నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళి అర్పించారు. నాయకుడిగా, సీఎంగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనో వేదనకు గురవుతున్నానని తెలిపారు. లక్షలాది ప్రజలు చూస్తుండగా ఎన్టీఆర్ తనను వివాహం చేసుకున్నారని, తనను ఎందుకు నందమూరి కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదు అని ప్రశ్నించారు. తనకు అవమానం జరుగుతుంటే సీఎం చంద్రబాబు ఇలానే చూస్తూ ఉంటారా? అని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ… ’29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనో వేదనకు గురవుతున్నా. లక్షలాది ప్రజలు చూస్తుండగా.. ఎన్టీఆర్ నన్ను వివాహం చేసుకున్న విషయం మీకు తెలుసు. నన్ను ఎందుకు ఈ కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదు. ఎన్టీఆర్ రాజకీయంగా అధికారంలోకి రావడంలో నా వంతు కృషి చేశాను. ఒక్క రూపాయి ఆశించకుండా చివరి వరకు ఆయనకు సేవలు చేశాను. నిన్న నా ఫోన్ నంబర్ ఎవరో టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో పెట్టారు. నిన్నటి నుండి వెయ్యికి పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. చూపించలేని అసభ్య మేసేజ్‌లు కూడా వస్తున్నాయి. మీరు అనుకున్నా, అనుకోకున్నా నేను మీ అత్తగారిని కదా చంద్రబాబు. ఇలాంటి అవమానం నాకు జరుగుతుంటే ఇలానే చూస్తూ ఉంటారా చంద్రబాబు?’ అని ప్రశ్నించారు.
‘ఇన్నేళ్ళు డబ్బు ఉన్నా లేకున్నా ఎవరినీ చేయిచాచి అడగలేదు. ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా బ్రతుకుతున్నాను. నామీద ఎందుకు మీకు కక్ష. అసలు నేనేమీ తప్పు చేశానో కూడా నాకు అర్ధం కావడం లేదు. ఎన్టీఆర్ పేరుతో మీరంతా లక్షలు కోట్లు సంపాదించారు. అలాగే పెద్దాయన్ని సాగనంపారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు. మహిళలను గౌరవించే అవసరం మీకు లేదా?’ అని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.