*ఢిల్లీకి బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.. పొత్తులపై క్లారిటీ రానుందా?
బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీకి బయలుదేరారు. హస్తినలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలను పురంధేశ్వరి కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు పురంధేశ్వరి వివరించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్, పవన్ పొత్తుల ప్రకటన వంటి అంశాలను హైకమాండ్ దృష్టికి పురంధేశ్వరి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. పవన్ పొత్తుల ప్రకటన గురించి పురంధేశ్వరి బీజేపీ పెద్దలతో చర్చించిన అనంతరం ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పరిస్థితులపై పురంధేశ్వరి ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు. దీంతో పాటు పురంధేశ్వరి పార్టీ పగ్గాలు చేపట్టాక అసలు ఏపీ బీజేపీలో ఎలాంటి మార్పులు వచ్చాయన్న అంశంపై కూడా ఢిల్లీ పెద్దలు ఆసక్తిగా ఉన్నారు. ఏపీలో ఉన్న తాజా రాజకీయాలపై ఓ నివేదికను సిద్ధం చేసిన బీజేపీ నేతలు అధ్యక్షురాలు పురంధేశ్వరి ముందు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఎవరి మద్దతుతో వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్లాలన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ బీజేపీ నేతలు ఓ నిర్ణయానికి రావచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నిర్వహించిన కోర్ కమిటీలో సభ్యుల అభిప్రాయాలను ఢిల్లీ పెద్దలకు బీజేపీ ఏపీ చీఫ్ వివరించనున్నారు. త్వరలో బీజేపీ ఏపీ విస్తృత స్థాయీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా జేపీ నడ్డాను పురంధేశ్వరి ఆహ్వానించనున్నారు.
*ఎమ్మెల్యే శంకరనారాయణ కాన్వాయ్‌పై డిటోనేటర్‌తో దాడి
పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు ప్రమాదం తప్పింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్లలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యేపై ఓ ఆగంతకుడు డిటోనేటర్ విసిరాడు. గోరంట్ల మండలం గడ్డం తండా వద్ద ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకరనారాయణ నిర్వహించారు. ఆయన వాహనం దిగి కొంత దూరం నడిచారు. బైక్ ర్యాలీ అనంతరం వెళుతున్న ఎమ్మెల్యే శంకరనారాయణ కాన్వాయ్‌పై ఓ ఆకతాయి డిటోనేటర్ విసరడం కలకలం రేపింది. అది పేలక పోవడంతో ప్రమాదం తప్పింది. అయితే, డిటోనేటర్ గురితప్పి పొదల్లో పడటం, అది పేలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున నాయకులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. శంకర్ నారాయణ కాన్వాయ్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరన్నది పోలీసులు గుర్తించారు. నిందితుడు సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన వెంకటేష్‌గా గుర్తించారు. వెంకటేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గ్రానైట్ తవ్వకాల్లో భాగంగా పేలుళ్లకు ఉపయోగించే డిటోనేటర్‌ను ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. మద్యం మత్తులోనే ఇలా చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు తెలుసుకున్నారు. ఇవాళ మద్యం మత్తులో పనికి వెళ్లగా యజమాని వెనక్కి పంపించినట్లు వారు వెల్లడించారు. జేబులో ఎలక్ట్రికల్ డిటోనేటర్ తీసుకువచ్చి.. వాహనంపై వెంకటేష్ విసిరేశాడు. ఎలక్ట్రికల్ డిటోనేటర్‌కు కరెంటు లేకుండా పేలే అవకాశం లేదని పోలీసులు తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని పోలీసులు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని సీఐ చెప్పారు.
*తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నది
హైదరాబాద్ అంబర్ పేటలో సేవ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ వద్ద ఇప్పటికే డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర, ఆర్ట్స్ కాలేజీ చరిత్ర తెలిసేలా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ పెట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే సుమారు 14 కోట్ల రూపాయలతో క్రీడలను మెరుగుపరిచేందుకు, ట్రాక్ ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. ఇటీవల ఓయూలో రెండు హాస్టళ్ల భవనాల కోసం కేంద్రం రూ.15 కోట్లు మొదటి దశ మంజూరు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భవనాల నిర్మాణ కోసం నిధులు మంజూరు చేసిందన్నారు. అంతేకాకుండా.. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన దేశంలో కరోనా వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం అనేక చర్యలు తీసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. మన రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటళ్లలో అనేక వసతులు పెంచిందని.. మెడికల్ కాలేజీలో 50 శాతం సీట్లు కార్మికుల పిల్లలకు కేటాయించడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా.. గాంధీ, ఉస్మానియా, రైల్వే హాస్పిటల్లో వసతులు మెరుగుపరిచిందని చెప్పారు. ప్రైమరీ సెంటర్లతో పాటు బస్తీ దవాఖానల కోసం, మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున కేంద్రం నిధులు ఇచ్చిందని తెలియజేశారు.
*పార్లమెంట్ బరిలో జానారెడ్డి!
నల్లగొండ జిల్లా హాలియాలో మాజీ సీఎల్పి నాయకుడు కుందూరు జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బీజేపీ, బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 75 వేల కోట్ల అప్పు చేస్తే.. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ 5లక్షల 60వేల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా.. దేశంలో తొమ్మిదేళ్లలో 112 లక్షల కోట్లు మోడీ ఖర్చు చేశాడని తెలిపారు. మోడీ, కేసీఆర్ లు చేసిన అవినీతిపై ఒకరిపై ఒకరు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో మద్యం, డబ్బు లేకుండా పోటీ చేయాలని సవాల్ చేసినా స్వీకరించలేదని జానారెడ్డి తెలిపారు. ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం తన వారసులను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పార్లమెంట్ బరిలో ఉంటానని అన్నారు. ఇదిలా ఉంటే.. ఉచిత కరెంటు మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని.. 24 గంటల కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఆయన తెలిపారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా? పార్లమెంట్ బరిలో నిలవాలా? అనే సందిగ్ధంలో జానారెడ్డి ఉన్నారని తెలుస్తోంది. రోజుకో రకంగా కామెంట్స్ చేస్తున్న ఆయన… తాజాగా నల్గొండ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని అంటున్నారు. జానారెడ్డికి నాగార్జున సాగర్ నియోజకవర్గం కంచుకోట. ఆయన టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి రికార్డు విజయాలు సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లోనూ ఆయనే గెలుపొంది తెలంగాణ తొలి ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ.. దివంగత నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ చేతిలోనూ ఓడిపోయారు. కాగా.. మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేస్తారా ? చేయరా ? అన్న సంశయం కార్యకర్తల్లో వచ్చింది.
*యుద్ధంలో చిక్కుకున్న భారత విద్యార్థులు.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం
హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లతో దాడి చేశారు. ఇజ్రాయెల్ వైపు నుంచి ప్రతీకార చర్య కూడా వచ్చింది. ప్రస్తుతం చాలా మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్‌లో ఉన్నారు. సమాచారం ప్రకారం.. 18 వేల మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు, వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉండడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితిని భారత ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడిపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడుతూ.. శనివారం రాత్రి మాకు చాలా సందేశాలు వచ్చాయి.మేము రాత్రంతా పని చేస్తున్నాము. ప్రధాన మంత్రి కార్యాలయం పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోందని ఆమె వెల్లడించారు. ప్రధాని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు. భారత రాయబార కార్యాలయం తన పౌరులందరినీ అప్రమత్తంగా ఉండాలని సూచించిందని అందరికీ తెలిసిన విషయమే. భారత విద్యార్థులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యార్థులతో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు విద్యార్థులను సమీపంలోని షెల్టర్లకు తరలించారు. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థి గోకుల్ మనవలన్ వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘నేను చాలా భయాందోళనలకు గురవుతున్నాను. ఇజ్రాయెల్ పోలీసు బలగాలు మాకు అండగా ఉన్నాయి. ఇప్పటివరకు మేము సురక్షితంగా ఉన్నాము. మేము భారతీయ రాయబార కార్యాలయం నుంచి వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నాము.’ అని తెలిపారు.
*అక్టోబర్ 14 వరకు ఇజ్రాయెల్‌కు విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య.. ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ కు వెళ్లే తన విమానాలను రద్దు చేసింది. తమ ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుండి వెళ్లే ఎయిరిండియా విమానాలను అక్టోబర్ 14 వరకు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ కాలంలో.. ధృవీకరించబడిన బుకింగ్‌లు చేసిన వ్యక్తులందరికీ సాధ్యమైన సహాయం అందించబడుతుందని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఎయిరిండియా ప్రతి వారం టెల్ అవీవ్‌కు 5 విమానాలను నడుపుతోంది. అంతకుముందు శనివారం కూడా.. ఫ్లైట్ నంబర్ AI 139, న్యూ ఢిల్లీ నుండి టెల్ అవీవ్ వెళ్లే రిటర్న్ ఫ్లైట్ AI 140 రద్దు చేశారు. అక్టోబర్ 6 శనివారం హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు.. ఇజ్రాయెల్‌లో సుమారు 300 మంది మరణించారు. సుమారు 1590 మంది గాయపడ్డారు. అటు గాజాలో కూడా 232 మంది మరణించారు. 1790 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో 20 మంది చిన్నారులు సహా 256 మంది పాలస్తీనా పౌరులు మరణించారని గాజాలో ఉన్న పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదేకాకుండా.. 1788 మంది పాలస్తీనియన్లు కూడా గాయపడ్డారు. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ దాడికి సంబంధించి యుద్ధం ప్రకటించాడు. శత్రువులు దీనికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం.. హమాస్ తీవ్రవాదులు గాజా స్ట్రిప్ నుండి 2 వేలకు పైగా రాకెట్లను కాల్చారు. ప్రతిస్పందనగా సైన్యం గాజా నగరం మధ్యలో ఉన్న ఒక టవర్‌ను కూల్చివేసింది. వాయు, సముద్ర సరిహద్దుల్లోని 7 ప్రాంతాల నుంచి హమాస్ చొరబడినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరోవైపు గాజా స్ట్రిప్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవాలని కోరుకుంటున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపింది. IDF ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ మాట్లాడుతూ.. గాజా స్ట్రిప్‌పై నియంత్రణ సాధించడమే తమ లక్ష్యమని.. తమకు రాబోయే 12 గంటల లక్ష్యం ఉందని తెలిపారు. తాము మొత్తం ప్రాంతాన్ని నియంత్రించాలనుకుంటున్నామని.. తీవ్రవాదులను చంపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
*సచిన్ రికార్డు బద్దలు.. ప్రపంచకప్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్!
ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ ఈ రికార్డు సాదించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఏడవ ఓవర్ రెండో బంతికి ఫోర్ బాదిన దేవ్ భాయ్.. ప్రపంచకప్ టోర్నీలో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 19 ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 1,000 పరుగులు పూర్తి చేశాడు. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును వార్నర్ బద్దలు కొట్టాడు. సచిన్, డివిలియర్స్ 20 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అందుకున్నారు. విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ 21 ఇన్నింగ్స్‌లలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా, దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హర్షల్ గిబ్స్ 22 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు.
