*13,000 మంది భద్రతా, బాంబ్ స్క్వాడ్స్, ఏటీఎస్.. అయోధ్యలో భద్రత కట్టుదిట్టం..
అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లోని ప్రముఖులు, సెలబ్రెటీలు, దౌత్యవేత్తలు, లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భద్రత కోసమ మల్టీ లెవల్ భద్రత ప్రణాళికలో భాగంగా నగరంలో 13,000 మంది బలగాలను మోహరించారు. రేపు ఈ మహత్తర కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, చిరంజీవి, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు రాబోతున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగుస్తుంది. ఈ వేడుకలకు మొత్తం వీవీఐపీలు, సాధువులతో కలిపి 7000 మందికి పైగా ప్రముఖులు వస్తున్నారు. అయోధ్య ఎక్కడా చూసిన భద్రతే కనిపిస్తోంది. మొత్తం 13,000 మంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. యాంటీ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను మోహరించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) అయోధ్యలో క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇక ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్)ని రంగంలోకి దింపింది. 24×7 పర్యవేక్షణ కోసం అయోధ్య అంతటా 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. లతా మంగేష్కర్ చౌక్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బందిని మోహరించారు. సరయు నదిపై పోలీసులు తరచూ బోట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అయోధ్యలో కొత్తగా ప్రారంభించబడిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ప్రాణ్ ప్రతిష్ట’ కోసం భక్తులు, ప్రముఖులు నగరానికి రావడం ప్రారంభించడంతో యాంటీ బాంబ్, డాగ్ స్క్వాడ్‌లను మోహరించారు. వీవీఐపీల కదలికల సమయంలో ట్రాఫిక్‌ని నిర్వహించేందుక ప్రధాన కూడళ్లలో ముళ్ల కంచెను ఉపయోగిస్తున్నారు. నేరస్తుల కదలికను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు ఆర్టిఫిషియల్(AI) కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఇక అన్ని భద్రతా సంస్థలు రియల్ టైమ్‌లో సెక్యూరిటీని పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలోని 51 నిర్దేశిత ప్రదేశాలలో పార్కింగ్ ఏర్పాట్లు చేసింది. 22,825 వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు ఉంటాయి. ఈ ప్రదేశాలను నిరంతరం డ్రోన్‌లతో పర్యవేక్షిస్తుంటారు. రామమందిర శంకుస్థాపనకు వచ్చే అతిథుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు 51 స్థలాలను గుర్తించినట్లు ట్రాఫిక్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) బీడీ పాల్సన్ తెలిపారు. ఇక జీవ, రసాయన, అణు దాడుల్ని, భూకంపాల వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శిక్షణ పొందిన NDRF బృందాలు మోహరించబడ్డాయి.
*500 కి.మీ రామరథాన్ని లాగి అయోధ్య చేరుకున్న రామభక్తుడు..
(రేపు) సోమవారం అయోధ్యలో రామమందిరప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అందుకు సంబంధించి దేశంలోని హిందూ సమాజంలో సంబరాల వాతావరణం నెలకొంది. కాగా.. అయోధ్యలో ప్రతిష్టంచనున్న బాలరాముడిని దర్శించుకునేందుకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే రామభక్తులు తమ భక్తిని చాటుతూ వెలుగులోకి వస్తున్నారు. రామభక్తుడైన బాబా బద్రి.. మధ్యప్రదేశ్ దామోహ్‌లోని బటియాగఢ్ నుంచి బయలుదేరిన రామభక్తుడు బద్రీ బాబా.. ఐదు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి అయోధ్య చేరుకున్నారు. అంతేకాదు.. అతను తన శిఖరం నుండి శ్రీరామచంద్రుని రథాన్ని లాగుకుంటూ అయోధ్యకు చేరుకున్నారు. బద్రీ బాబా 1992లో అయోధ్యలో శ్రీరామ్ లల్లా ఆలయాన్ని నిర్మిస్తే, తన శిఖరంపై నుండి దేవుని రథాన్ని లాగి అయోధ్యకు తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేసారు. అనేక అంతర్జాతీయ టెలివిజన్ షోలలో ఈ బాబా విన్యాసాలు ప్రజలు చూసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు.. ఇతను ఎంత గొప్ప శ్రీరామ భక్తుడో ప్రపంచం అంతా తెలుస్తుంది. ఈ బాబా ఐదు వందల కిలోమీటర్లకు పైగా తన జుట్టుతో రథాన్ని లాగుతూ అయోధ్య చేరుకున్నాడు. ఈ క్రమంలో రోజూ యాభై కిలోమీటర్లకు పైగా కాలినడకన ప్రయాణం పూర్తి చేశాడు. ఈ విధంగా.. అతను తన స్వస్థలం నుండి రథాన్ని లాగి అయోధ్యకు చేరుకోవడం ద్వారా తన కోరికను నెరవేరింది. దాంతో పాటు ఆ బాబా.. దమోహ్ నుండి రథాన్ని దాని శిఖరం నుండి లాగుతూ కాలినడకన అయోధ్యకు చేరుకున్న అటువంటి కష్టమైన తీర్మానాన్ని నెరవేర్చిన ఒక ప్రత్యేకమైన రామభక్తుడిగా నిలిచాడు.
*ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు… రాగానే సర్కార్‌పై ఫైర్!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇచ్చిన నియామకపత్రాన్ని వైఎస్ షర్మిలకు మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, రఘువీరా అందించారు. ఇక, కాసేపట్లో షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రసంగించారు. వైఎస్సార్ రెండు సార్లు పీసీసీ బాధ్యతలు చేపట్టారని.. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ తనకు పీసీసీ బాధ్యతలు అప్పగించారని షర్మిల పేర్కొన్నారు. గత ఐదేళ్లు వైసీపీ, అంతకు ముందు టీడీపీ అధికారంలో ఉందన్నారు. గత పదేళ్లల్లో ఏపీలో అభివృద్ధి జరిగిందా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన అప్పులు రూ. 2 లక్షల కోట్లు.. జగన్ రెడ్డి చేసిన కోట్లు రూ. 3 లక్షల కోట్ల పైనే ఉన్నాయన్నారు. మొత్తంగా ఏపీపై అప్పుల భారం రూ. 10 లక్షల కోట్లు పడిందని ఆమె విమర్శించారు. ఇన్ని అప్పులు తెచ్చారు.. అభివృద్ధి ఏమైందని షర్మిల ప్రశ్నించారు. రాజధాని ఉందా..? రాజధాని కట్టగలిగారా..? అంటూ ప్రశ్నలు గుప్పించారు. కనీసం ఒక్క మెట్రో ఉందా అంటూ మండిపడ్డారు. రూ. 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని.. కనీసం 10 పెద్ద పరిశ్రమలు కూడా లేవన్నారు. రోడ్ల నిర్మాణానికి డబ్బుల్లేవని.. కనీసం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు కూడా లేవన్నారు. దళితులపై దాడులు పెరిగాయన్నారు. అన్ని చోట్లా ఇసుక, మైనింగ్ మాఫియానే.. అంతా దోచుకోవడం, దాచుకోవడమేనని తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఏమైంది..పదేళ్లైనా ప్రత్యేక హోదా రాలేదన్నారు. ప్రత్యేక హోదా రాలేదనే దాని కన్నా.. పాలకులు తేలేదనే చెప్పాలన్నారు. ఐదేళ్లు ప్రత్యేక హోదా అంటే.. పదేళ్లు కావాలని బీజేపీ అడిగిందన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదన్నారు. ఉద్యమం చేసే వారిపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారు.. దీక్షలు చేశారని ఆమె వెెల్లడించారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ..”ప్రత్యేక హోదా కోసం అవిశ్వాసం పెడతాం.. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం అన్నారు జగన్. సీఎం అయ్యాక జగన్ ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం పోరాడారా..?. స్వలాభం కోసం వైసీపీ-టీడీపీ రాష్ట్ర ప్రయోజనులను తాకట్టు పెట్టింది. చంద్రబాబు త్రీడీ గ్రాఫిక్సులో రాజధాని చూపెట్టారు. జగన్ వచ్చి మూడు రాజధానులన్నారు.. ఒక్కటైనా కట్టారా..? ఏపీ రాజధాని అంటే ఏదో అనే పరిస్థితి వచ్చింది. వైఎస్ చనిపోయాక పోలవరం నిర్మాణం అడుగు కూడా ముందుకు పడలేదు. బీజేపీతో దోస్తీ కోసం టీడీపీ, వైసీపీలు పోలవరాన్ని తాకట్టు పెట్టాయి. వైసీపీ – టీడీపీ దొందూ దొందే. ఇవాళ అప్పులేని రైతు ఎవరైనా ఉన్నారా..? వైసీపీ, టీడీపీ ఎంపీలు బీజేపీకి తొత్తుల్లా మారారు. బీజేపీ ఏం చెబితే ఏపీ ఎంపీలంతా గంగిరెద్దుల్లా తలలూపుతారు. బీజేపీకి సహకరిస్తున్న వైసీపీ- టీడీపీలకు ఎందుకు ఓటేయాలి..? బీజేపీకే ఓటేయొచ్చు కదా..?” అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
*బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టేందుకు మోడీ, రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారు
బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టేందుకు ప్రధాని మోదీ , సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు మోడీకి గానీ, రేవంత్‌రెడ్డికి గానీ భయం లేదని , తెలంగాణ ప్రజల గొంతుకగా పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ , సీనియర్ జర్నలిస్టు రాధాకృష్ణ సంపాదకీయంలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఉదహరించారు. ‘‘ఇటీవల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మోదీని కలిసినప్పుడు బీఆర్‌ఎస్‌ను పూర్తి చేసేందుకు పూర్తిగా సహకరిస్తానని రాధాకృష్ణ చెప్పినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘాటైన కౌంటర్‌లో , బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు వాగ్దానం చేసిన వాటిని మాత్రమే బీఆర్‌ఎస్ పునరావృతం చేస్తున్నప్పుడు, నిజం మాట్లాడటం మరియు విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని ప్రజలను కోరడాన్ని విధ్వంసక ఆలోచనగా ఎలా పేర్కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. . తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐసీసీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లులు కట్టవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజలను కోరారని ఆయన సూచించారు. “అందుకే సోనియా గాంధీ బిల్లులు చెల్లించాలి. BRS ఎమ్మెల్యేలు మరియు నాయకులు ఆమెకు బిల్లులు పంపడానికి ప్రజలతో కలిసి పని చేయాలి, ”అన్నారాయన. ఉపముఖ్యమంత్రి చెప్పినట్లు ప్రగతి భవన్ విలాసవంతంగా ఉంటే ఈపాటికి దాన్ని బయటపెట్టి ఉండేవారని భట్టి విక్రమార్కపై ఆయన మండిపడ్డారు. మైనారిటీల్లో ఉన్న అపోహలను తొలగించి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.
*అయోధ్య ప్రాణ ప్రతిష్ట.. లక్నోకు చేరుకున్న పవన్ కళ్యాణ్..
అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ అంతా సిద్ధమైంది. రేపు రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పలు రంగాల నుంచి 7000 మందికి పైగా అతిథులు వస్తున్నారు. తాజాగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిర వేడుకకు బయలుదేరారు. ఆయన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకి చేరుకున్నారు. ఇది ప్రజల చిరకాల స్వప్నమని.. 500 ఏళ్ల తరువాత ఇది ఎట్టకేలకు నిజం కాబోతోందని, మేము చాలా సంతోషంగా ఉన్నామని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.
*నిత్యానందకు రామ మందిర ఆహ్వానం..హాజరవుతానని ప్రకటన..
అయోధ్య రామ మందిర వేడుకకు సంబంధించి తనకు ఆహ్వానం అందిందని వివాదాస్పద గురువు నిత్యానంద వెల్లడించారు. తాను ఈ కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు. తనను తాను స్వయంప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానంద, పరారీలో ఉన్న అత్యాచార నిందితుడు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌లో పేర్కొన్నారు. తనకు తాను కౌలాస దేశాన్ని సృష్టించుకుని, హిందూ మతానికి సుప్రీంగా చెప్పుకుంటున్నాడు. ‘‘ఈ చారిత్రాత్మక, అసాధారణమైన సంఘటనను మిస్ చేయవద్దు. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముడు అధికారికంగా ఆలయ ప్రధాన దేవుడిగా ఆవాహన చేయబడుతాడు. ప్రపంచం మొత్తంపై దయ చూపేందుకు వస్తున్నాడు’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో నిత్యానంద కామెంట్ చేశాడు. ఈ గొప్ప కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానించారని, భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం హాజరవుతారని చెప్పారు. నిత్యానంద డ్రైవర్ ఫిర్యాదుతో 2010లో అతనిపై అత్యాచార కేసు నమోదైంది, ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన ఇతను 2020లో ఇండియా నుంచి పారిపోయాడు. ఈక్వెడార్ దేశ సమీపంలో ఒక ద్వీపంలో “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస” పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు.
*అస్సాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు మరోసారి దాడి..
కాంగ్రెస్ అగ్రనేత చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొ్న్నారు. కాగా.. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు మరోసారి దాడి చేశారంటూ ఆరోపిస్తున్నారు. కాగా.. శనివారం కూడా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడింది. ఆ దాడిని కాంగ్రెస్ ఖండించింది. అధికార పార్టీ బీజేపీ.. దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హక్కును ‘అణచివేస్తోందని’ ఆరోపించింది. రాజ్యాంగాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను, నాయకులను బెదిరించే ఇలాంటి వ్యూహాలకు కాంగ్రెస్ భయపడబోదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె. సి.వేణుగోపాల్ ఈ దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, “అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి హిమంత ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కి ఎంత భయపడుతున్నారో ఇంతకంటే రుజువు ఏమి కావాలి? చూడండి, వారి గూండాలు మన కాంగ్రెస్ పోస్టర్లను చించి వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. అని సోషల్ మీడియాలో తెలిపారు. యాత్ర విస్తృత ప్రభావం కారణంగా హిమంత బిశ్వశర్మ చాలా కలత చెందాడు. అతను ఏ స్థాయికి దిగజారాడు చూడండని ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రకు వస్తున్న భారీ ఆదరణతో బీజేపీ ఉలిక్కిపడుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అసోంలోని లఖింపూర్‌లో కాంగ్రెస్ పార్టీ వాహనాలను ధ్వంసం చేయడం, యాత్ర పోస్టర్లు చింపివేయడం.. ఇది బీజేపీ ఆగ్రహాన్ని తెలియజేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో.. లఖింపూర్ హింసాత్మక ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాగా.. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో నాల్గవ రోజు కొనసాగుతోంది. ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్‌లోకి ఈ యాత్ర ప్రవేశించనుంది.\
*ఆఫ్ఘనిస్థాన్‌లో కూలిపోయిన మాస్కో వెళ్తున్న భారత విమానం
మాస్కో వెళ్తున్న భారత విమానం ఆఫ్ఘనిస్థాన్‌లోని బదాక్షన్‌లోని వాఖాన్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ మేరకు ఆఫ్ఘన్ మీడియా వెల్లడించింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల విమానం కూలిపోయిందని ఆదివారం (జనవరి 21) ప్రాంతీయ సమాచార, సాంస్కృతిక శాఖ అధికారి జబీహుల్లా అమీరిని ఉటంకిస్తూ ఆఫ్ఘనిస్తాన్ స్థానిక టెలివిజన్ ఛానెల్ టోలోన్యూస్ పేర్కొంది. కూలిపోయిన విమానానికి సంబంధించి కురాన్-వా-ముంజన్ జిల్లాలోని తోప్‌ఖానా ప్రాంతానికి ఒక బృందాన్ని పంపినట్లు అధికారి తెలిపారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే సమాచారం అందుబాటులో లేదు. ప్రమాదానికి గల కారణాలు కూడా వెల్లడి కాలేదు. అయితే, ఈ విషయంపై MoCA, DGCA వర్గాలు మీడియాతో షెడ్యూల్ చేసిన భారతీయ విమానయాన సంస్థ/ఆపరేటర్ గురించి ఇంకా సమాచారం లేదు. కూలిపోయిన విమానం చార్టర్ విమానం అని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదంపై ఆఫ్ఘనిస్తాన్ నుండి దర్యాప్తు చేయబడుతోంది. విమాన ప్రమాదానికి సంబంధించి ఇంకా ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అది విదేశీ విమానం కావచ్చు. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌లో భారతీయ ప్రయాణీకుల విమానం కూలిపోయిందని ఆఫ్ఘన్ మీడియా పేర్కొంది. ఇందులో చాలా మంది ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. కుప్పకూలిన విమానం భారతదేశంలో రిజిస్టర్ చేయబడలేదని MoCA , DGCA వర్గాలు తెలిపాయి. విమానం రష్యాలో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. ఏ భారతీయ విమానయాన సంస్థలోనూ రష్యా రిజిస్టర్డ్ విమానాలు లేవు.
