PG Medical Seats: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యను అభ్యసించాలనుకునే మెరిట్ విద్యార్థులకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) శుభవార్త అందించింది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 విభిన్న వైద్య విభాగాల్లో కొత్తగా 161 పీజీ సీట్లకు ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 163 సీట్ల కోసం ప్రతిపాదనలు పంపగా, ఏకంగా 161 సీట్లకు (98.77 శాతం) అనుమతి లభించడం విశేషం.
కూటమి ప్రభుత్వం ఎన్ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టడంతో పాటు ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంపు, ఆధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు కల్పించడం వల్ల ఈ విజయం సాధ్యమైందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అదనపు సీట్లతో ప్రతిభావంతులైన విద్యార్థులకు పీజీ విద్య మరింత అందుబాటులోకి రానుంది. విభాగాల వారీగా పరిశీలిస్తే, ఆర్థోపెడిక్స్‌లో అత్యధికంగా 27 సీట్లు రాగా.. చర్మ, సుఖ వ్యాధుల విభాగం (డీవీఎల్), ఈఎన్‌టీ, పాథాలజీ విభాగాల్లో 16 చొప్పున పీజీ సీట్లు మంజూరయ్యాయి.

