Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*తెలంగాణ హెల్త్ హబ్‌గా.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగాయి
తెలంగాణ రాష్ట్రం హెల్త్‌ హబ్‌గా, హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా అభివృద్ది చెందాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో అది సాధ్యమైందని చెప్పారు. బంజారాహిల్స్‌లో ఆదివారం లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్‌ ఆసుపత్రిని దర్శకధీరుడు రాజమౌళితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారని, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని అన్నారు. 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకల్ని ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన.. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌లను గాంధీ, నిమ్స్‌లో ఏర్పాటు చేస్తున్నామని.. వచ్చే నెలలో గాంధీలో ప్రారంభం అవుతుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం దవాఖానాలు, కార్పొరేట్‌ ఆసుపత్రులతో పోటీపడుతున్నాయని మంత్రి హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. 2014లో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 30 శాతం ఉంటే.. గత నెలలో అవి 70 శాతానికి చేరుకున్నాయన్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌లోనూ తెలంగాణ దేశంలో నెంబర్ వన్‌గా ఉందన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. వంద శాతం ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఎనీమియా తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 14 నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించబోతున్నామని చెప్పారు. అనవసర సీ సెక్షన్లు తగ్గించడంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు తోడ్పాటు అందించాలని, వాటి వల్ల అనేక ఇబ్బందులుంటాయని అన్నారు. ఆసుపత్రిలో ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యసేవలు అందించాలని ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు. నాడు పేదలు రొట్టెలు తింటే, ధనికులు అన్నం తిన్నారని.. కానీ నేడు అది రివర్స్ అయ్యిందని పేర్కొన్నారు.

*ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష
తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే.. ఈ సందర్భంగా పరీక్ష రాసిన అభ్యర్థులు మాట్లాడుతూ.. గతంలో గ్రూప్ 1 పరీక్ష కంటే ఈసారి పేపర్ ఈజీగా వచ్చిందని ఆయన అన్నారు. ఔటాఫ్ సబ్జెక్ట్ ప్రశ్నలు రాలేదన్నారు. పరీక్ష హాల్లో కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఇన్విజిలేటర్ ఫోన్లను కూడా లోపలికి అనిమతించ లేదని అభ్యర్థులు తెలిపారు. ఇప్పుడు జరిగిన గ్రూప్ 1 లో ఎక్కువ మంది మంచి మార్కులు సాధించే అవకాశం ఉందని పరీక్ష రాసిన అభ్యర్థులు వెల్లడించారు. కాగా పేపర్ లీకేజీ నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈసారి ఆఫ్‌లైన్‌ పద్ధతిలో, ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత ఏడాది ఏప్రిల్‌ 26న నోటిఫికేషన్‌ జారీ చేశారు. అక్టోబర్‌ 16న గ్రూప్ 1 పరీక్ష జరిగింది. 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 2,85,916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్‌ పరీక్షలకు 25,050 మంది అభ్యర్థులను కమిషన్ ఎంపిక చేసింది. అభ్యర్థులు షూలు ధరించి రావొద్దని.. చెప్పులను ధరించే ఎగ్జామ్ సెంటర్లకు రావాలని అధికారులు సూచించారు. గోరింటాకు, టాటూలతో రావొవద్దని స్పష్టం చేసింది. వాచీలు కూడా అనుమతించమని కమిషన్ స్పష్టం చేసింది.

*యువతి దారుణ హత్య.. కళ్లను ఛిద్రం చేసి..
రోజురోజుకు హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎక్కడో చోట దారుణ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మొన్నటికి మొన్న ముంబైలో తన సహచరిని ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రెషర్ కుక్కర్ లో ఉడికించాడు. ఇలాంటి క్రూరమైన ఘటనలకు పాల్పడున్నారు దుర్మార్గులు. ఇప్పుడు తాజాగా వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పరిగి మండలం కాలాపూర్ లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. మృతురాలిని జుట్టు శిరీష(19)గా గుర్తించారు. శిరీష రెండ్రోజులుగా కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు తెలిపారు. హత్య చేసిన అనంతరం దుండగులు మృతదేహాన్ని నీటి కుంటలో పడేశారు. నీటి కుంటలో మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిరీష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అంతేకాకుండా శిరీషను చంపి కళ్లను స్క్రూ డ్రైవర్ తో ఛిద్రం చేశారు దుండగులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు శిరీష ఇంటర్ పూర్తిచేసుకుని పారామెడికల్ కళాశాలలో నూతనంగా చేరినట్లుగా బంధువులు చెబుతున్నారు.

*చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరంకు తీవ్ర నష్టం చేకూరింది..
పోలవరం విషయమై చంద్రబాబు ప్రభుత్వంలో తీవ్ర నష్టం చేకూరిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బ తినడం వల్ల రూ. 2,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని ఆయన విమర్శించారు. 2013-14 రేట్లతో పోలవరం పూర్తి చేస్తామని.. 2016లో చంద్రబాబు అంగీకరించి సంతకం చేశారని.. రూ. 1200 కోట్ల మేర నిధులు మినహా మొత్తం డబ్బులు తీసేసుకున్నారని ఆయన ఆరోపించారు. జగన్ కృషి వల్ల కేంద్రం మొదటి దశ పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధుల విడుదలకు కేంద్రం అంగీకరించిందని ఈ సందర్భంగా చెప్పారు. రూ. 12,911 కోట్లు మొదటి విడత ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని.. 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే 20,946 పీడీఎఫ్‌లు ఉన్నాయన్నారు. లైడర్ సర్వే ప్రకారం అదనంగా 16,640 పీడీఎఫ్‌లు పెరిగాయన్నారు. వీటి కోసం అదనంగా రూ. 5 వేల కోట్లు అవసరం అవుతాయని కేంద్రానికి పంపామని మంత్రి తెలిపారు. మంత్రులను చంద్రబాబు విమర్శిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం, చంద్రగిరిని చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కుప్పంను అభివృద్ధి చేయలేని చంద్రబాబుకు మమ్మల్ని విమర్శించే హక్కు ఉందా అంటూ మంత్రి ప్రశ్నించారు. పులివెందులను అభివృద్ధి చేసిన వైఎస్సార్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. మమ్మల్ని ఓ మాట అంటే వంద మాటలు అంటాం అని మంత్రి మండిపడ్డారు. పవన్ ఆరోపణలు చేస్తే బీజేపీ చేసినట్లేనని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బీజేపీ-జనసేన అలయెన్స్‌లో ఉన్నాయి కాబట్టి జనసేన చేసిన ఆరోపణలు బీజేపీ చేసినట్లేనన్నారు.

*మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో బీజేపీ నేతల కీలక భేటీ..
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , విజయశాంతి తదితరులు హాజరయ్యారు. గత కొంతకాలంగా టీ- బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పరాజయం తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీంతో పార్టీ బలోపేతంపైనే సమావేశం అయినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు ప్రచారంపై రాష్ట్రంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. మాజీ మంత్రులు ఈటల రాజేందర్ లేదా డికె అరుణకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించేందుకు బిజెపి పెద్దలు సిద్దమయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో వీరి భేటికి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు అధ్యక్ష మార్పు ప్రచారంపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. ఇతర పార్టీలు చేసే వదంతులను బిజెపి క్యాడర్ నమ్మవద్దని సూచించారు. ఏదయినా వుంటే బిజెపి పెద్దలే స్వయంగా ప్రకటిస్తారని అన్నారు. పార్టీ లైన్ లోనే వుంటూ బిజెపి బలోపేతానికి పనిచేస్తున్నానని… పార్టీ జాతీయాధ్యక్షుడి ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. తనను రాష్ట్ర అధ్యక్ష పదవినుండి తొలగించి కేంద్ర మంత్రిని చేస్తారంటూ ప్రచారం జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. బిజెపిని బలహీనపర్చేందుకు జరుగుతున్న కుట్రల్లో భాగమే ఈ ప్రచారమని అన్నారు. బిజెపి అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ముందుగానే లీకయ్యే అవకాశాలు వుండవని… గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన దాఖలాలు లేవన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా బిజెపి నుండి లీకులు లేవని సంజయ్ అన్నారు.

*ఈసారి మోడీ గెలిస్తే “నరేంద్ర పుతిన్” అవుతాడు.. సీఎం హెచ్చరిక..
కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆదివారం మహా ర్యాలీ నిర్వహించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్ ను అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు నిర్వహించిన మహార్యాలీలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై కేజ్రవాల్ విరుచుకుపడ్డాడు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ గెలిచి మళ్లీ మోడీ ప్రధాని అయిీతే అతను ‘‘నరేంద్ర పుతిన్’’ అవుతారని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పోలుస్తూ నియంతలా మారుతారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు మోడీని ‘రాజు’గా పరిణించడం మొదలుపెట్టారని ఆయన అన్నారు. 140 కోట్ల మంది భారతీయులు దేశాన్ని రక్షించాలని నిర్ణయించుకుంటేనే, దేశం రక్షించబడుతుందని మాన్ వ్యాఖ్యానించారు. గత నెలలో ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా.. సివిల్ సర్వెంట్ల నియామకం, బదిలీలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండాలంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పు తరువాత కేంద్రం బదిలీలు, నియామకాలపై కొత్తగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీంతో మరోసారి కేంద్రం, ఢిల్లీలోని ఆప్ సర్కార్ మధ్య ఘర్షణ మొదలైంది. ఆరు నెలల్లో ఆర్ఢినెన్సును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలి. అయితే ప్రస్తుతం లోక్ సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. రాజ్యసభలో ప్రతిపక్షాల బలం ఎక్కువగా ఉండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రతిపక్షాల సాయం కోరుతున్నారు. తాజాగా ఆదివారం ఆప్ ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ‘మహా ర్యాలీ’ నిర్వహించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ఆప్ నేత, మంత్రి గోపాల్ రాయ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ర్యాలీలో ప్రసంగించారు. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని పునరాలోచించాలని, ఢిల్లీ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆప్ పేర్కొంది.

*మళ్లీ పెరిగిన టోల్ ట్యాక్స్.. అమల్లోకి కొత్త ధరలు
హైవేపై ప్రయాణిస్తు్న్న వాహనదారులకు పెద్ద షాక్. టోల్ టాక్స్ నిబంధనలలో ఇప్పుడు కొన్ని మార్పులు చేయనున్నట్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో టోల్ టాక్స్ ఛార్జీలను పెంచవచ్చు. మొత్తం మీద మీరు టోల్ ద్వారా వెళితే, మీరు మునుపటి కంటే ఎక్కువ నగదును వదిలించుకోవాల్సిందే. ఢిల్లీ డెహ్రాడూన్ జాతీయ రహదారిపై మరోసారి టోల్ ట్యాక్స్ పెంచేందుకు సన్నాహాలు ప్రారంభించారు. గతంలో టోల్ ట్యాక్స్ మొత్తం 3 సార్లు పెంచారు. దీని తర్వాత మరోసారి జూలై 1 నుంచి టోల్ ట్యాక్స్ పెంచేందుకు టోల్ ప్లాజా సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేశారు. NHAI నుండి గ్రీన్ సిగ్నల్ పొందడానికి వేచి ఉంది. NH-58లో మీరట్‌లోని శివయ్య గ్రామ సమీపంలోని పశ్చిమ యూపీ టోల్ ప్లాజా వద్ద టోల్ టాక్స్ వసూలు కింద.. కార్లు, జీపులకు కనీసం రూ. 10, బస్సు-ట్రక్కులకు రూ. 15, మల్టీ-యాక్సిల్ వాహనాలకు రూ. 30వరకు పెంచే యోచనలో ఉంది. సమీప గ్రామాల ప్రజలపై ప్రస్తుతం ఉన్న స్థానిక పన్నును పెంచే యోచనలో ఉంది. ప్రస్తుతం రూ.5 ఉన్న లోకల్ ట్యాక్స్ రూ.25 నుంచి రూ.30కి పెంచేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. వెస్ట్రన్ టోల్ ప్లాజా నుంచి రోజుకు 30 నుంచి 35 వేల వాహనాలు బయల్దేరుతున్నాయి. వారాంతాల్లో ఈ సంఖ్య 40 వేలు లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతుంది. టోల్ ప్లాజాపై పన్ను పెంచే నిబంధన లేదని టోల్ యాజమాన్యం చెబుతోంది. జూలై 2022లో టోల్ ట్యాక్స్ కూడా పెంచబడింది. కార్, జీపు పన్ను 95 నుండి 110కి, బస్-ట్రక్కు 335 నుండి 385కి, మల్టీ-యాక్సిల్ వాహనంపై 585 నుండి 620 రూపాయలకు పెంచబడింది. స్థానిక పన్నును కూడా 20 నుంచి 25 రూపాయలకు పెంచారు. టోల్ కంపెనీతో సంబంధం ఉన్న వ్యక్తులను వివరణ కోరగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా టోల్ కూడా పెరిగిందని సమాధానం ఇచ్చారు.

*విశ్వంలో భారీ నక్షత్రం పేలుడు.. “సూపర్ నోవా”ను గుర్తించిన జపాన్ శాస్త్రవేత్తలు
ఈ విశ్వం ఎన్నో అద్భుతాలకు నెలువు. కొన్ని కోట్ల గెలాక్సీలు, అందులో కొన్ని వందల కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఇలా మన ఊహకు అందని విధంగా ఉంటుంది. అయితే ప్రతీ నక్షత్రానికి పుట్టుక, చావు అనేది ఉంటుంది. అయితే నక్షత్రాల చావు చాలా భయంకరంగా ఉంటుంది. ఎంతలా అంటే దాని విస్పోటనం కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకు కనిపిస్తుంటుంది. అంత విధ్వంసకర రీతిలో ఈ నక్షత్రాల మరణం ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ భారీ నక్ష్రత్రానికి సంబంధించిన విస్పోటనాన్ని జపాన్ శాస్త్రవేత్తల బృందం అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ సహాయంతో గుర్తించారు. నక్షత్రం పేలుడు తర్వాత సూపర్ నోవాను గుర్తించారు. 13,824 అడుగుల ఎత్తులో హవాయిలోని మౌనా కీపై ఉన్న భారీ, ఎనిమిది మీటర్ల (26 అడుగుల కంటే ఎక్కువ) వెడల్పు గల జెమినీ నార్త్ టెలిస్కోప్ ఈ అంతరిక్ష పేలుడును గమనించింది. ‘‘SN 2023ixf’’గా పిలువబడే సూపర్నోవాను మే 19న జపాన్ ఖగోళ శాస్త్రవేత్త కొయిచి ఇటగాకి కనుగొన్నారు. గత 5 ఏళ్లలో శాస్త్రవేత్తలు గుర్తించిన అత్యంత సమీపంలోని సూపర్ నోవా ఇదే. పిన్ వీల్ గెలాక్సీ(మెస్సియర్ 101) స్పైరల్ ఆర్మ్స్ లోని ఒక నక్షత్రం పేలి సూపర్ నోవాగా మారింది. 2011లో గమనించిన టైప్ 1 సూపర్ నోవా తర్వాత గత 15 సంవత్సరాలత్లో మెస్సియర్ 101లో సంభవించిన రెండవ సూపర్ నోవా ఇదే. పిన్‌వీల్ గెలాక్సీ భూమి నుండి సుమారు 21 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉర్సా మేజర్ రాశి దిశలో ఉంది. రాత్రి పూట కనిపించే అతి తక్కువ గెలాక్సీల్లో ఇది ఒకటి. ఈ గెలాక్సీ దాదాపుగా 1,70,000 కాంతి సంవత్సరాల వ్యాసంతో ఉంది. దాదాపుగా ఒక ట్రిలియన్ నక్షత్రాలు ఇందులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గత నెలలో ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చూసిన దాంట్లో అతిపెద్ద కాస్మిక్ పేలుడును గుర్తించారు. ఈ సంఘటన భూమకి 8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది. మూడేళ్ల పాటు ఇది కొనసాగింది. ఇది మనకు తెలిసిన సూపర్ నోవా కన్నా పది రెట్లు ప్రకాశవంతంగా ఉంది.

*12 గంటల్లో 2000 జంటలకు పెళ్లి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్..
రాజస్థాన్ రాష్ట్రంలో ఆసక్తికర సంఘటన జరిగింది. పెళ్లిళ్లలో రికార్డ్ క్రియేట్ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బారాన్ లో మే 26న జరిగిన సామూహిక వివాహాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించింది. 12 గంటల్లో ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకుని ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 2013లో 24 గంటల్లలో యెమెన్ దేశంలో 963 జంటలు అత్యధిక వివాహాలు చేసుకున్న రికార్డును బద్దలు కొట్టారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వెబ్ సైట్ ప్రకారం.. ఈ మెగా ఈవెంట్ లో హిందూ, ముస్లిం జంటలకు వివాహాలు జరిగాయి. శ్రీ మహావీర్ గోశాల కళ్యాణ్ సంస్థాన్ సమాజంలో అట్టడుగు వర్గాలకు ఇలా సామూహిక వివాహాలు చేస్తోంది. మే 26న. 2,413 జంటలు వివాహాలు ఒకే ప్రదేశంలో జరిగాయి. ప్రతీ ఒక్కరు కూడా ఆరు గంటలతోపు వివాహం చేసుకున్నారు. ముందుగానే వధూవరులు పూలదండలు మార్చుకుని పెళ్లి మండపానికి చేరుకున్నారు. ప్రతీ జంట వివాహాన్ని వారి మతానికి అనుగుణంగా పూజారుల చేత నిర్వహించారు. హిందూ పూజారులు గాయత్రీ పరివార్ నుండి వచ్చారు, అదే సమయంలో ముస్లిం క్వాజీలు సమీప ప్రాంతాల నుంచి వచ్చినట్లు వెబ్‌సైట్ వెల్లడించింది. వివాహ తతంగం ముగిసిన తర్వాత ప్రభుత్వ ప్రతినిధులు వధూవరులకు వివాహ ధృవీకరణ పత్రాలను అందించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కేబినెట్ మంత్రి ప్రమోద్ జైన్ భయా ప్రతి జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి జంటకు వధువు కోసం ఆభరణాలు, పరుపులు, వంటగది పాత్రలు, టెలివిజన్, రిఫ్రిజిరేటర్, కూలర్, ఇండక్షన్ కుక్కర్ వంటి గృహోపకరణాలు వంటి బహుమతులు కూడా అందించబడ్డాయి. వివాహానికి హాజరైన అతిథులకు, మిగతావారికి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వెబ్సైట్ పేర్కొంది.

*50 ఏళ్ళ వయస్సులో మూడోసారి తండ్రి అయిన ఇండియన్ మైకేల్ జాక్సన్..?
ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవాగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డ్యాన్స్ చేస్తే.. అస్సలు బాడీలో ఎముకలు ఉన్నాయా అన్న అనుమానం ఎవరికైన వస్తుంది. హీరోగా, డైరెక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న ప్రభుదేవా గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది. అదేంటంటే.. ప్రభుదేవా ముచ్చటగా మూడోసారి తండ్రి అయ్యినట్లు తెలుస్తోంది. ప్రభుదేవా మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు. ఆయన జీవితంలోకి నయన్ అడుగుపెట్టిన తరువాత ప్రభుదేవాకు.. ఆయన భార్యకు విబేధాలు తలెత్తడం.. వారు విడిపోవడం జరిగాయి. ఇక మొదటి భార్యతో విడిపోయాక కొన్నాళ్ళు సింగిల్ గా ఉన్న ప్రభు.. మూడేళ్ళ క్రితం పిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్ ను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ మధ్యనే ఈ రహస్య వివాహం బయటపడింది. ప్రభుదేవా పుట్టినరోజున ఆమె ఒక ఛానెల్ వీడియోలో భర్తకు బర్త్ డే విషెస్ తెలిపింది. ప్రభుదేవా దొరకడం తన అదృష్టమని చెప్పగా.. ఆయన కూడా తన భార్య తన తల్లిలా చూసుకొంటుందని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభుదేవా- హిమానీ సింగ్ కు ఆడపిల్ల జన్మించిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇక ఈ విషయాన్ని కూడా ప్రభుదేవా చాలా సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నట్లు సమాచారం. ఇక సుందరం మాస్టర్ ఇంటికి కొత్త అతిథి రావడంతో సంబురాలు అంబరాన్ని అంటినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభుదేవా వయస్సు 50.. హాఫ్ సెంచరీకి నీకు మంచి గిఫ్ట్ వచ్చింది అన్నా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ విషయమై ప్రభుదేవా ఎలా స్పందిస్తాడో చూడాలి.

*నయన్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన విగ్నేష్..
దక్షిణాది చిత్ర పరిశ్రమ లో లేడీ సూపర్ స్టార్ మంచి పేరు ప్రఖ్యాత లు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు .ఇక నయనతార విగ్నేష్ గత సంవత్సరం జూన్ నెల లో పెళ్లి చేసుకోగా అక్టోబర్ నెల లో వారు సరోగసి ద్వారా కవల మగ పిల్లల కు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తమ పెళ్లిరోజు సందర్భంగా మొదటిసారి వారిద్దరి పిల్లల ఫోటోల ను సోషల్ మీడియా వేదిక గా రివీల్ చేయడం జరిగింది.అంతే కాకుండా విగ్నేష్ నయనతార గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తూ తనుకు మొదటి పెళ్లిరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అయితే తన పెళ్లిరోజు సందర్భం గా నయనతార విగ్నేష్ తన స్నేహితుల తో కలిసి మాట్లాడుతూ ఒక గది లో కూర్చున్నారు. ఆ సమయంలో నే విగ్నేష్ తనకు ఒక సర్ప్రైజ్ ను ఇచ్చాడు.. అందరూ గది లో కూర్చుని మాట్లాడుతుండ గా ఒక వ్యక్తి అక్కడికి ఫ్లూట్ వాయిస్తూ అయితే వచ్చారు.. ఆయన ఎంతో అద్భుతంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండడం తో నయనతార అంతా మైమరిచిపోయి ఒక్కసారి గా కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తను హత్తుకొని కొన్ని క్షణాల పాటు అలాగే ఉండిపోయిందటా.. కొంత సమయానికి ఆ గది మొత్తం ఎంతో ఎమోషనల్ గా మారిపోయిందని తెలుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది.ఇక ఈ దంపతులు మొదటి పెళ్లిరోజు జరుపుకోవడం తో అభిమానులు సోషల్ మీడియా వేదిక గా ఈ జంట కు పెళ్లిరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. నయనతార ప్రస్తుతం కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని సమాచారం. తన పిల్లలను జాగ్రత్త గా చూసుకోవడాని కి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తాను తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉంది నయనతార.

Exit mobile version