Digvijaya Singh: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారంటూ పేర్లు బయటికి వస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా పోటీలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. దీనిపై ఆయన ఇవాళ స్పందించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష ఎన్నికలకు ఆయన నామినేషన్ వేస్తారనే ఊహాగానాల మధ్య, పార్టీ చీఫ్ రేసులో తాను లేనని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం తెలిపారు. జబల్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని, అయితే పార్టీలోని అధిష్టానం తనకు ఇచ్చిన సూచనల మేరకు నడుచుకుంటానని అన్నారు.
దిగ్విజయ్ సింగ్ క్లారిటీ ఇవ్వడంతో అధ్యక్ష పదవి రేసులో ఇద్దరి పేర్ల మాత్రమే వినిపిస్తున్నాయి. తాను రేసులో లేనని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేయడంతో, అశోక్ గెహ్లాట్, శశి థరూర్ పార్టీ చీఫ్ పదవికి పోటీదారులుగా నిలిచారు.రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన అభ్యర్థిత్వాన్ని శుక్రవారం ధ్రువీకరించడంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.దీంతో రాజస్థాన్ మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ కూడా జరగవచ్చని భావిస్తున్నారు, ఎందుకంటే పార్టీ చీఫ్ పదవిని నిర్వహించడం కోసం అతను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. పార్టీలో ఒకే వ్యక్తి, ఒకే పదవి అనే నిబంధన ఉంటుందని రాహుల్ గాంధీ గురువారం స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశం ఉంది.
PM Narendra Modi: ‘అర్బన్ నక్సల్స్’ ఏళ్ల తరబడి ఆ డ్యామ్ పనులను నిలిపివేశారు..
కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సైద్ధాంతిక పదవిగా అభివర్ణించిన రాహుల్ గాంధీ, ఈ స్థానం భారతదేశ ఆలోచనలు, నమ్మక వ్యవస్థ, దృక్పథానికి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. శశి థరూర్‌తో కూడిన జీ-23 అని పిలువబడే కాంగ్రెస్ నాయకుల బృందం, పార్టీలో పెద్ద ఎత్తున సంస్కరణలు కోరుతూ 2020 ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాసింది.
సెప్టెంబరు 19న శశిథరూర్ సోనియాగాంధీని ఢిల్లీలోని నివాసంలో కలుసుకున్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికను సోనియా ముందు ప్రస్తావించగా.. ఆమె ఆయన కోరికను ఆమోదించారు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెప్పారు .పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీని కూడా శశిథరూర్ బుధవారం కలిశారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 19న ఫలితాలు వెల్లడికానున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్‌లకు గడువు విధించారు.