Rajasthan: మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయవచ్చని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. మహిళలపై నేరాలను అరికట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని నొక్కి చెప్పారు. రాజస్థాన్ ఎన్నికలకు ముందు మహిళల భద్రతపై ముఖ్యమంత్రి కఠినమైన సందేశం ఇచ్చారు. సోమవారం శాంతిభద్రతల పరిస్థితిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారి రికార్డును ఉంచాలని పోలీసులను కోరారు. తద్వారా వారికి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయడంతో సహా చర్యలు తీసుకోవచ్చన్నారు.
Also Read: Hanuman Chalisa: లోక్‌సభలో హనుమాన్ చాలీసా పఠించిన మహారాష్ట్ర సీఎం కుమారుడు
రాజస్థాన్‌లో మహిళలను వేధించే పోకిరీలను సహించమన్నారు. మహిళలను వేధించే పోకిరీల పేర్లు నమోదు చేసుకుని స్టాఫ్ సెలక్షన్ బోర్డు, రాజస్థాన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్‌తో పంచుకుంటామన్నారు. తద్వారా ఈ దరఖాస్తుదారులను ప్రభుత్వ సేవలకు దూరంగా ఉంచవచ్చన్నారు. వారి క్యారెక్టర్ సర్టిఫికేట్‌లలో వేధింపుల చర్య గురించి ప్రస్తావించబడుతుందని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అనేక నేరాలపై బీజేపీ రాజస్థాన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజా ప్రకటనతో ముఖ్యమంత్రి మహిళల భద్రతపై బలమైన రాజకీయ సందేశాన్ని పంపుతున్నట్లు కనిపిస్తోంది. తన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై బీజేపీ చేసిన విమర్శలపై కేంద్ర ప్రభుత్వ సొంత డేటాతో ముఖ్యమంత్రి గత వారమే స్పందించారు. నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో గణాంకాలను పేర్కొంటూ, బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో అత్యధిక అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. అస్సాం, ఢిల్లీ, హర్యానా మహిళలపై నేరాలలో అగ్రస్థానంలో ఉన్నాయన్నారు.
ఈ సమావేశంలో నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉంచే బార్‌లు, నైట్‌క్లబ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన నిర్వాహకులు, యజమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు అటువంటి ఔట్‌లెట్ల లైసెన్సులను రద్దు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హోం శాఖ సహాయ మంత్రి రాజేంద్ర యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉషా శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (హోం) ఆనంద్ కుమార్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేష్ మిశ్రా, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
