కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. ఓ మహిళా కేంద్రమంత్రిగా ఆమె ఒక మైలురాయిని సాధించబోతున్నారు. గురువారం (ఫిబ్రవరి 1, 2024) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌తో దేశ చరిత్రలోనే ఆమె ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు.
సార్వత్రిక ఎన్నికల ముందు పార్లమెంట్ మధ్యంతర సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ కొత్త భవనంలో ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఇక గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా నూతన పార్లమెంట్‌లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించబోతున్నారు.
ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ వరుసగా ఆరవ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె సమం చేయబోతున్నారు. 2019 జూలై నుంచి వరుసగా ఐదు సంవత్సరాలు దేశానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను మహిళా ఆర్థికమంత్రి సీతారామన్ అందించారు. ఇక గురువారం ఆరవసారి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా 1959–1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.
ఇప్పుడు అదే వరుసలో నిర్మలా సీతారామన్ నిలిచారు. వరుసగా ఐదు బడ్జెట్‌లు సమర్పించిన ఆర్థిక మంత్రుల జాబితాలో నిర్మలా సీతారామన్ నిలబడ్డారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి. చిదంబరం, యశ్వంత్ సిన్హా ఐదుసార్లు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. తాజాగా ఓ మహిళా మంత్రి ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్నారు.
ఇది కూడా చదవండి:PM Modi: బడ్జెట్‌పై ప్రధాని మోడీ ఏమన్నారంటే..!
ఇందిరాగాంధీ తర్వాత..
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత మోదీ 2.0 ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. అప్పట్నుంచీ ఆమెనే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇక 1970-71 ఆర్థిక సంవత్సరానికి ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్‌ను సమర్పించిన రెండవ మహిళగా నిర్మలా సీతారామన్ కావడం విశేషం.