Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*తెలంగాణలో మూగబోయిన మైకులు.. ప్రచారానికి తెర
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ప్రచారంలో దూసుకెళ్లిన అభ్యర్థుల మైకులు మూగబోయాయి. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలో వైన్స్ షాపులు కూడా మూతపడనున్నాయి. 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా.. తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతలు విసృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ దాదాపు 100కు పైగా సభల్లో ప్రసంగించారు. ఇదిలా ఉంటే.. నవంబర్ 30న జరిగే పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తం 119నియోజకవర్గాలకు గానూ ఎన్నికల బరిలో 2,290 మంది ఉన్నారు. వారిలో 221మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ సందర్బంగా భద్రతా విధుల్లో 45వేల మంది తెలంగాణ పోలీసులు ఉండనున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందే రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేది సాయంత్రం 5 గంటల వరకు సైలెంట్‌ పీరియడ్‌లో టీవీ, సోషల్‌ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదు. పత్రికల్లో వేసే ప్రకటనలకు మోడల్‌ కోడ్‌ మీడియా కమిటీ ముందస్తు అనుమతి ఉండాలి. వేరే నియోజకవర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్లు స్థానికంగా ఉండకూడదని, లాడ్జ్‌లు, గెస్ట్‌ హౌస్‌లు, హోటల్‌లో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29, 30 తేదీల్లో రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, పత్రికా గోష్ఠులు నిర్వహించరాదని, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపకూడదని స్పష్టం చేశారు. తెలంగాణలో మొత్తం 3కోట్ల 26లక్షల 2799 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1కోటి 62లక్షల 98వేల 418ఓట్లు.. మహిళలు 1కోటి 63లక్షల 1705 ఓట్లు ఉన్నాయి. అంతేకాకుండా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2676 ట్రాన్స్ జెండర్ ఓట్లు ఉన్నాయి. కొత్తగా యువ ఓటర్లు (18-19) 9లక్షల 99వేల 667 మంది ఉన్నారు. అందులో అబ్బాయిలు.. 570274, అమ్మాయిలు.. 429273, ట్రాన్స్ జెండర్స్ 120 మంది, సీనియర్ సిటిజన్ ఓటర్లు( 80ఏళ్ల పైబడి) 440371 మంది ఉన్నారు. NRI ఓటర్లు 2933, దివ్యాంగులు 5లక్షల 6వేల 921 మంది ఉన్నారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఈసీ గుర్తించింది.

*గంట ముందే ఆ నియోజకవర్గాల్లో మైకులు బంద్
నెలరోజులుగా హోరెత్తించిన ప్రచారం పలు నియోజకవర్గాల్లో ముగిసింది. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ముగియనుండగా.. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 4 గంటలకే ప్రచారం ముగించారు. అందులో.. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 4 గంటలకు ప్రచారం ముగిసినట్లుగా ఎన్నికల కమిషన్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో విజయానికి సహకరించాలని రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను వేడుకున్నారు. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 2298 మంది పోటీ చేసి తమ శక్తియుక్తులను వినియోగించి ప్రజల మద్దతును కోరారు. కాగా.. నవంబర్ 30న జరిగే పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తం 119నియోజకవర్గాలకు గానూ ఎన్నికల బరిలో 2,290 మంది ఉన్నారు. వారిలో 221మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ సందర్బంగా భద్రతా విధుల్లో 45వేల మంది తెలంగాణ పోలీసులు ఉండనున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందే రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచించింది.

 

*కాలుష్యరహిత విద్యుత్‌ రాష్ట్రానికి మేలు చేస్తుంది: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, పలు ప్రాజెక్టుల పనులకు వర్చువల్‌ పద్ధతిలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా సుమారు రూ.6600 కోట్ల విలువైన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో హెచ్‌పీసీఎల్‌తో రూ.10వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై అవగాహనా ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 14 జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. 28 సబ్‌ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించామని, కొన్నింటి పనులు ప్రారంభిస్తామన్నారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్‌స్టేషన్లే లేకపోవడంవల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారని పేర్కొన్నారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు. 12 సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తున్నాం, 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ట్రాన్స్‌మిషన్‌ కెపాసిటీని విస్తరించుకుంటూ, నాణ్యమైన విద్యుత్‌ ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్‌ చేస్తున్నామన్నారు. రైతులకు 9 గంటలపాటు పగటిపూటే ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టామన్నారు. రూ.1700 కోట్ల తో ఫీడర్లను ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నామని తెలిపారు. ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి రూ.2.4లకే యూనిట్‌ ధరతో సెకీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. మరో 25 సంవత్సరాలపాటు రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని.. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు. ఇప్పుడు సగటున రూ.2.4కే యూనిట్‌ ధర వచ్చే పరిస్థితుల్లోకి అడుగులు వేస్తున్నామన్నారు. దాదాపు రూ.3099 కోట్లతో సబ్‌స్టేషన్ల కోసం ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించామని, మరి కొన్నింటి పనులు ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. రూ. 3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్‌ పవర్‌కు శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు. రూ. 6500 కోట్ల పెట్టుబడి పెడుతున్నామని వెల్లడించారు. అవేరా స్కూటర్స్‌ తయారీ సంస్థకు శ్రీకారం చుడుతున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించింది. లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుందన్నారు. తాజా పెట్టుబడి వల్ల అదనపు ఉద్యోగాలు వస్తాయన్నారు. 28 సబ్‌ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. 850 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు వల్ల 1700 ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. హెచ్‌పీసీఎల్‌తో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం పెడుతున్నామన్నారు. సోలార్‌,విండ్‌, పీఎస్పీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులను వీరు పెడుతున్నారని.. దాదాపుగా 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కాలుష్యరహిత విద్యుత్‌ రాష్ట్రానికి మేలు చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

 

*”బట్టలు సిద్ధం చేసుకోండి”.. కార్మికుల కుటుంబాలకు ఆదేశాలు.. ఏ క్షణాన్నైనా బయటకు..
ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో 41 మంది కార్మికులు బయటకు రాబోతున్నారు. కొన్ని మీటర్ల దూరంలోనే కార్మికులు ఉన్నారని రెస్క్యూ సిబ్బంది వెల్లడించింది. 17 రోజులుగా తమ వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల బంధువులు వారి బట్టలు, బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. మరోవైపు 41 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును కార్మికుల కోసం ఏర్పాటు చేశారు. బయటకు వచ్చిన వెంటనే వారిని ఉత్తరాకాశీలోని ఆస్పత్రికి తరలించనున్నారు. మరోవైపు కార్మికులు ఏ క్షణాన్నైనా బయటకు వచ్చే అవకాశం ఉండటంతో టన్నెల్ బయట 41 అంబులెన్సులను సిద్ధం చేశారు. దాదాపుగా 16 రోజులుగా కార్మికులు ఇందులో చిక్కుకుపోయారు. వీరి కోసం వారి కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అమెరికా నుంచి తీసుకువచ్చిన ఆగర్ మిషన్ చెడిపోవడంతో, రెస్క్యూ కోసం ఇండియన్ ఆర్మీకి పిలుపు వెళ్లింది. మాన్యువల్ డిల్లింగ్ ద్వారా ‘‘ ర్యాట్ మైనర్స్’ ఉపయోగించి టన్నెల్ లోకి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బొగ్గును వెలికితీసే పురాతన పద్దతి ద్వారా కొండలోకి మార్గాన్ని ఏర్పాటు చేసి కార్మికులను బయటకు తీసుకురాబోతున్నారు. కార్మికులను చేరుకోవడానికి దాదాపుగా 3 మీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది.

*సౌత్ ఆఫ్రికా గనిలో ప్రమాదం.. ఎలివేటర్ కూలి 11 మంది మృతి
దక్షిణాఫ్రికా ప్లాటినం గనిలో భారీ ప్రమాదం జరిగింది. గనిలోకి కార్మికులను తీసుకెళ్తున్న ఎలివేటర్ ఒక్కసారి కూలిపోయింది. దీంతో కార్మికులు ఒక్కసారిగా 200 మీటర్లు కిందకి పడిపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా.. 75 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు మంగళవారం తెలిపారు. దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న రస్టెన్‌బర్గ్ నగరంలోని గనిలో కార్మికులు విధులు ముగించుకుని బయటకు వస్తున్న క్రమంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన 75 మంది కార్మికులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంపాల ప్లాటిన్ హోల్డింగ్స్(ఇంప్లాట్స్)సీఈఓ నికోముల్లర్ ప్రకటన చేశారు. ఇది ఇంప్లాట్స్ చరిత్రలో చీకటి రోజని, ఎలివేటర్ పడిపోవడానికి కారణాలపై దర్యాప్తు చేయాల్సి ఉందని, మంగళవారం నుంచి గని కార్యకలాలపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారిలో కొంతమందిలో తీవ్రమైన ఫ్రాక్చర్లు ఉన్నాయని ఇంప్లాంట్స్ ప్రతినిధి జోహాన్ థెరాన్ తెలిపారు. ఎలివేటర్ షాఫ్ట్ నుంచి సుమారు 200 మీటర్ల దిగువకు పడిపోయిందని, ఇది అసాధారణమైన ప్రమాదమని అతను చెప్పారు. దక్షిణాఫ్రికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాటిన్ ఉత్పత్తిదారు. 2022లో దేశంలో జరిగిన అన్ని మైనింగ్ ప్రమాదాల కారణంగా 49 మంది మరణించారు. అంతకుముందు ఏడాది 74 జరిగాయి. దక్షిణాఫ్రికా గణాంకాల ప్రకారం దక్షిణాఫ్రికా ప్రమాదాల వల్ల 2000లో దాదాపుగా 300 మంది మరణించారు. గత రెండు దశాబ్ధాలుగా ప్రమాదాలు క్రమంగా తగ్గాయి.

*పాక్ ఆర్టిస్టులను భారత్‌లో బ్యాన్ చేయాలి.. “సంకుచిత మనస్తత్వం” వద్దన్న సుప్రీంకోర్టు..
పాకిస్తాన్‌కి చెందిన ఆర్టిస్టులను భారతదేశంలో ప్రదర్శనలు ఇవ్వడంపై, వారు ఇక్కడ పనిచేయడంపై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. పిటిషనర్ ‘‘అంత సంకుచిత మనస్తత్వం’’ కలిగి ఉండవద్దని కోరింది. ఈ పిటిషన్‌ని అత్యున్నత కోర్టు కొట్టేసింది. సినీ వర్కర్, ఆర్టిస్ట్ అని చెప్పుకునే ఫైజ్ అన్వర్ ఖురేషీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టివేసిన బాంబే హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టీలతో కూడిన సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ‘‘మీరు ఈ అప్పీల్‌పై ఒత్తిడి చేయవద్దు. అంత సంకుచిత భావంతో ఉండకండి’’ అని ధర్మాసనం పేర్కొంది. గతంలో పిటిషన్‌పై బాంబే హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా బహిష్కరించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. భారతీయ పౌరులు, కంపెనీలు, సంస్థలు, సంఘాలు పాకిస్తాన్ ఆర్టిస్టులతో సంబంధాలు పెట్టుకోకుండా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇంతకుముందు విచారించిన బాంబే హైకోర్టు, సాంస్కృతిక సామరస్యం, ఐక్యత, శాంతిని పెంపొందించడంలో పిటిషనర్ పిటిషన్ తిరోగమన దశ అని, అందులో ఎలాంటి మెరిట్ లేదని పేర్కొంటూ కొట్టేసింది. దేశ భక్తుడిగా ఉండాలంటే విదేశాలను ముఖ్యంగా పొరుగు దేశాలకు చెందిన వారిపై శత్రుత్వం చూపాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. నిజమైన దేశ భక్తుడు నిస్వార్థపరుడు, తన దేశం కోసం అంకితభావంతో ఉన్న వ్యక్తి ఇలాంటివి చేయడని, మంచి హృదయం ఉన్న వ్యక్తి తన దేశంలోని ఏదైనా పనిని స్వాగతిస్తాడని, ఇది దేశంలో, సరిహద్దులో శాంతి, సామరస్యం, ప్రశాంతతను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. కళలు, సంగీతం, క్రీడలు, సంస్కృతి, నృత్యం మొదలైన కార్యకలాపాలు జాతీయతలు, సంస్కృతులు దేశాల మధ్య శాంతి, ఐక్యత, ప్రశాంతతను కలిగిస్తాయని బాంబే హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. క్రికెట్ ప్రపంచకప్ లో పాకిస్తాన్ పాల్గొందన్న విషయాన్ని గుర్తు చేసింది.

*చైనాకు కొత్త ముప్పు.. హెచ్చరికలు జారీ
చైనాలో పరిస్థితి మరింత దిగజారుతోంది. రోజూ 7 వేల మంది చిన్నారులు ఊపిరితిత్తుల వ్యాధితో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. చైనా ఈ వ్యాధిని రహస్యమైన న్యుమోనియాగా అభివర్ణించింది. ఇది సంక్రమణ ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి కరోనా మాదిరిగానే అంటువ్యాధి అని.. ఒక నగరం నుండి మరొక నగరానికి విస్తరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వేగంగా క్షీణిస్తున్న పరిస్థితుల మధ్య చైనా చేసిన ప్రకటన దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. న్యుమోనియా పెరుగుదల సంకేతాలు తక్కువగా ఉన్నప్పటికీ, జనాభాలో ఎక్కువ భాగం శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతుందని చైనా చెబుతోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, బీజింగ్‌లోని ఆరోగ్య అధికారులు ఫ్లూ, అడెనోవైరస్, శ్వాసకోశ వైరస్‌లు న్యుమోనియా కేసులను అధిగమించాయని చెప్పారు. పరిస్థితిని మరింత దిగజార్చడానికి రెండు కారణాలు వెల్లడించింది.. అవేంటో చూద్దాం.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చైనా చేసిన హెచ్చరికకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది పారిశ్రామిక పరిశ్రమల కారణంగా పెరుగుతున్న కాలుష్యం, చలికాలంతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్రీన్‌హౌస్ వాయువులు, పాదరసం స్థాయిలను పెంచడంలో చైనా ప్రపంచంలోనే ముందంజలో ఉందని యుఎస్ ఎంబసీ నివేదిక పేర్కొంది. ఇది చైనా ప్రజలను ప్రమాదంలోకి నెట్టడమే కాకుండా ప్రపంచ ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోంది. ఈ కాలుష్యం శ్వాసకోశ రోగుల పరిస్థితిని మరింత తీవ్రంగా మారుస్తోంది. చైనాలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ శీతాకాలంలో కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతుంది. దాంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. పరిశోధన నివేదికలోని గణాంకాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ డేటాబేస్, సియాటెల్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ నుండి వచ్చిన డేటా కాలుష్యం కారణంగా మరణాల విషయంలో చైనా ముందంజలో ఉందని చూపిస్తుంది. దీని వల్ల చైనాలో ఏటా 22 లక్షల మంది చనిపోతున్నారు.
ఇది రెండో కారణం
ఊపిరితిత్తుల వ్యాధి పెరగడానికి పొగాకు మరొక కారణం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చైనాలో ధూమపానం నిషేధించబడింది. ఎలాంటి ధూమపానం చేయలేని 28 ప్రదేశాలను ప్రభుత్వం గుర్తించింది. ఇదిలావుండగా, చైనాలో 30 కోట్ల మంది ధూమపానం చేస్తున్నారు. పొగాకును అత్యధికంగా ఉపయోగించడం, ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే చైనా అగ్రగామిగా ఉన్నందున ఈ సంఖ్య స్వయంగా ఒక రికార్డు. చైనాలో ప్రతి సంవత్సరం 2.4 ట్రిలియన్ సిగరెట్లు అమ్ముడవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రపంచంలోని మొత్తం సిగరెట్లలో 46 శాతం. అంటే చైనా ప్రజలు ఎంతమేరకు పొగను పీల్చుకుంటున్నారో డేటా నుండి అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం చైనా ప్రభుత్వానికి కూడా తెలుసు. దీంతో పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

*విషాదం.. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి
కోలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రముఖ డైరెక్టర్‌ మరి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మారిముత్తు గతరాత్రి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఎప్పటిలానే ఇంటివద్ద.. గతరాత్రి భోజనం చేసి.. సిగరెట్ తాగడం అలవాటు అయిన మారిముత్తు.. బయటకు వచ్చి సిగరెట్ తాగిన కొద్దిసేపటికె దగ్గు రావడం, ఆపై ఊపిరి ఆడకుండపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మారిముత్తు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పరియేరుం పెరుమళ, కర్ణన్, మమన్నన్ లాంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు మారిముత్తు. అతని వయస్సు 30.. చిన్నతనం నుంచి మారిముత్తు సినిమాల మీద కోరికతో.. ఇండస్ట్రీకి వచ్చాడు. ఇక అలా మారి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్ గా చేరాడు. మారి సెల్వరాజ్ తన సినిమాలను ఎలా మలుస్తాడో అందరికీ తెల్సిందే. ఇక అతనికి చేదోడు వాదోడుగా మారిముత్తు ఉండేవాడు. ఆలా అతను అసిస్టెంట్ గా చేసిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక దీంతో ఈ మధ్యనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఒక కథను కూడా సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతను మృత్యువాత పడడం విషాదకరమని ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.. ఇక ఈ మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని వేరే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న మారిముత్తు ఇలా అర్దాంతరంగా మృతిచెందడం.. వారి కుటుంబానికి తీరని లోటు అని పలువురు ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.

 

*సిరీస్ మ‌ధ్య‌లోనే స్వ‌దేశానికి ఆరుగురు ఆస్ట్రేలియా ప్లేయర్స్!
భార‌త్‌తో జ‌రుగుతున్న‌ ఐదు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా వ‌రుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. నేడు మూడో టీ20 జరగనుంది. ఈ సిరీస్ డిసైడ‌ర్ మ్యాచుకు ఇద్ద‌రు స్టార్ ఆట‌గాళ్లు దూరం కానున్నారు. స్టీవ్ స్మిత్, ఆడం జంపాలు నేడు స్వ‌దేశానికి వెళుతున్న నేపథ్యంలో మూడో టీ20 ఆడడం లేదు. మంగళవారం గౌహతిలో జరిగే మూడో టీ20 తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్ మరియు సీన్ అబాట్ బుధవారం స్వదేశానికి బయలుదేరనున్నారు. రెండు నెలలకు పైగా భారత్‌లో ఉన్న ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. దాంతో ప్రపంచకప్ 2023 గెలిచిన జట్టు సభ్యులలో ఆరుగురికి విశ్రాంతిని ఇచ్చింది. చివరి రెండు టీ20ల‌కు ఆస్ట్రేలియా క్రికెట్ తన స్క్వాడ్‌ను ప్ర‌క‌టించింది. ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్ మాత్రమే టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు. చివరి రెండు టీ20ల‌కు ఆసీస్ యువకులతో బరిలోకి దిగనుంది. ఇప్ప‌టికే రెండు మ్యాచుల్లో నెగ్గి 2-0 ఆధిక్యంలో ఉన్న‌ భారత్ సిరీస్‌పై కన్నేసింది. గువాహ‌టిలోని బ‌ర్స‌ప‌ర స్టేడియంలో నేటి రాత్రి 7 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాల్సి ఉంది. మూడో టీ20కి వర్షం ముప్పు లేదు కానీ మంచు ప్రభావం ఉండే అవకాశముంది.
ఆస్ట్రేలియా జట్టు:
మాథ్యూ వేడ్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, బెహ్ర‌న్‌డార్ఫ్, త‌న్వీర్ సంగా, కేన్ రిచ‌ర్డ్‌స‌న్, బెన్ డ్వార్‌షుస్, నాథ్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, అరోన్ హ‌ర్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్పే.

 

Exit mobile version