Site icon NTV Telugu

NIMS: నిమ్స్ అరుదైన రికార్డ్.. 6 నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడీ సర్జరీలు పూర్తి

Nims Kidney

Nims Kidney

నిమ్స్ యూరాలజీ విభాగం రికార్డులను తిరగరాస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది. 1989లో ప్రారంభమైనప్పటి నుంచి మూత్రపిండ మార్పిడి సర్జరీలకు నమ్మకమైన చిరునామాగా నిలిచిన నిమ్స్, భారీ శస్త్రచికిత్సలు, ఆధునిక నైపుణ్యంతో ప్రసిద్ధి చెందింది. 2015లో సీనియర్ ప్రొఫెసర్, విభాగాధిపతి డా. సి. రామ్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగింది. సీనియర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్‌ల బృందం గత పదేళ్లలో 1000కి పైగా కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసింది. ముఖ్యంగా గత ఆరు నెలల్లోనే 100 మార్పిడులు చేయడం గమనార్హం.

Also Read:Delhi: ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం..

ప్రతి సంవత్సరం 100కి పైగా మార్పిడులు చేస్తూ, గత రెండేళ్లుగా ఈ సంఖ్య మరింత పెరిగింది. నిమ్స్ దేశంలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసే మూడవ అగ్రశ్రేణి సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. రోబోటిక్ సిస్టమ్ లభ్యతతో సాంకేతికంగా ముందంజలో ఉండి, ఇప్పటివరకు 4 రోబోటిక్ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసింది. కిడ్నీ మార్పిడులతో పాటు, ఇదే బృందం ప్రతి నెలా 1000కి పైగా ఇతర శస్త్రచికిత్సలు నిర్వహిస్తోంది. అంటే సంవత్సరానికి 12,000కు పైగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అలాగే గత రెండేళ్లలో 350కి పైగా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు.

Also Read:BCCI: సంచలన నిర్ణయం.. జాతీయ క్రీడా బిల్లు పరిధిలోకి బీసీసీఐ..

ఈ అసాధారణ విజయాలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. రామ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజా నరసింహకు, నిమ్స్ డైరెక్టర్ డా. ఎన్. భీరప్పకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘనతలు నిమ్స్ యూరాలజీ విభాగం నిబద్ధత, నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచాయి.

Exit mobile version