Site icon NTV Telugu

Top Headlines@9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*దద్దరిల్లేలా దశాబ్ధి ఉత్సవాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడి ఇవాళ్టికి పదో ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఇటు పార్టీ తరఫున, అటు ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు తరఫున గోల్కొండ కోటలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తుంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణను ఇచ్చింది తమ పార్టీయేనంటూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేదిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. వామపక్షాలతో పాటు మిగతా పార్టీలు కూడా వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నాయి. మరికొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దూకుడుగా ముందుకు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. కొత్త సచివాలయం వేదికగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ అవతరణ వేడుకలు చేస్తుంది. ఇవాళ (శుక్రవారం) సీఎం కేసీఆర్‌ సచివాలయంలో జాతీయజెండాను ఎగురవేసి.. గత తొమ్మిదేళ్ల ప్రగతి ప్రజలకు తెలియజేయనున్నారు. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్య ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహిస్తుంది. సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో గోల్కొండ కోటపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. మరోవైపు గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర ప్రథమ పౌరురాలి హోదాలో రాజ్‌భవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి అవతరణ వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం ప్రజలతో గవర్నర్‌ మాట్లాడుతారు. వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్‌ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ బిల్లు పాస్‌ అయిన సమయంలో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్‌ ఈ సారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో నిర్వహించే వేడుకల్లో ఆమె పాల్గొంటారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలను రూపొందించారు.

*తెలంగాణలో ఉన్న మత పరమైన రిజర్వేషన్లు తీసేయాలి
తెలంగాణలో ఉన్న మత పరమైన రిజర్వేషన్లు తీసేయాలని కేంద్రం మంత్రి కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అప్పుడే గిరిజనులకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అందుతాయని అన్నారు. తెలంగాణలో పదవులు ద్రోహులకు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దళిత సీఎం, మూడెకరాల భూమి ఎక్కడ పోయింది? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎగరవేశారు. ఫ్లై ఓవర్ లతో సమస్యలు పరిష్కారం కావన్నారు. ప్రజలకు అనుమతి లేని సెక్రటేరియట్ ఎందుకు? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేంద్రం చాలా నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొసం అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఉద్యమాలు చేసిన అందరికీ కేంద్ర ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు తెలిపారు. నీళ్లు , నిధులు , నియామకాలు కోసం ఉద్యమం జరిగిందన్నారు. ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు అన్ని ప్రాంతాలు రాష్ట్రం కోసం పోరాటం చేశారన్నారు. 1200 మంది అమర వీరులు అయ్యారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ ను స్మరించు కోవాలని, ఆమె రాష్ట్రం కోసం పార్లమెంటు లో పోరాటం చేశారని అన్నారు. ఏ వ్యక్తి వల్లనో, కుటుంబం వల్లనో తెలంగాణ రాలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణ ఒక కుటుంబానికి బానిస అయిందని అన్నారు. అవినీతి విపరీతంగా పెరిగి పోయిందని మండిపడ్డారు. దగా పడ్డ తెలంగాణగా మారిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకచోట్ల మోసం జరుగుతుందని కిషన్‌ రెడ్డి తెలిపారు. ల్యాండ్ మాఫియా, ధరణి మాఫియా లాంటి వాటితో పాటు అన్ని చోట్ల మాఫియా గా మారిందని ఆరోపణలు గుప్పించారు.

*నేడు సీఎం జగన్‌ గుంటూరు పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా.. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 9.30 గం టలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు. తొలుత గుంటూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని.. అక్కడ నుంచి చుట్టుగుంటకు వెళ్లనున్నారు. అక్కడ వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా.. రైతులకు ట్రాక్టర్లు, హార్వె స్టర్లు రాష్ట్రస్ధాయి పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించనున్నా రు. ఈ కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వా త జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటు­న్న కూలీల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ­పెట్టిన వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద శుక్రవారం రాష్ట్ర­వ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగామేళాకు ఏర్పాట్లు పూర్త­య్యా­యి. గుంటూరు చుట్టుగుంట సెంటర్‌ వద్ద ట్రాక్టర్లు, కం­బైన్డ్‌ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. వంద శాతం యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అం­­చనాతో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్‌ స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని సీఎం బటన్‌ నొక్కి నేరుగా జమచేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాల పంపిణీ చేస్తారు. ఈ ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారికి సాగు వ్యయం తగ్గించి నికర ఆదాయం పెంచాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచనలకను­గు­ణంగా వైఎస్సార్‌ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.15లక్షల విలువైన యంత్ర పరికరాలను ఆర్బీకే స్థాయిలోనూ, రూ.25లక్షల విలు­వైన కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో కూడిన యంత్ర పరికరాలను క్లస్టర్‌ స్థాయిలోనూ ఏర్పాటు­చేస్తోంది. పంటల సరళి, స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా కావాల్సిన యంత్ర పరికరాల ఎంపిక, కొనుగోలుతో పాటు వాటి నిర్వహణ బాధ్యతలను కూడా రైతు గ్రూపులకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. యంత్ర పరికరాలు, వాటి అద్దె వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. కనీసం 15 రోజుల ముందుగా మండల పరిధిలో ఏ ఆర్బీకే నుంచైనా బుక్‌ చేసుకునేందుకు వీలుగా ‘వైఎస్సార్‌ సీహెచ్‌సీ’ యాప్‌ను అందుబాటులోకి తీసు­కొ­చ్చింది. ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు, గ్రూపులకు వచ్చే ఆదాయం, రుణాల చెల్లింపు వివరాలను ఎప్ప­టి­­కప్పుడు నమోదు చేస్తూ వీటి నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో డాష్‌ బోర్డునూ ఏర్పాటుచేశారు.

*ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. . అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. నేడు కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్ర వడగాల్పులు, 286 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రేపు 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 300 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం, బాపట్ల, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. ఎండ తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. వడగాల్పులతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలకు బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచనలు చేసింది. ప్రజలు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, శీతల పానియాలు తీసుకోవాలని సూచించింది. నిన్న పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.1 డిగ్రీలు, ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.

*భారీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు
తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది..ఎవరికీ అనుమానం రాకుండా రెండు పడవల్లో శ్రీలంకనుంచి భారత్‌కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా, కోస్టు గార్డు, డిఆర్‌ఐ అధికారులు, కస్టమ్ అధికారులు రెండు రోజులు గాలించి మొత్తం 32 కిలోల బంగారం వెలికితీశారు..ఈ బంగారం విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో ఒక పడవలోని స్మగ్లర్లు అధికారులను చూడగానేభయంతో 11 కిలో బంగారాన్ని సముద్రంలో పడేశారు. అలాగే మరో పడవలో 21 కిలోల పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు.. ఈ రెండు ఘటనల్లో రూ.20 కోట్లకు పైగా విలువ కలిగిన 32.60 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్‌ఐ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.. కొంతమంది స్మగ్లర్లు శ్రీలంకనుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు డిఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. ఈమేరకు కోస్టుగార్డు , కస్టమ్స్ అధికారులతో కలిసి నిఘా పెట్టారు. ఈ క్రమంలో మండపం ఫిషింగ్ హార్బర్ సమీపంలో రెండు పడవల కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆ రెండు పడవలను వెంబడించగా తప్పించుకునే క్రమంలో ఒక పడవలోని ముగ్గురు సగ్లర్లు తమ వద్ద ఉన్న 11.6 కిలోల బంగారం కడ్డీలను సముద్రంలో పడవేశారు వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా డైవర్లను రంగంలోకి దింపి రెండు రోజులపాటు తీవ్రంగా శ్రమించి సముద్రంలో పారేసిన బంగారాన్ని వెలికితీశారు. మరో పడవలోని 21 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుని ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.. అసలు ఆ బంగారం ఎక్కడిది, ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగి తెలుసుకుంటున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

*సాక్షి హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీలోని సాక్షి హత్య కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులకు భారీ ఊరట లభించింది. నిందితుడు సాహిల్ సాక్షిని 20కి పైగా పొడిచి చంపిన కత్తిని రిథాలా నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఆదివారం సాక్షిపై సాహిల్ కత్తితో దాడి చేశాడు. అనంతరం సాక్షిని రాయితో చితకబాది దారుణంగా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన సాహిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సాక్షికి చెందిన 10 మందికి పైగా స్నేహితుల వాంగ్మూలాలను పోలీసులు తీసుకున్నారు. వీరిలో అజయ్ అలియాస్ జబ్రూ, నీతూ, ప్రవీణ్ ఉన్నారు. సాహిల్ మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు సీసీటీవీలో కనిపించిన 8 మందిని గుర్తించారు. వారి వాంగ్మూలాలను కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. గురువారం సాహిల్ కు కోర్టు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. సాహిల్‌ను పోలీసులు విచారించగా.. అతను హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు సాహిల్ హత్య చేసిన తర్వాత బులంద్‌షహర్ చేరుకున్న మార్గాన్ని కూడా పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం కత్తిని రితాలాలోని పొదల్లో పడేశాడు.సాక్షి శరీరంపై 34 గాయాల గుర్తులు కనిపించాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. షాహాబాద్ డెయిరీలోనే అద్దె ఇంట్లో సాహిల్ తన కుటుంబంతో ఉంటున్నాడు. సాక్షి, సాహిల్‌ మధ్య సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. అయితే కొంతకాలంగా వీరి రిలేషన్ షిప్ లో గ్యాప్ వచ్చింది. దీనికి కారణం మరో బాలుడు ప్రవీణ్ గా గుర్తించారు. సాక్షి గతంలో ప్రవీణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది.. కానీ మళ్లీ అతను సాక్షితో కలిసి తిరుగుతున్నారు. దీంతో అది తట్టుకోలేకపోయిన సాహిల్ సాక్షిని తిరిగి తనతో ఉండాలని కోరాడు.. దీనికి ఆమె నిరాకరించడంతో సాహిల్ పదే పదే సాక్షిని వేదించాడు. దీంతో సాక్షి ఆమె స్నేహితుడు జాబ్రూ సాహిల్‌ను బెదిరించారు. దీంతో సాక్షిని సాహిల్ హత్య చేశాడు.

*తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే?
బంగారం అంటే అందరికీ మక్కువే. ఆడవాళ్లకే కాకుండా.. మగవాళ్లు కూడా వంటిపై ధరిస్తారు కాబట్టి .. బంగారం ధరలపై ప్రజలు నిత్యం ఒక కన్నేసి ఉంటారు. బంగారం ధరలు తగ్గాయంటే కొనడం కోసం చూస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గాయంటే ప్రజలు పండగ చేసుకోకుండా ఉంటారా? ఈ రోజు పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్ రేట్లు దిగివస్తుండడం భారీగా ఊరట కలిగిస్తోంది. దేశీయంగా డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ధరలు దిగి వస్తుండడం బంగారం కొనుగోలు చేసే వారికి మంచి అవకాశంగా మారుతోంది. దేశంలో కొద్ది రోజుల క్రితం రూ.2000 నోట్లు ఉపసంహరణ ప్రకటనతో బంగారం కొంటున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో పసిడి ధరలు భారీగా పెరుగుతాయని అంతా భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్ల బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా జీడీపీ గణాంకాలు అంచనాలకు మించి నమోదవడం సహా ఇతర కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 1976.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.86 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇండియన్ రూపాయి కరెన్సీ విలువ డాలర్‌తో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ రూ.82.313 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్‌ బులియన్ మార్కెట్ల బంగారం ధరలు ఇవాళ మళ్లీ తగ్గాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఇవాళ 10 గ్రాములకు రూ.150 పడిపోయింది. ప్రస్తుతం తులం రేటు రూ.55,700 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు రూ.170 పడిపోయి రూ.60,760 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.150 తగ్గి ప్రస్తుతం రూ.55,850 కొనుసాగుతుండగా. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు 150 దిగివచ్చింది. ప్రస్తుతం తులానికి రూ.60,930 వద్ద కొనసాగుతోంది.

*మలైకా ప్రెగ్నెన్సీపై స్పందించిన అర్జున్ కపూర్..?
బాలీవుడ్ ముదురు భామ మలైక అరోరా, అర్జున్ కపూర్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే..గత రెండేళ్ల క్రితమే ఈ విషయాన్ని మీడియా ముందు రివిల్ చేశారు..ఇక అప్పటి నుంచి ఘాటు రొమాన్స్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు..అయితే తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అర్జున్ కపూర్, మలైకా త్వరలో బిడ్డను కనబోతున్నారని గాసిప్ న్యూస్ స్ప్రెడ్ చేయడంపై గతేడాది ఒక పబ్లికేషన్‌తో పాటు జర్నలిస్టుకు నోటీసులు పంపించాడు అర్జున్. అలాగే తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘ఫేక్ న్యూస్’ వార్తలను ఖండించాడు. ఇదిలా ఉంటే, ఇలాంటి వార్తలు రాస్తున్న కొన్ని మీడియా, వెబ్‌సైట్లపై తాజా ఇంటర్వ్యూలో మరోసారి స్పందించాడు..ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేస్తున్న మీడియా ఛానెల్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొన్ని మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేసి, చివరికి అవే నిజమనుకునేలా చేస్తున్ డేంజరస్ రిపోర్టింగ్ గురించి హైలైట్ చేశాడు. తమ వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ధైర్యం చేయొద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.ప్రేక్షకులను చేరుకునేందుకు జర్నలిస్టులపై ఆధారపడతామన్న అర్జున్.. తామూ మనుషులమనే విషయాన్ని వాళ్లు గుర్తుంచుకోవాలని కోరాడు.. ఒకసారి విషయాన్ని కనుక్కొని రాస్తే బెటర్, ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఊరుకొనేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. వీరిద్దరూ ప్రస్తుతం లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.. పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి.

*అత్యాచారం కేసులో హాలీవుడ్ నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష
అత్యాచారం కేసులో హాలీవుడ్ నటుడు డానీ మాస్టర్‌సన్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. 2001 – 03 మధ్య కాలంలో అతడు ముగ్గురిపై అత్యాచారానికి పాల్పడగా.. రెండు కేసుల్లో దోషిగా తీర్పునిస్తూ, 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే.. మూడో అత్యాచారం ఆరోపణలపై జ్యూరీ ఇంకా తీర్పుని ప్రకటించాల్సి ఉంది. గత ట్రయల్‌లోని జ్యూరీ ఏకగ్రీవ నిర్ణయానికి రాకపోవడంతో కేసుని వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు రెండో ట్రయల్‌లో భాగంగా.. రెండు కేసుల్లో అతడు దోషిగా తేల్చుతూ జ్యూరీ తీర్పునివ్వడంతో, ఆ నటుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి 30 ఏళ్ల కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. న్యాయస్థానం తీర్పు ప్రకటించిన సమయంలో డానీ మౌనంగా ఉండిపోగా.. అతని భార్య, నటి బిజు ఫిలిప్స్‌ మాత్రం కోర్టులోనే బోరుమంది. కాగా.. డానీ మాస్టర్‌సన్‌ 2001లో 23 ఏళ్ల యువతిపై, 2003లో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2003 చివర్లోనూ మరో యువతిని (23) తన ఇంటికి పిలిచి మరీ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై 2020 జూన్‌లో విచారణ జరిపిన న్యాయస్థానం.. అతనికి జైలు శిక్ష విధించింది. అదే రోజు డానీ 3.3 మిలియన్‌ డాలర్లు చెల్లించి, జైలు నుంచి బయటకొచ్చాడు. తాజాగా మరోమారు విచారణ జరగ్గా.. డానీనిద న్యాయస్థానం నిందితుడిగా తేల్చింది. అయితే.. 2001, 2003లో అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు అయ్యాయి. కానీ.. 2003 ఏడాది చివర్లో హాలీవుడ్ హిల్స్‌లోని తన ఇంట్లో ఓ యువతిని అత్యాచారం చేసిన ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. అందుకు తగ్గ ఆధారాలు లభ్యం కావాల్సి ఉంది. మరోవైపు.. డానీకి 30 ఏళ్ల జైలు శిక్ష విధించడంపై ఓ బాధితురాలు ఆనందం వ్యక్తం చేసింది. డానీకి తగిన శాస్తి జరిగిందని, న్యాయం గెలిచిందని పేర్కొంది. ఇదిలావుండగా.. 1998లో లాంచ్ అయిన రెట్రో సిట్‌కామ్ ‘దట్ సెవెంటీస్ షో’తో డానీ మాస్టర్‌సన్ పాపులారిటీ గడించాడు. ఆ షోతో వచ్చిన ఫేమ్ పుణ్యమా అని.. ఇతని ఫిల్మ్ కెరీర్ సాఫీగా సాగింది. అయితే.. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా.. 2017లో నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ‘ద రాంచ్‌’ అనే కామెడీ షో నుంచి డానీ మాస్టర్‌సన్‌ను తొలగించింది.

Exit mobile version