Site icon NTV Telugu

Top Headlines@9AM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*రైలుపట్టాలపై మరణ మృదంగం
ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం మోగింది. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. మరో 900 మందికిపైగా గాయపడగా.. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాత్రివేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో చాలా మంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని భావిస్తున్నారు. బాధితుల్లో బెంగాల్‌వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. స్థానిక రైల్వే అధికారులు ఒకలా.. రైల్వే అధికార ప్రతినిధి మరొలా చెబుతున్నారు. తొలుత బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న యశ్వంతపూర్ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పిందని.. దీంతో పలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో వచ్చిన షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ వాటిని ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై వస్తోన్న గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. అయితే రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్‌ శర్మ మాత్రం దీనికి భిన్నమైన ప్రకటన చేశారు. తొలుత కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిందని.. దాని బోగీలు బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ రైలు పట్టాల మార్గంలో పడ్డాయని పేర్కొన్నారు. అనంతరం ఆ సూపర్‌ఫాస్ట్‌ బోగీలు పక్క ట్రాక్‌పై బోల్తాపడ్డాయని తెలిపారు. ప్రమాదం తర్వాత బోగీల్లో చిక్కుకున్న బాధితుల హాహాకారాలతో ఘటనాస్థలం దద్దరిల్లింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు.. తక్షణమే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. బాలేశ్వర్‌లోని వివిధ ఆసుపత్రుల్లో 400 మంది క్షతగాత్రులను అధికారులు చేర్పించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ సహా బాలేశ్వర్‌, భద్రక్‌, మయూర్‌బంజ్‌, కటక్‌ల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అలర్ట్ చేశారు. బోల్తాపడ్డ బోగీల నుంచి ఇప్పటివరకు 120 మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి 200 అంబులెన్స్‌లతోపాటు అవసరం ఉన్న మేరకు వైద్యులను ఒడిశా ప్రభుత్వం పంపించింది.

*ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి
ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు. ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం మోగింది. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఓ గూడ్స్ రైలు ఢీకొనటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 233 మంది దుర్మరణం చెందారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని హావాకు వెళ్తున్న బెంగళూరు- హావ్రా సూపర్ఫస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. వాటిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం.. బోల్తాపడ్డ కోరమండల్ కోచ్లను పక్కనున్న ట్రాక్పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది.

*ఏపీలో ఆ జిల్లాలకు వర్షసూచన
రోహిణికార్తెలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రతకు ఉక్కపోత తోడుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలా ఉండగా.. పలు జిల్లాల్లో అక్కడక్కడ రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడనున్నట్లు తెలిపింది. మరోవైపు పలు మండలాల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల స్వల్ప వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. 4వ తేదీ పార్వతీపురం మన్యం, విజయనగరం, కాకినాడ, చిత్తూరు, నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనుండగా.. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ చిరు జల్లులు పడనున్నాయి. 6వ తేదీ వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షాలతో కాస్త ఉపశమనం లభించనుంది. వర్షాలతో పాటు రానున్న మూడు రోజుల పాటు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాల్లోని కొన్ని మండలాలకు తీవ్ర వడగాల్పులు, మరికొన్ని మండలాలకు సాధారణ స్థాయిలో వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత, వడగాల్పుల వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మినహా బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచించారు. సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

*హిజాబ్‌ వివాదం.. పాఠశాల గుర్తింపు రద్దు చేసిన ఎంపీ సర్కార్‌
రెండు రోజుల క్రితం హిజాబ్ వివాదం చెలరేగిన మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లోని గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూల్ రిజిస్ట్రేషన్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలను తనిఖీ చేసిన బృందం కనుగొన్న అంశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. పాఠశాలలో తాగునీరు, బాలికలకు బాత్‌రూమ్‌లు సహా పలు లోపాలు ఉన్నట్లు తనిఖీల్లో తేలిందని పేర్కొంది. హిజాబ్ సమస్య కారణంగానే కాకుండా పాఠశాలలో అవకతవకల కారణంగా కూడా గుర్తింపు రద్దు నిర్ణయం తీసుకున్నట్లు దామోహ్ జిల్లా కలెక్టర్ మయాంక్ అగర్వాల్ తెలిపారు. అందువల్ల దీని రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దు చేయాలని నిర్ణయించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ముస్లిమేతర బాలికలు హిజాబ్‌లు ధరించమని ఆరోపించిన ఆరోపణలపై వివాదం తలెత్తింది. తలకు హిజాబ్‌ ధరించిన బాలికలను కలిగి ఉన్న పాఠశాల పోస్టర్‌ను ప్రదర్శించడం ఆగ్రహాన్ని రేకెత్తించింది. అయితే ఈ మాటలను పాఠశాల యజమాని ముస్తాక్ ఖాన్ ఆరోపణలను తోసిపుచ్చారు. పాఠశాల దుస్తుల కోడ్‌లో శిరోజాలు కనిపించకుండా స్కాఫ్ ధరించడం ఒక భాగమని అన్నారు. అయితే ఎవరూ వారిని ధరించమని బలవంతం చేయలేదని పేర్కొన్నారు. పాఠశాల రాష్ట్ర సిలబస్‌ను అనుసరిస్తుందని, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ బోధించలేదని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానం మాత్రమే రాష్ట్రంలో వర్తిస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.

*స్టార్ హీరోలపై కోటా సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎలాంటి పాత్ర అయినా ఆయన దిగంత వరకే.. ఒక్కసారి ఆయన నటించడం మొదలుపెట్టాడా..? అవార్డులు.. రివార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఈ మధ్య వయస్సు పైబడడంతో సినిమాల్లో తక్కువ కనిపిస్తున్న కోటా.. సమయం చిక్కినప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ ఇండస్ట్రీ గురించిన ఘాటు నిజాలను బయటపెడుతుంటారు. ఇక తాజాగా మరోసారి కోటా.. స్టార్ హీరోల గురించి, ఇప్పుడున్న ఇండస్ట్రీ గురించి తనదైన రీతిలో చెప్పుకొచ్చాడు. “ఇప్పుడు సినిమా అనేది లేదు అంతా సర్కస్. ఇక్కడ అంతా ఒక సర్కస్ నడుస్తోంది. ఒకప్పుడు ఉన్న ఇండస్ట్రీ కాదు. ఇంకొక రామారావు పుడితే తప్ప ఈ భూమి మీద ఇంకొక రామారావు లేడు. అసలు హీరోలు ఇప్పుడు ఎలా ఉంటున్నారు. మేము రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నాం.. ఆరు కోట్లు తీసుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. ఆ రోజుల్లో రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా.. ఇప్పుడు హీరోలు పేతా సాంగ్స్ కూడా డ్యాన్స్ లు చేస్తున్నారు. అప్పట్లో రామారావు గారు 60 ఏళ్ల వయస్సులో శ్రీదేవితో డాన్స్ చేస్తే వాళ్లిద్దరు మాత్రమే కనపడ్డారు కానీ.. ముసలోడు డాన్స్ వేసాడు అని అనలేదు. ఇక ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చిన్న ఆర్టిస్టులు బతకడానికి కష్టమైపోయింది. చిన్న సినిమాలు బతకాలి అంటే ఒక కమిటీ వేసి తెలుగు ఆర్టిస్టులతో సినిమా చేస్తే తక్కువ ఖర్చుతో అవుతుంది ఆర్టిస్ట్ లు బాగుంటారు. చిన్న ఆర్టిస్టులను బ్రతికించండి. ఎదో ఒక అడ్వర్టైజ్ మెంట్ చేద్దాము అనుకుంటే బాత్ రూమ్ క్లిన్ చేసే బ్రష్ దగ్గర నుంచి బంగారం వరకు హీరోలే చేస్తున్నారు. దయచేసి చిన్న ఆర్టిస్టులను బతికించండి” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

*ఈసారి పాన్ డైరెక్టర్ తో సాలిడ్ ప్రాజెక్ట్!
మిగతా హీరోలతో పోల్చితే రేసులో చాలా వెనకబడిపోయారు అక్కినేని హీరోలు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌తో సతమతమవుతున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య, అఖిల్ ఘోరమైన డిజాస్టర్స్ అందుకున్నారు. ఇటీవల వచ్చిన ఏజెంట్, కస్టడీ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర 50 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చారు అక్కినేని బ్రదర్స్. ముఖ్యంగా చైతన్య వరుస ఫ్లాపులు ఫేజ్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో చేసిన లాల్ సింగ్ చడ్డా, దిల్ రాజు బ్యానర్లో వచ్చిన థాంక్యూ.. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేసి కస్టడీ సినిమాలు.. చైకి హిట్ ఇవ్వలేకపోయాయి. దాంతో నాగ చైతన్యకు అర్జెంట్‌గా ఓ హిట్ పడితే బాగుంటుదని భావిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ క్రమంలో చైతన్యకు ఓ సాలిడ్ ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లాంటి సక్సెస్‌ఫుల్ బ్యానర్‌లో చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. కార్తికేయ2 మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ చందూ మొండేటి ఈ ప్రాజెక్ట్‌ హ్యాండిల్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత బన్నీ వాసు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ రాబోతుందని చెప్పుకొచ్చాడు. చైతన్య బోట్‌మ్యాన్‌గా, జాలరీగా కనిపిస్తాడని అన్నారు. గుజరాత్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. దాంతో ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు యాభై కోట్లకు పైగానే పెట్టబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఈ లెక్కన చైతు కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇదేనని చెప్పొచ్చు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ రేంజ్‌లో ఖర్చు చేస్తుందంటే.. ఖచ్చితంగా నాగ చైతన్య కెరీర్లో ఈ సినిమా ఓ మైలుగారాయిగా నిలిచిపోతుందనే నమ్మకంతో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. మరి చైతన్య ఏం చేస్తాడో చూడాలి.

*నో డౌట్… ‘భగవత్ కేసరి’ టైం స్టార్ట్!
మే నెల మొత్తం ప్రభాస్, పవన్ కళ్యాణ్‌, ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ వంతు వచ్చేసింది. మరో వారం రోజుల్లో సోషల్ మీడియాను హోరెత్తించడానికి రెడీ అవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. జూన్ 10 బాలయ్య బర్త్ డే ట్రీట్ ఓ రేంజ్‌లో ఉండబోతోంది. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో NBK 108 ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. వచ్చే దసరాకు రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య బర్త్ డే సందర్భంగా… NBK 108 టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఈ సినిమాకు ముందు నుంచి ‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ వినిపించింది. కానీ లేటెస్ట్‌గా పవర్ ఫుల్ టైటిల్‌ తెరపైకి వచ్చింది. కథ ప్రకారం ఈ సినిమాకు ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నిజముందా? అనే డౌట్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఈ టైటిల్ పై సాలిడ్ క్లారిటీ వచ్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ ఈస్ట్ గోదావరీ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్‌లో ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ కనిపించడంతో ఈ టైటిల్ క్లారిటీ వచ్చేసినట్టేనని అంటున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో మైత్రి సంస్థ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో భగవత్ కేసరి గోదావరి ఏరియా డిస్ట్రిబ్యూషన్ మైత్రీ వారే చేస్తున్నారనే క్లారిటీ కూడా వచ్చేసింది అని అంటున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించనుంది.

Exit mobile version