NTV Telugu Site icon

Top Headlines@1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

*నరకాసురుడినైనా నమ్మండి.. కానీ నారా చంద్రబాబును నమ్మొద్దు..
రాజధానిలో పేదలకు ఇళ్లిచ్చే అద్భుతమైన కార్యక్రమం దేశ చరిత్రలోనే ప్రత్యేకమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. దేశంలో పేదలకు ఇల్లు కావాలని అనేక పోరాటాలు చూశామన్నారు. కానీ పేదలకు ఇల్లు ఇవ్వడానికి సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందని.. యాభై వేల మందికి ఇల్లు ఇస్తామంటే మారీచులు ,రాక్షసులు లాంటి ప్రతిపక్షాలు అడ్డు పడ్డాయని ఆయన మండిపడ్డారు. పది లక్షలు విలువ చేసే స్థలాన్ని ప్రతి పేద కుటుంబానికి ఇస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ప్రభుత్వం ఇస్తుంది ఇళ్ల పట్టాలు కాదు… సామాజిక న్యాయ పత్రాలు అంటూ జగన్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఏ ఒక్కరికీ సొంతం కాదు… భవిష్యత్‌లో అమరావతి అందరిదీ కావాలన్నారు. 25 లే ఔట్లలో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. వారం రోజుల పాటు ఇక్కడ పట్టాల పంపిణీ పండుగ జరుగుతుందన్నారు. అమరావతి ప్రాంతంలో యుద్ద ప్రాతిపదిక ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. వారం పాటు ఇళ్ల పట్టాల పండుగ కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుందని అని సీఎం జగన్‌ ప్రకటించారు. దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇప్పటికే లే అవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని, జులై 8వ తేదీ లోగా జియో ట్యాగింగ్‌ పూర్తి చేస్తామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్లు ఉంటాయని సీఎం జగన్‌ వెల్లడించారు. సొంతంగా ఇళ్లు కట్టుకుంటే.. రూ. లక్షా 80 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తాం. రెండో ఆప్షన్‌లో నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ చేస్తాం. ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుంది. స్టీల్‌, సిమెంట్‌, డోర్‌ ఫ్రేమ్‌లు సబ్సిడీపై అందిస్తాం. మెటీరియల్‌ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు అని సీఎం జగన్‌ ప్రకటించారు. ఎన్నికలు వస్తున్నాయ్ అనగానే చంద్రబాబు మోసపూరిత మాటలు చెప్తాడని…. అమలు కానీ మేనిఫెస్టో ప్రచారంలోకి తెస్తాడంటూ ఆరోపించారు. నరకాసురుడినైనా నమ్మండి.. కానీ నారా చంద్రబాబును మాత్రం నమ్మొద్దంటూ విమర్శలు గుప్పించారు. ఆర్ధికంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా నవరత్నాలు అమలుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశామన్నారు. వైసీపీ సర్కారు మేనిఫెస్టోను ఓ పవిత్ర గ్రంథంలా భావించిందన్నారు. వైసీపీ పాలనలో లంచం,అవినీతి , వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.

 

*రైతులకు జగన్‌ సర్కార్ శుభవార్త.. ఆ రోజే అకౌంట్లలో నిధులు జమ!
ఏపీలోని రైతులకు జగన్‌ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్‌ రైతు భరోసా పథకం నిధులను ముఖ్యమంత్రి జగన్‌ విడుదల చేయనున్నారు. అన్నదాతలకు తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది. అలాగే ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. ఈ నెల 30న కర్నూలు జిల్లా పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి రైతుల అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేయనున్నారు.ఈ సంవత్సరం 52.31 లక్షలమంది అన్నదాతలకు తొలి విడతలో పెట్టుబడి సాయంగా రూ.7,500 చొప్పున రూ.3,934.25 కోట్లను సీఎం ఖాతాల్లో జమ చేస్తారు. పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది కూడా రైతు భరోసా అందుకునే రైతుల సంఖ్య పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కింద అర్హులైన రైతులకు ఏటా మూడువిడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. మే నెలలో రూ.7,500.. రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడోవిడతగా జనవరిలో రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ నెలలో అందించనున్న సాయంతో కలిపితే.. ఈ నాలుగేళ్లలో సగటున 52.30 లక్షల మందికి వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.30,996.34 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లవుతుంది. రైతు భరోసాతో పాటూ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు కూడా జగన్‌ సర్కారు సాయం అందించనుంది. సీజన్‌ ముగియకముందే ఇన్‌పుట్‌ సబ్సిడీ (పంట నష్టపరిహారం) నేరుగా వారి అకౌంట్‌లలోనే జమ చేస్తూ బాధిత రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో మాండూస్‌ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి 91,237 మంది రైతులకు రూ.76.99 కోట్ల నష్టపరిహారాన్ని ఫిబ్రవరిలో అందజేశారు.అకాల వర్షాలకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 78,510 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో 59,230 ఎకరాల్లో వ్యవసాయ పంటలు.. 19,280 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ మేరకు పంటలు దెబ్బతిన్న 48,032 మంది రైతులకు రూ.46.39 కోట్ల పంట నష్టపరిహారాన్ని ఈ నెల 30న సీఎం జమచేయనున్నారు. ఈ నాలుగేళ్లలో 22.70 లక్షల మంది రైతులకు రూ.1,958.18 కోట్ల పంట నష్టపరిహారం అందించినట్లు అవుతుంది.

 

*ఆలయంలో అపచారం..
నిజమాబాద్ జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నీలకంటేశ్వరాలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈ.ఓ.వేణు సరస్సులో దిగి స్నానం చేశారు. దేవుని విగ్రహాలు అభిషేకం చేస్తున్నాము.. పుష్కరిణిలో ఈత కొట్టద్దు అంటూ అర్చకులు వారిస్తున్నా ఈవో వినిపించుకోకుండా ఈత కొట్టడం సంచలనంగా మారింది. అభిషేకం జరుగుతున్నా అస్సలు పట్టించుకోకుండా దర్జాగా ఈఓ ఈత కొట్టడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో ఈవో వేణుపై విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగు ఆలయాలకు వేణు ఇంచార్జీ ఈఓ గా పనిచేస్తున్నారు. ఈవో వేణు తీరుపై భక్తులు మండిపడు తున్నారు. ఇంచార్జీ ఈఓగా ఉంటూ పుష్కరిణిలో విగ్రమాలు అభిషేకం చేస్తున్న పట్టించుకోకుండా ఈత కొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నారనే ధీమాతోనే ఈఓ ఇలా చేశాడంటూ సర్వత్రా మండిపడుతున్నారు. విగ్రహాలు అభిషేకం చేస్తున్నామని ఈత కొట్టకూడదని అర్చకులు వాదిస్తున్నా ఈఓ వేణు ఈత కొట్టడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఎదురుగా వెళ్లి ఈఓ ఈత కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తు వారిని శిక్షించాల్సింది పోయి ఆలయ ఈఓగా వున్న వేణు ఈవిధంగా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈఓ స్థానంలో పనిచేస్తున్న వేణును తక్షణమే కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి వారి వల్లే ఆలయంలో అపచారాలకు చోటుచేసుకుంటోందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వీడియోపై ఉన్నత స్థాయి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

*షెడ్యూల్‌ ప్రకారమే టీఎస్ ఐసెట్‌
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే నేడు, రేపు (26,27) తేదీల్లో TSISET-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 37,112 మంది పురుషులు, 38,815 మంది మహిళలు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాంతీయ కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్షలో నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే TS ISET-2023 పరీక్ష మే 26, 27 తేదీలలో రెండు సెషన్లలో నిర్వహించబడుతుంది. ఆ తేదీలలో, ISET పరీక్ష మొదటి సెషన్‌లో ఉదయం 10 నుండి 12.30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. రెండవ సెషన్‌లో pm. జూన్ 5న ప్రైమరీ కీ విడుదల.. ఆన్సర్ కీపై అభ్యంతరాలను జూన్ 8 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. జూన్ 20న తుది కీతో పాటు ఫలితం వెలువడనుంది. తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం మే 22న టీఎస్ ఐసెట్ పరీక్ష హాల్ టికెట్లను తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన సంగతి తెలిసిందే.హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ISET కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, అర్హత పరీక్ష హాల్ టికెట్ నంబర్ వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఐసెట్ నిర్వహణను కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ చేపట్టిన విషయం తెలిసిందే. ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు. పరీక్షలో మూడు విభాగాలు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: ఎనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు.

 

*చెన్నైలో ఐటీ దాడులు
చెన్నైలో ఐటీ దాడుల కలకలం సృష్టిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. మంత్రికి చెందిన 40 ప్రాంతాల్లో శుక్రవారం ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కరూర్ ప్రాంతానికి చెందిన బాలాజీ సీనియర్ డీఎంకే నాయకుడు. చెన్నై, కరూర్ ప్రాంతాల్లోని మంత్రి ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) మొదటి కుటుంబానికి సంబంధం ఉందని ఆరోపించిన రియల్ ఎస్టేట్ సంస్థ జి-స్క్వేర్‌పై ఐటి డిపార్ట్‌మెంట్ దాడులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు జరిపిన ఒక నెల తర్వాత ఈ దాడి జరిగింది. టాంగెడ్కో అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మద్యం బాటిళ్లను విక్రయించేందుకు టాస్మాక్(TASMAC) దుకాణాలు రూ.10 అదనంగా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కరూర్ టీమ్ బాలాజీకి కనెక్ట్ అయిందని ఆరోపించారు. విల్లుపురం, చెంగల్‌పట్టులో జరిగిన హూచ్‌ విషాదాల కారణంగా బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగించాలని, పోలీసులు, ఈడీ క్రైమ్‌ బ్రాంచ్‌లకు సుప్రీంకోర్టు ఆదేశాలివ్వాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై ఇటీవల డిమాండ్‌ చేశారు. బాలాజీ కేబినెట్‌లో కొనసాగితే ఆయనపై న్యాయమైన విచారణ సాధ్యం కాదని అన్నామలై ఆరోపించారు.

 

*ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్.. ఆ రోజే రూ.75 నాణెం విడుదల
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా స్మారకార్థం రూ.75 నాణేన్ని ముద్రించనున్నారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నాణెంపై పార్లమెంట్ కాంప్లెక్స్, కొత్త పార్లమెంట్ భవనం చిత్రం ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ప్రకటన ప్రకారం, 75 రూపాయల నాణెం 44 మిమీ వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది. నాణేన్ని నాలుగు లోహాలతో తయారు చేయనున్నారు. ఇందులో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ఉంటాయి. పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం క్రింద ‘2023’ అని రాసి ఉంటుంది. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభ వేడుకల్లో కనీసం 25 పార్టీలు పాల్గొనే అవకాశం ఉంది. 20 ప్రతిపక్ష పార్టీలు కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. అధికార ఎన్డీయేలోని 18 మంది సభ్య పార్టీలతో పాటు, బీజేపీతో సహా ఏడు ఎన్డీయేతర పార్టీలు ఈ వేడుకకు హాజరు కానున్నాయి. BSP, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ (సెక్యులర్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), YSR కాంగ్రెస్, BJD, TDP అటువంటి NDA యేతర పార్టీలు, అవి ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని భావిస్తు్న్నారు. కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. ఆయన ప్రభుత్వ దురహంకారం పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసిందని అన్నారు. మోదీ జీ, పార్లమెంట్ ప్రజలచే స్థాపించబడిన ప్రజాస్వామ్య దేవాలయమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు. రాష్ట్రపతి కార్యాలయం పార్లమెంటులో మొదటి భాగం. మీ ప్రభుత్వ దురహంకారం పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసింది. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేయనున్న 75 రూపాయల నాణెం 35 గ్రాములు. ఇందులో 50% వెండి, 40% రాగి, 5% జింక్ మరియు 5% నికెల్ ఉంటాయి. దీని డిజైన్ గురించి చెబుతూ, నాణేనికి ఒకవైపు అశోక స్తంభం తయారు చేయబడి, దిగువన రూ.75 అని వ్రాయబడుతుంది.

 

*ప్రధాని మోడీని చంపేస్తానంటూ బెదిరింపు కాల్..
ప్రధాని నరేంద్ర మోడీకి బెదిరింపు కాల్ వచ్చింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి.. మోడీని చంపుతానని బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బెదిరింపు కాల్ ను ట్రేస్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు. కాల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు ఢిల్లీలోని ప్రసాద్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కరోల్ బాగ్‌లో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని ఢిల్లీలోని రాయ్‌గర్ పురా నివాసి హేమంత్‌గా గుర్తించారు. కాల్ చేసిన వ్యక్తి హేమంత్ మద్యం మత్తులో ప్రధాని మోడీని చంపుతానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. PCR కాల్ అందుకున్న తర్వాత ఒక బృందాన్ని పంపారు.. కాలర్ హేమంత్ కుమార్ వయస్సు 48 సంవత్సరాలు.. అతని వివరాలను సేకరించి రాయగర్ పురా, కరోల్ బాగ్, పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారణ చేశామని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు గత 6 సంవత్సరాలుగా నిరుద్యోగి అని, అతనికి మద్యపానం అలవాటు ఉందని వారు తెలిపారు. ఇక.. ఉద్యోగం లేకపోవడం వల్లే మద్యానికి బానిసగా మారిన హేమంత్ కోపంలో ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానంటూ కాల్ చేశాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మరిన్ని వివరాల కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే గతంలో కూడా ప్రధాని మోడీని చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అతను పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 100కు కాల్‌చేసి మరీ ప్రధాని మోదీకి హాని చేస్తానని ఓ యువకుడు పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది.

 

*చైనాను వణికిస్తున్న కరోనా.. వారానికి 6.5 కోట్ల మందికి వైరస్..
చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. జూన్‌ మాసంలో అదికాస్త గరిష్ట​ స్థాయికి చేరుకుంటుంది. జూన్ చివరి వారం కల్లా దాదాపు 6.5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కరోనాను నిరోధించే వ్యాక్సిన్‌ల నిల్వను పెంచే దిశగా చైనా సర్కార్ చర్యలు ప్రారంభించింది. అలాగే ఈ కొత్త వేరియంట్‌ని ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రముఖ చైనీస్‌ ఎపిడెమియాలజిస్ట్‌ ఝాంగ్‌ నాన్షాన్‌ వెల్లడించింది. అలాగే జనాభాలో వృద్ధుల మరణాల పెరుగుదలను నివారించడానికి శక్తిమంతమైన టీకా బూస్టర్‌ తో పాటు యాంటీ వైరల్‌ మెడిసిన్స్ ను సిద్ధం చేయాలని చైనా ప్రభుత్వం భావిస్తుంది. ఇక బీజింగ్‌ సెంట్రల్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకారం.. గత నెలలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఏప్రిల్‌ చివరి నుంచి ఈ కేసుల సంఖ్య వీపరీతంగా పెరగడం ప్రారంభమైందని వెల్లడించింది. ఇదిలా ఉండగా, గత ఏడాదిలో శీతకాలంలో జీరో కోవిడ్‌ విధానాన్ని చైనా ప్రభుత్వం ఎత్తివేసినప్పటి నుంచి అనూహ్యంగా కరోనా కేసులు నమోదవ్వడమే గాక దేశంలో దాదాపు 85 శాతం మంది అనారోగ్యం బారినపడ్డారు. కాగా యూనివర్సిటీ హాంకాంగ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌‌ హెల్త్‌ ఎపిడెమియాలజిస్ట్‌ మాత్రం ప్రస్తుత వేవ్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉండటమే గాక మరణాలు కూడా తక్కువగానే నమోదవ్వుతాయని తెలిపింది. ఇది తేలికపాటి వేవ్‌గానే పరిగణిస్తున్నాం.. కానీ ఈ కరోనా మహమ్మారీ ఇప్పటికీ ‍ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించడం బాధకరమని ఎపిడెమియాలజిస్ట్‌ తెలిపింది.

 

*రండి బాబు రండి మా దగ్గర ఉద్యోగాలున్నాయ్.. ఆలీబాబా ఆఫర్
రిట్రెంచ్‌మెంట్, ఆర్థిక మాంద్యం సమయంలో చైనా కంపెనీ ప్రజలకు గొప్ప ఉపశమనం ఇచ్చింది. ఎక్కడికక్కడ కంపెనీలు నిరంతరం ఉద్యోగాల నుంచి తొలగిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో చైనాకు చెందిన ఈ-కామర్స్ వెబ్‌సైట్ అలీబాబా వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది. 15000 మందికి ఉద్యోగాలు ఇస్తామని అలీబాబా తాజాగా ప్రకటించింది. గత 6 నెలల్లో ఐటీ రంగంలో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రజలకు కష్టకాలంలో దూతగా నిలిచిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. Weibo నివేదిక ప్రకారం.. చైనీస్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అలీబాబా తన 6 ప్రధాన వ్యాపార విభాగాల కోసం 15000 మందిని రిక్రూట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సమయంలో కాలేజీలో కొత్తగా గ్రాడ్యుయేట్ చేసిన వారికి ఇది ప్రత్యేక అవకాశంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎందుకంటే తాజాగా గ్రాడ్యుయేట్ల నుంచి 3 వేల మందిని కంపెనీ రిక్రూట్ చేసుకోనుంది. అదే సమయంలో కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందని వస్తున్న పుకార్లను ఖండించింది. E-com వెబ్‌సైట్ అలీబాబా ఇటీవల వేలాది మంది ఉద్యోగులకు నియామకానికి మార్గం చూపింది. వేలాది మంది ఉద్యోగులను తొలగించాలని చైనా కంపెనీ నిర్ణయించింది. మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ తన మొత్తం ఉద్యోగులలో 7శాతం తగ్గించాలని కోరుకుంటోంది. పునర్వ్యవస్థీకరణ కింద కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా అలీబాబా తన ఖర్చులను తగ్గించుకుంటుంది. అయితే, తమ ఉద్యోగులను తగ్గించాలన్న నిర్ణయాన్ని కంపెనీ ‘పుకారు’గా పేర్కొంది. ఇది సాధారణ ప్రక్రియ అని కంపెనీ తెలిపింది. కంపెనీ త్వరలో వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది.

 

*అయ్యో.. సారా అలీఖాన్‌కు బ్రేకప్ చెప్పిన శుభ్‌మన్ గిల్
టీమిండియా యువ క్రికెటర్ శుభమన్ గిల్ ఐపీఎల్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులోనూ గిల్ ముందున్నాడు. ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ పట్టికలో ఫాఫ్ డు ప్లెసిస్‌ను అధిగమించడానికి గిల్‌కి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే కావాలి. ఇవాళ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. కాగా, ఈ మ్యాచ్ లో డుప్లిసిస్ ని అధిగమించి ఆరెంజ్ క్యాప్ ను గిల్ సాధించే ఛాన్స్ ఉంది. శుబ్ మన్ గిల్ పేరు వినపడగానే క్రికెట్ తో పాటు ఆయన లవ్ ఎఫైర్లు కూడా వినపడతాయి. మొదట క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రాగా.. ఆ కొద్ది రోజులకే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తో ప్రేమలో ఉన్నాడంటూ టాక్ వచ్చింది. అయితే తాజాగా వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ మరో వార్త వినిపిస్తుంది. అయితే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈ ఏడాది మొదట్లో ఈ జంట దుబాయి లో డిన్నర్ చేస్తూ మీడియా కంట పడ్డారు. అంతేకాకుండా విమానంలోనూ ఇద్దరూ కలిసి ప్రయాణించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు టాక్ వచ్చింది. చాలాసార్లు మీడియా ఈ విషయంపై వీరిద్దరినీ ప్రశ్నించగా, డేటింగ్ చేస్తున్నామనే ఇన్ డైరెక్ట్ గా చెబుతూ వచ్చారు. అయితే, తాజాగా వీరిద్దరూ విడిపోయారట. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా వచ్చాయా? ఎందుకు విడిపోయారంటూ అభిమానులు పెద్ద ఎత్తున నెట్టింట చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో గిల్ కి సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నిజానికి, గిల్ మొదట సారా టెండుల్కర్ తో ప్రేమలో ఉన్నాడు.. అయితే సారా అలీఖాన్ కోసం ఆమెను వదిలేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరికీ కూడా చెడింది. చూడాలి మరి తర్వాత వీరి జీవితాల్లోకి ఎవరైనా వస్తారా లేక మళ్లీ వీళ్లే కలుస్తారా అనేది.