Site icon NTV Telugu

Top Headlines@1PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*బీఆర్ఎస్- బీజేపీ కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర.. ఐటీ దాడులకు భయపడేది లేదు..
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ భయ పెట్టాలని చూస్తున్నారు అని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఐటీ దాడులకు భయపడేది లేదు అని ఆయన వ్యాఖ్యనించారు. ఇది బీఆర్ఎస్- బీజేపీ కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర.. ఇలాంటి రాజకీయ బెదిరింపులకు కాంగ్రెస్ నాయకులు భయపడరు అంటూ టీపీసీసీ చీప్ మండిపడ్డారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ అంత అండగా ఉంటుంది అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్- బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకులను మాత్రమే టార్గెట్ గా చేసుకుని ఐటీ అధికారులు దాడులు చేస్తుందని దుయ్యబట్టారు. గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో మాత్రమే ఐటీ దాడులు చేస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోంది అని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అని వెల్లడించారు. ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు.

*పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా చేరిన పోలీసులు
ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత.. ఐటీ దాడులను నిరసిస్తూ కార్యకర్తలు, అనుచరుల ఆందోళన.. పొంగులేటి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు కార్యకర్తల ప్రయత్నం.. దాదాపు 7 గంటలుగా తనిఖీలు సాగుతున్నాయి. ఖమ్మం, హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఖమ్మంలో 5, హైదరాబాద్‌లో 10 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి బంధువులు, కీలక ఉద్యోగుల ఇళ్లల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఇవాళ పాలేరులో పొంగులేటి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. పాలేరు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయంలో గురువారం ఉదయం ఐటీ సోదాలు జరిగాయి. ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు 8 వాహనాల్లో వచ్చారు. ఇది జరుగుతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల క్రితమే చెప్పారు. ఖమ్మంలోని పొంగులేటి ఇంటి కార్యాలయాలను తనిఖీ చేస్తున్న ఐటీ శాఖ అధికారులు. పొంగులేటి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో పొంగులేటి కుటుంబ సభ్యులంతా ఖమ్మంలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే పొంగులేటి అనుచరులు, శ్రేణులు ఇంటివద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున 4:30 గంటలకు వచ్చిన ఐటీ అధికారులు వారందరి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి అనుచరుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పాలేరు, హైదరాబాద్‌లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. వంశీరామ్ బిల్డింగ్స్‌లోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటి రాఘవ్‌ కన్‌స్ట్రక్షన్‌ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో చేరాడు. అయితే తనకు ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో పొంగులేటి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆ తర్వాత ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి పాలేరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు జరుగుతుండటం గమనార్హం.

*చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ వాయిదా
ఫైబర్ నెట్‌ స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబును ఫైబర్‌ నెట్‌ కేసులో అరెస్ట్‌ చేయొద్దని సుప్రీం ఆదేశించింది. స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ రిజర్వ్‌లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. స్కిల్‌ స్కాం క్వాష్‌ పిటిషన్‌లోని కొన్ని అంశాలు ఫైబర్‌నెట్‌ కేసుతో ముడిపడి ఉన్నాయని.. క్వాష్‌ పిటిషన్‌ తీర్పు తర్వాతే ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌పై విచారణ చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. దీపావళి సెలవుల అనంతరం స్కిల్ కేసు తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆరోగ్యకారణాల రీత్యా చంద్రబాబు ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. సుప్రీంకోర్టులో కేసు ముగిసేవరకు అరెస్టు చేయబోమనే నిబంధన కొనసాగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా కోర్టుకు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఈనెల 23లోగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు పెట్టుకున్న 17-ఏ పిటిషన్‌పై దీపావళి సెలవుల తర్వాత సుప్రీం తీర్పు వెలువడనుంది.

*హైకమాండ్ ఆదేశిస్తే సీఎం అవుతా.. ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమయంలో రాజకీయ నేతల ప్రసంగాలు, విలేకరుల సమావేశాలు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులంతా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. హామీలు వస్తున్నాయి. తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తే ఒక ఎస్సీ, ఎస్టీ, ఒక మహిళ, ఓసీ అభ్యర్థి సీఎం అవుతారని, పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే సీఎం పదవి చేపడతానని ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 సీట్లు గెలుస్తామని, 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన బలం, బలహీనత దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలని, రూ.200 కోట్లు ఖర్చు చేసిన తనను ఓడించలేకపోతున్నారని, తనను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఇళ్లు కాలిపోయినప్పుడు, ప్రజలు ఇబ్బందులు పడినప్పుడు, ఎన్నికల సమయంలో రాలేని అధికార పార్టీ నాయకులు ములుగులో ఇబ్బందులు సృష్టించారని అన్నారు. నేడు ఓట్ల కోసం రెండు, మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా వెనుకంజ వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తన కోసం రాజకీయాల్లోకి రాలేదని మరోసారి ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉన్నప్పటికీ అందరూ కాంగ్రెస్‌ వైపే ఉన్నారని, ఇక్కడి రాజకీయాలను ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రతి ఒక్కరూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని, పేదలకు ఇళ్లు కట్టించి భూములు పంచింది కాంగ్రెస్‌ పార్టీయేనని అన్నారు. చదువుకున్న విద్యార్థులంతా నిరుద్యోగులని, పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును చూసి తల్లిదండ్రుల గుండెలు తరుక్కుపోతున్నాయని, నిరుద్యోగ యువత అంతా తనకు అనుకూలంగా ఉన్నారని, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

*నామినేషన్ దాఖలు చేసిన భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ వేయడానికి మధిర రిటర్నింగ్ కార్యాలయానికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తుల, అభిమానులతో కలిసి ఆయన వెళ్లి నామినేషన్ వేశారు. మధుర నియోజకవర్గానికి నాలుగోసారి భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారు. ఆయన ఇప్పటికి మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.. ఇక, నాలుగోసారి గెలిచేందుకు తన నామినేషన్ ను భట్టి విక్రమార్క దాఖలు చేశారు. ఈ సందర్బంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు అంటూ మండిపడ్డారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి అని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో నామినేషన్ కు వెళుతున్న వేళ ఇలా ఐటీ దాడుల పేరుతో బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని హెచ్చరించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని భట్టి విక్రమార్క తెలిపారు.

*సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాజ‌న్న సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ఇక, ఇవాళ ఆయన త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి అందించారు. సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్ ఐదోసారి బ‌రిలో దిగుతున్నారు. నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు కేటీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు చేశారు. కాసేపట్లో ఆర్మూర్‌లో నిర్వహించే రోడ్ షోలో కేటీఆర్ పాల్గొంటారు. ఇక, సాయంత్రం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు. ఇక, మంత్రి కేటీఆర్ 2006 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ వెన్నంటి ఉన్నారు. తొలిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ క్యాండిడేట్ గా కేటీఆర్ పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. ఇక, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తన ఎమ్మెల్యే పదవికి కేటీఆర్ రాజీనామా చేసి తిరిగి 2010 ఉప ఎన్నికల్లో బరిలో నిలిచడంతో పాటు సమీప ప్రత్యర్ధి కేకే మహేందర్‌ రెడ్డిపై మరోసారి 68 వేల 219 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 జనరల్‌ ఎన్నికల్లో 53 వేల 4 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తిరిగి 2018 ఎన్నికల్లో సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 89 వేల 9 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి మంత్రి కేటీఆర్ రికార్డు సృష్టించారు.

 

*టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం.. ఆ అంశాలే ప్రధాన అజెండా
టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం జరుగుతోంది. ఓ ప్రైవేట్ హోటల్లో ఇరు పార్టీలకు చెందిన జేఏసీ సభ్యులు సమావేశమయ్యారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలిసింది. మేనిఫెస్టో ప్రకటన లోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపత్రo రూపకల్పన పైనా ప్రధానంగా నేతలు చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి టీడీపీ – జనసేనలు 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకోనున్నాయి. ఓటర్ జాబితా అవకతవకలపైనా ఉమ్మడి పోరుకు ప్రణాళికను రచిస్తున్నాయి. నియోజకవర్గాల స్థాయిలో ఆత్మీయ సమావేశాల నిర్వహణపై జేఏసీ నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశానికి లోకేష్ సహా ఇరు పార్టీలకు చెందిన జేఏసీ సభ్యులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. ఓటరు లిస్టు అవకతవకలపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని టీడీపీ పీఏసీ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కారు దోపిడీ, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడి పోరాటాలకు కార్యాచరణ రూపకల్పన చేయాలని పీఏసీ భావించింది. ఇసుక, మద్యం, కరువు, ధరలు, ఛార్జీల పెంపు వంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రచించింది. నియోజకవర్గాల వారీగా టిడిపి-జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించేలా జేఏసీలో ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై నేటి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

*శ్రీవారి భక్తులకు శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శన టికెట్లతో పాటు గదులూ విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబ‌రు 23 నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనానికి సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శన టికెట్లు, శ్రీ‌వాణి ద‌ర్శన టికెట్లు, గ‌దుల కోటాను న‌వంబ‌రు 10న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రోజుకి 22500 చోప్పున పది రోజులుకు 2.25 లక్షల టికెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. రోజుకి 2 వేల చొప్పున 20 వేల టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. సాయంత్రం 5 గంటలకు వసతి గదులు కోటా విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాలను గమనించాలని టీటీడీ అధికారులు కోరారు. డిసెంబర్ 22న వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 4.25 లక్షల టైంస్లాట్ సర్వ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని టీటీడీ తెలిపింది.

 

*అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా సారథి
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ టీమ్ కెప్టెన్ మెగ్‌ లాన్నింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తన తీసుకున్న నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని లాన్నింగ్‌ వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన టైం అని ఆమె పేర్కొంది. 31 ఏళ్ల లాన్నింగ్‌ సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక, మెగ్ లాన్నింగ్‌ తన 13 ఏళ్ల సుధీర్ఘ కెరీర్‌లో 241 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 182 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా ఆమె వ్యవహరించారు. ఫుల్‌టైమ్‌ బ్యాటర్‌, పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ అయిన మెగ్ లాన్నింగ్‌ తన కెరీర్‌లో 17 సెంచరీలతో పాటు 38 అర్థ శతకాలు చేయడంతో పాటు 5 వికెట్లు పడగొట్టింది. మూడు రకాల ఫార్మెట్లలో 241 మ్యాచ్ లు ఆడి 8,352 పరుగులు సాధించారు. లాన్నింగ్‌ తన కెరీర్‌లో ఏడు వరల్డ్‌కప్‌ టైటిళ్లు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవడం చాలా కష్టమైన నిర్ణయం అని మెగ్ లాన్నింగ్ పేర్కొన్నారు. కానీ, రిటైర్మెంట్ కోసం ఇదే సరైన సమయమని ఆమె తెలిపారు. ఇక, మెగ్ లాన్నింగ్‌ మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు సారథిగా కొనసాగుతానని ప్రకటించింది.

Exit mobile version