Site icon NTV Telugu

Top Headlines@1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

*తీవ్ర తుఫానుగా మోచా.. తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు ఉదయం 5:30 గంటలకు అదే ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కొంత సేపటికి వాయువ్య దిశగా పయనించి ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా పయనించి క్రమంగా బలపడి ఇవాల సాయంత్రానికి తుపానుగా మారుతుందని వెల్లడించింది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తున్నదని, ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. రేపు (12వ తేదీ) ఉదయం మళ్లీ క్రమంగా బలపడి, ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత దిశను మార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడి 14వ తేదీ మధ్యాహ్నం 110-120 వేగంతో కాక్స్ బజార్ (బంగ్లాదేశ్), క్యుక్ప్యూ (మయన్మార్) వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రేపటి నుంచి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. నేటి నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, రాష్ట్రంలోని కొన్ని చోట్ల దాదాపు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. “ఆకాశం నిర్మలంగా ఉంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఉంటుంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు మరియు 28 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. వాయువ్య దిశ నుండి గాలులు గంటకు 4 నుండి 6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ బులెటిన్ పేర్కొంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 36.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 61 శాతంగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా పొడి వాతావరణం ఉంటుంది. రానున్న మూడు రోజుల పాటు రాయలసీమలో కూడా పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి రెండు చోట్ల సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

*టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ముగ్గురికి నిందుతులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రేణుక,డి రమేష్, ప్రశాంత్ రెడ్డి లకు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ముగ్గురి నిందుతుల పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని పోలిసులకు అదేశాలను జారీ చేసింది. మూడు నెలల వరుకు ప్రతి సోమ, బుధ, శుక్రవారం లో సీట్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి ప్రవీణ్‌ వ్యక్తిగత సహాయకుడు లీకేజీకి కారణమని.. రేణుక, లవుద్యావత్ డాక్యా ప్రధాన నిందితులుగా ఉన్నారు. కాగా… రేణుకాది గండిఎడ్‌ మండలం మన్సూర్‌పల్లి తండా.. అదే మండలానికి చెందిన డాక్యాది పంచాంగల్‌ తండా. డాక్యా బీటెక్ పూర్తి చేసి దాదాపు 15 ఏళ్లుగా టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 2018లో వనపర్తిలోని గురుకుల పాఠశాలలో హిందీ పండిట్‌గా ఉద్యోగం రావడంతో మూడేళ్ల క్రితం రేణుక మహబూబ్‌నగర్‌కు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం రేణుక వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం గురుకులంలో పని చేస్తోంది. అయితే టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో రేణుక ప్రవీణ్‌తో సన్నిహితంగా మెలిగింది. ప్రవీణ్‌కి ఆమె తన ఫోన్‌ నంబర్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ ఆమెకు తరచూ ఫోన్ చేసేవాడని సమాచారం. ఆ తర్వాత తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలో రేణు పలుమార్లు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చింది. TSPSC పేపర్ లీక్ చేయాలని రేణుక, ఆమె భర్త ప్లాన్ చేసుకున్నారు. ప్రవీణ్‌తో రేణుకు ఉన్న సన్నిహిత సంబంధంతో ముగ్గురు కలిసి TSPSC పేపర్‌ను లీక్ చేశారు.

*నీటి వాటాలపై తేల్చకుండానే ముగిసిన కేఆర్‌ఎంబీ సమావేశం
కృష్ణా జలాల్లో నీటి వాటాలను తేల్చకుండానే కేఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. నదీ జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని తెలంగాణ వాదిస్తే.. 66:34 నిష్పత్తిలో ఉండాలని ఏపీ వాదిస్తోంది. ఇదిలా ఉండగా.. కేంద్రం తొమ్మిదేళ్ల నుంచి నీటి వాటాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది. తాత్కాలిక సర్దుబాటు 66:34 తమకు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ స్పష్టం చేస్తోంది. నీటి వాటా ఖరారు అంశాన్ని ట్రైబ్యునల్‌కు నివేదించామని, 811 టీఎంసీల్లో చెరోసగం కేటాయించాల్సిందేనని తెలిపింది. పాలమూరు-రంగారెడ్డిపై కేంద్రం సరిగా స్పందించడం లేదని.. పట్టిసీమ గోదావరి జలాల మళ్లింపులో తమకెందుకు వాటా ఇవ్వరని ప్రశ్నించారు తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్. అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని.. తెలంగాణలోని ఓ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, బోర్డు బడ్జెట్‌పై చర్చ జరిగింది. గెజిట్‌ నోటిఫికేషన్‌, హిందీ అమలు, ఏపీకి కార్యాలయం తరలింపు, జల విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి లెక్కింపు, ఆర్డీఎస్‌పై చర్చించారు అధికారులు. కేఆర్‌ఎంబీ కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎలాంటి నీటి వాటా ఖరారు చేయలేదని, 66:34 నిష్పత్తిలో నీటివాటా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ కోరినట్లు తెలిపారు ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలు మాత్రమే తీసుకోవాలన్న వాదన సరికాదన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కంటే సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటున్న ఏపీ అధికారులు.. కృష్ణా బోర్డును త్వరలో విశాఖకు తరలిస్తామని చెబుతున్నారు.

*కేజ్రీవాల్ సర్కారుకు బిగ్ రిలీఫ్‌
ఢిల్లీలో పాలనా వ్యవహారాలపై నియంత్రణ అధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పును వెలువరించింది. సుప్రీం తీర్పుతో కేజ్రీవాల్‌ సర్కార్‌కు బిగ్‌ రిలీఫ్‌ లభించింది. ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఢిల్లీ సర్కారుకు అధికారాలు లేవన్న గత తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వాధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్‌ జనరల్‌ కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది. వాస్తవ అధికారాలు ఎన్నికైన ప్రభుత్వానికే ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వానికి సేవలపై శాసన, కార్యనిర్వాహక అధికారం ఉంది. 2019లో జస్టిస్ అశోక్ భూషణ్ తీసుకున్న నిర్ణయంతో మేము ఏకీభవించబోమని సుప్రీంకోర్టు పేర్కొంది. 2019లో జస్టిస్ భూషణ్ పూర్తిగా కేంద్రానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

*విడాకులు తీసుకుంటున్న ప్రధాని
అతిచిన్న వయస్సులోనే దేశ అత్యున్నత పదవిని చేపట్టారు ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్. పదవిని చేపట్టడమే కాకుండా డైనమిక్‌ పీఎంగా పేరు కూడా తెచ్చుకున్న సనా మారిన్‌ ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తాజా ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్‌ విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించారు. తన మూడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె సోషల్‌మీడియాలో ప్రకటించారు. తన భర్త మార్కస్‌ రైకోనెన్‌తో కలిసి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ‘‘మేమిద్దం విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. మేం చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం. కలిసి పెరిగాం. 19 ఏళ్లుగా కలిసే ఉన్నాం. ఇప్పటికీ మేం మంచి స్నేహితులమే. మా ప్రియమైన కుమార్తెకు తల్లిదండ్రులమే. ఒక కుటుంబంగా మా కుమార్తె కోసం సమయాన్ని వెచ్చిస్తాం’’ అని ప్రధాని సనా మారిన్‌ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

*ఇమ్రాన్‌ అరెస్ట్‌తో భగ్గుమన్న పాకిస్థాన్.. అల్లర్ల అణచివేతకు రంగంలోకి సైన్యం
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌ నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. పాక్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన అల్లర్లు, ఆందోళనలు బుధవారమూ కొనసాగాయి. పలుచోట్ల విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ఏడుగురు మృతి చెందగా 300 మందికి గాయాలయ్యాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌పై అల్లర్లను అణిచివేసేందుకు పాకిస్థాన్ సైన్యాన్ని పిలిపించింది. పార్టీ ఆందోళనలతో అట్టుడికిన పంజాబ్, ఖైబర్‌ తదితర ప్రావిన్సుల్లో అల్లర్లను అదుపు చేసేందుకు సైన్యాన్ని మోహరించారు. శాంతిని పునరుద్ధరించేందుకు రెండు ప్రావిన్సులు, రాజధానిలో సైన్యాన్ని మోహరించడానికి మంత్రివర్గం ఆమోదించింది. ఇమ్రాన్‌ఖాన్‌ను మంగళవారం రాజధాని ఇస్లామాబాద్‌లో సాధారణ విచారణ సందర్భంగా అరెస్టు చేశారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక కోర్టులో ఆయనను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అవినీతి నిరోధక కోర్టులో విచారణ తర్వాత ఇమ్రాన్‌ను సెషన్స్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తోషఖానా అవినీతి కేసులో ఆయనపై నేరాభియోగాలను న్యాయమూర్తి నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఖరీదైన బహుమతులను అందించేందుకు 1974లో ఏర్పాటు చేసిన సంస్థే తోషఖానా. దీనికి స్టోర్‌ ఉంది. ప్రధానిగా ఉన్నప్పుడు అక్కడ రాయితీతో వస్తువులను తీసుకున్న ఇమ్రాన్‌.. ఆ తర్వాత వాటిని అధిక ధరకు అమ్ముకున్నారనేది ఈ కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌పై వచ్చిన ఆరోపణ. ఇస్లామాబాద్‌లో అత్యంత భద్రత కలిగిన పోలీస్‌ లైన్స్‌లోని నూతన పోలీస్‌ అతిథి గృహాన్ని ఈ కేసుల విచారణకు తాత్కాలిక కోర్టుగా నిర్ణయించారు. ఈ ప్రాంతానికి మీడియానూ అనుమతించలేదు. కోర్టు పరిసరాలకు వచ్చిన పార్టీ కీలక నేతలు ఖురేషీ, ఉమర్‌లనూ అడ్డుకున్నారు. పైగా రెండు అవినీతి కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉమర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఖురేషీ కోర్టు ఆవరణలోకి వెళ్లి అరెస్టు నుంచి తప్పించుకున్నారు.

*బీ అలర్ట్.. వాట్సప్‌ కాల్స్‌ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నా.. సైబర్ నేరగాళ్లు మాత్రం రోజుకో కొత్త మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్న పొరపాటు జరిగినా ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరాలకు తెరతీస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తూ దోచుకుంటున్నారు. దేశంలో సైబర్ మోసాలు ప్రబలంగా ఉన్నాయి. సైబర్ మోసగాళ్ళు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, ఈ వాణిజ్య సైట్‌లను వదలకుండా నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు అర్థంకాని రీతిలో ఇరుకున పెట్టి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరాలు నేడు ప్రధాన సమస్యగా మారడంలో ఆశ్చర్యం లేదు. సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా మోసానికి గురవుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు మోసగాళ్లు అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఇప్పుడు మరో కొత్త తరహా మోసానికి తెరతీశారు. అందుకు వాట్సాప్‌ను ఆయుధంగా ఎంచుకున్నారు. ఇతర దేశాల నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. వరుసగా కాల్స్ చేస్తూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ నంబర్ల నుంచి పదే పదే కాల్స్ రావడం చికాకు కలిగిస్తోంది. ఉద్యోగావకాశాలు, లాటరీలు, రుణాలు, టాస్క్‌ల పేరుతో వాట్సాప్ వినియోగదారులను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అమ్మాయిల పేర్లు, డీపీలతో ప్రలోభపెట్టే ఎత్తుగడలు వేస్తున్నారు. ముచ్చటగా మాట్లాడుతూ.. సైబర్ దాడి చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. మలేషియా, ఇథియోపియా, వియత్నాం, బ్యాంకాక్ వంటి దేశాల ఐఎస్‌డి కోడ్‌లతోనే ఈ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్‌లు, మెసేజ్‌లు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఫారిన్ కోడ్స్ ఉన్న ఫోన్లు వస్తే పెద్ద మోసమని లిఫ్ట్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ నంబర్ల ద్వారా సైబర్ మోసాలకు గురవుతున్నామని కొందరు స్కామర్లు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. అమ్మాయిలే ఎక్కువగా ఈ కాల్స్‌ టార్గెట్‌గా వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి అమ్మాయిల పేరుతో మెసేజ్ లు, వీడియో కాల్స్ వస్తున్నాయంటూ ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇతర దేశాల కోడ్‌లతో ఫోన్ వచ్చినంత మాత్రాన అది అంతర్జాతీయ కాల్ కాదు. ఇలాంటి కాల్స్‌ను వెంటనే బ్లాక్ చేయాలని వాట్సాప్ వినియోగదారులకు పోలీసులు సూచిస్తున్నారు. అయితే తమ నంబర్లు సైబర్ నేరగాళ్ల చేతికి ఎలా చేరాయని వాట్సాప్ యూజర్లు తలలు పట్టుకుంటున్నారు. వరుసగా కాల్స్ చేస్తూ విసిగి వేసారిపోతున్నామని, మెసేజ్ లు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు

*ఉస్తాద్ ఫస్ట్‌లుక్ అదిరింది..
పవన్ కళ్యాణ్ ని ఫాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా తెలిసింది ఫాన్స్ కి మాత్రమే. అందుకే ఆ ఫాన్స్ నుంచే ఒకరు బయటకి వచ్చి, పవన్ కళ్యాణ్ ని గబ్బర్ సింగ్ గా మార్చి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అసలు హిట్ ఫ్లాప్ అనేది మ్యాటర్ కాదు, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపించాడు? ఎంతలా ఎంటర్టైన్ చేశాడు అనేది మాత్రమే మ్యాటర్. పవన్ కళ్యాణ్ ని అభిమానులకి నచ్చేలా ప్రెజెంట్ చేస్తే చాలు బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనే విషయం స్పష్టంగా తెలిసిన పవన్ అభిమాని హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాడు. పవన్ కళ్యాణ్ అంటే ఇలానే కదా ఉండాలి, ఇలా కాదా ఎంటర్టైన్ చెయ్యల్సింది అనిపించే రేంజులో హరీష్ శంకర్, పవన్ ని ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమా కొట్టిన హిట్ దశాబ్దం పాటు రీసౌండ్ లా వినిపిస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ చూపించినట్లు ఇంకొకరు చూపించలేరు అనే కామెంట్ పుష్కర కాలంగా వినిపిస్తూనే ఉంది. ఈ మాటని మరో పుష్కరం పాటు వినిపించేలా చెయ్యడానికి హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ లు కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ఇటివలే సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ అవ్వగానే అభిమానుల అంచనాలు, ట్రేడ్ వర్గల లెక్కలు ఆకాశాన్ని తాకాయి. ఆకాశం మాకు హద్దు కాదు అని చాటి చెప్తూ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ కోసం వెయిట్ చేస్తున్న పవన్ ఫాన్స్ కి మరింత కిక్ ఇస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సర్ప్రైజ్ గిఫ్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ని పవన్ కళ్యాణ్ స్టైల్ అండ్ స్వాగ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ ముస్లిమ్స్ ఉండగా… ఫోర్ గ్రౌండ్ లో పోలిస్ బ్యారికేడ్ పైన చెయ్ పెట్టి, ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నాడు. షర్ట్ బటన్స్ అన్నీ వదిలేసి, ఒక్కటి మాత్రమే పెట్టి… బ్లాక్ గాగుల్స్ తో పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేసాడు. టికెట్ వర్త్ పోస్టర్ ని గిఫ్ట్ గా ఇవ్వడంతో పవన్ ఫాన్స్ అంతా హరీష్ శంకర్ కి గుడి కట్టినా తప్పులేదు మావా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

*మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అంటే మామూలు విషయం కాదు. అది కూడా రాజమౌళి తర్వాత శంకర్‌తో సినిమా చేస్తున్న ఘనత కేవలం రామ్‌ చరణ్‌కే చెల్లింది. మెగా పవర్ స్టార్‌ను సీఎంగా చూసేందుకు.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్‌ రేంజ్‌లో రామ్ చరణ్‌ను ఊహించుకుంటున్నారు. అయితే స్టార్టింగ్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోయిన ఆర్సీ 15.. ఈపాటికే థియేటర్లోకి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేయాల్సింది. కానీ ఇండియన్ 2 వల్ల డిలే అయిపోయింది. దాంతో అసలు గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడు? అనేది తేలడం లేదు. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కాబట్టి.. రిలీజ్ విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చేయాల్సింది. కానీ ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనేది చెప్పడం లేదు. వచ్చే సంక్రాంతి లేదా సమ్మర్‌కు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ లేటెస్ట్ అప్టేడ్ మాత్రం మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌ అనే చెప్పాలి. రీసెంట్‌గా క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఈ ఏడాదిలోనే థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. క్రిస్మస్ టార్గెట్‌గా డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అప్పటికే కొన్ని సినిమాలు ఈ రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నా.. చరణ్ బరిలోకి దిగితే లెక్కలు మారిపోనున్నాయి. సంక్రాంతికి ప్రభాస్, మహేష్ రాబోతున్నారు కాబట్టి.. అప్పటి వరకు గేమ్ ఛేంజర్ థియేటర్లో సాలిడ్ గేమ్ ఆడేయొచ్చు. అయితే ఈ రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version