Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*పూర్తిగా తెగిపోయిన వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ
వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలతో హంటర్‌ రోడ్‌ నీట మునిగింది. దీంతో నయూంనగర్, శివనగర్ లకు చెందిన వరద బాధితులు బిల్డింగ్‌లపై తలదాచుకుంటున్నారు. హంటర్‌ రోడ్డుకు ఎస్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. తమకు సాయం చేయాలని బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దీంతో పూర్తిగా వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ తెగిపోయింది. ఇప్పటికే వరదనీటిలో వాహనాలు కొట్టుకుపోయాయి. వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సంతో కాజీపేట రైల్వే స్టేషన్, వరంగల్ బట్టల బజార్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. హనుమకొండ-వరంగల్ రహదారి బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నీరు భారీగా నిలిచింది. వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధమవ్వగా, పంతిని వద్ద ఊర చెరువు ఉప్పొంగడంతో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. మైలారం దగ్గర భారీ చెట్టు కూలి అధిక సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. మరో రెండు రోజులు జిల్లా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో.. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. అయితే, ఇప్పటికే కాజీపేట రైల్వే స్టేషన్ పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో కనెక్టవిటీ తెగిపోయింది. వరంగల్ నుంచి వచ్చే వరదతో హంటర్ రోడ్డులో పూర్తిగా నిలిచిపోయిందని బాధితులు పేర్కొంటున్నారు. గత రాత్రి నుంచి వరద నీటిలోనే ఉన్నట్లు బాధితులు తెలియజేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌(జంక్షన్‌)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రైల్లే పట్టాలపై నీరు చేరడంతో రైలు ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో, హసన్‌పర్తి-కాజీపేట రూట్‌లో మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 9 రైళ్లను ఇప్పటికే దారి మళ్లించారు.

 

*రంగంలోకి మంత్రి కేటీఆర్
మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద మూసి నదిని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో వరద పరిస్థితిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సహాయక చర్యలుచేపట్టాలని మంత్రి సూచించారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, సహాయక చర్యలు చేపట్టలని ఆదేశించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బంది తలెత్తకూడదని తెలిపారు. అత్యవసర సహాయం కోసం అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. మూసీనదికి ఎక్కువ మోతాదులో నీరు చేరాయని మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద నీరు ఏరులై పారుతుందని కానీ.. ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎటువంటి సహాయక చర్యలకు అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాన్ని లెక్క చేయకుండా మూసారం బాగ్ బ్రిడ్జి పరివాహన ప్రాంత ప్రజలను స్వయంగా మంత్రి కేటీఆర్ కలిసి ధైర్యం చెప్పారు. హైదరాబాద్‌లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. వర్షాకాలం రాకముందే కాల్వలు పూడికతో నిండిపోయాయని అన్నారు. చెరువుల్లో నీటి మట్టం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. నగరంలో ఎస్‌ఆర్‌డిపి అమలుకు ముందు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విపక్షాలు వీలైతే సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వర్షాలపై రాజకీయం చేయడం సరికాదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 14 వంతెనలు మంజూరయ్యాయని కేటీఆర్ తెలిపారు.

 

*మున్నేరు వరదల్లో చిక్కుకున్న కుటుంబం
ఖమ్మం జిల్లాలో మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. మున్నేరు వరద ఉధృతి, సహాయక చర్యలపై మంత్రి పువ్వాడని అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. వరద ప్రవాహంలో ఓ ఇంట్లో చిక్కుకున్న ఏడుగురినీ రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని హుటాహుటిన ఖమ్మం తరలించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో భద్రాచలం నుంచి ఖమ్మంకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెళ్లారు. మున్నేరు ప్రవాహంలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసినట్లు మంత్రి పువ్వాడ చెప్పాడు. విశాఖ నుంచి భద్రాచలం వస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మార్గమధ్యంలో ఖమ్మం మళ్లించాలని కేసీఆర్ తెలిపారు. ప్రత్యేక డ్రోన్ పంపించి ఇంట్లో చిక్కుకున్న ఏడుగురి పరిస్థితినీ ఆరా తీస్తున్నట్లు ఖమ్మం జిల్లా అధికారులు వెల్లడించారు. అయితే, ఖమ్మం నగరంలోని పద్మావతి నగర్ లో ధ్యాన మందిరంలో ఉన్న ఏడుగురు నీ కాపాడేందుకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. వరద ఉదృతితో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సహాయక చర్యలను మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ ప్రియాంక పర్యవేక్షిస్తున్నారు. మున్నేరు వరదల్లో చిక్కిన శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన మందిరంలోనీ ఏడుగురు పేర్లు.. 1.లక్ష్మీనారాయణ(55), 2.లక్ష్మీ(50) , 3.యశ్వంత్(26), 4.అరవింద్(34), 5.విఘ్నేష్(2), 6. ప్రవల్లిక(27), 7.కావ్య(26)గా గుర్తించారు. ఈ ఏడుగురు బాధితులను అధికారులు సురక్షితంగా రక్షించారు.

 

*వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టు మరోసారి షాక్
ఎన్నికల వివాదాల కేసులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లు హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. అయితే, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మరో 28 ఎన్నికల పిటిషన్లపై హైకోర్టులో విచారణ వేగంగా జరుగుతుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా శాసనసభ్యుడిగా తన ఎన్నిక చెల్లదన్న తీర్పుపై స్టే ఇవ్వాలని వనమా వెంకటేశ్వర్ రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. వనమా విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు మధ్యంతర తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది. 2018 ఎన్నికల్లో అఫిడవిట్ లో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు నివేదిక సమర్పించారని హైకోర్టును సమీప అభ్యర్ధి జలగం వెంకటరావు ఆశ్రయించారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా ఎన్నికను రద్దు చేస్తూ ఈనెల 25వ తేదీన హైకోర్టు తీర్పునిచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా హైకోర్టు ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ నిన్న (బుధవారం) వనమా వెంకటేశ్వరరావు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ధర్మాసనం వనమా విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే, కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకటరావును అసెంబ్లీ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

 

*బిగ్‌బాస్‌ షోను సెన్సార్ చేయకపోతే ఎలా?.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
బిగ్‌బాస్‌ రియాల్టీ షోపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమం ప్రసారానికి ముందు సెన్సార్‌షిప్‌ చేయకపోతే ఎలా అంటూ నిర్వాహకుల్ని ప్రశ్నించింది. అలాగే ఈ షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అందే ఫిర్యాదులను పరిశీలించడం పోస్టుమార్టంతో పోల్చింది. ఇప్పుడు ఈ షో ప్రసారం కావడం లేదన్న కారణంతో కోర్టు కళ్లు మూసుకుని ఉండలేమని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవ­హారంపై లోతుగా విచారణ జరుపు­తామని, కేంద్రానికి తగిన సచనలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. టీవీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఓ యంత్రాంగం లేకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. బిగ్‌బాస్‌ షో అశ్లీలతను ప్రోత్సహించేదిగా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన రెండు పిల్స్‌పై హైకోర్టులో జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసా­దరావు, జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. సెన్సార్‌ లేకుండా షోను ప్రసారం చేస్తున్నారని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఈ షోను రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 లోపు ప్రసారం చేయాలని కోరారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ షో ప్రసారం కావడం లేదని ప్రతివాది తరఫు లాయర్ వాదించారు. ఈ పిల్స్‌పై విచారణ సరికాదని.. ఇకముందు ప్రసారం కాబోయే కార్యక్రమంపై అభ్యంతరం ఉంటే తాజాగా పిల్‌ వేయడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. బిగ్‌బాస్‌ షో ప్రసారానికి ముందు సెన్సార్‌షిప్‌ విధానం లేదనిస్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెట్‌ మాటీవీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రసారం అయ్యాక అభ్యంతరం ఉంటే ఫిర్యాదు చేయవచ్చని.. కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ చట్టం ప్రకారం ఫిర్యాదులను పరిశీలించేందుకు వ్యవస్థ ఉందన్నారు. ప్రసారానికి ముందే సెన్సార్‌షిప్‌ చేయాలనుకుంటే కేంద్రం చట్టం చేయాల్సి ఉంటుందని కోర్టు ముందు ప్రస్తావించారు. బిగ్‌బాస్‌ లాంటి షో నచ్చకపోతే టీవీ ఛానల్‌ మార్చుకోవచ్చని.. భావవ్యక్తీకరణ హక్కును నిరాకరించడానికి వీల్లేదని, అందువల్ల కోర్టు జోక్యం చేసుకునే పరిధి తక్కువ అన్నారు.

 

*పవన్‌ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు విష పుత్రుడు
ఏపీలో మహిళల మిస్సింగ్‌లపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్లకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రకటన చేశారని.. దానిపై పవన్ వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు. భారీ స్థాయిలో మహిళల అదృశ్యమయ్యారన్న ఆయన.. మహిళల అదృశ్యంలో ఏపీ దేశంలో 11వ స్థానంలో ఉందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించటం లేదని ఆమె ప్రశ్నించారు. రాజ్యసభ ఎందుకు ఏపీలో మహిళల అదృశ్యంపైనే ఎందుకు ఎక్కువ ఆందోళన చెందుతోందన్నారు. ఏపీనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆమె పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్లనే ఏపీలో మహిళల అదృశ్యం అంటున్న పవన్.. ప్రేమ వ్యవహారాల వల్లనే చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారని తెలుసుకోవాలన్నారు. ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం కాదా అంటూ ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ దత్తపుత్రుడే కాదు విష పుత్రుడు అంటూ మండిపడ్డారు. తప్పిపోయిన వారిలో 70 శాతం వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించాలని అనుకోవటం లేదని ప్రశ్నించారు. “ఒక క్రిమినల్ కహానీ అల్లి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కళ్యాణ్ కుట్ర. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమా హీరోలు ఏం చెప్పినా చెల్లుతుందా??. మాకు చాలా విషయాలు ప్రశ్నించాలని ఉంది. కనిపిస్తే, ఎదురుపడితే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది. సభ్యత ఉంది కనుకే నోటీసులు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఆరవ స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పరు. పవన్ కళ్యాణ్ మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి. మహిళా కమిషన్ అంటే పవన్ కళ్యాణ్‌కు చులకన భావం. వాలంటీర్ల వల్లే మహిళలు అదృశ్యం అవుతున్నారు అన్న పవన్ కళ్యాణ్ ఆధారాలు బయటపెట్టాలి. రికవరీ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. భరణం ఇచ్చి వదిలించుకుంటాం అంటే ఏ ఒక్క మహిళ అయినా అంగీకరిస్తుందా?. వాలంటీర్ల క్యారెక్టర్‌పై మాట్లాడుతున్నారు కనుక మేం కూడా ప్రశ్నిస్తున్నాం. మహిళల అభివృద్ధి, సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి, మాకు ఎంతో చిత్తశుద్ధి ఉంది.” అని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

 

*స్కూల్లో నగ్నంగా పడుకున్న హెడ్‌మాస్టర్
హెడ్మాస్టర్ అంటే స్కూల్లో ఉన్న టీచర్స్, పిల్లలు అందరికి హెడ్ అని అర్థం.. స్కూల్లో ఎవరు తప్పు చేసిన కూడా తాను ఒక భాధ్యత తీసుకొని దాన్ని మూలాలతో సహా సరి చెయ్యాలి.. అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు బాధ్యత తప్పి వ్యవహరించాడు. స్కూల్ కి తప్పతాగి, ఒంటిమీద సోయి లేకుండా వచ్చాడు. ఆ తరువాత తరగతి గదిలోనే.. మద్యం మత్తులో.. ఒంటిపై ఏ మాత్రం సోయి, తెలివి లేకుండా నగ్నంగా నిద్రపోయాడు.. ఈ ఘటన తో ప్రజలంతా ఉలిక్కి పడ్డారు.. అతన్ని చూసిన మిగిలిన వారంతా కూడా షాక్ అవ్వడంతో పాటు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలపడంతో.. ఆ హెడ్మాస్టర్ ని సస్పెండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని బహ్రెచ్ జిల్లాలోని శివపూర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ స్కూల్లో హెడ్మాస్టర్ గా దుర్గాప్రసాద్ జైస్వాల్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి మద్యం తాగే అలవాటుంది.. గత కొద్ది రోజుల క్రితం కూడా అతను మద్యం సేవించి స్కూల్ కు వచ్చినట్లు తోటి టీచర్స్ చెబుతున్నారు.. ఆ సమయంలో స్కూల్లో తరగతి గదుల్లో టీచర్లు పాఠాలు చెబుతున్నారు. ఓ తరగతి గదిలోకి వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల ముందే దుస్తులన్నీ విప్పేశాడు. అక్కడే నగ్నంగా నిద్రపోయాడు. ఇది విద్యార్థులు తల్లిదండ్రులకు తెలపడంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు.. అతన్ని వీడియో తీశారు… ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. వెంటనే వారు ప్రధానోపాధ్యాయుడుపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారు. హెడ్మాస్టర్ ప్రవర్తన మీద విద్యార్థులు తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. అతను ఇలా చేయడం మొదటిసారి కాదని తరచుగా ఇలాగే చేస్తున్నాడని ఆరోపించారు. ప్రధానోపాధ్యాయుడి ఈ చేష్టలతో విసిగిపోయిన కొంతమంది అమ్మాయిలు స్కూలుకు వెళ్లడం మానేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి అతని ఉద్యోగం పోయిందని తెలుస్తుంది.

 

*మొబైల్ ఫోన్ మోజులో.. ధబేల్‌మని జారిపడ్డ ప్రధాని
కేవలం వాహనాలు నడుపుతున్నప్పుడే కాదు, మనం నడుస్తున్నప్పుడు కూడా మొబైల్ ఫోన్లను పక్కన పెట్టడం శ్రేయస్కరం. ఒకవేళ మొబైల్ ఫోన్ మోజులో పడి నడుచుకుంటూ వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగొచ్చు. గతంలో కొన్ని యాక్సిడెంట్‌లో చోటు చేసుకోవడం, జనాలు గోతిలో పడటం వంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు సాక్షాత్తూ ఫిజీ ప్రధానమంత్రి సితివేణి రబుకా సైతం ఈ మొబైల్ ఫోన్ మోజులో పడి, మెట్ల మీద నుంచి జారిపడ్డారు. సెల్‌ఫోన్ చూస్తూ నడిచిన ఆయన మెట్లు దిగడాన్ని గమనించలేదు. దీంతో జారి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు దెబ్బతగిలింది. దీంతో.. తన చైనా పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఫిజీలోని చైనా రాయబార కార్యాలయంతో పాటు స్వయంగా ప్రధాని రబుకా వెల్లడించారు. తనకు ఎదురైన ఈ ఘటనపై ప్రధాని రబుకా ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన ఫోన్ చూస్తుండగా జారిపడ్డానని, ఫలితంగా తలకు గాయమైందని, దీంతో చైనా పర్యటనని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ‘‘బుధవారం ఉదయం ప్రభుత్వానికి చెందిన కొత్త బిల్డింగ్‌ ప్రవేశ ద్వారం వద్ద నేను మొబైల్‌ చూస్తూ పొరపాటున మెట్లు జారి కిందపడ్డాను. ఈ ప్రమాదంలో తలకు గాయమైంది. దీంతో నా సిబ్బంది నన్ను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. ఇప్పుడే నేను ఆసుపత్రి నుంచి తిరిగొచ్చాను’’ అని రబుకా ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోలో ఆయన చొక్కాపై కొద్దిగా రక్తపు మరకలు ఉండటాన్ని గమనిస్తే.. ఆయనకు గట్టిగానే దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. కాగా.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి గెంగ్డూలో జరిగే ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవానికి ఫిజీ ప్రధాని హాజరు కావాల్సి ఉంది. కానీ.. ఈ ఘటన కారణంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

 

*చిరు నట విశ్వరూపం.. భోళా శంకర్ ట్రైలర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేషే చెల్లెలిగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చిరు మాస్ మ్యానియాను మెహర్ రమేష్ అద్భుతంగా చూపించాడు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ ఫ్రెష్ గా ఉంది. కలకత్తా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కలకత్తాలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఈ కిడ్నాప్ కేసులు పోలీసులకు సవాల్ గా మారతాయి. కానీ, ఆ నిందితులను పట్టుకోవడం పోలీసుల వలన కాకపోవడంతో గ్యాంగ్ స్టర్ గా ఉన్న భోళా హెల్ప్ తీసుకుంటారు పోలీసులు. ఇక అమ్మాయిల విషయం కావడంతో భోళా సైతం పోలీసులకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా.. ఆ బ్లాక్ మాఫియాకు భోళా విలన్ గా మారతాడు. ఈ నేపథ్యంలోనే భోళాను ఆపడానికి అతని చెల్లిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి భోళా చెల్లిని కాపాడుకున్నాడా.. ? అమ్మాయిల కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరు.. ? భోళా ఆ మాఫియాను ఆపగలిగాడా.. ? అనేది సినిమాలో చూడాలి. చిరు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ దుమ్ము దులిపేశాడు. వన్ మ్యాన్ షో చూపించేశాడు. ఇక చిరు.. రాజశేఖర్ లా, పవన్ కళ్యాణ్ లా నటించినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. ఆగస్టు 11 న భోళా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

 

*ఘాటుగా స్పందించిన రోహిత్ శర్మ!
వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన రెండో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై సెంచరీ బాదాడు. కోహ్లీ సెంచరీపై చాలా మంది ఫాన్స్, మాజీలు హర్షం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లపై కాకుండా.. విండీస్‌ లాంటి జట్టుపై సెంచరీ చేశాడని వ్యాఖ్యానించారు. తాజాగా ఆ విమర్శలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. ఏ క్రికెటర్‌ ప్రదర్శన పైనా ఇలాంటి విమర్శలు చేయడం సరైంది కాదన్నాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డే మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘ఇలాంటి విమర్శలపై ఇప్పటికే చాలాసార్లు స్పందించా. బయట నుంచి వచ్చే విమర్శలపై మేం ఎక్కువగా దృష్టి పెట్టం. జట్టులో ఏం జరుగుతుందనేది విమర్శలు చేసే వారికీ తెలియదు. అందుకే అలా మాటాడుతుంటారు. మా దృష్టంతా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడంపైనే ఉంటుంది. వ్యక్తిగతంగా రాణించినా.. మ్యాచ్‌లో ఎలా గెలవాలనేదే మాకు ముఖ్యం. జట్టుకు ఆట ఎలా ఉపయోగపడ్డాదనేది కీలకం. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌ను గెలవడం పైనే దృష్టి పెట్టాం. యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు.’జట్టులో చాలా మంది ఆటగాళ్లకు ఎక్కువ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది. వారికి ప్రత్యేకంగా తమ పాత్ర, ఆట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్‌ పరిస్థితిని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఆడగలిగే సత్తా వారికి ఉంది. అయితే యువ క్రికెటర్లు స్వేచ్ఛగా ఆడగలిగేలా చూడటమే మా బాధ్యత. కొన్ని స్థానాల కోసం చాలా మంది ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఈ సమయంలో తుది జట్టు ఎంపిక కెప్టెన్, కోచ్‌కు కష్టంగా ఉంటుంది’ అని రోహిత్ శర్మ చెప్పుకోచ్చాడు.

Exit mobile version