లు పేల్చారు. డీఎంకే అధికారం చేపట్టినత తొలి ఏడాది సనాతన ధర్మాన్ని వ్యతిరేకించారు, రెండో ఏడాది సనాతనధర్మాన్ని రద్దు చేయాలని చెప్పారు. మూడో ఏడాది సనాతనాన్ని నిర్మూలించాలని అంటున్నారు, నాలుగో ఏడాది నువ్వు హిందువు అని, ఐదో ఏడాది 90 శాతం డీఎంకే నాయకులు హిందువులే అని చెబుతారని, మీ డ్రామాలు అందరికీ తెలుసని అన్నామలై తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో 17 ఏళ్లుగా ఇలాంటి నాటకాలే జరగుతున్నాయని అన్నారు.
*భారత్‌పై అదే అక్కసు.. జీ20, పేరు మార్పుపై డ్రాగన్ వ్యాఖ్యలు..
భారతదేశం ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో అగ్రదేశాల అధినేతలు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే భారతదేశానికి అంతర్జాతీయంగా పెరుగుతున్న పలుకుబడిని చూసి డ్రాగన్ కంట్రీ చైనా తట్టుకోలేకపోతోంది. చైనా తన మౌత్‌పీస్ పత్రిక అయిన గ్లోబల్ టైమ్స్ ద్వారా భారతదేశంపై విషాన్ని చిమ్మే కథనాలను ప్రచురిస్తోంది. భారతదేశం అంతర్జాతీయ ప్రభావాన్ని పెంచుకునేందకు జీ20 సదస్సును ఉపయోగించుకుంటుందని వ్యాఖ్యానించింది. దేశం పేరు మార్చడం కన్నా ఇతర ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలని గ్లోబల్ టైమ్స్ లో పేర్కొంది. 1947కి ముందు దేశం స్వాతంత్య్రం పొందిన నాటి ఆర్థిక వ్యవస్థను భారతదేశం సమగ్రంగా సంస్కరించగలదా..? అనేదే ముఖ్యమైన విషయమని, విప్లవాత్మక సంస్కరణలు లేకుండా, భారతదేశం విప్లవాత్మక అభివృద్ధిని సాధించలేదని అంది. భారత్ పెరుగుతున్న ప్రపంచ దృష్టిని ఉపయోగించుకుని దాన్ని వృద్ధికి చోదక శక్తిగా మార్చుకోగలదని ఆశిస్తున్నాము అంటూ చైనా పేర్కొంది. రాబోయే జీ20 సమ్మిట్ పై ప్రపంచ దృష్టి కేంద్రీకృతమైన తరుణంలో భారత్ ప్రపంచాన్ని ఏం తెలియజేయాలని అనుకుంటుంది..? అని చైనా ప్రశ్నించింది. పేరు మార్పు వలస రాజ్యాల కాలం పేర్లుగా భావించే వాటిని తొలగించే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుందని తన మీడియాలో చెప్పింది. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత మోడీ పరిపాలన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వాల్లో ఒకటిగా ఉందని, భారత్ తన ఆర్థిక వ్యవస్థను సరళీకరించడానికి పెద్ద సంస్కరణల్ని ప్రారంభించిందని.. అయితే దురదృష్టవశాత్తు వాణిజ్య రక్షణవాదం వైపు ఎక్కువగా మారుతోందని చైనా తన నివేదికలో పేర్కొంది. దేశం పేరు మార్చాలా..? వద్దా..? అనే దానికన్నా ముందు ఇవి ముఖ్యమైనవంటూ సూచించింది. ఇటీవల కాలంలో చైనా కంపెనీలపై భారత్ కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో.. ప్రపంచానికి తన మార్కెట్లను పూర్తిగా తెరవడంతలో భారత్ సంకోచం అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. జీ20 ప్రెసిడెన్సీపై సలహాలు ఇస్తూ.. భారత్ తన ఆర్థిక వ్యవస్థను సంస్కరించుకోవడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి , విదేశీ పెట్టుబడిదారులకు న్యాయమైన వ్యాపార వాతావరణాన్ని అందించడానికి జీ20ని ఉపయోగించుకోవాలని సూచించింది.
*నెట్స్‌లో కష్టపడుతున్న కేఎల్ రాహుల్.. డుమ్మా కొట్టిన రోహిత్, విరాట్..!
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆసియా కప్-2023లో అడుగుపెట్టిన భారత జట్టుకు అడుగడుగునా వరణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా చిరకాల ప్రత్యర్థితో జరిగిన పోరులో 48.5 ఓవర్లలో రోహిత్ సేన 266 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, ఎడతెరిపి లేని వర్షం కారణంగా పాకిస్తాన్‌కు బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను క్యాన్సిల్ చేయడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఈ క్రమంలో టీమిండియా తమ రెండో మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడింది. ఈ మ్యాచ్ కు కూడా వరుణుడు అడ్డు వచ్చాడు. వర్షం కారణంగా ఆగుతూ సాగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు డీఎల్‌ఎస్ పద్ధతిలో.. టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో సూపర్-4లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం మరోసారి పాకిస్తాన్‌తో ఇండియా జట్టు తలపడేందుకు రెడీ అయింది. కొలంబోలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. కాగా తొలి మ్యాచ్‌లో పాక్ పేసర్ల నుంచి టీమిండియా బ్యాటర్లు గట్టి పోటీని ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తదుపరి మ్యాచ్‌లో లోపాలు సవరించుకుని భారత్ పట్టుదలగా ఉంది. అయితే, టీమిండియా ఆటగాళ్లు నేడు (గురువారం) ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఫిట్‌నెస్ సమస్యల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. లెఫ్టార్మ్, రైటార్మ్ పేసర్ల బౌలింగ్‌ను అతడు ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉంటే.. మిగతా వాళ్లు కూడా కాసేపు ప్రాక్టీస్ చేయగా.. ఈ ఆప్షనల్ సెషన్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి డుమ్మా కొట్టారు. యువ ప్లేయర్స్ సైతం ప్రాక్టీసు చేస్తున్న టైంలో వీరిద్దరు రెస్ట్ తీసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంకొవైపు.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గరుండి మరీ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్‌ను గమనించినట్లు సమాచారం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు వీలుగా టీమ్ లోకి తీసుకున్న తరుణంలో అతడి బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ మీద ద్రవిడ్ నజర్ పెట్టినట్లు టాక్.
