*పవన్‌కు పది ప్రశ్నల పేరుతో మంత్రి అమర్‌నాథ్ బహిరంగ లేఖ
వారాహి యాత్రకు వస్తున్న పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారాహి వెబ్ సిరీస్ 3 అంటూ వ్యాఖ్యానించారు మంత్రి. ఉత్తరాంధ్రలో అక్రమాలు అన్యాయాలపై ప్రశ్నిస్తానంటున్న ప్యాకేజ్ స్టార్ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అమర్నాథ్. పవన్‌కు పది ప్రశ్నల పేరుతో మంత్రి అమర్‌నాథ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. విధానం అంటూ లేని పార్టీ జనసేన అంటూ మంత్రి విమర్శించారు. పవన్ కళ్యాణ్ మొదటి అన్యాయం చేసింది ఉత్తరాంధ్రకేనని.. విశాఖకు చెందిన కాపు బిడ్డను పెళ్లి చేసుకుని మోసం చేశారని మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు. బీజేపీతో సంసారం, చంద్రబాబుతో సహజీవనం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. వారాహి యాత్ర ఎందు కోసమో ప్రజలకు చెప్పాలన్నారు. వాలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
*చిరంజీవికి మంత్రి రోజా సవాల్.. వచ్చి చూస్తే తెలుస్తుంది
‘ప్రత్యేకహోదాతో పాటు రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలే గానీ.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఇండస్ట్రీ మీద పడతారేంటి’ అని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా దిగొచ్చి.. చిరు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా చిరుకి మంత్రి రోజా ఓ సవాల్ విసిరారు. గడప గడపకు చిరంజీవి వచ్చి చూస్తే.. తాము ఏం అభివృద్ధి చేశామో, ఎన్ని రోడ్లు వేశామో తెలుస్తుందని ధ్వజమెత్తారు. ఏ అర్హత ఉందని సినిమా టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాన్ని అడుక్కున్నారని ప్రశ్నించారు. హీరోలు అందరూ కలిసి ఎందుకు జగన్ దగ్గరికి వెళ్లారని నిలదీశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మినహాయిస్తే.. ఏ ఇతర హీరోలు ప్రభుత్వాన్ని విమర్శించడం లేదన్నారు. సినిమా వేదికలపై ప్రభుత్వాన్ని తిడితే సహించేది లేదన్న మంత్రి రోజా.. రాజకీయాలు చేయాలని అనుకుంటే, రాజకీయాల్లో ఉండి మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు. అలా కాకుండా సినిమాలే చేయాలనుకుంటే, రాజకీయాల జోలికి రాకుండా సినిమాలే చేసుకోవాలని హితవు పలికారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీ అభివృద్ధి చేసిన ఘనత జగన్‌ది అని చెప్పుకొచ్చారు. చిరంజీవి చెబితే విని, పనిచేసే పరిస్థితిలో జగన్ లేరన్నారు. కేంద్రమంత్రిగా చిరంజీవి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతుంటే.. చిరంజీవి అప్పుడేం చేశారని అడిగారు. హోదా గురించి అప్పుడు ఎందుకు చిరంజీవి అడగలేదు? అని ప్రశ్నించారు. కేంద్రంమంత్రిగా ఉండి చిరంజీవి ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? అని చెప్పారు. ప్రజల తిరస్కారానికి గురైన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన చిరంజీవి.. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని రోజా పేర్కొన్నారు. తమ్ముడి మీద ప్రేమతో చిరంజీవి ఇలా మాట్లాడి, ఏదో బలాన్ని ఇవ్వాలని చూస్తున్నాడని అభిప్రాయపడ్డారు. తమని నమ్మకున్న వాళ్లను రోడ్డుమీదికి వదిలేసి.. వీళ్లు హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారని కౌంటర్ వేశారు. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు.. మళ్లీ అన్నదమ్ములు కలిస్తే అలానే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
*కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించిన వైసీపీ
కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకించింది. అవిశ్వాస తీర్మానం చర్చలో వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. మణిపూర్‌లో మహిళపై అత్యాచార ఘటనలు బాధాకరమని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మణిపూర్ మహిళలు రక్షించబడాలని.. మణిపూర్‌లో రెండు వర్గాల వారిని కూర్చోబెట్టి పరిష్కారం కల్పించాలన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి మణిపూర్‌లో శాంతిని పునరుద్దరించాలని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. శాంతిని పునరుద్ధరించకపోతే ప్రజాస్వామ్యనికి అర్ధం ఉండదన్నారు. మణిపూర్‌లో అదనపు బలగాలు మోహరించాలని..రెండు వర్గాలతో చర్చలు జరపాలని ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడించారు. మణిపూర్ మయన్మార్‌తో బలహీనమైన సరిహద్దు కలిగి ఉందని.. బలహీనమైన సరిహద్దు దేశ భద్రతకి మంచిది కాదన్నారు. ఈ అవిశ్వాసానికి విలువ లేదని వైసీపీ భావిస్తోందన్నారు. అధికార ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉందన్నారు. అవిశ్వాస తీర్మానం రెండు కూటముల మధ్య రాజకీయాలు చేసుకోవడానికి మాత్రమేనన్నారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని వైసీపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోందని వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.
*నిజామాబాద్‌లో కేటీఆర్ పర్యటన
నిజామాబాద్ జిల్లాలో ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా.. నగరంలో ఐటీ టవర్ ను ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కోరుకునేది అభివృద్ధి సంక్షేమమని తెలిపారు. ఎన్నికలు వస్తే సంక్రాంతి గంగిరెద్దుల వచ్చినట్లు వస్తారు.. జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ అగమైందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక తెలంగాణలో ప్రతి వర్గం సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండటం కొందరికి నచ్చడం లేదని.. అందుకోసం లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువతకు ఓ వైపు శిక్షణ మరో వైపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న నేతలే కలకాలం గుర్తుండిపోతారని ఆయన తెలిపారు. ప్రజల కోసం పనిచేసే వారినే వచ్చే ఎన్నికల్లో గెలిపించండని కోరారు. గతంలో పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచినా ప్రజలను పట్టించుకోలేదని.. సమైక్య పాలనలో తెలంగాణ ఆగమైందని కేటీఆర్ అన్నారు. వరి సాగులో నేడు తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని తెలిపారు. కేసీఆర్ విధానాల వల్లే నేడు నిండా చెరువులు పచ్చని పంటలు కనిపిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. అంతేకాకుండా.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమాబాద్ ఎంపీ చిల్లరగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నిజమాబాద్ ఎంపీ సంస్కారంగా మాట్లాడాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా.. డిపాజిట్ కొల్లగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. 70 ఏళ్ల వయస్సున్న కేసీఆర్ ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. ధరలు పెంచిన బీజేపీ నేతలను నిలదీయండని అన్నారు. మరోవైపు 50 ఏళ్ళు అధికారం ఇస్తే కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. మళ్ళీ ఒక్క చాన్స్ అంటూ వస్తున్నారని.. 3 గంటల కాంగ్రెస్ కావాలా.. 3 పంటల కేసిఆరా.. మతం మంటలు పెడుతున్న బీజేపీ కావాలా అని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా.. నిజమాబాద్ కు రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
*శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్
ఆగస్టు 15 స్వాతంత్రదినోత్సవం పురస్కరించుకొని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్బంగా.. విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే వారిని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా.. ఆగస్టు 15 వరకూ విమానాశ్రయంలోకి సందర్శకులకు ఎంట్రీ లేదని అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు, వారితో వెళ్లేవారికి అధికారులు కొన్ని సూచనలు చేశారు. అన్ని రకాల పాసులను ఆగస్టు 16 వరకూ బలగాలు రద్దు చేశాయి. మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్టులోని పార్కింగ్, డిపార్చర్, అరైవెల్ లో సీఐఎస్ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. విదేశాలకు వెళుతున్న ప్రయాణికులకు వీడ్కోలు తెలపడానికి ఒకరు లేదా ఇద్దరు రావాలని అధికారులు సూచిస్తున్నారు. తప్ప అధిక సంఖ్యలో వస్తే అనుమతించబోమని అధికారులు అంటున్నారు. ప్రయాణికులు, వాహనదారులు అందరు గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
*మరో వివాదంలో రాహుల్ గాంధీ
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా ఎంపీలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపై అవిశ్వాస తీర్మనం సందర్భంగా జరిగిన చర్చ సమయంలో రాహుల్ గాంధీ తన ప్రసంగం ముగించే సమయంలో అధికార సభ్యులవైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని.. ఇది సభలో ఉన్న మహిళా ఎంపీలను అగౌరవపరిచినట్టు అని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ మహిళా మంత్రులు, ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మోడీ ఇంటిపేరు కేసులో సూరత్ కోర్టు విధించిన శిక్ష నేపథ్యంలో ఎంపీ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పు కారణంగా 4 నెలల తరువాత సోమవారమే పార్లమెంట్‌కు వచ్చారు. ఈ రోజు అవిశ్వాస తీర్మనంపై రాహుల్ ప్రసంగించారు. తన ప్రసంగం చివరలో ట్రెజరీ బెంచ్‌ల వైపు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. అయితే ఇది తమకు అభ్యంతరకరంగా ఉందని బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదేం పద్ధతి, మహిళల పట్ల వ్యవహారించడం ఇలానే అంటూ బీజేపీ మహిళా ఎంపీలు ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విపక్ష సభ్యులు ఇండియా కూటమి తరపున ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. మంగళవారం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న మణిపూర్ రాష్ట్రంలో తాను పర్యటించానని.. తాను సహాయక శిబిరాలకు వెళ్లానని, దురాగతాలను ఎదుర్కొన్న మహిళలతో తాను మాట్లాడానని తెలిపారు. తమ పిల్లల మృతదేహాల వద్ద ఉన్న తల్లులతో మాట్లాడానని… ఆ భయానక సంఘటనల గురించి చెప్పేటపుడు మహిళలు స్పృహ కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఆ రాష్ట్రంలో పర్యటించలేదని ఆరోపించారు. బీజేపీ ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందన్నారు. ప్రధాని ఆ రాష్ట్రానికి ఎన్నడూ వెళ్లలేదన్నారు. మణిపూర్ ఇక ఉండబోదని.. మణిపూర్ మహిళల బాధలు బీజేపీకి అర్థం కావడంలేదన్నారు. భారత దేశ ఆత్మను ప్రభుత్వం హత్య చేసిందని ఆరోపించారు. తన ప్రసంగం ముగించే సమయంలో రాహుల్ గాంధీ అధికార సభ్యులు, ట్రెజరీ బెంచ్‌లవైపు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు.
*తొలి భారత బౌలర్‌గా కుల్దీప్ యాదవ్!
భారత లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. తన మణికట్టు మయాజాలాన్ని ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులను పెవిలియన్ చేర్చుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో 4 వికెట్స్ తీసిన కుల్దీప్.. రెండో వన్డేలో 1 వికెట్, మూడో వన్డేలో 2 వికెట్స్ పడగొట్టాడు. ఇక మొదటి టీ20లో 1 వికెట్ తీసిన అతడు.. మూడో టీ20లో 3 వికెట్లు సాధించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి.. 3 వికెట్లు (బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ మరియు జాన్సన్ చార్లెస్) తీశాడు. దాంతో కుల్దీప్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్స్ పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రికార్డుల్లోకెక్కాడు. కుల్దీప్ 30 మ్యాచ్‌ల్లో 50 వికెట్స్ ఖాతాలో వేసుకున్నాడు. అంతకముందు ఈ రికార్డు మరో మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ పేరిట ఉండేది. చహల్ 34 మ్యాచ్‌ల్లో 50 వికెట్స్ తీశాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌తో చహల్ రికార్డును కుల్దీప్ బ్రేక్ చేశాడు. 28 ఏళ్ల కుల్దీప్ యాదవ్ మరో రికార్డు కూడా సాధించాడు. టీ20ల్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్‌గా కుల్దీప్ నిలిచాడు. దాంతో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. విండీస్‌పై ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్15 వికెట్లు తీశాడు.33 ఏళ్ల భువనేశ్వర్ 18 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అద్భుత ప్రదర్శన చేస్తున్న కుల్దీప్.. ప్రపంచకప్ 2023 రేసులోకి వచ్చాడు.
*ఖుషి ట్రైలర్ విడుదల
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నిన్ను కోరి, మజిలీ లాంటి లవ్ స్టోరీస్ తరువాత శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం ఒకటి అయితే.. విజయ్ దేవరకొండ లైగర్ ప్లాప్ తరువాత రిలీజ్ అవుతున్న చిత్రం కావడం మరొక విశేషం. ఇక సామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరి ముగ్గురు కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులే కాదు ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విజయ్, సామ్ ల మధ్య లవ్ స్టోరీని చాలా అద్భుతంగా చూపించాడు శివ నిర్వాణ. ముఖ్యంగా విజయ్- సమంత రొమాన్స్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఒక క్రిస్టియన్ అబ్బాయికి బ్రాహ్మణల అమ్మాయికి మధ్య జరిగిన లవ్ స్టోరీగా ఖుషీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కాంబో మహానటిలో కనిపించేసరికి వీరిని ఎవరు కొత్త జంటలా చూడకపోవడం సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇక హేషమ్ అబ్దుల్ వాహబ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపించింది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. మరి ఈ సినిమాతో విజయ్- సమంత ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
