Site icon NTV Telugu

Nominations: మోగనున్న ఎన్నికల సైరన్‌.. తెలంగాణ, ఏపీల్లో రేపట్నుంచే నామినేషన్ల పర్వం

Ap Ts

Ap Ts

Nominations: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రేపట్నుంచి ఎన్నికల నామినేషన్లు మొదలు కానున్నాయి. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగానే… ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 26న నామినేషన్లను పరిశీలన, 29న నామినేషన్ల విత్‌డ్రాకు అవకాశం ఇచ్చింది ఈసీ. పోలింగ్ మే 13న జరుగుతుంది. జూన్ నాలుగున కౌంటింగ్ ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్‌ ఆఫీస్‌ గేటు నుంచి 100 మీటర్ల వరకే వాహనాలకు అనుమతి ఇచ్చింది ఎలక్షన్ కమిషన్‌. అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపింది.

Read Also: Vallabhaneni Balashowry: నా వల్ల కాదు అనే వైసీపీకి రాజీనామా చేశా..

ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ముహుర్తాలు చూసుకున్నారు. పేరు బలం, గ్రహబలం చెక్ చేసుకుని నామినేషన్‌ వేసేందుకు టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అఫిడవిట్లు, పేపర్ వర్కంతా రెడీ చేసుకుని పెట్టుకున్నారు. అవసరాన్ని బట్టి రెండు మూడు సెట్ల నామినేషన్లు వేయడానికి రెడీ అయ్యారు. సీఎం జగన్ ఈనెల 25న పులివెందుల అసెంబ్లీకి నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకు ముందే 22న జగన్ తరఫున ఒక సెట్ నామినేషన్ అవినాష్‌ రెడ్డి వేస్తారని చెబుతున్నారు.

Read Also: Kejriwal: కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీకి మరో షాక్.. తాజా ఆదేశాలు ఇవే

తెలంగాణలో రేపటి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. రేపు మెదక్‌, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌ బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మెదక్‌ నుంచి రఘునందన్‌రావు… మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌, మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ నామినేషన్‌ వేస్తారు. ఇక… ఎల్లుండి… సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి, ఖమ్మం నుంచి వినోద్‌రావు నామినేషన్లు దాఖలు చేశారు. వీరి నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరవుతారు. ఈ నెల 22న జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబాబాద్ అభ్యర్థులు నామినేషన్ వేస్తారు. జహీరాబాద్‌ నుంచి బీబీ పాటిల్‌, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నల్లగొండ నుంచి సైదిరెడ్డి, మహబూబాబాద్‌ నుంచి సీతారాం నాయక్‌ నామినేషన్‌ వేయనున్నారు. 23న భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి, 24న పెద్దపల్లి, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, వరంగల్‌ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. హైదారాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్‌ కార్యక్రమానికి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, వరంగల్ అభ్యర్థి అరూర్ రమేష్ నామినేషన్‌కు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ హాజరవుతారు. ఇక… 25న కరీంనగర్, నిజామాబాద్, నాగర్‌కర్నూల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్, నాగర్‌కర్నూల్ అభ్యర్థి భరత్ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ హాజరుకానుండగా… నిజమాబాద్ అభ్యర్థి అరవింద్ నామినేషన్‌కు అశ్విని వైష్ణవ్ హాజరవుతారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ విషయానికొస్తే ఇంకా కరీంనగర్‌, ఖమ్మం, హైదరాబాద్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ప్రకటించిన నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు.

Exit mobile version