Karnataka Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ 136 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. ఫలితాల్లో బీజేపీ 65 స్థానాలకే పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో కర్ణాటక రాజకీయ ఆనవాయితీ పునరావృతమైంది. కర్ణాటక ఎన్నికల్లో ఓ పార్టీ ఈ స్థాయిలో మెజార్టీ దక్కించుకోవడం దాదాపు 34 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం విశేషం. కర్ణాటకలో గత 38 సంవత్సరాలుగా ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. 1983, 1985 సంవత్సరాలలో జనతా పార్టీ వరుసగా రెండుసార్లు విజయం సాధించింది. ఆ తర్వాత నుండి ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి గెలవలేదు.
Read Also:Prabhas: ‘ఆదిపురుష్’ హిట్ కావాలని భద్రాద్రి ఆలయానికి రూ.10లక్షల విరాళం
2013లో కాంగ్రెస్ పార్టీ గెలవగా, 2018లో బీజేపీ, ఇప్పుడు 2023లో తిరిగి కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఇది రెండో అత్యధిక మెజార్టీ. 1989లో కాంగ్రెస్ 179 సీట్లు గెలిచింది. ఆ తర్వాత పదేళ్లకు కాంగ్రెస్ పార్టీయే 1999లో 132 స్థానాల్లో గెలిచింది. ఈసారి ఏకంగా 136 స్థానాలు గెలిచి 1999 రికార్డును బద్దలు కొట్టింది. కాంగ్రెస్ పార్టీకి 1989లో వచ్చిన 179 సీట్ల తర్వాత అత్యధికం ఇదే. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 40 శాతానికి కాస్త అటు, ఇటుగా మాత్రమే ఉంది. బీజేపీ ఓటు బ్యాంకు మాత్రం భారీగా తగ్గుతూ, పెరుగుతూ వస్తోంది. అధికారం విషయానికి వస్తే కాంగ్రెస్, బీజేపీ చెరోసారి అధికారంలోకి వస్తున్నాయి.
Read Also:PBKS vs DC: పంజాబ్ కింగ్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం
చామరాజనగర్ జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రుల పాలిట శాపంగా మారిందనే అపవాదును కొన్న ఏళ్లుగా మోస్తూనే ఉంది. చామరాజనగర్‌లో అడుగుపెట్టిన సీఎం.. ఆ పదవిని కోల్పోతారనే నమ్మకం కర్ణాటకలో పాతుకుపోయింది. తాజా ఫలితాలతో ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రెండుసార్లు ఈ జిల్లాలో పర్యటించారు. ఫలితాల్లో బీజేపీ ఓటమిపాలవ్వడంతో బొమ్మై సీఎం పదవి కోల్పోక తప్పలేదు. మే 10వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 73.19శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదవ్వడం ఇదే తొలిసారి. 2013లో 71.83శాతం, 2018లో 73.36శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసొచ్చినట్లు తెలుస్తోంది.
