Site icon NTV Telugu

Chairman’s Desk: యువత రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు?.. కారణాలు ఇవేనా?

Indian Youth Politics

Indian Youth Politics

Youth vs Indian Politics: రాజకీయాలు అంటరానివని, అనవసరమని యువత ఫీలౌతున్నారు. నెలకు ఓ లక్ష రూపాయలు జీతం, చిన్న కారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే చాలు. అదే జీవితం అనుకుంటున్నారు. అంతకు మించి ఆలోచించటానికి పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో రాజకీయాలు వంశపారంపర్యం అయిపోయాయి. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేల వారసులే రాజకీయాల్లోకి వస్తున్నారు. వారిలో యూత్ ను వెతుక్కోవాల్సిందే కానీ.. సాధారణ యువత మాత్రం రాజకీయాలంటే అదో డర్టీ ప్రొఫెషన్ గా భావిస్తున్నారు. కాస్త సమయం దొరికితే సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తున్నారు కానీ.. నిర్ణయాధికారం దిశగా ఆలోచించడం లేదు. ఇంతకూ యువత ఎందుకు ఇలా ఆలోచిస్తోంది..? రాజకీయాలతోనే దేశంలో మార్పు సాధ్యమని ఎందుకు గుర్తించడం లేదు..? నేటి సమాజం కూడా యువతను ఆ దిశగా డిస్కరేజ్ చేస్తోందా..? ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.

రాజకీయాలపై నేటి యువతలో సదభిప్రాయం లేదనే అంశంలో రెండో మాటకు తావు లేదు. అలాగే రాజకీయాల్ని చిన్నచూపు చూడటం కూడా అలవాటైపోయింది. దీంతో కీలకమైన రాజకీయ రంగంలో యువ రక్తం తగ్గిపోతోంది. మనది అత్యధిక యువ జనాభా గల దేశమని గొప్పగా చెప్పుకుంటున్నా.. రాజకీయాల్లో మాత్రం యువత మచ్చుకైనా కనిపించడం లేదు. ఓవైపు యూరోపియన్ పార్లమెంట్ లో, పశ్చిమ దేశాల చట్టసభల్లో యువత కనిపిస్తున్నారు. కానీ మన దగ్గర మాత్రం చట్టసభలు కాదు కదా.. కనీసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల క్యాబినెట్లలో కూడా యువత కనిపించడం లేదు. రాజకీయాల్ని ఎంత తిట్టుకున్నా.. దేశంలో ఏ మార్పైనా ఆ రాజకీయంతోనే సాధ్యమనే విషయాన్ని యువత మర్చిపోతున్నారు.

బీటెక్ చేస్తే.. లక్ష రూపాయల జీతంతో ఐటీ ఉద్యోగం వస్తుంది. అలా జాబ్ చేసుకుంటూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని.. చిన్న కారు కొనుక్కుని ఈఎంఐలు కట్టుకుంటూ గడిపేస్తే సరిపోతుంది. ఈ జీవితానికిది చాలు అనేది మెజార్టీ యువత ఫీలింగ్. అలా యువత మధ్యతరగతి చట్రంలో ఇరుక్కుపోతున్నారు. అంతకుమించి ఏమీ అక్కర్లేదనే వైఖరితో ఉంటున్నారు. దీంతో కీలకమైన నిర్ణయాధికారానికి దూరమైపోతున్నారు. దేశంలో ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా, ఏ కొత్త సాంకేతికత రావాలన్నా.. ఎవరి బతుకులు బాగుచేయాలన్నా.. ఆ నిర్ణయాధికారం రాజకీయ నేతలకే ఉంటుందనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిన వాస్తవం. అలాంటి రంగాన్ని అంటరానిదిగా చూస్తూ.. ఆవైపు చూడటమే మహాపాపం అనుకుంటే.. ఇక మెరుగైన విధానాలు ఎక్కడ్నుంచి వస్తాయనేది కచ్చితంగా యువత ఆలోచించాల్సిన విషయం.

రాజకీయాలు ఖరీదుగా మారడంతో.. ఆ రిస్క్ మనకెందుకులే అని యువత భావిస్తోంది. ఈరోజుల్లో కార్పొరేటర్ కావాలంటే కోటి రూపాయలు, ఎమ్మెల్యే కావాలంటే కనీసం 50 కోట్ల రూపాయలు చేతిలో ఉండాల్సిందే. అంత డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందనేది కీలక ప్రశ్న. అదే సమయంలో రాజకీయాల్లో రాణించాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాలనేది కూడా తప్పుడు భావనే అని ఇప్పటి ప్రముఖ నేతల ప్రస్థానం చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ, చంద్రబాబు కానీ, కేసీఆర్ కానీ.. వీళ్లెవరికీ రాజకీయ నేపథ్యం లేదు. కానీ 70, 80ల్లో అప్పటి నేతల్ని చూసి.. స్ఫూర్తి పొంది.. రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఎన్నో ఢక్కామొక్కీలు తిని.. తిరుగులేని నేతలుగా నిలబడ్డారు. ఇప్పటి యువతకు దశాబ్దాల తరబడి ప్రజా జీవితంలో సాధకబాధకాలు తట్టుకునే ఓపిక, తీరిక లేవనే వాదన కూడా లేకపోలేదు. కాస్త సమయం దొరికితే చాలు స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి.. ఫేస్ బుక్ లో లైక్ లు కొడదామా, యూట్యూబ్ లో నాలుగు వీడియోలు చూద్దామా.. ఇన్ స్టాలో రీల్స్ చూద్దామా అనే ధ్యాసే. అంతే కానీ మన జీవితాల్ని మార్చే నిర్ణయాధికారాన్ని ఒడిసిపట్టుకోవాలని, రాజకీయాల్లో చేరాలని ఆలోచించే వారే కరువైపోయారు.

వచ్చే ఏడాదికి దేశంలో 40 శాతం యువతే ఉంటారు. ఇది ఒక రకంగా గర్వకారణం. ఎందుకంటే ప్రపంచంలో మరే దేశానికి కూడా ఇంత యువశక్తి లేదు. ఈ యువ శక్తితో, మేధాశక్తితో మనం ప్రపంచాన్నే శాసించవచ్చు. ఎన్నో అద్భుతాలను, ఆవిష్కరణలను సృష్టించవచ్చు. రాజకీయాల్లో కూడా బలమైన ప్రత్యామ్నాయం చూపించవచ్చు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితుల, భౌగోళిక ప్రభావం, వింత పోకడలు, ఆర్థిక పరిపుష్టి దృష్ట్యా కొంతమేర యువత విదేశాల వైపు మొగ్గు చూపుతోంది. అదే సమయంలో మెజార్టీ యువతకు లక్ష రూపాయల జీతం తెచ్చుకునే ఉద్యోగం సంపాదించుకవడమే జీవిత లక్ష్యంగా మారింది. ఈ కంఫర్ట్ జోన్ దాటి ఒక్క అడుగు అటూఇటూ వేయటానికి, రిస్క్ తీసుకోవటానికి యువత ఇష్టపడటం లేదు. పాలిటిక్స్ అంటే టచ్ మి నాట్ అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న యువతకి సామాజిక స్పృహ ఎంతవరకు ఉందనేది కూడా ప్రాధాన్యం గల అంశమే. యువతలో ఉన్న ఉత్సాహానికి అభివృద్ధి చెందిన భారత్ ను సాకారం చేసే సామర్థ్యం ఉందనడంలో సందేహం లేదు. ఇప్పటికే కొందరు యువ సర్పంచ్ లు తమ వినూత్న కార్యాచరణతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతున్నారు. కానీ అలాంటి విజయవంతమైన యువ సర్పంచ్ లు కూడా ప్రస్తుత రాజకీయాల్లో తర్వాతి మెట్టు ఎక్కలేక చతికిలపడుతుండటమే అసలైన చోద్యం. గత మూడు దశాబ్దాలుగా పెను మార్పులు వచ్చిన ప్రతి రంగంలో యువత భాగస్వామ్యమే కీలకం. ఈ కీలకాన్ని అర్థం చేసుకున్నా.. భ్రష్టుపట్టిపోతున్న రాజకీయాల ప్రక్షాళన జరగాలంటే.. కచ్చితంగా యువత ముందడుగు వేయాలన్న విషయం తేటతెల్లమౌతుంది.

దేశ జనాభాలో 18 ఏళ్లు నిండిన వారిలో ఓటర్ల నమోదు తగ్గడం ఆందోళనకరంగా ఉంది. ఉదాహరణకు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో, అర్హులైన యువతలో 25 శాతం మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. దేశంలోని యువతలో ఎక్కువ మంది ఎవరు అధికారంలోకి వచ్చినా తమ జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేరని నమ్ముతున్నారు, ఎందుకంటే దేశ రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసే వర్గంగా భావిస్తారు. అయితే, ఈ ద్వేషంలో, యువత తమ ఉదాసీనత ద్వారా, తమ దేశ నిర్వహణలో వాటాను కలిగి ఉండే హక్కును వదులుకుంటున్నారని మర్చిపోతున్నారు. సినిమాలు, క్రికెట్ ను చాలా సీరియస్ గా తీసుకునే యువత.. రాజకీయాల్ని మాత్రం తమకు పట్టని రంగంగా చూస్తోంది. హీరోలు, క్రికెటర్లు ఏం చేసినా.. ఏం చేయకపోయినా అదేదో సొంత వ్యవహారంలా భావిస్తారు. కానీ దేశాన్ని మార్చే శక్తి ఉన్న రాజకీయ రంగంలో ఏం జరిగినా.. నేతలు ఏం చేసినా.. చేయకపోయినా.. అసలేమీ పట్టించుకోరు. యువతలో రాజకీయాలపై ఉదాసీన వైఖరే అతి పెద్ద ముప్పు అనే అభిప్రాయం కూడా ఉంది. యువత నేతలుగా ఎదగడం సంగతి తర్వాత.. కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఉండటం.. ఏ ప్రభుత్వం ఏం చేసినా.. తమకు ఒరిగేదేం లేదనుకోవడం చాలా పొరపాటు. దేశ జనాభాలో ప్రభావశీలపాత్ర పోషించే యువత ఇలా నిరాసక్తిగా ఉండటం కారణంగానే.. రాజకీయ నేతలు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతుందనే వాదన కూడా లేకపోలేదు. మొదట యువత రాజకీయాలపై తమ దృష్టి కోణం మార్చుకుంటే.. కచ్చితంగా నిర్ణయాధికారం అదే వస్తుందనడంలో సందేహం లేదు.

నిజానికి దేశంలో చాలా సమస్యల్ని పరిష్కరించే శక్తి.. యువత చేసే వినూత్న ఆలోచనలకు ఉంది. కానీ నిర్ణయాధికారం దిశగా యువత ఆలోచన చేయకపోవడంతో.. దశాబ్దాలుగా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇప్పటికీ మనకు సోషల్ మీడియాలో చాలా వినూత్న ఆలోచనలు, విభిన్న భావాలు కనిపిస్తుంటాయి.వాటిలో కొన్ని నిజ జీవితంలో ఆచరణలోకి వస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంటుంది. కానీ యువత మాత్రం సోషల్ మీడియా ట్రెండయ్యే అంశాల గురించి మాత్రమే ఆలోచిస్తూ.. తమ సృజనాత్మకతను పరిమితం చేసుకుంటున్నారు. అంతేగానీ తమ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చే దిశగా ఆలోచించడం లేదు.

మన దేశంలో ఎన్నికల విధానాన్ని నేతలు పూర్తిగా మార్చిపారేశారు. ధనస్వామ్య దేశంగా మార్చి ఎన్నికల ప్రక్రియలో యువత అనర్హులు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. విలువలు కలిగి ఉన్నతమైన చదువులు చదివి, సమాజం పట్ల అవగాహన కలిగిన యువతకు అవకాశాలు ఇవ్వటం లేదు. దీనికి తోడు విద్యార్థి సంఘాలు బలహీనపడటం కూడా.. యువతలో నాయకత్వ లక్షణాలను నీరుగార్చేస్తోంది. ప్రస్తుతం విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అనేక పార్టీలకు అనుబంధంగా ఉంటున్నాయి. కేవలం ఆయా సంఘాలలో పనిచేసేవారికే కాక… చురుకుగా పని చేయ గలిగిన సామాజిక స్పృహ ఉన్న యువతనంతా అన్ని రాజకీయ పక్షాలూ ప్రోత్సహించాలి. ఎన్ని కల సమయంలోనో… లేదా ఏవో కొన్ని ఉద్యమాల సందర్భంగానో యువతను, వారి ఆవేశాన్నీ వాడుకుని వదిలేస్తుండటం రాజకీయ పక్షాల్లో కనిపిస్తున్న ట్రెండ్‌. ఈ ధోరణిని రాజకీయ పార్టీలు విడనాడాలి. ఇప్పటివరకూ యువతను సంకుచిత రాజకీయాల కోసం వాడుకుంటున్న పార్టీలకు ఇకనైనా కనువిప్పు కలగాలి. రాజకీయ పార్టీలు యువతకు అన్ని స్థాయుల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి. గ్రామ వార్డు మెంబర్‌ నుంచీ అత్యున్నత పార్లమెంట్‌ సభ్యుని వరకూ వారికి అవకాశం ఇవ్వాలి. యువతీ యువకులు భవి ష్యత్‌ రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రజా ప్రతి నిధులుగా ఎదగడానికి శిక్షణా ప్రాంగణాలుగా స్థానిక సంస్థలు ఉపయోగపడతాయి. అలాగే అట్టడుగు స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్లా ఎన్నికైన యువ ప్రతినిధులకు అవగాహన కలగడానికి అవి ఉపయోగపడ తాయి. వార్డు మెంబర్లుగా, గ్రామ సర్పంచ్‌ లుగా, ఎంపీటీసీలుగా, మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులుగా, మున్సిపల్‌ ఛైర్మన్లుగా, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మహా నగరాలకు మేయర్లుగా… ఇలా వివిధ పదవులను పొంది… పాలనలో ప్రాథమిక అనుభవం సంపాదించటానికి రాజకీయ పార్టీలు ముందు యువతకు అవకాశం కల్పించాలి. ఆ తర్వాత అసెంబ్లీ, శాసన మండలి, పార్లమెంట్‌ ఉభయ సభలకూ పోటీ చేయించాలి. దీనివల్ల కింది స్థాయి నుంచీ ఢిల్లీ వరకూ వివిధ పాలనా వ్యవస్థల పట్ల యువతకు అవగాహన పెరిగి మంచి పాలకులుగా ఎదుగుతారు.

యువత రాజకీయాల్లోకి రావడం దేశానికే కాదు.. రాజకీయ పార్టీలకూ అవసరమే. ఎందుకంటే ఏ రంగంలో అయినా పాత నీరు పోయి.. కొత్త నీరు వస్తేనే మనుగడ సాధ్యమౌతుంది. అలాగే రాజకీయ పార్టీల మనుగడకు కొత్త రక్తం కావాలి. యువత లేకపోతే ఏం జరుగుతుందో చెప్పటానికి బెంగాల్‌‌లో సీపీఎం ఉత్తమ ఉదాహరణ. జ్యోతిబసు, బుద్దదేవ్ భట్టాచార్య1977 నుంచి 2011 వరకు కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇద్దరూ అత్యంత ప్రతిభావంతులు. 2011లో సీపీఎం అక్కడ కూలిపోయింది. 34 ఏండ్లుగా పార్టీలోకి కొత్త రక్తం రాలేదు. ఆ పాత నాయకులే సీపీఎంపై ఆధిపత్యం చెలాయించారు. ఫలితంగా ఆ పార్టీ తెరమరుగైంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే.. మిగతా పార్టీలైనా యువ నేతల్ని ప్రోత్సహించాలి. లేకపోతే వాటికీ భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.

జాతీయ యువ విధానం ప్రకారం.. 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిని యువతగా పరిగణిస్తారు. ఇది చురుగ్గా, సృజనాత్మకంగా వుండే దశ. వర్గ, వర్ణ, లింగ భేదం లేకుండా, పేదలు, ధనవంతులన్న తేడా లేకుండా వీరందరూ ఒక సోషల్ గ్రూప్. ఇంట్లో అయినా, వీధిలోనైనా ఉరకలెత్తే సమూహం యువతరం. సందడికైనా, సాహసానికైనా ముందు నిలిచే సందోహం యువతరం. వాహనానికి ఇంధనం ఎలాగో దేశానికి యువతరం అలాగ. దేహానికి రుధిరం ఎలాగో సమాజానికి నవతరం అలాగ. ఎక్కడైనా, ఎప్పుడైనా దేన్నయినా శోధించి.. సాధించి, అధిగమించి.. అధిరోహించి విజయ పతాకాన్ని ఎగరేయడం యువతరానికి సహజ సిద్ధంగానే సమకూరే విద్య. దానికి సరైన నైపుణ్యమూ, సహకారమూ, లక్ష్యమూ జోడించగలిగితే- ఆ విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ఇంతటి శక్తిసామర్థ్యాలున్న యువత మిగతా రంగాలతో పాటు రాజకీయాలకూ అవసరమే.

స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో యువత ఉత్సాహంగా రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఆ పోకడ 2,3 దశాబ్దాలు కొనసాగింది. దీంతో అప్పుడెప్పుడూ రాజకీయాల్లో యువత లేరనే భావనే కలగలేదు. కానీ సరళీకరణల తర్వాత రాజకీయాల్లో యువత ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోయింది. నేతల గెలుపోటముల్ని డిసైడ్ చేసే స్థితిలో ఉన్న యువత.. నాయకత్వ స్థానాలకు మాత్రం ఎదగలేకపోతోంది. రాజకీయాలపై అనాసక్తే దీనికి ప్రధాన కారణం. లిక్కర్ బిజినెస్ చేసేవాళ్లు, రౌడీలు, కబ్జాకోరులే రాజకీయం చేయగలరనే భావన యువతను ముందే కట్టడి చేస్తోంది. ఇప్పటికీ యువత రిస్క్ చేస్తే రాజకీయాల్లో ఓ స్థాయి వరకూ ఎదగొచ్చు. కానీ అంతకుమించి ఎదగటం సాధ్యం కాదు. ఎందుకంటే నేతలు అలా ఎదగనివ్వరు. ఇతర రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితులుండగా.. రిస్క్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి పరిస్థితులతో రాజీపడాల్సిన కర్మేంటని యువతరం ప్రశ్నించుకుంటోంది. దీంతో రాజకీయాలంటేనే ఆమడ దూరం పరిగెడుతోంది.

చరిత్రలో అయినా, సమాజంలోనైనా యువత పాత్ర ఎంతో కీలకం. ఏ ఉద్యమం విజయవంతం కావాలన్నా, ఏ ప్రాజెక్టు ఫలవంతం అవ్వాలన్నా వారి క్రియాశీలత ప్రధానం. అందుకనే వందేళ్ల క్రితమే వివేకానందుడు ప్రత్యేకించి యువతరాన్ని మేల్కొలిపే ఉద్యమం చేపట్టారు. యువతరం పూనుకుంటే దేశాన్ని ముందుకు నడిపించవొచ్చని అప్పుడే చెప్పారు. ప్రపంచ దేశాలన్నింటి కన్నా అత్యధిక యువ జనాభా వున్న దేశం భారత్‌. ప్రపంచంలో 180 కోట్ల యువత ఉంటే- అందులో 28 శాతం మన యువతే. మన దేశంలో ఇప్పుడు పౌరుల సగటు వయసు 29 ఏళ్లు. అంటే భారత్‌ నవనవలాడుతున్న ఒక యువజన దేశం.

రాజకీయాల్లోకి రాకపోవటానికి యువతకు కొన్ని కారణాలున్నాయి. ప్రతికూలతలు ఉన్న మాట నిజమే అయినా.. యువశక్తి ముందు ఆ అడ్డుగోడలు నిలబడలేవని చెప్పటానికి చరిత్రలో చాలా ఉదాహరణలున్నాయి. యువరక్తానికి.. విప్లవానికి, కవిత్వానికి.. గట్టి సంబంధం ఉంది. 23 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడే ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అని భగత్‌సింగ్‌ నినదించారు. 24 ఏళ్ల వయస్సుకే అల్లూరి సీతారామరాజు వందేమాతరం అని విశాఖ మన్యాన్ని చైతన్యబాటలో కదిలించారు . శీతకాలం కోత పెట్టగ.. కొరడు కట్టీ.. ఆకలేసీ కేకలేశానే అనే కవితతో శ్రీశ్రీ 23 ఏళ్ల వయస్సులోనే జయభేరి మోగించారు. పద్దెనిమిదేళ్లు దాటేస్తున్నా.. ఒక్క మంచి కవితా రాయలేదే అని మహాకవి జాన్‌మిల్టన్‌ మధనపడ్డారు. టి.ఎస్‌. ఇలియట్‌ తన మాస్టర్‌ పీస్‌ అయిన ది వేస్ట్‌ ల్యాండ్‌ ను, జాన్‌కీట్స్‌ తన అత్యుత్తమమైన కవిత్వాన్ని పాతికేళ్ల లోపే రాసేశారు. నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడివితినని శ్రీనాథుడే స్వయంగా రాసుకున్నాడు. వీరందరి స్ఫూర్తితో యువత ముందుకు కదిలితే రాజకీయ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగటం పెద్ద విషయమేం కాదు. కాకపోతే అడ్డుగోడల్ని బద్దలు కొట్టాలన్న సంకల్పం తీసుకోవటమే ఇక్కడ కీలకం.

యువతక రాజకీయాలపై విముఖత కలగటానికి విద్యావ్యవస్థ కూడా ఓ కారణం అని చెప్పక తప్పదు. గతంలో ఇంటర్ స్థాయి నుంచీ పీజీ వరకు విద్యార్థి సంఘాలు చాలా చురుగ్గా, శక్తివంతంగా ఉండేవి, నిర్ణీత కాలవ్యవధిలో జరిగే విద్యార్థి సంఘాల ఎన్నికలు యువ నేతలను తయారుచేసేవి. కానీ ఇప్పుడు విద్యావ్యవస్థలో.. విద్యార్థి సంఘాల ప్రాధాన్యత చాలా వరకు తగ్గిపోయింది. దీంతో అసలు విద్యార్థి సంఘాలు ఉంటాయని కూడా తెలియని తరం చదువు పూర్తిచేసుకుని సమాజంలో అడుగుపెడుతోంది. దీంతో వీరికి అకడమిక్ నాలెడ్జ్ మినహా మిగతా దేని గురించీ అవగాహన ఉండే అవకాశం ఉండటం లేదు. చదువుకునేటప్పుడు అకడమిక్ నాలెడ్జ్, ఉద్యోగాల కోసం స్కిల్ డెవలప్ మెంట్. అంతే కదా కావాల్సింది. ఇక మిగతా నాలెడ్జ్ అంటా టైమ్ వేస్ట్.. బ్రైన్ వేస్ట్ అనేది జెన్ జీ అభిప్రాయం. బాగా చదివితే కచ్చితంగా గోల్డ్ మెడల్ వస్తుంది. ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మ్ చేస్తే.. కచ్చితంగా లక్షల రూపాయల జీతంతో కొలువు ఖాయం. అది వచ్చాక జీవితంలో స్థిరపడిపోవచ్చు. ఇంత గ్యారంటీ జీవితాన్ని కళ్లెదురుగా పెట్టుకుని.. ఎంత కష్టపడ్డా.. ఏం చేసినా ఎదుగుతామనే నమ్మకం లేని రాజకీయాల్లోకి ఎందుకు రావాలని యువత ఆలోచించడమే పెద్ద సమస్య అనడంలో మరో మాటకు తావు లేదు.

మానవ వనరులుగా ఉన్న యువతను వినియోగించుకొని పాలనలో భాగస్వాములు చేసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పరిశ్రమలలో, ఉద్యోగాల్లో, వివిధ రంగాల్లో యువత స్థానాన్ని అడ్డుకునే వారు లేరు. ఎందుకంటే అవి వారి ప్రతిభ ఆధారంగా పొందినవి. కానీ ఓ విద్యావంతుడు, యువకుడు నాయకునిగా ఎదిగితే మాత్రం పాలకవర్గం తట్టుకోలేకపోతోంది. పాలకులు యువ నాయకత్వాన్ని అణచివేయడంలో విజయవంతమవుతున్నారు. ఫలితంగా రాజకీయ వారసులను తెరపైకి తెచ్చుకొని అందలాలు ఎక్కిస్తున్నారు. ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా యువత కలిగిన దేశంగా రెండో స్థానంలో ఉన్న ఇండియా యువ నాయకత్వంలో మాత్రం జీరోగా మారింది. అందుకు పాలకుల పరోక్ష కారణాలు, ధనస్వామ్య రాజకీయాలని స్పష్టంగా చెప్పవచ్చు. అలాగే యువతలో రాజకీయ చైతన్యం లేకపోవడం మరో కారణంగా అర్థం చేసుకోవచ్చు. 75 ఏళ్ల రిపబ్లిక్‌‌ ఇండియా ఇంకా అసమానతలు, అభివృద్దికి దూరంగా బతుకుతున్న ఎందరికో దారి చూపడానికి… సామాజిక పోరాటం ఒక్కటే కాదు.. చట్టాల ద్వారా వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఆధునిక పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా భారత్ అన్ని రంగాల్లో రాణించాలంటే యువశక్తి నాయకత్వంలో ప్రధాన పాత్రను పోషించడం వల్లనే అది సాధ్యమవుతుంది

ఏ రంగంలో అయినా నాయకత్వానికి యువతరం సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఎప్పటికప్పుడు సకాలంలో నాయకత్వ మార్పిడికి అవకాశం ఉంటుంది. కానీ కొన్నాళ్లుగా దేశ రాజకీయాల్లో నాయకత్వ మార్పు జరగకడం లేదు. దీనికి ప్రధాన కారణం యువత నిరాసక్తతే అంటే ఔననక తప్పని పరిస్థితి. ఓవైపు రాజకీయాలంటే విముఖత ప్రదర్శిస్తూ.. ఆవైపే కన్నెత్తి చూడకుండా.. మరోవైపు ఉన్న నాయకులు మారిపోయి కొత్త నాయకత్వం రావాలనుకోవడం ఎలా సాధ్యమనేది యువత ఆలోచించాల్సిన విషయం. నాయకత్వం మారాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ మార్పు కోసం మనమేం చేస్తున్నామనే సంగతి ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఇప్పటికీ యువ శక్తి సామర్థ్యం ఏంటో.. వారి కంటే మన రాజకీయ నేతలకే ఎక్కువగా తెలుసంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే యువతపై తీవ్ర ప్రభావం పడే అంశాలపైనా.. వారు ఎక్కువగా రియాక్ట్ అవుతారనుకునే విషయాలపైనా ఎంత బలమైన నేతలైనా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మిగతా ధర్నాలు, ఆందోళనల్ని లైట్ తీస్కున్నా.. యువత చేసే పోరాటాల్ని మాత్రం ఎవరూ లైట్ తీస్కునే పరిస్థితి లేదు. ఇలా తమ శక్తి ఏంటో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా.. యువత మాత్రం ఓ పరిధి దాటి బయటకు రావడం లేదు. రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడటం లేదు.

ఇటీవల రాజకీయాలలో అడపాదడపా యువతకు అవకాశం కల్పిస్తున్నా అది ఎక్కువ మేర ప్రభావం చూపడం లేదు. ఉదాహరణకి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కొత్త పార్టీ తరఫున కొంతమంది వెలుగులోకి వచ్చారు. అలాగే గత కొద్ది కాలంగా ఏపీ, తెలంగాణలో కూడా అక్కడక్కడ కొంతమంది యువకులు ఇటు పార్టీల ద్వారా, ఇండిపెండెంట్‌గా నిలబడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇండిపెండెంట్‌లు గెలిచిన దాఖలాలు ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కొంతమేర పంచాయతీ ఎన్నికల్లో యువకులు ముందుకు వస్తున్నప్పటికీ ఆ ఎన్నికల్లో కూడా పార్టీల అభ్యర్థులే ప్రధాన భూమిక పోషించి కొత్తవారికి అవకాశం లేకుండా చేస్తున్నారు. మరి ఇంతగా వారసత్వ రాజకీయాలు, గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో యువతకి అండగా ఎవరు నిలబడతారు? ఎవరు వారిని చైతన్యవంతం చేస్తారు? ఆర్థికంగా సపోర్ట్ చేసేవారు ఎవరు?

యువతరం దేశానికి ఇంధనం. ప్రగతికి రథచక్రం. చరిత్రలో ఏ మార్పు సంభవించినా అది ఉరకలెత్తే యువత వల్లే సాధ్యం. అలాంటి యువశక్తి నిర్వీర్యమౌతుందన్నది నిష్టురసత్యం. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల.. దశ, దిశలను అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. మన చుట్టూ జరుగుతోన్న వాస్తవ పరిస్థితులను గుర్తించడంలో ఏమాత్రం ఏమరుపాటు వహించినా ఒక తరం అభివృద్ధి ప్రమాదంలో పడుతుంది. యువశక్తి దేశాభ్యుదయానికి జీవనాడి. ఆ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా.. దేశాన్ని మార్చటానికి, రాజకీయ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయటానికి యువతే నడుం బిగించాలి. రాజకీయాల్లో యువత ప్రాబల్యం పెరిగితే కచ్చితంగా పార్టీల మౌలిక విధానాల్లో తేడా వస్తుంది. తద్వారా మొత్తం రాజకీయ వ్యవస్థ స్వరూపం మారుతుంది. అప్పుడు పాత జాడ్యాలన్నీ చాలావరకు వదిలిపోతాయి. కానీ ఈ సువర్ణావకాశాన్ని యువతే సృష్టించుకోవాలి. కానీ యువ తరం మాత్రం రాజకీయలంటే రిస్క్ అనే ధోరణితో.. గట్టునుంచి వినోదం చూద్దాం అనుకుంటోంది. అదే తప్పంటున్నారు మేధావులు. రాజకీయాల్లోకి దిగి ఆ రంగంలో పనిచేయకుండా.. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన సాధ్యం కాదు. అదీ యువతే చేయాల్సి ఉంది. రాజకీయాలు కుళ్లిపోయాయాని నేతల్ని తిట్టుకుంటూ కూర్చోవటం ఫ్యాషనైపోయింది. కానీ అదే కుళ్లిన వ్యవస్థ దేశాన్ని ముందుకు నడిపిస్తోందన్న వాస్తవాన్ని గుర్తించాలి. దేశంలో ఏం మారాలన్నా మొదట మారాల్సింది రాజకీయమే. దాన్ని మార్చాల్సింది యువతరమే. ఈ వాస్తవాన్ని యువత ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి.

30 ఏళ్ల లోపు దేశరక్షణలో అమరులైన యువత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ స్ఫూర్తితో రాజకీయాల్లోనూ యువత ప్రవేశించాలి. అప్పుడే అందరూ కోరుకునే కొత్తతరహా రాజకీయాన్ని చూడగలం. లేకపోతే ఎన్ని దశాబ్దాలైనా పాత చింతకాయ పచ్చడి తినాల్సిందే. అటు పార్టీలు కూడా వాటి మనుగడ సాగించటానికి యువత చేదోడు తీసుకోవాలని గుర్తించాలి. అవకాశాల్ని యువత ఎలాంటి అడ్డుగోడలు సృష్టించుకోకుండా అందుకోవాలి. అప్పుడే నవభారతం సాకారమౌతుంది.

యువత రాజకీయాల్లోకి రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. రాజకీయాలు బాగా ఖరీదుగా మారిపోయాయి. ఎవరి సహకారం లేకుండా ఎదగలేమనే అభిప్రాయం ఉంది. రాజకీయం ఒక ఆటవిక కార్యక్రమం అయిపోయింది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ జీతం తెచ్చుకునే ఉద్యోగులను మాత్రమే తయారు చేస్తోంది. రాజకీయాలంటే సమాజంలో గౌరవం లేకుండా పోవడంతో.. యువత విముఖత పెంచుకుంటున్నారు. పాలిటిక్స్ లో ఎదగటానికి తక్కువ అవకాశం ఉంటుందనే భావన కూడా బలంగా పాతుకుపోయింది. మంచి వ్యక్తిత్వం ఉన్న తెలివైన యువకులలో చాలామంది రాజకీయాలు తమకు సరిపోవని భావిస్తారు. ఉద్యోగం సంపాదించడం , మంచి ఆదాయంతో తమ భవిష్యత్తును నిర్ధారించుకోవడం వారి ప్రధాన లక్ష్యం. రాజకీయాల విషయంలో యువత ఆలోచన ధోరణి మారితే.. చాలా మార్పులు వాటంతట అవే జరిగిపోతాయి. జనాభాలో అధిక శాతాన్ని కాదని ఎవరూ ఏమీ చేసే పరిస్థితి ఉండదు. యువత అక్కడొకరు, ఇక్కడొకరు రాజకీయ ప్రయత్నాలు చేసి.. ఒంటరి పోరాటం చేయలేక ఓడిపోతున్నారు. అదే యువత సమూహంగా ముందుడగు వేస్తే.. సమష్టి శక్తి చాటితే.. ఎంత కొమ్ములు తిరిగిన నాయకుడైనా.. ఎంత బలమైన పార్టీ అయినా తలవంచక తప్పదు. కాకపోతే అందుకు కాస్త వ్యూహం, మరికాస్త చొరవ కావాలి. వాటిని యువత అందిపుచ్చుకుంటే.. ఇక ఆకాశమే హద్దురా అనటానికి ఎక్కువ కాలం వేచిచూడాల్సిన అవసరం ఉండదు. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.

Exit mobile version