Nimmagadda Ramesh: ప్రజాస్వామ్య బీజాలు మన సంస్కృతిలో ఎప్పుటినుంచో ఉన్నాయని.. ప్రజాస్వామ్యం బలహీనపడటానికి అంతర్గత శత్రువులే కారణమని మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. విజయవాడలో సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. సమన్యాయం కాకుండా, నాకు ఓటు వేయని వారిని అణిచేస్తాననే ధోరణి సరైనది కాదన్నారు. ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడం దుర్భరమన్నారు. పట్టణ ప్రాంతాలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో వెనుకబడి ఉన్నాయని.. ఓటు వేయకుండా ప్రజా ప్రతినిధి నుంచీ జవాబుదారీతనం ఎలా ఆశిస్తారన్నారు. ప్రతిపక్షాలకు సంఖ్యతో సంబంధం లేకుండా అవకాశం కల్పించాలన్నారు. గిలెటిన్ ద్వారా పద్దులు ఆమోదం పొందడం బాధాకరమన్నారు. CAG(కాగ్) నివేదికలకు కచ్చితంగా స్పందించాలన్నారు. కాగ్ పాలనా పరమైన సూచనలు ఇటీవల అరుదుగా చేస్తోందని ఆయన చెప్పారు. రాజ్యాంగ అధికరణలు 72,73 స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని జరుగుతున్నాయని ఇటీవల నివేదిక వచ్చిందన్నారు.
Also Read: Pawan Kalyan: కురుక్షేత్రం అంటే కురుక్షేత్రమే.. వచ్చేది జనసేన-టీడీపీ ప్రభుత్వమే..
వాలంటీర్ల వ్యవస్ధ మూలంగా సర్పంచ్‌లు అందరూ ఉత్సవ విగ్రహాలుగా మారామని ఆందోళనలో ఉన్నారన్నారు. చాలా మంది సర్పంచులు అధికార పార్టీ నుంచి, అధికార పార్టీ సానుభూతి పరులుగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో పౌరుల్లో అత్యంత చైతన్యం రాబోతోందని నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. ముందుగానే సరి చూసుకోకుండా.. ఓటు కనిపించలేదని ఎలా అంటారని ఆయన సూచించారు. ఓటర్ల జాబితాలో లోపాలు సరి చేసుకోడానికి సమగ్రమైన సూచనలు ఎలక్షన్ కమిషన్ చేసిందని పేర్కొన్నారు. ఆగస్టు 20 నుంచి సెప్టెంబరు 23 వరకూ మదింపు చేసిన ఓటర్ల ప్రక్రియ రేపు జరగబోయే ఎన్నికలకు మూలమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సేవలు ఓటర్ల వివరాల సవరణలో వినియోగించుకోవాలని సూచనలు చేశారు. Empowering Democracy వెబ్ సైట్ ప్రారంభిస్తామని.. ఒక టోల్ ఫ్రీ నంబరు కూడా ఇస్తామన్నారు. ఓటు వినియోగంపై ఒక అవగాహన కల్పించడం.. కంప్లైంట్లను సంబంధిత అధికారులకు తీసుకెళ్ళడం ఈ వెబ్ సైట్ ఉద్దేశమని ఆయన చెప్పారు.