AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!

North Andhra Weather Alert Rains

North Andhra Weather Alert Rains

North Andhra Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వాయుగుండం గంటకు సుమారు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. సెప్టెంబర్ 23 రాత్రికి ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల మధ్య, విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య, కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సెప్టెంబర్ 23న కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులకు హెచ్చరిక జారీ కాగా.. సెప్టెంబర్ 24న కూడా అతి భారీ వర్షాల ముప్పు కొనసాగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమగోదావరి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపించనుంది. మరోవైపు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆకస్మిక వరదల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఐఎండీ బులెటిన్ ప్రకారం.. సెప్టెంబర్ 22 సాయంత్రం వాయుగుండం కళింగపట్నానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సెప్టెంబర్ 23 రాత్రికి విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 25–30 నాటికల్ మైళ్ల వేగంతో గాలులు, గంటకు 40 నాటికల్ మైళ్ల వరకు గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నంబర్ స్థానిక హెచ్చరిక కొనసాగుతోంది. దక్షిణ కోస్తా పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రం చాలా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడకూడదని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

భారీ వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలోని వాగులు, వంకలు, నదుల్లో నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ పరిస్థితులపై అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వరద నీటి ప్రవాహాలను దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లి ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో పలు రహదారులు జలమయమయ్యాయి. కొన్ని గ్రామాల్లో డ్రైనేజీల్లో పూడిక తొలగించకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి చేరి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వర్షాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాగుకు అవసరమైన నీరు అందుతుందని, పంటలకు వర్షాలు ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు.