NTV Telugu Site icon

Union Budget: నిర్మలమ్మ బడ్జెట్‌లో మహిళలు లబ్ధి పొందేవి ఏంటంటే..!

Fm Minister

Fm Minister

సార్వత్రిక ఎన్నికల ముందు పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో మహిళలకు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. పదేళ్ల బీజేపీ ప్రభుత్వ కాలంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు నిర్మలమ్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుత బడ్జెట్‌లో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా కవరేజీని విస్తరించడం, లక్షపతి దీదీ పథకం లక్ష్యాన్ని పెంచుతున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ‘లక్షపతి దీదీ’ పథకం లక్ష్యాన్ని పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందుతుండగా దీన్ని 3 కోట్ల మందికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే తొమ్మిది నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Upasana Konidela: గవర్నర్ ను కలిసిన మెగా కోడలు..

ఇక 10 సంవత్సరాల్లో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28 శాతం పెరిగిందన్నారు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమేటిక్స్‌ కోర్సుల్లో బాలికలు, మహిళలు 43 శాతం నమోదు చేసుకున్నారని… ఇది ప్రపంచంలోనే అత్యధికమని చెప్పుకొచ్చారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం, పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 1/3 సీట్ల రిజర్వేషన్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 70 శాతం ఇళ్లు మహిళలకు ఇవ్వడం వారి గౌరవాన్ని పెంచుతాయని స్పష్టం చేశారు.