Site icon NTV Telugu

Noida Phase 2 Protest: కట్టలు తెంచుకున్న కార్మికుల కోపం.. నోయిడాలో కార్లకు నిప్పు.. రాళ్లదాడితో దద్దరిల్లిన వీధులు!

Noida Phase 2 Protest

Noida Phase 2 Protest

Noida Phase 2 Protest: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న ప్రైవేట్ కంపెనీల ఉద్యోగుల ఆగ్రహం సోమవారం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. నోయిడాలోని ఫేజ్-2 ప్రాంతంలో గత మూడు రోజులుగా శాంతియుతంగా సాగుతున్న ప్రైవేట్ కంపెనీ ఉద్యోగుల ఆందోళన సోమవారం ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. వేతనాల పెంపుతో పాటు పలు డిమాండ్ల కోసం ఉద్యోగులు చేపట్టిన నిరసన ఉగ్రరూపం దాల్చడంతో నోయిడా వీధులు ఒక్కసారిగా రణభూమిని తలపించాయి. నోయిడా ఫేజ్-2 పరిధిలోని సెక్షన్-84 ప్రాంతంలో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన హింసకు దిగారు.

READ ALSO: Akkineni : అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. నాగచైతన్య లైనప్‌లో ప్రాజెక్టులు!

పోలీసులపై రాళ్లదాడి.. వాహనాలకు నిప్పు
వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఉద్యోగులు ఉదయాన్నే రహదారులను దిగ్బంధించారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి విషమించింది. ఆగ్రహించిన నిరసనకారులు ఒక్కసారిగా పోలీసు వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో సెక్టర్-84లో రెండు వాహనాలకు నిప్పు కూడా పెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో, భీతావహ వాతావరణంతో నిండిపోయింది.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచడం లేదని, కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న జీతం తమకు ఏమాత్రం సరిపోవడం లేదని, అందుకే రోడ్లపైకి రావాల్సి వచ్చిందని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజానికి ఈ ఉద్రిక్తతలకు ఒక రోజు ముందే జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎటువంటి స్పష్టత రాకపోవడంతో ఉద్యోగులు శాంతించలేదు. సోమవారం ఉదయం ఒక్కసారిగా ఆందోళన ఉగ్రరూపం దాల్చింది.

భారీగా మోహరించిన పోలీసు బలగాలు
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అధికారులు అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు. లాఠీఛార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 144 సెక్షన్ తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. హింసకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ, పరిస్థితి తమ నియంత్రణలోనే ఉందని పోలీసులు చెబుతున్నారు.

READ ALSO: Sensex Crash: ట్రంప్ ‘దిగ్బంధనం’ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 105 డాలర్లకు చేరిన ముడి చమురు!

Exit mobile version