Gujarat: గుజరాత్‌లోని అన్ని రాజకీయ పార్టీలు వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, నవ్‌సారి అసెంబ్లీ నియోజకవర్గంలోని అంచేలి గ్రామస్తులతో పాటు 17 ఇతర గ్రామాల వాసులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అధికార బీజేపీకి చెందిన రాజకీయ నాయకులను ప్రచారం కోసం గ్రామాల్లోకి రాకుండా నిషేధించాలని బ్యానర్లు వేలాడదీశారు. అంచేలి రైల్వే స్టేషన్‌లో లోకల్ రైళ్లను ఆపాలన్న తమ డిమాండ్ ఇంకా నెరవేరకపోవడమే ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అంచేలి రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రాంతాల్లో ‘ట్రైన్ నహీ తో వోట్ నహీ’ అంటూ బ్యానర్లు వెలిశాయి. ఎన్నికల ప్రచారానికి బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలు రావొద్దు.. మా డిమాండ్‌లు నెరవేరడం లేదు. ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అంటూ పోస్టర్‌లో రాసుకొచ్చారు. కొవిడ్‌కు ముందు ఇక్కడ రైలును ఆపాలనేది వారి డిమాండ్. ఈ సమస్యపై సంబంధిత వ్యక్తులెవరూ స్పందించడం లేదని జోనల్ రైల్వే వినియోగదారుల కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు ఛోటూభాయ్ పాటిల్ అన్నారు.
Narayana: మోడీ వచ్చారు.. వెళ్ళారు.. తెలుగు రాష్ట్రాలకేం చేశారు?
“1966 నుండి లోకల్ ప్యాసింజర్ రైలు ఇక్కడ ఆగుతుంది, కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా అది ఆగిపోయింది. అది పునఃప్రారంభమైన తర్వాత, అది ఇక్కడ మా స్టేషన్‌లో ఆగదు. కనీసం 19 గ్రామాల ప్రజలు తమ ఉద్యోగాల కోసం ఇక్కడి నుంచి ప్రయాణాలు చేస్తారు.” అని చోటూభాయ్ పాటిల్ అన్నారు. ఈ డిమాండ్‌పై ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు లేని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ను పంపాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారని ఛోటూభాయ్ పాటిల్ తెలిపారు.