Site icon NTV Telugu

FIFA Fan Event: ఫిఫా ఈవెంట్‌లో రెపరెపలాడిన భారత జెండా.. నోరా డ్యాన్స్‌కు ఫిదా.. వీడియో వైరల్‌

Fifa Fan Event

Fifa Fan Event

FIFA Fan Event: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో భారత మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జైహింద్ అంటూ నినాదాలు హోరెత్తాయి. ఏంటి ఇదంతా నిజమా? భారత్ ఎప్పుడు ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో అర్హత సాధించింది? అని అనుకుంటున్నారా.. అయితే ఫిఫా ప్రపంచకప్‌లో భారత్ భాగం కానప్పటికీ.. మన జెండా వరల్డ్ కప్ వేదికపై కనిపించింది. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫ్యాన్ ఈవెంట్ సందర్భంగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహి అక్కడ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చిన సందర్భంగా ఆమె జైహింద్ అనే నినాదాలతో వేదికను హోరెత్తించింది. ఆ సమయంలో నోరా ఫతేహీకి ఓ అభిమాని భారత జెండాను ఇవ్వగా వేదికపై నుంచే ఆమె జెండాను ఎగరేస్తూ భారత అభిమానుల హృదయాలను గెల్చుకుంది.

Himanta Biswa Sarma: రాహుల్ గడ్డంతో సద్దాం హుస్సేన్ లాగా కనిపిస్తున్నాడు..

ఫిఫా ప్రపంచకప్ 2022 ఫ్యాన్స్ ఫెస్ట్‌ కోసం నోరా ఫతేహి తన ప్రత్యేకమైన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఇంతలో ఓ అభిమాని ఆమెకు భారత జెండాను అందించాడు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్న నోరా.. జైహింద్ అనాలంటూ ప్రేక్షకులను పిలుపునిచ్చింది. ఎవరైనా జైహింద్ అంటారా? అని అడిగింది. దీంతో భారత అభిమానులంతా జైహింద్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. అంతేకాకుండా జెండాను భుజంపై వేసుకుని ఎగరేసింది. ఆ విధంగా మన త్రివర్ణ పతాకంపై ఫిఫా ప్రపంచకప్ వేదికపై రెపరెప లాడింది. నోరా వేదికపై ‘సాకి సాకి’, ‘మనికే’ వంటి అనేక హిట్ బాలీవుడ్ ట్రాక్‌లకు తన డ్యాన్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం నోరా వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను ఓ అభిమాని తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. మన దేశానికి చెందిన వ్యక్తి కాకపోయినా నోరాను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఓ యూజర్ తన స్పందనను తెలియజేశాడు. చాలా మంది ఆనంద భాష్పాలను రాలుస్తున్నట్లు రెడ్ హార్ట్ ఎమోజీలను జత చేశారు. ఎలాంటి మధురమైన క్షణాలను ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version