NTV Telugu Site icon

Top Headlines@5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*నా తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నా.. వారే దాడి చేశారు
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అచ్చంపేటలో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. అంతేకాకుండా.. గువ్వల బాలరాజు నుదిటిపై గాయలుకావడంతో చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. కాసేపటి క్రితమే ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడి చేసిన వారి గురించి బయటపెట్టారు. తెలంగాణలో ఎన్నడూ లేని ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యనే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేశారు.. నిన్న నామీద దాడిచేశారన్నారు. నిన్న ప్రచారం ముగించుకొని వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తన కాన్వాయ్ ని వెంబడిస్తూ అచ్చంపేట రాగానే ఆపి తన మీద దాడికి దిగారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ గతంలో తన ఆఫీసు మీద దాడి చేశారని పేర్కొన్నారు. నిన్న వంశీకృష్ణ రాయితో దాడిచేశాడని చెప్పారు. పగలు, ప్రతికారాలు లేకుండా పనిచేస్తున్నానని అన్నారు. నేను నమ్మే దైవం నా తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నా.. వంశీకృష్ణ అతని అనుచరులు నా మీద దాడి చేశారని చెప్పారు. వంశీకృష్ణ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు గువ్వల బాలరాజు తెలిపారు. ఈ దాడి పిరికితనంతో చేసిన దాడి అని బాలరాజు అన్నారు. తనను ఎదుర్కొనే శక్తి లేక అంతమోదించే కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జైళ్లలో నుండి క్రిమినల్స్ ని తీసుకువచ్చి దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. తన అనుచరులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నట్లు బాలరాజు చెప్పారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.. కాంగ్రెస్ పార్టీకి దీటైన సమాధానం చెబుదామని అన్నారు.

*ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్‌ చేసింది కాంగ్రెస్‌ కాదా?
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌ రావు సమక్షంలో ఓదెల జడ్పీటీసీ రాములు యాదవ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి హరీశ్‌ బీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్‌ చేసింది కాంగ్రెస్‌ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలాంటి కాంగ్రెస్ మనకు అవసరమా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఒక ముఠా చేతుల్లోకి వెళ్లిందన్న మంత్రి.. కాంగ్రెస్ చేతుల్లోకి రాష్ట్రం వెళ్లడం మంచిది కాదన్నారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి చేతుల్లోకి పోతే రాష్ట్రం ఏమైపోతుందని ఆయన ప్రశ్నించారు.. రేవంత్‌ రెడ్డికి హార్స్‌ పవర్‌ అంటే తెలుసా అంటూ మంత్రి హరీశ్ అన్నారు. రైతుబంధు ఇస్తే, బిచ్చం వేస్తున్నారని రేవంత్‌ రెడ్డి అంటున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్‌ కృషి వల్లనే తెలంగాణలో భూముల విలువ పెరిగింది.. 2-3 గంటల కరెంట్‌ కూడా కర్ణాటకలో ఇవ్వడం లేదని మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి చెప్పారు. రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుంచి బీఆర్‌ఎస్, తెలుగుదేశం ఇప్పుడు కాంగ్రెస్ ఇలా పార్టీలు మారటమే పని అంటూ విమర్శించారు. ఆయనకు నీతి జాతి లేదని మంత్రి హరీశ్‌ విమర్శించారు. ఆయనకు పార్టీలు మారటం తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. రేవంత్ రెడ్డి ఏనాడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలేదని, పోగ తుపాకులు పట్టుకొని బెదిరించాడన్నారు మంత్రి హరీశ్. ఉద్యమ సమయంలో ఒక్కనాడు మాతో కలిసి రేవంత్ రెడ్డి రాలేదన్నారు. పెద్దపల్లి భూముల విలువ ఎంత ఉండే… ఇప్పుడు ఎంత ఉంది గమనించాలన్నారు.

*తప్పుడు ప్రచారాలు చేయకండి.. మీడియాపై తుల ఉమ ఫైర్
తప్పుడు ప్రచారాలు చేయకండి మీడియాపై బీజేపీ నాయకురాలు తుల ఉమ ఫైర్ అయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో తుల ఉమ మాట్లాడుతూ.. నేను ఏ పార్టీ లోకి వెళ్ళేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేయకండని అన్నారు. కొంత మంది నేను బీఆర్ఎస్ పార్టీ లోకి వెళ్తున్నట్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. అలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి అని మండిపడ్డారు. మీడియాలో వచ్చిన కథనాలు తప్పు, నమ్మకండి ప్రజలారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ కి వెళ్తున్నట్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నేను ఇప్పటి వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు నిర్ణయం తీసుకోలేదని అన్నారు. నన్ను నమ్ముకున్న వారు ఉన్నారు, వారి నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుంటాను, నా ఒక్క దాని కోసం నిర్ణయం తీసుకోను అని తుల ఉమ క్లారిటీ ఇచ్చారు. కొంత మంది కావాలనే బదనాం చేస్తున్నారని అన్నారు. పార్టీల వారు రమ్మని అడిగారు అంతే..అని తెలిపారు. నేను ఇప్పటికే చాలా నష్టపోయాను, మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదన్నారు. ఇప్పుడు తీసుకొనే నిర్ణయం అందరికీ ఉపయోగ పడే విధంగా ఉంటుందని తుల ఉమ అన్నారు. భవిష్యత్ లో నేను రాజకీయాల్లో కీలకంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. నిన్న తుల ఉమ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీసీ లను అణగదొక్కాలని చూస్తున్నారు, అగ్రవర్గాలకు కొమ్ము కాస్తున్నరని మండిపడ్డారు. బీజెపీలో మహిళను స్థానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను నమ్మించి మోసం చేశారని నిప్పులు చెరిగారు. బీజెపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా చిన్న తనం నుంచే దొరలతో కొట్లాడుతున్న అని తెలిపారు. బీఆర్ఎస్ లో కూడా ఓ దొర అహంకారంతో బయటకు వచ్చానని తెలిపారు. ఎమ్మెల్యే గా పోటీ చేయాలని అనుకున్న అని స్పష్టం చేశారు. బీజేపీ కుటుంబ పాలనకి వ్యతి రేకం అన్నారు కానీ.. దొరల కాళ్ళ దగ్గర బీ ఫామ్ పెట్టి వచ్చాడు ఎంపి బండి సంజయ్ అంటూ మండిపడ్డారు. దొరల వద్ద చేతులు కట్టుకొని ఉండలేను అని తెలిపారు. నా కళ్ళలో కన్నీళ్లు తెప్పించారని మండిపడ్డారు. బీజెపీలో సిద్దాంతాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో నే ప్రకటిస్తనని అన్నారు. బీజెపీలో బీసీ ముఖ్యమంత్రి అనేది బూటకమని మండిపడ్డారు. దొరలు కావాలనే నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఏ పార్టీ అనేది నిర్ణయం తీసుకోలేదని అన్నారు. వేములవాడ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

*కార్యకర్తలను కాపాడుకోవడం కోసం నేను ఎంతవరకైనా వెళ్తా
తెలంగాణలో ఎన్నికల జోరు పెరిగింది. ఆయా పార్టీలు ప్రజలును ఆకర్షించేందుకు వారి పార్టీలు ప్రకటించిన మేనిఫేస్టోతో పాటు.. మరిన్ని వరాలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ప్రచారం నిర్వహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 72-78 గెలుచుకో బోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు పొంగులేటి. మీరు అభిమానించే మీ శ్రీనన్న ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉండబోతున్నాడన్నారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం నేను ఎంతవరకైనా వెళ్తానన్నారు. కొత్తగూడెం నేను నిలబడే ఆలోచన చేయలేదు, నేను నిలబడే నియోజకవర్గం కోసం, నా కోసం నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదన్నారు. నేను పోటీ చేస్తున్న చేస్తున్న పాలేరు నియోజకవర్గం కంటే మిగతా నియోజకవర్గాల్లో 75శాతం టైం కేటాయిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ ఆదేశానుసారం పొత్తులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ కి కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ, పొంగులేటి అభిమానులుగా పార్టీ ఆదేశానుసారం చిత్తశుద్ధితో పనిచేస్తే కూనంనేని సాంబశివరావు గెలుపు తథ్యమన్నారు. అనంతరం కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నేను కూడా పోటీ చేయాలని అనుకోలేదు కానీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర పార్టీ నాయకులు ఒత్తిడి, నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా సీపీఐ నుంచి పోటీ చేసేందుకు ఒప్పుకున్నాను. పొంగులేటి వన్ మాన్ ఆర్మీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పొంగులేటికి ప్రజా బలం ఉంది తనను వేరే విధంగా ఆలోచన చేయొద్దు. పాలేరు లో సీపీఐ పొంగులేటికి పూర్తి మద్దతు ఇస్తున్నది, ఖమ్మం లో తుమ్మల నాగేశ్వరరావు కు సీపీఐ మద్దతు ఇస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఆశించిన విధంగా 10కి 10 స్థానాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు మిత్రపక్షాలు గెలుపు తథ్యం. కొత్తగూడెం స్థానం గెలవక పోతే వ్యక్తిగతంగా తనకు, తన పార్టీకి, మిత్ర ధర్మం పాటించలేదని కాంగ్రెస్ కు చెడ్డ పేరు వస్తుంది. ఎవరికీ ఇబ్బందులు కలిగించను, ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించను. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి ఉందాం. పదవి కోసం పోటీ చేయడం లేదు.’ అని ఆయన అన్నారు.

*పండగ పూట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి
మెదక్ జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తున్న తల్లిని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కుమారులు మృతి చెందారు. తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే కళ్ళముందే తన కుమారులు చనిపోవడంతో ఆ తల్లి గుండె పగిలేలా రోధిస్తుంది. దీపావళి సందర్భంగా.. పిల్లలకు టపాసులు కొనిచ్చేందుకు షాప్ కి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. రెండేళ్ల క్రితమే తన భర్త శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడు. అప్పుడు భర్తని, ఇప్పుడు పిల్లల్ని కోల్పోవడంతో తీవ్రంగా దు:ఖ సాగరంలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ తల్లి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమేను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన కుమారులు పృధ్విరాజ్ (12), ఫణి తేజ (10)గా గుర్తించారు. తల్లి అన్నపూర్ కస్తూరిబా స్కూల్ లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుంది.

*”పెద్ద దేశాలు, అంతర్జాతీయ చట్టాలు” అంటూ.. మరోసారి భారత్‌పై కెనడా ప్రధాని వ్యాఖ్యలు..
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీస్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదానికి కారణమైంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి. తమ పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడం వివాదాస్పదం అయింది. అంతే కాకుండా కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను ఆ దేశం బహిష్కరించింది. దీనికి తీవ్రంగా స్పందించిన భారత్, కెనడియన్ దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాల్సిందిగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇండియాను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘‘పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఎటువంటి పరిణామాలు లేకుండా ఉల్లంఘించగలిగితే, ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికీ మరింత ప్రమాదకరం’’ అని అన్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ ఎనర్జీ గ్రిడ్ ప్రారంభించిన సందర్భంగా కెనడా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడా తరుపున అమెరికా ఈ విషయాన్ని భారత్‌తో చర్చించాలా..? వద్దా.? అనే ప్రశ్నకు స్పందించిన ట్రూడో.. కెనడా పౌరుడి హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందనే విశ్వసనీయ ఆరోపణల గురించి మాకు మొదటి నుంచి తెలుసు, ఈ విషయం గురించి తమతో కలిసి పనిచేయాల్సిందిగా భారత్‌ని కోరామని, అమెరికా వంటి మా మిత్ర దేశాలతో ఈ విషయంపై సంప్రదించామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చట్టబద్ధమైన సంస్థలు, దర్యాప్తు సంస్థలతో పనిచేస్తున్నామని ట్రూడో వెల్లడించారు. కెనడా ఎల్లప్పుడు చట్టబద్ధమైన పాలన కోసం నిలబడే దేశమని, పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే ప్రతి ఒక్కరికి ప్రమాదకరమని ఆయన అన్నారు. భారత్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించి 40 మంది కెనడా దౌత్యవేత్తల ప్రత్యేక రక్షణల్ని రద్దు చేయడంపై నిరాశ చెందినట్లు ట్రూడో అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ప్రస్తుతం ఏం స్పందించలేదు. గతంలో ఈ వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. కెనడా తమకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని, ఒకవేళ ఇస్తే పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. నిజ్జర్ హత్యపై కెనడా చేసిన ఆరోపణల్ని భారత్ గతంతో తప్పుపట్టింది. కెనడా అసంబద్ధ రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించింది.

*భార్య, ప్రియుడు కలిసి భర్త దారుణ హత్య.. శవాన్ని రెండు ముక్కలుగా నరికి..
తమిళనాడులో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అత్యంత దారుణంగా హత్య చేసింది. ప్రియుడి మోజులో పడిన సదరు ఇల్లాలు అతడితో కలిసి భర్తను కడతేర్చింది. తిరుచ్చి పోలీసులు ఈ హత్యకు పాల్పడిన మహిళ వినోదిని(26), ఆమె లవర్ భారతి(23)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంటకు సహకరించిన మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేశారు. వినోదిని, భారతితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ఆమె భర్త పూలవ్యాపారి ప్రభు(30)ని పథకం ప్రకారం ప్రియుడితో కలిసి హత్య చేసింది. అప్పటికే వినోదినికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రభుకు నిద్ర మాత్రలను ఇచ్చిన వినోదిని, ఆమె ప్రియుడు భారతి, అతని స్నేహితుల సాయంతో గొంతు కోసి హత్య చేసింది. ఈ హత్య అనంతరం భారతి, అతని స్నేహితులు తిరుచ్చి-మదురై హైవే సమీపంలో మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వర్షం కురవడంతో ఈ పథకం సాధ్యం కాలేదు. అనంతరం ప్రభు మృతదేహాన్ని నరికి కావేరి, కొల్లిడం నదుల్లో పారేశారు. వినోదిని, భారతి, అతని స్నేహితులు రూబెన్ బాబు, దివాకర్, శర్వణ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. నవంబర్ 5న ప్రభు సోదరుడు ఇంటికి వెళ్లి చూడగా.. తన భర్త ఇంటికి రాలేదని వినోదిని తెలిపింది. ప్రభు సోదరుడు అతనిని వెతికేందుకు మార్కెట్ వెళ్లాడు. ప్రభు ఆచూకీ లభించకపోవడంతో సమయపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో భారతితో వినోదిని వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. ప్రభును తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. హత్యకు ముందే వినోదిని, భారతి మూడు నెలల క్రితం సంధాయ్ గేట్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న విషయం ప్రభుకు అనుకోకుండా తెలిసింది. భారతితో సంబంధాన్ని తెంచుకోవాలని వినోదిని ప్రభు హెచ్చరించాడు. ఈ వివాదం కారణంగా వీరిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరిగేవి. అయితే గత 10 రోజులుగా వినోదిని భారతిని కలవలేదని, అయితే అతని సాయంతో ప్రభుని హత్య చేయాలని భావించిందని ప్రభు అన్న ఆరోపించాడు. నవంబర్ 4న తన భర్తకు ఆరోగ్యం బాగాలేదని నిద్రమాత్రలు వేసింది, మత్తులోకి జారుకోగానే గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం. హత్య తర్వాత భారతి తన ముగ్గురు స్నేహితులను పిలిచి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి కావేరి నదిలో మొండెం, మిగిలిన భాగాలను కొల్లిడం నిదిలో విసిరేశారు.

*గాజా ఆస్పత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయిల్ సైన్యం..
ఇజ్రాయిల్-హమాస్ వార్ మొదలై నెల రోజులు గడిచాయి. హమాస్ ను పూర్తిగా నేలమట్టం చేసేదాకా విశ్రమించేంది లేదని స్పష్టం చేసింది. అయితే గాజాలోని ఆస్పత్రులను ఇజ్రాయిల్ ఆర్మీ టార్గెట్ చేస్తోంది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్ షిఫాను ఆర్మీ చుట్టుముట్టింది. ఆస్పత్రులను హమాస్ కమాండ్ సెంటర్ గా వాడుకుంటోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అందుకే వాటిని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అల్ షిఫా ఆస్పత్రి చుట్టు ఇజ్రాయిల్ తన ట్యాంకుల్ని మోహరించింది. ఆస్పత్రిపై దాడులను తీవ్రతరం చేయడంతో పేషెంట్లు పారిపోతున్నారు. దాడుల కారణంగా ఆస్పత్రి అంతా అంధకారం అలుముకుంది. దీంతో పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. ఇప్పటి వరకు ఇద్దరు నవజాత శిశువులు మరణించినట్లు పాలస్తీనా అధికారులు వెల్లడించారు. అయితే గాజాలోని ఆస్పత్రుల్లో ఉన్న శిశువులను తరలించేందుకు ఇజ్రాయిల్ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అల్-షిఫా ఆస్పత్రితో సంబంధాలు తెగిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) ఆదివారం వెల్లడించింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయేసస్ మాట్లాడుతూ.. తాజా నివేదిక ప్రకారం, ఆస్పత్రి చుట్టూ ట్యాంకులు ఉన్నాయని ఆయన ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. రోగుల పరిస్థితి గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్ ఉత్తరగాజా నుంచి సురక్షితమైన దక్షిణ ప్రాంతానికి వెళ్లాలని ఇజ్రాయిల్ ఆదేశించింది. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ కథనం ప్రకారం.. ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్న వారిని హమాస్ ముష్కరులు కాల్చివేస్తున్నారని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1400 మందిని చంపేసింది. ఆ తర్వాత నుంచి హమాస్ టార్గెట్‌గా ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. మొదట వైమానిక దాడులకే పరిమితమైనప్పటికీ.. ప్రస్తుతం భూతలదాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ దాడుల వల్ల ఇప్పటి వరకు గాజాలోని 11000 మంది పాలస్తీనియన్లు మరణించారు.

*పండగ పూట విషాదం.. ప్రముఖ సీనియర్ హీరో మృతి
కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు గంగా (53) శుక్రవారం సాయంత్రం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. టి.రాజేందర్‌ దర్శకత్వం వహించిన ఉయిరుళ్లవరై ఉషా అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు గంగా.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న గంగా ఆ తరువాత క్రైం తొడుమ్‌ అలైగళ్, మురుగేశన్‌ తునై, మామండ్రం, సావిత్రి వంటి చిత్రాల్లో నటించాడు. 53 ఏళ్లు అయినా గంగా వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉన్నాడు. ఇక శుక్రవారం సాయంత్రం ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావాడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇక హాస్పిటల్ కు తీసుకెళ్లినా కూడా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈయన భౌతిక కాయాన్ని సొంతూరు చిదంబరం సమీపంలోని భరత్తూర్‌ చావడి గ్రామానికి తరలించి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇక దీంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక గంగా.. అవకాశాలు ఉన్నంతవరకు హీరోగా నటించి.. అనంతరం టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహించాడు. ఇక గంగా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తపరిచారు.

 

*నేను అరెస్టు కాలేదు.. పోలీసులు అందుకే వచ్చారు- వీడియో రిలీజ్ చేసిన హిమజ
నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో రేవ్ పార్టీని హైదరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు భాగం చేసినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 మంది సెలబ్రిటీలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కూడా నమోదు చేశారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిమజ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. ఈ వార్తలన్నీ అవాస్తవం అని చెబుతూ తాను తన నివాసంలో దీపావళికి హౌస్ పార్టీ ప్లాన్ చేసుకుని తనకు కావాల్సిన వాళ్ళందర్నీ పిలుచుకున్నానని చెప్పుకొచ్చింది. తాను కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి దీపావళి కావడంతో బంధువులను మిత్రులను పిలిచి ఒక మంచి పార్టీ చేసుకున్న సమయంలో ఎవరో తెలియని వారు పోలీసులకు సమాచారం ఇచ్చారని పోలీసులు వచ్చి ఏం జరుగుతోందని ప్రశ్నించి ఏమైనా చట్ట విరుద్ధంగా జరుగుతుందా లేదా అని చెక్ చేసి వెళ్లారని హేమజ చెప్పుకొచ్చింది. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారని ఎలక్షన్స్ టైం కాబట్టి ఏమైనా తప్పుగా జరుగుతుందేమో అనే ఉద్దేశంతో వచ్చి చెక్ చేశారు కానీ ఎలాంటి చట్ట విరుద్ధమైన పనులు జరగడం లేదని తెలుసుకుని వెళ్లిపోయారని హిమజ చెప్పుకొచ్చింది. మేము వాళ్ళకి చాలా కార్పొరేట్ చేశామని, వాళ్లు కూడా చాలా మర్యాదగా నడుచుకున్నారని అని చెప్పుకొచ్చింది. అయితే మీడియాలో రేవ్ పార్టీ భగ్నం చేసి తనను అరస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని, అది ఎంత మాత్రం నిజం కాదని ఆమె చెప్పుకొచ్చింది. వ్యూస్ కోసం ఇలా రాయడం కరెక్ట్ కాదని, నిజం ఏమిటో తెలుసుకుని ఆ తర్వాత ఇలాంటి వార్తలు పబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది. ఈ వార్తలు, న్యూస్ యాప్ లోని వార్తలు చూసి చాలా మంది భయపడి తనకి కాల్స్ చేస్తున్నారని వారందరికీ సమాధానం చెప్పలేక ఇలా ఒక వీడియో చేసి పెడితే అందరికీ ఒక క్లారిటీ ఇచ్చినట్లు అవుతుంది అని వీడియో చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. రేవు పార్టీ అంటున్నారు రేవ్ పార్టీ నిర్వహిస్తూ గనక పోలీసులు చెక్ చేస్తే ఇలా నేను లైవ్ వీడియో పెట్టగలనా అని ఆమె ప్రశ్నించారు. మేమందరం మా ఇళ్ళల్లో హ్యాపీగా ఉన్నాం, కాసేపట్లో దీపావళి పూజ కూడా ప్రారంభించుకోబోతున్నాం అయినా ఎందుకు ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. పోలీసులు వచ్చారు, చెక్ చేసుకున్నారు, వెళ్లిపోయారు, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. మరి ఈ సమాచారం పోలీసులకు ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారో? నాకు తెలియదు కానీ అది రకరకాలుగా మీడియా వరకు వెళ్లిందని ఆమె చెప్పుకొచ్చారు. అసలు ఏం జరిగిందో తన వాళ్ళందరికీ తెలుసుగాని తన శ్రేయోభిలాషులకు మాత్రం ఈ విషయంలో కాస్త క్లారిటీ ఇవ్వాలనిపించి వీడియో చేస్తున్నానని తాను పోలీస్ స్టేషన్లో లేను ఇంటిలోనే ఉన్నానని చెబుతూ వీడియోలో కూడా ఇంటిని చూపించే ప్రయత్నం చేసింది.