*నేడే సంగారెడ్డిలో బీజేపీ నిరుద్యోగ మార్చ్
నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బీజేపీ శ్రేణులు “నిరుద్యోగ యాత్ర” నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఈటల, విజయశాంతి, రఘునందన్ రావు, రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొంటారు. ఈ నిరుద్యోగ మార్చ్ సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌజ్ నుంచి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో నేడు నిర్వహించే నిరుద్యోగ యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నిరుద్యోగ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి బీజేపీకి ఉందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ , మహబూబ్ నగర్ జిల్లాల్లో నిరుద్యోగ యాత్ర విజయవంతమైందని, సంగారెడ్డి జిల్లాలోనూ నిరుద్యోగ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అనాలోచిత విధానాల వల్ల తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమయ్యే ప్రమాదం ఉందని బండి సంజయ్ అన్నారు.
*నేడు విశాఖకు సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి చేరుకుని, అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 5.50 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు, అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. దీంతోపాటు అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను ప్రారంభించనున్నారు. అనంతరం ఎండాడలోని కాపుభవన్, భీమిలి ఫిష్ ల్యాండింగ్ పాయింట్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం 6.15 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమై 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
*మహా వివాదంపై నేడు సుప్రీం తీర్పు
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే శివసేన, బీజేపీ ప్రభుత్వానికి విషమ పరీక్ష ఎదురుకాబోతోంది. పార్టీ ఫిరాయించిన శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్దవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్‌పై నేడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతోంది. గతేడాది శివసేన తిరుగుబాటుపై ఉద్దవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2022 జూన్ నెలలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసినందుకు ఏక్ నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీనిపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. గతేడాది శివసేనలో చీలిక తీసుకువచ్చి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు, బీజేపీ సహకారంతో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఒక వేళ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత ప్రకటిస్తే అతను రాజీనామా చేయడంతో పాటు ప్రభుత్వం రద్దు చేయబడుతుంది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేసింది. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మద్దతుగా కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదించగా, ఏక్నాథ్ షిండే శిబిరం తరఫున హరీష్ సాల్వే, నీరజ్ కౌల్, మహేశ్ జెఠ్మలానీలు వాదించారు. సుప్రీంకోర్టు తీర్పుకు ఒక రోజు ముందు మహారాష్ట్ర రాజకీయాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే 288 మంది సభ్యుల అసెంబ్లీలో అధికార శివసేన-బీజేపీ కూటమికి 184 ప్లస్ ఓట్లు ఉన్నాయని, అవసరమైతే తమ మెజారిటీని నిరూపించుకుంటామని అన్నారు.
*స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుళ్ల కలకలం.. వారం వ్యవధిలోనే మూడోసారి!
సిక్కుల పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో వరుస పేలుడు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున పేలుడు శబ్దం వినిపించిందని పలు వర్గాలు తెలిపాయి. వారం వ్యవధిలో పరిసరాలను కుదిపేసిన మూడో పేలుడు ఇది. వివరాల ప్రకారం దాదాపు అర్ధరాత్రి 12.30 గంటలకు పేలుడు సంభవించింది. క్రూడ్ బాంబు పేలిన తర్వాత ఒక అనుమానితుడిని పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడు జరిగిన సమయంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ సమీపంలోని గదిలో ఉన్నారని కూడా వర్గాలు తెలిపాయి. ముగ్గురినీ విచారించారు. ఈ పేలుడుకు ఇప్పటివరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. ఈ ఘటనపై పంజాబ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గురువారం నాటి పేలుడుకు కారణమైన క్రాకర్‌లో పొటాషియం క్లోరేట్‌ను ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిందితులను పట్టుకుంటున్నట్లు పంజాబ్ పోలీసులు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. “అర్ధరాత్రి 12.15 – 12.30 గంటల సమయంలో పెద్ద శబ్ధం వినిపించింది. మరో పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నాం. ఇంకా నిర్ధారించబడలేదు. భవనం వెనుక కొన్ని ముక్కలు కనుగొనబడ్డాయి. కానీ చీకటిగా ఉన్నందున అవి ఏంటో కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నాము.” అని పోలీసు కమిషనర్ నౌనిహాల్ సింగ్ విలేకరులతో అన్నారు. కాగా, పంజాబ్ పోలీసులు కూడా ఈ ఘటనపై ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా ముందు ప్రస్తావిస్తామని చెప్పారు.
*మధ్యదరా సముద్రం కింద బయటపడిన 7000 ఏళ్ల నాటి రోడ్డు
ఎన్నో వేల ఏళ్ల నాటి సంస్కృతులు ఈ మహాసముద్రాల కింద నిక్షిప్తం అయి ఉన్నాయి. దీనికి సజీవ సాక్ష్యమే తాజా మధ్యదరా సముద్రం కింద కనుగొనబడిన ఓ రహదారి. పురావస్తు పరిశోధకులు పరిశోధనలు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పదులు కాదు, వందలు కాదు ఏకంగా 7000 ఏళ్ల క్రితం నాటి రోడ్డును పరిశోధకులు కనుగొన్నారు. మధ్యదరా సముద్రం దిగువన సముద్రపు మట్టి నిక్షేపాల కింద ఈ రహదారిని బయటపడింది. ఈ రహదారి యూరప్ దేశం క్రోయేషియన్ ద్వీపంలో ఉన్న కోర్కులా ద్వీపతీరంలో హ్వర్ సంస్కృతికి సంబంధించిందిగా చరిత్రకారులు నమ్ముతున్నారు. ఈ రహదారి నాలుగు మీటర్ల వెడల్పుతో జాగ్రత్తగా రాతిపలకతలో పేర్చబడింది. కార్బన్ డేటింగ్ ప్రకారం.. క్రీస్తుపూర్వం 4900 ఏళ్ల క్రితం అంటే దాదాపుగా 7000 ఏళ్ల క్రితం ఇక్కడ మనుషులు స్థిర నివాసం ఉన్నారని, ఈ రోడ్లపై నడిచారని క్రొయేషియా యూనివర్సిటీ ఆఫ్ జదర్ పరిశోధకులు తెలిపారు. దాదాపుగా 5000 BCEలో హ్వార్ సంస్కృతి ఇక్కడ వర్థిల్లినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. వీరు రైతులు, పశువుల కాపరులుగా తీరం వెంబడి చిన్న, ఏకాంత కమ్యూనిటీలుగా నివసించారని పరిశోధకులు తెలిపారు. తాజాగా జరిగిన ఆవిష్కరణలు సముద్రపు అడుగు భాగంలో కోర్కులా ద్వీపంలోని వెలా లుకా సమీపంలోని గ్రాడినా బే సమీపంలో జరిగాయి. ఈ ప్రాంతంలో చెకుముకి బ్లేడ్లు, రాతి గొడ్డళ్ల వంటి నియోలిథిక్ కళాఖండాలు కనుగొనబడ్డాయి. కాంక్రీట్ నిర్మాణమే కాకుండా అత్యంత ఆకర్షనీయమైన విస్తృతమైన గట్లు గట్లుగా ఉండే వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇది నీటి సరఫరాకు సహాయపడే విధంగా రూపొందించినట్లు పరిశోధకులు తెలిపారు. హ్వార్ సంస్కృతి, వారి జీవన విధానం గురించి మనకు తెలియనవి ఇంకా చాలా ఉన్నాయని పరిశోధకులు చెప్పారు.
*ఓటీటీలోకి శాకుంతలం
లేడీ సూపర్ స్టార్ సమంతా, గుణశేఖర్ డైరెక్షన్ లో నటించిన మూవీ ‘శాకుంతలం’. కాళిదాస్ రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా శాకుంతలం సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో సమంతా ‘శకుంతలా దేవి’గా నటించగా, దేవ్ మోహన్ ‘దుష్యంత మహారాజు’గా నటించాడు. ఈ ఇద్దరికీ పుట్టిన ‘భరతుడి’గా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా నటించింది. ఫాంటసీ డ్రామాగా అనౌన్స్మెంట్ తోనే మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసిన ఈ మూవీ 80 కోట్ల భారి బడ్జట్ తో రూపొందింది. కేవలం సమంతా మాత్రమే సేవియర్ గా, ఆమె మార్కెట్ పైనే డిపెండ్ అయ్యి పాన్ ఇండియా రేంజులో ఏప్రిల్ 14న ఆడియన్స్ ముందుకి వచ్చింది శాకుంతలం సినిమా. హ్యూజ్ థియేట్రికల్ బిజినెస్ సొంతం చేసుకున్న శాకుంతలం సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈవెనింగ్ షోస్ నుంచి థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపించడం తగ్గింది. వర్డ్ ఆఫ్ మౌత్ నెగటివ్ గా స్ప్రెడ్ అవ్వడంతో మూడో రోజుకే శాకుంతలం సినిమా బాక్సాఫీస్ రన్ కి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడింది. దీంతో సినిమాని కొన్న ప్రతి ఒక్కరికీ భారి నష్టాలని మిగిలించింది శాకుంతలం సినిమా. సమంతా స్టార్ ఇమేజ్ కూడా శాకుంతలం సినిమాని నష్టాల నుంచి బయట పడేయలేకపోయింది. దిల్ రాజు అంతటి స్టార్ ప్రొడ్యూసర్, తన 25 ఏళ్ల కెరీర్ లో శాకుంతలం అంత షాక్ ఇచ్చిన సినిమా ఇంకొకటి లేదని చెప్పాడు అంటే శాకుంతలం సినిమా ఎలాంటి షాకింగ్ రిజల్ట్ ని ఇచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఫస్ట్ మండేకే థియేట్రికల్ రన్ ని ఎండ్ కార్డ్ పడడంతో, నెల కూడా తిరగకుండానే శాకుంతలం సినిమా సైలెంట్ గా ఒటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో మల్టిపుల్ లాంగ్వేజస్ లో శాకుంతలం సినిమా స్ట్రీమ్ అవుతోంది. మరి థియేటర్స్ లో మిస్ కొట్టిన ఆడియన్స్ ఒటీటీలో అయినా శాకుంతలం సినిమాని చూస్తారో లేదో చూడాలి.
*చెన్నై చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం
బుధవారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం చవిచూసింది. సీఎస్కే నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. 140 పరుగులకే తట్టుబుట్టా సర్దేసింది. దీంతో.. చెన్నై జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటర్లు విలవిల్లాడారు. ఎవ్వరూ నిలకడగా రాణించలేకపోయారు. రుస్సో (35), మనీష్ పాండే (27) తమ జట్టుని గట్టెక్కించడం కోసం ప్రయత్నించారు కానీ.. ఫలితం లేకుండా పోయింది. చివర్లో అక్షర్ సైతం మెరుపులు మెరిపించినా.. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. దీంతో.. ఢిల్లీ ఓటమి తప్పలేదు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో ఏ ఒక్కరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు కానీ.. వచ్చిన ప్రతీ బ్యాటర్ తనవంతు సహకారం అందించాడు. రుతురాజ్(24), రహానే(21), దూబే(25), రాయుడు(23), జడేజా(21), ధోని(20).. ఇలా అందరూ డబుల్ డిజిట్ స్కోర్‌తో రాణించడంతో.. చెన్నై అంత స్కోరు చేయగలిగింది. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది. ఢిల్లీ జట్టుకి ఆదిలోనే మూడు ఎదురుదెబ్బలు తగిలాయి. సున్నా పరుగులకే వార్నర్ ఔట్ అవ్వగా.. ఆ కొద్దిసేపటికే ఫిల్ సాల్ట్ (17), మిచెల్ మార్ష్ (5) పెవిలియన్ బాట పట్టారు. అత్యంత కీలకమైన ఆ ముగ్గురు ఆటగాళ్లు ఔట్ అవ్వగా.. ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన మనీష్ పాండే, రుస్సోలకు ఆచితూచి ఆడాల్సి వచ్చింది. మరో వికెట్ పడకుండా ఉండేందుకు.. వాళ్లు నిదానంగా లాక్కొచ్చారు. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా.. చాలావరకు సింగిల్స్, డబుల్స్‌తోనే రాణించారు. ఎప్పుడో ఒకసారి బౌండరీ కొడుతూ.. అలా అలా నెట్టుకొచ్చారు. ఇక ఓవర్లు తగ్గే కొద్దీ లక్ష్యం పెరుగుతుండటంతో.. వీళ్లిద్దరు రెచ్చిపోవాలని అనుకున్నారు. కానీ.. ఇంతలోనే చెన్నై బౌలర్లు వాళ్లను పెవిలియన్ పంపించేశారు. రిపల్ పటేల్ అత్యంత చెత్త ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతుల్లో కేవలం 10 పరుగులే చేశాడు. చివర్లో అక్షర్ (12 బంతుల్లో 21) గట్టిగా బాదేందుకు ట్రై చేశారు కానీ.. అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. చెన్నై బౌలర్లలో పతిరానా 3, దీపక్ చహార్ 2, జడేజా 1 వికెట్ తీశారు.