ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించడంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. ప్రత్యర్థి ఆటగాడైనా సరే బాగా ఆడితే.. మైదానంలోనే ప్రశంసిస్తుంటాడు. సహచర, ప్రత్యర్థి ఆటగాళ్ల కష్టానికి క్రెడిట్ ఇవ్వడంలో ముందుండే మహీ.. తాజాగా ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు. తనకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వచ్చినా.. అందుకు తాను అర్హుడను కాదని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చిన మహీకి అవార్డు రాగా.. పైవిధంగా స్పందించాడు.
ఎల్‌ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సీఎస్‌కేకు హ్యాట్రిక్ ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో తనదైన హిట్టింగ్‌తో విజయం అందించిన మహీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 18వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవడం ఎలా అనిపిస్తుందని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో కామెంటేటర్ మురళీ కార్తీక్ అడగగా.. ‘నాకు ఎందుకు అవార్డు ఇస్తున్నారా? అని ఆలోచిస్తున్నా. ఈ అవార్డుకు నూర్ అహ్మద్ అర్హుడు. ఈరోజు అతడు మెరుగైన ప్రదర్శన చేశాడు. మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు’ అని ధోనీ సమాధానం ఇచ్చాడు.
Also Read: MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో మొదటి ఆటగాడిగా ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు!
లక్నో సూపర్ జెయింట్స్‌పై నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన 4 ఓవర్ల కోటాలో వికెట్ తీయకపోయినా 13 పరుగులే ఇచ్చాడు. నూర్ అద్భుత బౌలింగ్ కారణంగా ఎల్‌ఎస్‌జీ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఇప్పటివరకు చెన్నై 7 మ్యాచ్‌లు ఆడగా.. నూర్ అహ్మద్ 24 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 12 వికెట్స్ పడగొట్టి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. 20 ఏళ్ల నూర్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్. 2022లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు.