NTV Telugu Site icon

Top Headlines@5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల కీలక నివేదిక
రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదిక ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు మెడికల్ రిపోర్టులో వెల్లడించారు. మెడికల్ రిపోర్టును బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ జైలు అధికారులు చెప్పుకొచ్చినట్లు సమాచారం. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక ఉన్నట్లుగా తెలిసింది. చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్టు నిర్ధారణ అయింది. గడ్డం మీద, అరచేతి‌భాగాల్లో, చాతి భాగంలో, శరీరంలోని పలు భాగాల్లో హెరిటమతాస్ దొద్దుర్లు, చర్మం రంగుమారినట్లుగా వైద్యుల నివేదికలో తేలింది. కలామన్ లోషన్, అరచేతుల కోసం మార్చురెక్స్ సాఫ్ట్ క్రీమ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం మెకనాజల్ వైద్యులు రిఫర్ చేశారు. అలెర్జీ కోసం టెక్జిన్, ఇమ్యూనిటీ పెంపు కోసం లిమ్సీ ట్యాబ్లెట్స్ రిఫర్ చేశారు. తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డీహైడ్రేషన్‌తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ వైద్యులు తేల్చారు. డీహైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని నివేదికలో స్పష్టంగా సూచించారు. చంద్రబాబుకు హైపర్ ట్రోఫీక్ కార్డియో మైయోపతి (Hyper trophic cardiomyopathy) సమస్య ఉందని వ్యక్తిగత వైద్యులు తెలిపారు. ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్‌తో గుండె పైనా ప్రభావం పడే అవకాశం ఉందని వ్యక్తిగత వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలను చిన్నవి చేసి చూపిస్తున్న ప్రభుత్వం, అధికారులు చూపిస్తున్నారని వారు చెప్పారు. తాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

 

*చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తు్న్నారు..
చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎవ్వరుబడితే వారే మాట్లడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తనకు తెలిసిన టక్కుటమారా విద్యలతో అన్నింటినీ ఇంతవరకు తప్పించుకున్నాడు.. చివరికి తనకు ఫోన్ చేసి జిమ్మిక్కులు చెయ్యాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాత్రి ఓ వ్యక్తి ఫోన్ చేశారని.. ఏడుస్తూ చంద్రబాబు పెద్దాయన.. తప్పుకదా అని అడిగారని మంత్రి చెప్పారు. ఆరోగ్యం బాగోలేదు అని న్యూస్‌లో చూశానని చెప్పాడని వెల్లడించిన మంత్రి.. ఏదైనా కోర్టులో చూసుకోవాలని చెప్పానని పేర్కొన్నారు. దీని ద్వారా టీడీపీ నాయకులు లబ్ధిపొందాలని చూస్తున్నారని మంత్రి విమర్శించారు. అశోక్ గజపతి రాజు వెళ్లి పరామర్శించారని.. వారు ఎంత హాయిగా నవ్వుకుంటున్నారో ఫొటోలు చూడాలన్నారు. ఎందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆరోగ్య బాగోకపోతే కోర్టులో పిటీషన్ వెయ్యాలన్నారు. రాత్రి జరిగితే ఉదయాన్నే మీడియాకి రావడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది‌ వారి కుటుంబం సభ్యులు, నాయకులు ఆడుతున్న డ్రామా అని ఆయన ఆరోపించారు. కోర్టు అనుమతి లేకుండా జైలుకు వైద్యులు ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. ఇది చట్టపరంగా ఫిర్యాదు చెయ్యాలా వద్దా అంటూ మంత్రి ప్రశ్నలు గుప్పించారు. వారు చేస్తున్న పనికి వేరొకరు బలికాకూడదానే విడిచిపెట్టామన్నారు. బొత్స మాట్లాడుతూ.. ” ఈ స్కామ్ లో చంద్రబాబు తప్పు చేసారు. దీనిని మరింత రాద్దాంతం చేస్తే నష్టపోయేది టీడీపీనే. చంద్రబాబుకు ఒళ్లంతా మచ్చలే… మచ్చలేదంటారేంటి. అశోక్ గజపతి రాజు తన మచ్చని చూసుకోకుండా మామీద విమర్శిస్తున్నారు. ఇలాంటి మాటలు మాటలాడకండి.. మేము వ్యంగ్యంగా మాట్లాడుతున్నమనడం తప్పు… ఇలా ఫోన్ చేసి మాట్లాడడం వ్యంగ్యం అనాలి. వ్యవస్థలను మేనేజ్‌ చేసేది చంద్రబాబు… మేము కాదు. ఢిల్లీ నుంచి పెద్దపెద్ద లాయర్లను తీసుకొచ్చి వాదిస్తున్నారు కదా. ఎంతో మంది నాయకులు తప్పు చేసి జైలుకు వెళ్లిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి..రాజధాని తరలింపుపై ఓ కమిటీ వేశారు. ఎంత త్వరగా విశాఖకు వస్తే అంత మంచిది.” అని పేర్కొన్నారు.

 

*అధికారంలోకి వస్తే రైతు పండించే ప్రతి పంటకు భీమా కల్పిస్తాం
మోడీ సర్కార్ రాకముందు దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉండేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడ విద్యుత్ కోతలు లేవని తెలిపారు. రామగుండం NTPCకి మోడీనే శంఖుస్థాపన చేశారు, ప్రారంభం చేశారని కేంద్రమంత్రి అన్నారు. ఎరువుల సమస్యను తీర్చింది మోడీనేనని.. కొరత, కోతలు లేని నూతన భారతావనిని మోడీ ఆవిష్కరించారని పేర్కొన్నారు. 10 ఎకరాలు ఉన్న రైతుకు ఎరువుల మీద 2 లక్షల సబ్సిడీ కేంద్రం ఇస్తుందని తెలిపారు. ఎరువుల పరిశ్రమ, NTPC ప్రాజెక్ట్ ప్రారంభానికి మోడీ వస్తే కేసీఆర్ ఫాంహౌస్, ప్రగతి భవన్ లో పడుకున్నాడని విమర్శించారు. కొడుకు సీఎం, అయన జాతీయ నేత కావాలని శ్రద్ద తప్ప కేసీఆర్ కి తెలంగాణ ప్రజల పై లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల పైన ధ్యాస తప్ప తెలంగాణ అభివృద్ది పై ఆయనకు చితశుద్ది లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫిజిబిలిటీ కాదు… దాన్ని మెంటైన్ చేయలేమని అంటున్నారని తెలిపారు. ఇంజనీర్లను పక్కన పెట్టి ఫాంహౌస్ ఇంజనీర్ గా మారి తెలంగాణ ప్రాజెక్ట్ లను కేసీఆర్ ముంచుతున్నాడని దుయ్యబట్టారు. కృష్ణా ట్రిబ్యునల్ ఆలస్యానికి కారణం కేసీఆరేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలి అంటే నదుల అనుసంధానం జరగాలని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని విమర్శించారు. రాష్ట్రంలో మార్పు రావాల్సి ఉందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్నారని.. రాజకీయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అప్పు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి తెలిపారు. 7 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిందని.. కేంద్రం చిత్తశుద్దితో సహకారం చేస్తుంటే వీళ్ళు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు పండించే ప్రతి పంటకు భీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనవరి ఒకటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తాయని తెలిపారు. రైతు రాజ్యాన్ని తెలంగాణలో తీసుకొస్తాం… కేసీఆర్ లాగా ఎకరానికి కోటి రూపాయలు వస్తున్నాయని మభ్య పెట్టమన్నారు.

 

*బీఆర్‌ఎస్‌లోకి పొన్నాల
మంత్రి కేటీఆర్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాలను స్వయంగా ఇంటికి వెళ్లి కలిసారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎల్‌లోకి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేరునున్ననట్లు క్లారిటీ ఇచ్చారు. ఈనెల 16న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలో పొన్నాల పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. పొన్నాలకు పార్టీలోకి రావాలని ఆహ్వానించామని అన్నారు. పార్టీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.ఆయనకు గౌరవం, ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. పొన్నాలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 16న జరిగే కేసీఆర్ సభలో ఆయన పార్టీలో చేరుతారని మంత్రి కేటీఆర్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో పొన్నాల బీఆర్ఎస్ కండువాకప్పుకోవడం ఖాయమైంది.. దీంతో బీఆర్ఎస్ కు బలమే అని చెప్పాలి. అయితే పొన్నాల కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ లో చేరుతారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నాలపై ఫైర్ అవుతున్నారు. 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు వీడటం ఏంటని పొన్నాల పై మండిపడుతున్నారు. అయితే ఇటు కాంగ్రెస్, అటు పొన్నాల విమర్శనస్రతాలు చోటుచేసుకుంటున్నా పరిణామంలో మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లడం చర్చకు దారితీసింది. అయితే పొన్నాల నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు పంపారు. బాధతో పార్టీ కి రాజీనామా చేస్తున్నానని అంటూ ఖర్గేకు లేఖలో తెలిపిన విషయం తెలిసిందే.. 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పార్టీ ఓడిపోయిందని అన్నారు. కానీ నన్ను రాజీనామా చేయించి బలి పశువుని చేసింది పార్టీ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2018 లో కూడా పార్టీ ఒడిపోయిందని, కానీ అప్పటి నాయకులను మాత్రం రాజీనామా చేయాలని అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

*విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకున్న ముఖ్యమంత్రి స్పందించడు
చిక్కడపల్లిలో నిన్న ప్రవళిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ప్రవళిక సూసైడ్ చేసుకోవడం దారుణమన్నారు. ప్రవళిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరీక్షలు పోస్ట్ పోన్ అవుతున్నాయని.., మీరు నాకోసం ఎంతో కష్టపడ్డారని వాళ్ళ అమ్మ నాన్న తో ఫోన్ లో బాధపడిందని అన్నారు. ఆమె మృతికి నిరసనగా యువత మొత్తం వచ్చారని బండి సంజయ్ తెలిపారు. లక్ష్మణ్, భానుప్రకాష్ వాస్తవాలను తెలుసుకుందామని వెళ్తే.. వారిపై పోలీసులు లాఠీ చార్జీ చేశారన్నారు. విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకున్న ముఖ్యమంత్రి స్పందించడని బండి సంజయ్ అన్నారు. ఇంకా మరోసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాడని బండి సంజయ్ అన్నారు. కుటుంబంలో మనోధైర్యం నింపకుండా లవ్ ఫెయిల్యూర్ అని చెబుతున్నాడని కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తప్పుడు ప్రకటనల వల్ల ఆ కుటుంబం కుమిలిపోతోందని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ ఆమె మరణం లవ్ ఫెయిల్ వల్ల చనిపోయిందని అబద్ధపు లేఖలు సృష్టించేందుకు కూడా కేసీఆర్ వెనుకాడరని పేర్కొన్నారు. నిరుద్యోగులకు అండగా తాముంటామని బండి సంజయ్ అన్నారు. కోచింగ్ సెంటర్లు మొత్తం బంద్ చేసి మీ గ్రామాలకు వెళ్ళండని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండని.. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించి బీజేపీకి ఓటు వేసేలా చూడండని అన్నారు. నిరుద్యోగులకు తాను నియామక పత్రాలు అందజేస్తానని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వం కూల్చడం పెద్ద మ్యాటర్ కాదని తెలిపారు. 50 రోజులు కొట్లాడండి.. బీజేపీకి అండగా నిలవండని బండి సంజయ్ పేర్కొన్నారు. నవంబర్ 30 కేసీఆర్ కు డెడ్ లైన్ కావాలని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలని తెలిపారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా.. అంబేడ్కర్ రాజ్యాంగం కావాలా అని అన్నారు. కాంగ్రెస్, బీఆరెస్ ఒక్కటేనని విమర్శించారు. 3+3=6.. బీఆరెస్ ఇంటికి పోవడం ఫిక్స్ అని కామెంట్ చేశారు. కారు షెడ్డుకు పోయింది.. సారు ఫామ్ హౌజ్ కు.. 16 ఎక్కడ పోయిందో వారికే తెలియాలని బండి సంజయ్ అన్నారు.

 

*ఆర్మీ హెలికాప్టర్ ప్రయాగ్‌రాజ్‌లో అత్యవసర ల్యాండింగ్.. ఇదే కారణమా..?
దేశం రక్షణలో ప్రాణాలను సైతం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటారు ఆర్మీ సైనికులు. ప్రతి క్షణం వాళ్ళకి కత్తి మీద సాములాంటిదే. ఏమాత్రం ఆదమరిచి ఉన్న అపాయం ముంచుకు వస్తుంది. ఈ మాట ఇప్పుడు చెప్పడానికి కారణం..శనివారం ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌లో భారత సైన్యానికి చెందిన చేతక్ హెలికాప్టర్ ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాలలోకి వెళ్తే శనివారం ఒక సాధారణ శిక్షణా మిషన్‌లో పాల్గొన్న చేతక్ హెలికాప్టర్ ని అత్య అవసరంగా ల్యాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ ఇంజినీరింగ్ యూనిట్ సంఘటనా స్థలానికి చేరుకుని సాంకేతిక తనిఖీలు నిర్వహించింది. ఆ తర్వాత హెలికాప్టర్‌ను తిరిగి ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఈ ఘటన గురించి ఓ ప్రకటనలో మాట్లాడారు. చేతక్ హెలికాప్టర్ శిక్షణ మిషన్ లో పాల్గొన్న సమయంలో సాంకేతిక లోపాలకు గురైనట్లు అనిపించింది. వెంటనే ముందస్తు జాగ్రత్తగా హెలికాప్టర్ ని ల్యాండ్ చేసినట్లు తెలిపారు. కాగా ఈ ఘటన లో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆర్మీ ఇంజినీరింగ్ యూనిట్ సంఘటనా స్థలానికి చేరుకుని సాంకేతిక తనిఖీలు నిర్వహించిందని, అనంతరం హెలికాప్టర్ ని యధావిధిగా శిక్షణ మిషన్ లో ఉపయోగించమని ఆయన తెలిపారు. ముందుగానే హెలికాప్టర్ లోని సాంకేతిక లోపాలను గుర్తించడం ద్వారా జరగబోయే ప్రధాని ఆపగలిగారు అని లేకపోయి ఉంటె పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అభిప్రాయం పడుతున్నారు ఈ ఘటన గురించి తెలిసిన వారు.

 

*యూట్యూబ్ లో ఫెమస్ అయితే చంపేస్తారా..? ఇదెక్కడి న్యాయం..!
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అంటే ఏ పని చేసిన పిడికెడు అన్నం కోసమే. దాని కోసం మనిషి నానాయాతన పడుతుంటారు. ప్రస్తుతం యూట్యూబ్ హావ నడుస్తుంది. కొందరు నేమ్, ఫేమ్ కోసం యూట్యూబ్ ని ఎన్నుకుంటే.. కొందరు వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి యూట్యూబ్ ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్ లో క్లిక్ అయితే నేమ్, ఫేమ్ తోపాటు మంచి సంపాదన కూడా వస్తుంది. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఓ ఆసరా దొరుకుతుంది అనుకునే వాళ్ళు ఎందరో. అయితే ఆ యూట్యూబ్ లో ఫేమ్ రావడం తో ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే..బీహార్ లో హరధన్ అనే 19 ఏళ్ళ యువకుడు తండ్రిని కోల్పోయాడు. దీనితో కుటుంబ భారం ఆ యువకుడి పైన పడింది. ఈ నేపథ్యంలో తన తల్లిని, ఇద్దరు సోదరీమణులను పోషించుకునేందుకు హరధన్ యూట్యూబ్‌లో ట్యూషన్లు మరియు రీల్స్ అప్‌లోడ్ చేసేవాడు. కాగా హరధన్ కి యూట్యూబ్ లో మంచి గుర్తింపు వచ్చింది. హరధన్ కి వచ్చిన ఈ ఫేమ్ అతని మరణానికి కారణం అయింది. హరధన్ కి నేమ్, ఫేమ్ రావడాన్ని చూసి ఓర్వలేని వ్యక్తులు బీహార్‌లోని నలందలో తన ఇంట్లో నిద్రిస్తున్న హరధన్ ను పదునైన కత్తితో విచక్షణారహితంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు గుమిగూడి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో హరధన్ సోదరి మాట్లాడుతూ తనకి యూట్యూబ్ లో ఫేమ్ రావడం వల్లనే అతన్ని హత్య చేశారని తెలిపింది. కాగా ఈ హత్యకు కేవలం యూట్యూబ్ ఫేమ్ మాత్రమే కారణమా..? లేక వేరే కారణాలు ఎం అయినా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారు.

 

*ఇజ్రాయిల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది.. పుతిన్ కీలక వ్యాఖ్యలు..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. గత శనివారం ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 1300 మంది చనిపోయారు. ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇజ్రాయిల్, గాజాలోని హమాస్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో గాజాస్ట్రిప్ లోని వేల మంది మరణిస్తున్నారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలుగా ఉన్న తమవారిని రెస్క్యూ చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే హమాస్ క్రూరదాడి నేపథ్యంలో ఇజ్రాయిల్ కి తమను తాము రక్షించుకునే హక్కు ఉందని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఈ రెండు దేశాల మధ్య సమస్య పరిష్కరించడానికి తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించినట్లు మీడియా నివేదించింది. కిర్గిజ్‌స్తాన్ వేదికగా జరుగుతున్న పూర్వపు సోవియట్ యూనియన్ దేశాల కూటమి ‘కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(సీఐఎస్)’ శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ హాజరయ్యారు. పాలస్తీనా-ఇజ్రాయిల్ సమస్యకు చర్చలే ప్రత్యామ్నాయం అని పుతిన్ అన్నారు. చర్చల ద్వారా ఐక్యరాజ్యసమితి ‘టూ స్టేట్ ఫార్ములా’ను అమలు చేయడం, తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనా స్వతంత్ర రాజ్యాన్ని సృష్టించడం, ఇజ్రాయిల్ తో శాంతి, భద్రతతో సహజీవనం చేయడానికి సహాయపడుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ క్రూరమైన దాడికి గురైంది. ఇజ్రాయిల్ తనను తాను రక్షించుకునే హక్కు ఉందని, శాంతియుత మార్గంలో సమస్య పరిష్కారానికి కృషి చేయడం చాలా కీలకమని పుతన్ చెప్పారు. టూ స్టేట్ ఫార్ములాకు ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్, వేరే దేశ పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు గానూ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్(ఐసీసీ) పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే రష్యా, కిర్గిజ్ స్తాన్ రెండు దేశాలు కూడా ఐసీసీలో భాగస్వామ్య దేశాలు కావు. వచ్చే వారం చైనాలో జరిగే బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ సమావేశానికి పుతిన్ ఆ దేశానికి వెళ్లనున్నారు.