Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*చంద్రబాబుది మాటల ప్రభుత్వం.. జగన్ మోహన్ రెడ్డిది చేతల ప్రభుత్వం
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబుది మాటల ప్రభుత్వమన్న మంత్రి రోజా.. జగన్ మోహన్ రెడ్డిది చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశాడని తీవ్రంగా విమర్శించారు. పాదయాత్రలో చెప్పిన ప్రతీ హామీని జగన్ నెరవేరుస్తున్నారన్నారు. దేశంలోనే ఏపీని టాప్ 5 రాష్ట్రాల సరసన నిలిపారని ఆమె పేర్కొన్నారు. బెస్ట్ 5 సీఎంల జాబితాలో జగన్ మోహన్ రెడ్డి నిలిచారని మంత్రి తెలిపారు. మ్యానిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు పరచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. పబ్లిసిటీకి జగన్ మోహన్ రెడ్డి దూరం అని ఆమె వెల్లడించారు. మనం కాదు మన చేతలు మాట్లాడాలనుకునే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ ప్రశంసించారు. “చంద్రబాబు డ్రామాల గురించి రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. బాబుకు కష్టాలు వచ్చినప్పుడల్లా దాన్ని ప్రజల సమస్యగా చిత్రీకరించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు రూ.118 కోట్ల ముడుపుల కేసులో జైలుకెళ్లడం ఖాయమని తెలిసి.. చంద్రబాబు సింపతీ కోసం కొత్త డ్రామా ఆడుతున్నాడు.” అని ఆర్కే రోజా పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరికీ మేలు జరగాలని గడప గడపకు ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజల వద్దకే పంపించారని తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం నభూతో నః భవిష్యత్ అని వెల్లడించారు. వైయస్సార్ రెండు అడుగులు ముందుకేస్తే… జగనన్న నాలగు అడుగులు ముందుకేశారన్నారు. తండ్రిని మించిన తనయుడిగా జగనన్న ప్రజలకు మంచి చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. జగనన్న దమ్మున్న నాయకుడు అంటూ.. 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన రియల్ హీరో జగనన్న అంటూ రోజా పేర్కొన్నారు. నియోజకవర్గాల సమీక్షలో గుర్తించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గతంలో మిల్లర్లు రైతులను జలగల్లా పీడించేవారని.. రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా ధాన్యం కొంటోందన్నారు. కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఆలోచనతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రైతులను ఇబ్బంది పెట్టే మిల్లుల పై చర్యలు తీసుకుంటామన్నారు. పార్ధసారధిని మరోమారు పెనమలూరు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నామన్నారు. జగనన్న వస్తేనే మన భవిష్యత్తు బాగుంటుందని మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు.

 

*పూర్తిగా పతనమైన టమాటా ధర.. కిలో 30 పైసలే!
మొన్నటి వరకు సామాన్యులను ఏడిపించిన టమాటా.. ఇప్పుడు రైతులను ఏడిపిస్తోంది. దాదాపు మూడు నెలల పాటు సాధారణ ప్రజలు వాటిని తినాలంటేనే భయపడ్డారు. కానీ ఇప్పుడు ఆ టమాటాలు కొనే నాథుడు లేక పశువులకు ఆహారంగా మారుతున్నాయి. 3 నెలల వరకు కిలో రూ. 300 వరకు పలికిన టమాటా.. ఇప్పుడు 30 పైసలకు కూడా కొనే దిక్కులేక నేలపాలవుతోంది. పంట పండించిన రైతులు రవాణా ఛార్జీలు కూడా రావనే ఉద్దేశంతో టమాటాలను రోడ్డు పక్కనే పారబోస్తున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్, కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్లలో టమాటా ధరలు పూర్తిగా పతనమయ్యాయి. 25 కేజీల బాక్స్ 10 రూపాయల నుంచి 35 రూపాయలు పలుకుతోంది. అంటే కేజీ టమాటా ధర దాదాపు 30 నుంచి 40 పైసలు పలుకుతోంది. దీంతో గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై రైతులు టమాటాలను పారబోస్తున్నారు. గత జూన్, జులై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు ఈ 20 రోజుల్లో నేల మీద పారబోసే స్థాయికి చేరుకున్నాయి. పలు ప్రాంతాల నుంచి టన్నుల కొద్దీ పంట వస్తుండటం, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో.. టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఓ నెల క్రితం మార్కెట్‌కు టమాటాలు తీసుకొచ్చి జేబు నిండా డబ్బులు తీసుకెళ్లిన రైతు.. ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.పెరిగిన టమాటా ధరలు జూన్, జూలై నెలలో రైతులకు కాసుల వర్షం కురిపించాయి. ఊహకందని ధరలతో కొందరు రైతులను టమాటా కోటీశ్వరులను చేసింది. ఇదే విషయాన్ని రైతులు స్వయంగా చెప్పారు. టమోటాకు ఇంత ధర ఎప్పుడూ లేదని, చాలా డబ్బు సంపాదించామని తెలిపారు. అయితే ఇప్పుడు అదే టమోటా రైతుకు కంటతడి పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పంటకు పెట్టుబడి, ఎరువులు, కూలీల ఖర్చులు కూడా పూడే పరిస్థితి లేదని కంటతడి పెట్టుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తీరా పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు కురుస్తూ నష్టాలను కలిగిస్తున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. నష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

 

*హోంగార్డ్ ఆత్మహత్యా యత్నం దారుణం: కిషన్‌ రెడ్డి
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లో పని చేస్తున్న హోంగార్డు రవీందర్ ఆత్మహత్యయత్నాం సంచలనంగా మారింది. జీతం ఇవ్వకపోవడంతో బ్యాంకుకు చెల్లించాల్సిన ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందని మనస్థాపానికి గురయ్యాడు. అనంతరం హోంగార్డు అధికారుల ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే, హోంగార్డు ఆరోగ్యం విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. అయితే, హోంగార్డు రవీందర్ పరిస్థితిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రవీందర్ ను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాస్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వాళ్ళ కనీస హక్కులు ఇవ్వకుండా.. హోంగార్డ్ వ్యవస్థను ప్రభుత్వం అవమాన పరుస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హోంగార్డ్ ల సమస్యలపై చాలా సార్లు మాట్లాడిన.. సీఎం చాలా సార్లు వాళ్ళను పర్మినెంట్ చేస్తాము అని చెప్పారు.. హోంగార్డ్ లు 16 గంటలకు పైగా పని చేస్తున్నారు.. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. వాళ్ళ ఆరోగ్యానికి భద్రత ఇవ్వాలి.. హోంగార్డ్ లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలి.. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన చూడండి అంటూ వీడియో ప్లే చేసిన కిషన్ రెడ్డి.. ఐదున్నర సంవత్సరాలు గడిచినా.. సీఎం వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు అని ఆయన మండిపడ్డారు. హోంగార్డులకు కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు అని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రాగానే.. హోంగార్డ్ ల అన్ని సమస్యలు పరిష్కరిస్తాము అని ఆయన హామీ ఇచ్చారు.

 

*బిల్డింగ్ గోడ కూలి ముగ్గురు మృతి.. పరారీలో బిల్డర్, ఓనర్..
హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న భవనంలోని ఆరో అంతస్తులో కార్మికులు సెంట్రింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే అకస్మాత్తుగా ఒక్కసారిగా ఐదో అంతస్తులోని భవనం గోడ కూలిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకోనేలోపే అనుకున్నదంతా జరిగిపోయింది. దానిపై నిర్మించిన సెంట్రింగ్ కర్రలు విరిగిపోవడంతో ఒక్కసారిగా నలుగురు కార్మికులు కింద పడిపోయారు. వారిపై బలంగా సెంట్రింగ్ కర్రలు బలంగా పడటంతో నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శబ్దం రావడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. పక్కనే బిల్డిండ్ గోడ కూలిపోయి కూలీలు చనిపోవడంతో చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణంలో లోపాలు ఉన్నా.. ఇంటి యజమాని నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే మృతి చెందిన కూలీల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో అద్దరగుట్ట ప్రాంతం విషాదంగా మారింది. ఈ ప్రమాదంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. భారీ వర్షాల కారణంగా ఈ గోడ కూలిందా? లేక వాస్తు దోషమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గోవా కర్రలు నాణ్యత లేకపోవడం వల్లనే ఉదయం సమయంలో పని చేస్తుండగా ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నామన్నారు. తన పరిస్థితీ విషమంగా ఉన్నదని అన్నారు. ఓనర్స్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఓనర్స్ దాసరి సంతోష్, శ్రీరామ్ లుగా గుర్తించారు. బిల్డింగ్ ని శ్రీనివాస్ నాయుడుకి డెవలప్మెంట్ కి ఇచ్చినట్లు సమాచారం. డిసెంబర్ 2, 2022లో భవన నిర్మాణ అనుమతులు తీసుకున్నారు. జిహెచ్ఎంసి జీ+5కి పర్మిషన్స్ ఇచ్చింది. అయితే యజమానులు మాత్రం జీ+7 నిర్మాణం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 7వ అంతస్తులో పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. యజమాని, బిల్డర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓనర్, బిల్డర్ పై కేసు నమోదు చేసి వెంటనే పట్టుకుంటామని తెలిపారు.

 

*అవినీతిని దాచిపెట్టేందుకే సనాతన్‌ అంశాన్ని లేవనెత్తారు: ఉదయనిధి
సనాతన్ సమస్యపై గందరగోళం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ పీఎం కేర్స్ ఫండ్, కాగ్ నివేదిక, మణిపూర్ హింస, తొమ్మిదేళ్ల పనిపై ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. సనాతన్ సమస్య మణిపూర్, రూ. 7.5 కోట్ల అవినీతి అంశం నుంచి దృష్టి మరల్చేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పన్నిన ఎత్తుగడ అని ఆరోపించారు. ఈ మేరకు ఉదయనిధి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాని మోడీ, ఆయన మిత్రపక్షాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మణిపూర్‌లో జరిగిన మరణాలు, రూ.7.5 కోట్ల అవినీతిని దాచిపెట్టేందుకే సనాతన్‌ అంశాన్ని లేవనెత్తారని స్టాలిన్‌ అన్నారు. పీఎం కేర్స్ ద్వారా కరోనా మహమ్మారి కోసం డబ్బు వసూలు చేసినట్లు ప్రధాని మోడీచెబుతున్నారని, అయితే రూ.7.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న కాగ్ నివేదికపై ఆయన ఎప్పుడూ స్పందించలేదని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. మణిపూర్ సమస్యపై స్పందించకుండా తన స్నేహితుడు గౌతమ్ అదానీతో కలిసి మోడీ ప్రపంచ యాత్ర చేస్తున్నాడంటూ ఆరోపించాడు. కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తప్పుడు వార్తల ఆధారంగా తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం లేదని స్టాలిన్ అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తున్నామని, ప్రజలందరూ సమానమేనని అన్నారు. 9 ఏళ్ల పాలనలో ప్రధాని మోడీ చేసిన పని ఏంటని ఉదయనిధి స్టాలిన్ తన లేఖలో ప్రశ్నించారు. ప్రధాని మోడీ నోట్ల రద్దును మాత్రమే చేశారని, మురికివాడలను దాచిపెట్టేందుకు గోడలు కట్టారని, కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించారని, కొత్త పార్లమెంట్‌లో సింగోల్‌ను ఏర్పాటు చేశారని, ఇప్పుడు దేశం పేరు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టాలిన్ అన్నారు.

 

*జీ20 సదస్సుకు ముందు రాహుల్ గాంధీ యూరప్ పర్యటన
దేశంలో ఓ వైపు ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు మందు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ యూరప్ పర్యటకు వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన వివిధ దేశాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం ఆయన బ్రస్సెల్స్ చేరుకున్నారు. అక్కడి ప్రవాస భారతీయులతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు, న్యాయవాదులతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారు. రాహుల్ గాంధీ అన్ని సమావేశాలను ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ సమన్వయం చేస్తోంది. రాహుల్ గాంధీతో పాటు శామ్ పిట్రోడా కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. బ్రస్సెల్స్ లో మీడియాతో మాట్లాడుతారు. ఫ్రెంచ్ చట్టసభ సభ్యలతో భేటీ అవుతారు. భారత్ రావడానికి ముందు నార్వేలో పర్యటిస్తారు. రాజధాని ఓస్లోలో ఆ దేశ పార్లమెంట్ సభ్యులను కలవాలని రాహుల్ భావిస్తున్నారు. అంతకుముందు రోజు రాహుల్ గాంధీ తన ఎక్స్ అకౌంట్ లో భారత జోడో యాత్ర గురించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. గతేడాది సెప్టెంబర్ 7న జోడో యాత్ర మొదలైంది. ఈ రోజుతో ఏడాది పూర్తైంది. విద్వేషం తొలిగిపోయే వరకు ప్రయాణం కొనసాగుతుందని, ఐక్యత, ప్రేమ వైపు వేలాది అడుగులు వేసేందుకు జోడో యాత్ర కారణమైందని ఆయన పోస్ట్ చేశారు. ‘మోడీ ఇంటి పేరు’ వివాాదంపై రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆయన ఎంపీ పదవి మళ్లీ పునరుద్ధరించారు. దీని తర్వాత ఆయన చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన యూకే పర్యటనకు వెళ్లారు. జీ20 సమావేశాలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 12 ఆయన తిరిగి ఇండియా రానున్నారు.

*ఉదయనిధి స్టాలిన్‌కు సపోర్ట్‌గా కట్టప్ప
కోలీవుడ్ నటుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పేరు సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. హిందూ సనాతన ధర్మాన్ని నిర్ములించాలంటూ సంచలనం వ్యాఖ్యలు చేయగా.. అవికాస్తా వైరల్ కావడంతో హిందూ సంఘాలు అతడిపై మండిపడుతున్నాయి. తమిళనాడులో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి స్టాలిన్.. “డెంగ్యూ, మలేరియా ఎలాగో సనాతన ధర్మం కూడా అంతే.. మనం కేవలం దానిని వ్యతిరేకించి ఊరుకోకూడదు.. దాన్ని నిర్మూలించాలి” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక దీంతో కేవలం తమిళనాడులోనే కాకుండా దేశం మొత్తంలోని హిందూ సంఘాలు ఉదయనిధిపై విరుచుకుపడుతున్నాయి. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని సనాతన ధర్మాన్ని హిందూ సంప్రదాయాన్ని కించపరిచే విధంగా.. తక్కువ చేసే విధంగా మాట్లాడితే సహించబోమని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు కూడా తమదైన శైలిలో మాటల దాడులు చేస్తున్నారు.ఇక ఈ నేపథ్యంలోనే ఉదయనిధి స్టాలిన్ కు సపోర్ట్ చేసేవారు కూడా ఎక్కువ అయ్యారు. తాజాగా నటుడు సత్యరాజ్.. ఉదయనిధికి సపోర్ట్ గా నిలిచాడు. తన మద్దతు ఉదయనిధికే అని, ఆయన మాట్లాడిన మాటల్లో తప్పేముందని ప్రశ్నించాడు. తాజాగా మీడియా ముందు సత్యరాజ్ మాట్లాడుతూ.. ” సనాతనం గురించి మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టంగా మాట్లాడారు.. ఉదయనిధి స్టాలిన్ ధైర్యాన్ని అభినందిస్తున్నాను.. మంత్రి ప్రతి విషయంలోనూ వ్యవహరిస్తున్న, అనుచరిస్తున్న తీరు గర్వకారణం” అనిచెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సత్యరాజ్ పై కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక సత్యరాజ్.. బాహుబలి కట్టప్ప పాత్రతో తెలుగువారికి కూడా సుపరిచితమే. ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల్లో కూడా ఆయన నటిస్తున్నాడు. మరి ఇప్పుడు సత్యరాజ్ పై హిందూ సంఘాలు ఎలా విరుచుకుపడతాయో చూడాలి.

 

*ఉస్తాద్ యాక్షన్ లోకి దిగాడు… సినిమా ఏదైనా గన్ కామన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గత వారం రోజులుగా సూపర్ కిక్ లో ఉన్నారు. ఒక డ్రగ్ ని తీసుకున్నట్లు OG మత్తులో ఉన్నారు. సుజిత్ స్టైలిష్ మేకింగ్ తో పవన్ కళ్యాణ్ ని OGగా చూపించి ఫ్యాన్స్ కి సూపర్ స్టఫ్ ఇచ్చాడు. థమన్ థంపింగ్ మ్యూజిక్ OG గ్లిమ్ప్స్ ని మరింత స్పెషల్ గా మార్చింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున ఈ గ్లిమ్ప్స్ బయటకి వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ గ్లిమ్ప్స్ వైబ్ లోనే ఉన్నారు. ఈ జోష్ ని మరింత పెంచుతూ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఇచ్చిన బ్రేక్ ని కంప్లీట్ చేసి… పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్ కి అటెండ్ అయ్యాడు. ఈ షూటింగ్ రెండు రోజుల ముందే స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా కూడా ఎడతెరపి లేని వర్షాల కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగింది. లేటెస్ట్ గా మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకోని, చైర్ లో కూర్చోని చాలా మాస్ లుక్ లో కనిపిస్తూ ఉన్నాడు. OG గ్లిమ్ప్స్, ఉస్తాద్ పోస్టర్ లో ఉన్న కామన్ పాయింట్… పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న గన్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కి గన్స్ అంటే చాలా ఇష్టం అనే విషయం మన అందరికీ తెలిసిందే. మరి ఫ్యాన్ స్టఫ్ ఇవ్వడంలో ముందుంటున్న OG, ఉస్తాద్ సినిమాలు ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాయి? ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తాయి? ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటాయి అనేది చూడాలి.

Exit mobile version