NTV Telugu Site icon

Top Headlines@1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

*ఎంసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత సాధించగా.. అగ్రికల్చర్‌, ఫార్మా విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత రాణించారు. ఇంజినీరింగ్‌లో అనిరుధ్‌కు మొదటి ర్యాంకు సాధించగా.. వెంకట మణిందర్‌రెడ్డికి రెండో ర్యాంకు సాధించారు. ఇంజినీరింగ్‌లో 79 శాతం అబ్బాయిలు, 85 శాతం అమ్మాయిలు క్వాలిఫై అయ్యారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, వైద్య విభాగాలకు సంబంధించిన ఫలితాలను https://ntvtelugu.com/telangana-eamcet-results-2023 ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.

 

*లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి.. ఆ తరువాత ఏమైందంటే..
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రెస్టారెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దీంతో ఆయన అనుచరులు, బీఆర్ఎస్ శ్రేణులు, భద్రతా సిబ్బంది టెన్షన్ పడ్డారు. అయితే కాసేపటి తర్వాత మంత్రి లిఫ్ట్‌ నుంచి సురక్షితంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిన్న (బుధవారం) ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల జిల్లాకు వెళ్లారు. మార్గమధ్యంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పెద్దపల్లి పట్టణంలో పర్యటించారు. ఈ క్రమంలో కూనరం చౌరస్తాలో బీఆర్ఎస్ నేత నిర్వహిస్తున్న రెస్టారెంట్ కు మంత్రి వెళ్లారు. కొద్దిసేపటికి రెస్టారెంట్ లో ఉన్న శ్రీనివాస్ గౌడ్ భవనం పైనుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఎక్కారు మంత్రి. అయితే లిఫ్ట్ లో సామర్థ్యానికి మించి ఉండటంతో డోర్స్ క్లోజ్ అయిన తర్వాత తిరిగి తెరుచుకోలేదు. దీంతో లిప్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. కాగా లిప్ట్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇరుక్కుపోవడంతో అక్కడున్న వారంతా ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు శ్రమించి లిఫ్ట్‌ తలుపులు తెరిచారు. దీంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు లిఫ్ట్‌లోని వారందరూ బయటకు వచ్చారు. అందరూ సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి మాట్లాడుతూ లిప్ట్ లో సామర్థ్యానికి మించి ఎక్కడంతోనే సమస్య తలెత్తిందని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తను సురక్షితంగానే ఉన్నాని అన్నారు. సామర్థ్యాన్ని మించడంతో సమస్య తలెత్తిందని స్పష్టం చేశారు. అక్కడి నుంచి మంత్రి తన కారులో చెన్నూరుకు బయలుదేరి వెళ్లారు.

 

*నేడు విచారణకు అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌.. సర్వత్రా ఉత్కంఠ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ఈరోజు విచారణకు రానుంది. తెలంగాణ హైకోర్టులో ఈరోజు (మే 25) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని అవినాష్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. దీని ప్రకారం నేడు (మే 25) అవినాష్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపి తీర్పు వెలువరించనుంది. ప్రస్తుతం సిబిఐ విచారణలో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేయకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టు కోరగా, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన తల్లి అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఉందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం బాగుపడే వరకు ఆమెపై చర్యలు తప్పవని అవినాష్ రెడ్డి అన్నారు. అయితే సుప్రీంకోర్టు తిరస్కరించింది. అవినాష్ రెడ్డి ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అవినాష్ పిటిషన్‌లో వివేకానందరెడ్డి కుమార్తె నారెడ్డి సునీతను ఇంప్లీడ్ చేయనున్నారు. అవినాష్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే కేసులో జరిగిన పరిణామాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సీబీఐ, సునీత తెలిపారు. మరి ఈరోజు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 28న తెలంగాణ హైకోర్టు వేసవి సెలవుల్లో ఉన్నందున జూన్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై స్పందించిన అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు అప్పటి వరకు సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని, వేసవి సెలవుల కోర్టులోనే విచారణ జరపాలని సూచించారు. ఈ అంశంపై న్యాయమూర్తి స్పందిస్తూ.. హైకోర్టు సీజేని కలవాలని సూచించారు. అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జూన్ 5కి వాయిదా పడింది.త్వరలో మళ్లీ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే అంతకుముందే సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌పై నిర్ణయాన్ని హైకోర్టుకు రిఫర్ చేసింది. అయితే నిర్ణయాన్ని ప్రకటించకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు పిటిషనర్‌కు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అందుకే వెకేషన్ బెంచ్ ముందు విచారణ జరపాలని సూచించింది. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరగనుండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

*జైలు బాత్‌రూమ్‌లో కుప్పకూలిన సత్యేందర్ జైన్
ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్టై తీహార్ జైలులో ఉన్నారు. నేడు ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. బుధవారం రాత్రి తన రూంలోని బాత్రూంలో సత్యేందర్ అపస్మారక స్థితిలో పడిపోయారు. దీంతో వెంటనే విధుల్లో ఉన్న సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. ఆయనను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. పడిపోవడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. తల తిరగడంతోనే ఇలా జరిగినట్టుగా చెబుతున్నారు. ‘‘సత్యేందర్ జైన్‌ను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేర్చారు. తీహార్ జైలులోని వాష్ రూమ్‌లో తల తిరగడంతో ఆయన కుప్పకూలిపోయాడు. ఇంతకు ముందు కూడా సత్యేందర్ జైన్ బాత్రూంలో పడిపోవడంతో వెన్నెముకకు తీవ్రమైన గాయం అయింది’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఇక, సోమవారం సత్యేందర్ జైన్‌కు అనారోగ్యంగా ఉండడంతో సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.ఇక, సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యేందర్ జైన్ పలుమార్లు బెయిల్ కోసం ఇప్పటికే ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సత్యేందర్ తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మనుసింఘ్వీ మాజీ మంత్రి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఉన్న జైన్ 35కిలోలు బరువు తగ్గారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో సత్యేందర్ బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణకు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించేందుకు సుప్రీం ఓకే చెప్పింది.

 

*ఢిల్లీకి చేరిన కర్ణాటక కేబినెట్ విస్తరణ వివాదం
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై రచ్చ మొదలైంది. నిన్నటి నుంచి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం వేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మే 19న కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైనప్పటికీ, సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాల కారణంగా ఆ విషయం కుదరలేదు. ఆ తర్వాత బంతి ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కోర్టులోకి వచ్చింది. రాష్ట్ర కొత్త సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గంలో ప్రస్తుతం 8 మంది మంత్రులు ఉన్నారు. ప్రస్తుతం కనీసం 25 మంది మంత్రులు కావాల్సి ఉంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్.. ఇద్దరూ తమ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల సంఖ్య క్యాబినెట్‌లో ఎక్కువగా ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో.. ప్రభుత్వాన్ని నడపడంలో తమ ఆధిపత్యం చెలాయించే వీలుంటుందనేది వారి భావన. బుధవారం నుంచి ఢిల్లీలో మకాం వేసిన డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమై మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఖర్గేతో భేటీకి ముందు సీఎం సిద్ధరామయ్య ఆయన నివాసానికి చేరుకుని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. మే 20న సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రుల శాఖల విభజన జరగలేదు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో జి పరమేశ్వర, కెహెచ్ మునియప్ప, కెజె జార్జ్, ఎంబి పాటిల్, సతీష్ జార్కిహోళి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. ప్రియాంక్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు. కల్బుర్గి జిల్లా చితాపూర్ స్థానం నుంచి గెలిచిన ప్రియాంక్ ఖర్గే అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

*2000నోట్లను వదిలించుకునేందుకు జనం తిప్పలు
2000 నోట్ల చలామణిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. నోట్ల మార్పిడి కోసం ప్రజలు బ్యాంకులకు వెళ్తున్నారు. 2000 నోట్లను వినియోగించడానికి బంగారంపై పెట్టుబడి పెట్టడం, క్యాష్ ఆన్ డెలివరీపైనే ఆహారం అడుగుతున్నారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల నోట్ల మార్పిడిపై ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ఇస్తున్నారు. కొన్నిచోట్ల 2000 రూపాయలకు బదులుగా 2100 రూపాయల విలువైన చికెన్‌, మటన్‌ను, కొన్నిచోట్ల బ్రాండెడ్‌ బట్టలు 2000 రూపాయలకు ఇస్తున్నారు. 2000 నోటును ఉపయోగించడానికి.. ప్రజలు పెట్రోల్ పంప్‌లో ఇంధనం నింపడం ద్వారా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. 2000 నోట్లను ఖర్చు చేసేందుకు కస్టమర్లకు ఎవరు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారో తెలుసుకుందాం. ఢిల్లీలోని ఓ మాంసం విక్రయదారుడు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్‌తో ముందుకొచ్చాడు. 2000 నోట్లకు బదులు 2100 విలువైన మాంసాన్ని అందజేస్తానని తన దుకాణం బయట ఏకంగా పోస్టర్ పెట్టాడు. 2000 నోటుపై మాంసం విక్రయదారులు దాదాపు 5 శాతం మేర ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారు. ఆయన దుకాణానికి సంబంధించిన ఈ పోస్టర్ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. 2000 నోట్లను ఖర్చు చేయడానికి ప్రజలు అతని దుకాణం నుండి మాంసం కూడా కొనుగోలు చేస్తున్నారు.ఆర్బీఐ 2000 నోటు రద్దు తర్వాత, దుకాణదారులు 2000 నోటు తీసుకోకుండా తప్పించుకుంటున్నారు. ఒక్కోసారి సాకులు చెప్పి ప్రజల నుంచి నోట్స్ రాకుండా తప్పించుకుంటున్నారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బట్టల వ్యాపారి 2000 నోటుకు సంబంధించి ఓ అద్భుతమైన ఆఫర్‌ను ప్రజల్లోకి తీసుకొచ్చాడు. బట్టల కోసం తన దుకాణానికి వచ్చి షాపింగ్ చేసే వాళ్లకు రూ.2000లకే బ్రాండెడ్ బట్టలు ఇస్తానని ప్రకటించాడు. అంతే కాకుండా 2000 నోట్లతో కస్టమర్ ఎవరి బిల్లునైనా చెల్లించవచ్చని పేర్కొన్నాడు. ఆర్బీఐ ప్రకారం.. ప్రజలు తమ వద్ద ఉన్న 2000 నోట్లను సెప్టెంబర్ 30 వరకు మార్చుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు నోట్ల మార్పిడికి 4 నెలల గడువు ఇచ్చింది. ఈ సమయంలో ప్రజలు ఒకేసారి 10 నోట్లను అంటే 20000 రూపాయల వరకు మార్చుకోవచ్చు. మార్కెట్‌లో నగదు కొరత లేకుండా ఉండేందుకు, ప్రజలు తమ నోట్లను సౌకర్యవంతంగా మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, అయితే 4 నెలల్లో ఎప్పుడైనా నోట్లను సులభంగా మార్చుకోవచ్చు.

 

*త్వరలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల మార్కెట్‌లోకి టాటా కంపెనీ
టాటా గ్రూప్ త్వరలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల మార్కెట్‌లోకి ప్రవేశించబోతుంది. ఇందుకోసం కంపెనీ పూర్తి ప్రణాళికను రూపొందించింది. ఈ రంగంలోకి ప్రవేశించడానికి కంపెనీ OSAT అంటే ఔట్‌సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ విక్రేతలతో కూడా చర్చలు జరుపుతోంది. అదే సమయంలో.. కంపెనీ తమిళనాడులో తన కొత్త ప్రాజెక్ట్ కోసం ఎలక్ట్రానిక్ ప్లాంట్ సమీపంలో భూమిని కూడా వెతుకుతోంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌ని కలిగి ఉంది. టాటా గ్రూప్ ఈ పెద్ద నిర్ణయంతో భారతదేశం ప్రపంచ స్థాయిలో చిప్‌లను సరఫరా చేసే అవకాశాన్ని పొందవచ్చు. సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ వ్యాపారాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు టాటా సన్స్ ETకి తెలిపింది. గ్రీన్‌ఫీల్డ్ ఎలక్ట్రానిక్ భాగాల తయారీ కోసం టాటా గ్రూప్ 2020లో టాటా ఎలక్ట్రానిక్స్‌ను ప్రారంభించింది. టాటా వర్గాల సమాచారం ప్రకారం.. తమిళనాడులోని పశ్చిమ జిల్లా కోయంబత్తూరులో భూమిని తీసుకోవడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. భూమిని తీసుకున్న తర్వాత కంపెనీ తదుపరి దశకు వెళ్లనుంది. టాటా గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ రూ.4,684 కోట్ల పెట్టుబడితో ఫోన్ విడిభాగాల తయారీ యూనిట్ కోసం 2021లో తమిళనాడు ప్రభుత్వంతో మెమోరాండంపై సంతకం చేసింది. టాటా యొక్క ఈ ముఖ్యమైన అడుగు 18,000 మందికి పైగా ఉపాధిని కూడా అందిస్తుంది. టాటా కంపెనీ యొక్క ఈ ప్రణాళిక విజయవంతమైతే, ఇది తమిళనాడులో మూడవ అతిపెద్ద మొబైల్ విడిభాగాల తయారీ సంస్థ అవుతుంది. ప్రస్తుతం, తమిళనాడులోని తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ సౌకర్యాలను కూడా ప్రజలు పొందుతున్నారు.

 

*జై శ్రీరామ్ సంచనలం మర్చిపోక ముందే “రామ్ సియా రామ్” రిలీజ్…
జూన్ 16న ఇండియన్ బాక్సాఫీస్ చూడబోతున్న సెన్సేషన్ ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేసారు మేకర్స్. ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ కొడతాడు, మొదటి రోజు వంద కోట్లు రావడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆరు నెలల క్రితం భయంకరమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన ఈ మూవీ ఫేట్ ని మార్చేసింది ‘జై శ్రీరామ్’ సాంగ్. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సాంగ్ ఇంపాక్ట్ ని మర్చిపోక ముందే మరో సాంగ్ ని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఇప్పటి వరకూ ఇండియాలో ఏ సినిమా పాటా విడుదల చేయని విధంగా, ఈ సెకండ్ సాంగ్ “రామ్ సియా రామ్” సాంగ్ లాంచ్ ని ప్లాన్ చేసారు. “రామ్ సియా రామ్” సాంగ్ ని ఈ నెల 29న హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు ఆదిపురుష్ చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ సాంగ్ ని సచేత్ – పరంపర కంపోజ్ చెయ్యడంతో పాటు వారే పాడడం విశేషం. జై శ్రీ రామ్ సాంగ్ ని అద్భుతమైన లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రి “రామ్ సియా రామ్” సాంగ్ కి కూడా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఒక సెన్సేషనల్ గా ఉండబోతోన్న ఈ పాటని మూవీ ఛానెల్స్, మ్యూజిక్ ఛానెల్స్ తో పాటు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై మే 29 మధ్యాహ్నం 12గంటలకు ఈ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించబోతున్నారు. సినిమాలకు సంబంధించి దేశ చరిత్రలోనే ఇదో సంచలనం కాబోతోంది. మే 29న మధ్యాహ్నం 12 గంటలకి దేశం మొత్తం ఒకేసారి “రామ్ సియా రామ్” పాటని వినబోతుందనమాట. ఇది నిజంగా ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఈ సాంగ్ రిలీజ్ తో ఆదిపురుష్ పై అంచనాలు పీక్ స్టేజ్ ని వెళ్తాయి, వాటిని ఆకాశానికి తీసుకోని వెళ్తూ జూన్ 6న ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరగనుంది.

 

*వైరల్ అవుతున్న మ్యాంగో మ్యాన్.. నవీన్ ఉల్ హక్ పై కోహ్లీ ఫ్యాన్స్ రివెంజ్..!
ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న ఆఫ్ఘాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మరోసారి కోహ్లీ ఫ్యాన్స్ పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ప్లేఆఫ్స్ లో భాగంగా బుధవారం రాత్రి లక్నో-ముంబై మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో ఓడిన తర్వాత నవీన్ ను నెటిజన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. అతడిని ట్రోల్ చేస్తున్నారు. నవీన్ ఉల్ హక్ ను ముంబై ప్లేయర్స్ తో పాటు జొమాటో, స్విగ్గీలు కూడా ఆటాడుకున్నాయి. అయితే లక్నో-ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీతో గొడవపడ్డ నవీన్ ఆ తర్వాత చేసిన రచ్చ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబై-ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ ఔటయ్యాక.. ముంబై మ్యాచ్ ను చూస్తూ.. ఓ గిన్నెలో మామిడి పండ్లను షేర్ చేస్తూ.. స్వీట్ మ్యాంగోస్ అని నవీన్ ఉల్ హక్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇక అప్పటి నుంచి అతన్నీ.. కోహ్లీతో పాటు దాదాపు ప్రతీ ఇండియన్ ఫ్యాన్ ట్రోలింగ్ చేస్తున్నాడు. నిన్న ముంబైతో మ్యాచ్ లో నవీన్.. నాలుగు వికెట్లు తీసిన తర్వాత కేఎల్ రాహుల్ స్టైల్ లో సెలబ్రేషన్స్ చేసుకోవడం మరింత కోపం తెప్పించింది. ఈ మ్యాచ్ లో లక్నోను ముంబై ఇండియన్స్ ఓడించిన తర్వాత అభిమానులు మాత్రం నవీన్ పై ట్రోలింగ్ కు దిగారు. నవీన్ ను మామిడి పండ్లు అమ్ముతున్న వాడిగా మీమ్స్ క్రియేట్ చేసి ఓ ఆట ఆడుకుంటున్నారు. ముంబై-లక్నో మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై ఆటగాళ్లు కుమార్ కార్తీకేయ, విష్ణు వినోద్, సందీప్ వారియర్ లు కూడా ఓ టేబుల్ ముందు మామిడి పండ్లను పెట్టి ‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు’ అన్న స్టైల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక నవీన్ ఉల్ హక్ ను కోహ్లీ ఫ్యాన్స్ తో పాటు ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా ట్రోల్ చేశాయి. జొమాటో.. తన ట్విటర్ హ్యాండిల్ లో నవీన్ బ్యాటింగ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసి ‘నాట్ సో స్వీట్ మ్యాంగోస్’ అని పోస్ట్ పెట్టింది. స్విగ్గీ కూడా మామిడి పండ్లను కట్ చేసిన ఫోటోను షేర్ చేస్తూ ట్రోల్ చేసింది. కోహ్లీ ఫ్యాన్స్ పుణ్యమా అని ఎప్పుడు ఇంత ఫేమస్ కాని నవీన్.. ఈ మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాడు. హ్యాష్ ట్యాగ్ నవీన్ తో పాటు స్వీట్ మ్యాంగోస్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.