ఎన్టీఆర్ వీరాభిమాని, టీడీపీ సీనియర్ నాయకులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రామచంద్రరాజు (ఎన్టీఆర్ రాజు) ఈరోజు ఉదయం కన్నుమూశారు. తిరుపతిలోని తన నివాసంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్టీఆర్ రాజు మరణంతో టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతిపట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు.
మహానేత ఎన్టీఆర్ గారిపై ఉన్న అపారమైన అభిమానంతో ఆయన పేరునే రామచంద్రరాజు తన ఇంటిపేరుగా (ఎన్టీఆర్ రాజు) మార్చుకుని నిజమైన వీరాభిమాని అనిపించుకున్నారు. రెండు పర్యాయాలు టీటీడీ బోర్డు సభ్యులుగా ఎంతో అంకితభావంతో సేవలందించారు. ఎన్టీఆర్‌కి ఆల్ ఇండియా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి.. పార్టీకి, ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారు. శాసనసభ సభ్యునిగా అవకాశం వచ్చినా.. ఎన్టీఆర్ అభిమాని గానే ఉంటా అని చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. ఆచరణతోనే ఆదర్శంగా నిలిచిన ఎన్టీఆర్ రాజు జీవితం.. తరతరాల వారికి మార్గదర్శకంగా నిలుస్తుంది.
Also Read: SRH Team 2026: మాన్‌స్టర్ వచ్చేశాడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత మారేనా?
ఎన్టీఆర్ రాజు మరణంపై సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. ‘తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అన్న ఎన్టీఆర్ గారి వీరాభిమాని, మూడు సార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా అన్నగారు నియమించిన పెద్దలు శ్రీ రామచంద్రరాజు (ఎన్టీఆర్ రాజు) గారు ఇవాళ ఉదయం కన్నుమూశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.
