*280 మందికి పైగా దుర్మరణం.. ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి
ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, మంత్రులు, దేశ రాయబారులు సందేశాలు పంపుతున్నారు. ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సానుభూతి తెలిపారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత పౌరులకు కెనడియన్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిన్ ట్రుడో ఒక ట్వీట్ చేశారు.అలాగే తైవాన్ ప్రెసిడెంట్ ట్సాయి ఇంగ్ వెన్ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం, క్షతగాత్రులకు సానుభూతి ప్రకటించారు. ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు కూడా స్పందించారు. బాధిత కుటుంబాలకు రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపొవ్ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 280 మందికిపైగా దుర్మరణం చెందారు. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో నడిచే కొన్ని రైళ్లను రద్దు చేయగా, పలు రైళ్లను దారి మళ్లించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది.
*తెలుగురాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు
ఆపరేషనల్ కారణాల వల్ల విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నేటి నుంచి 9వ తేదీ వరకు 12 రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. విజయవాడ డివిజన్ మీదుగా వెళ్లే 12 రైళ్లు రద్దు కాగా.. ఒడిశా ప్రమాదం క్రమంలో మరికొన్ని రైళ్లు క్యాన్సిల్ అయ్యాయి. పలు కారణాల వల్ల ఏపీలో ప్రయాణించే 12 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏడు రోజుల పాటు రద్దు చేసింది. విజయవాడ-రాజమండ్రి(07459), రాజమండ్రి-విజయవాడ(07460), రాజమండ్రి-విశాఖపట్నం(07466), విశాఖపట్నం- రాజమండ్రి(07467), కాకినాడ పోర్ట్ -విశాఖపట్నం(17267), విశాఖపట్నం- కాకినాడ పోర్ట్(17268), కాకినాడ పోర్ట్ -విజయవాడ(17258), విజయవాడ -కాకినాడ పోర్ట్(17257), గుంటూరు -విశాఖపట్నం(17239), విశాఖపట్నం -గుంటూరు(17240), విశాఖపట్నం- విజయవాడ(22701), విజయవాడ- విశాఖపట్నం(22702) ట్రైన్లను 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రద్దు చేశారు. ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల కుటుంబసభ్యులకు సహాయం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ- 0866 2576924, రాజమండ్రి- 08832420541, సామర్లకొట-7780741268, నెల్లూరు-08612342028, ఒంగోలు-7815909489, గూడురు-08624250795, ఏలూరు-08812232267 నెంబర్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఏపీకి చెందిన పలువురు ప్రయాణికులు కూడా ఈ ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 70 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. నేడు దాదాపు 50 రైళ్లను రద్దు చేయగా.. 38 రైళ్లను దారి మళ్లించారు. హౌరా-తిరుపతి(20889), హౌరా-సికింద్రాబాద్(12703), హౌరా-హైదరాబాద్(18045) రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-షాలిమార్(22850), వాస్కోడగామా-షాలిమార్(18048) రైళ్లను కటక్, అంగోల్ మీదుగా దారి మళ్లించనుండగా.. చెన్నై సెంట్రల్-హౌరా(12840) ట్రైన్‌ను జరోలి మీదుగా, బెంగళూరు-గువాహటి(12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్, జార్సుగుడా, టాటా మీదుగా మళ్లించనున్నారు. హౌరా-పూరీ(12837), హౌరా-బెంగళూరు(12863), హౌరా-చెన్నై మెయిల్(12839), హౌరా-సంబల్‌పూర్(20831), సంత్రగాచి-పూరీ(02837), కన్యాకుమారి-హోరా(1266), చెన్నై సెంట్రల్-హౌరా(12842), బెంగళూరు- రైళ్లను నేడు రద్దు చేశారు.
*ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి ఆఫ్ లైన్ లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ పరిశీలించారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులకు బయోమెట్రిక్‌తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 58 మంది దివ్యాంగులు స్క్రైబ్స్ కు అనుమతి కోరారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు.
*ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన వివరాలను ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఆరేళ్ల సమీకృత బీ.టెక్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 4 నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను జూలై 13న విడుదల చేస్తామని, ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తామని కేసీ రెడ్డి చెప్పారు. దివ్యాంగుల కోటాను 3 నుంచి 5 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అడ్మిషన్లు చేపడతామన్నారు. 40 శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారు మాత్రమే ఈ కోటాలో అర్హులని పేర్కొన్నారు. పీహెచ్‌సీ, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ తదితర ప్రత్యేక కేటగిరీ కోటా విద్యార్థుల సర్టిఫికెట్లను నూజివీడు ట్రిపుల్ ఐటీలో జూలై 5 నుంచి 9వ తేదీ వరకు పరిశీలిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్‌ను జోడించి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని వివరించారు. ఒక్కో క్యాంపస్‌లో ఉన్న వెయ్యి సీట్లకు అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో వంద సీట్లు కూడా భర్తీ చేస్తామన్నారు. నాలుగు క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు భర్తీ చేస్తామని, ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తామని తెలిపారు. వీటికి అదనంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 5 శాతం సూపర్‌న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ కోటాలో చేరినవారు ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలకు ఎంపికైనవారికి జూలై 21, 22 తేదీల్లో, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు జూలై 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తామని వెల్లడించారు.
*హ్యాపీ బర్త్‌డే బావా.. ఆప్యాయంగా విష్ చేస్తూ కవిత ట్వీట్
నేడు తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియాలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అభిమానులు హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంత్రి హరీశ్‌కు సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తన బావ అయిన మంత్రి హరీశ్ రావుకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయంగా విష్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి గతంలో జరిగిన ఓ ఈవెంట్‌కి సంబంధించిన ఫొటోను ఎమ్మెల్సీ కవిత షేర్ చేశారు. కవిత షేర్ చేసిన ఫోటోను పలువురు రీట్వీట్ చేస్తున్నారు. అక రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజున, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో జనపనార విత్తనాలను నాటాలని సూచించారు. పర్యావరణ ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ చిరు కార్యక్రమంలో పాల్గొనాలని సంతోష్ విజ్ఞప్తి చేశారు. మంత్రి హరీశ్ రావుతో కలసి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను ట్వీట్ చేశారు.
*కొద్దిరోజులు ఆగండి.. రైతులుకు వాతావరణశాఖ హెచ్చరిక..
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విత్లనాలు వేసేవారికి కొద్ది రోజులు ఆగాలనీ సూచించింది. ఇప్పట్లో విత్తనాలు వేయకూడదని హెచ్చిరికలు జారీ చేసింది. జూన్ నెల ప్రారంభం కాగానే వాతావరణంలో మార్పులు వచ్చి వాతావరణం చల్లబడుతుంది. కానీ జూన్ నెల ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా.. ఎండలు ఇంకా మండుతూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారీ వర్షాలు, వడగళ్ల వానలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడమే ఇందుకు కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఏటా జూన్ మొదటి వారంలో కేరళను తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి జూన్ రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు ప్రవేశిస్తే ఎండలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రానికి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా వస్తున్నాయి. 2021లో, నైరుతి రుతుపవనాలు మే చివరి నాటికి కేరళను తాకనున్నాయి. జూన్ మొదటి వారంలో తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. ఇక 2022లో నైరుతి రుతుపవనాలు మే 29న కేరళను తాకనున్నాయి.అవి జూన్ 8న రాష్ట్రానికి చేరుకున్నాయి.దీంతో తెలంగాణలో సాధారణ వర్షపాతం కంటే 50 శాతం ఎక్కువ వర్షం కురిసింది. 2021లో తెలంగాణలో 111.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2022 సీజన్‌లో 109.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. అయితే ఈ రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాలు ఐదు రోజులు ఆలస్యంగా రాష్ట్రాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. నేడు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ద్రోణి ద్రోణి ప్రభావంతో ఈరోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చిన్నపాటి జల్లుల కారణంగా రైతులు పంట వేయవద్దని సూచించారు. ఇది ఇలా ఉండగా ఈ ఏడాది వాతావరణం భిన్నంగా ఉందనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వడగళ్ల వాన కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
*ప్రేయసి కడుపులో బిడ్డకు డీఎన్ఎ టెస్ట్ చేయించిన 83 ఏళ్ళ నటుడు.. సిగ్గుండాలి
సాధారణంగా పెళ్లి, పిల్లలు అనేది వారి పర్సనల్స్. కానీ, సినీ తారల విషయంలో మాత్రం అభిమానులు ఎప్పుడు వారి జీవితాల్లోకి తొంగి చూస్తూ ఉంటారు. అది అనుమానం కాదు అభిమానం. మా హీరో అది.. మా హీరో ఇది అని చెప్పుకోవాలి అంటే.. వారు తప్పు చేయకుండా అభిమానులే ఆపాలి. అయితే ఇదంతా మన దేశం వరకే.. హాలీవుడ్ నటులు ఇలాంటివాటి గురించి అస్సలు పట్టించుకోరు. ఏ వయస్సులోనైనా పెళ్లి చేసుకుంటారు.. పిల్లల్ని కంటారు. ఎంతమందిని అయినా పెళ్లి చేసుకుంటారు. అయితే 83 ఏళ్ళ వయస్సులో తండ్రి కాబోతున్నాడు ఒక నటుడు. ఇక్కడవరకు ఓకే కానీ, ఆ బిడ్డకు తండ్రి తాను అవునో కాదో అని డీఎన్ఎ టెస్ట్ చేయించాడు. ప్రస్తుతం ఆ ఘనుడు గురించిన ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎవరా నటుడు అని అంటే .. ఫేమస్ హాలీవుడ్ నటుడు అల్ పాసినో. గాడ్ ఫాదర్ లాంటి క్లాసిక్ మూవీలో నటించి మెప్పించిన అల్ పాసినో 83 ఏళ్ళ వయస్సులో తనకంటే వయస్సులో చిన్నది అయిన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. ఈ మధ్యనే ఆమె ప్రెగ్నెంట్ అయ్యినట్లు తెల్సింది. ఇక ఆ విషయం తెల్సిన వెంటనే ఎవరైనా ఏం చేస్తారు.. ఎగిరి గంతేస్తారు. లేక అందరికి స్వీట్స్ పంచుతారు. కానీ, మనోడు మాత్రం ఆ బిడ్డకు తండ్రి తానో కాదో తెలియడానికి డీఎన్ఎ టెస్ట్ చేయించాడు. చివరకు ఆ డీఎన్ఎ టెస్ట్ లో బిడ్డకు ట్యాంఫ్రి తానే అని తెలిసాకా హిప్ హిప్ హుర్రే అంటూ డ్యాన్స్ లు వేశాడు. ఇక ఈ విషయం తెలియడంతో నెటిజన్స్ అతడిని ఏకిపారేస్తున్నారు. సిగ్గుండాలి.. అంత నమ్మకం లేనప్పుడు ఆమెతో సహజీవనం ఎలా చేసావ్ అని కొందరు. ఈ వయస్సులో నువ్వు చేసిందే పెద్ద తప్పు.. మళ్లీ దానికి తోడు ఇలాంటి పనులా.. ఛీఛీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
*ఈ కారం ఘాటు హాలీవుడ్ వరకూ చేరింది… రీజనల్ సినిమాకి కింగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ప్రకంపనలు టాలీవుడ్ ని దాటి హాలీవుడ్ వరకూ చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ‘గుంటూరు కారం’ టైటిల్ అనౌన్స్మెంట్ మాస్ స్ట్రైక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ రాబట్టి కొత్త డిజిటల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్న గుంటూరు కారం సినిమా గురించి హాలీవుడ్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ బాబు 28వ సినిమా టైటిల్ ని ‘గుంటూరు కారం’గా ప్రకటించారు అంటూ వెరైటీ ఆర్టికల్ ని పబ్లిష్ చేసింది. ఒక రీజనల్ సినిమాకి ఈ రేంజ్ రీచ్ రావడం మహేష్ బాబుకే సొంతం అయ్యింది. వెరైటీ మ్యాగజైన్ ఆర్టికల్ పబ్లిష్ చేయడంతో మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇది సార్ మా హీరో రేంజ్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. రీజనల్ సినిమాలో ఇప్పటివరకూ చూడని ఓపెనింగ్స్ ని ఇచ్చిన మహేష్ బాబు ఈసారి ‘గుంటూరు కారం’ సినిమాతో మెసేజులు వదిలేసి మాస్ సినిమా చూపించబోతున్నాడు. అందుకే అమలాపురం నుంచి అమెరికా వరకూ ఉన్న మహేష్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడే కాదు ఓవర్సీస్ లో మహేష్ బాబుకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఇప్పటివరకూ అక్కడ 11 వన్ మిలియన్ డాలర్ సినిమాలని ఇచ్చాడు. గుంటురు కారం సినిమాకే ఇలా ఉంటే మహేష్ నెక్స్ట్ సినిమా దర్శక ధీరుడు రాజమౌళితో ఉంది. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ గ్లొబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనుంది. పాన్ వరల్డ్ బాక్సాఫీస్ టార్గెట్ గా రానున్న SSMB 29 సినిమాకి హాలీవుడ్ లో ఇంకెంత హవోక్ క్రియేట్ అవుతుందో చూడాలి.
