Site icon NTV Telugu

Nikki Haley: అమెరికా అధ్యక్ష బరి నుంచి నిక్కీ హేలీ నిష్క్రమణ!

Nikkey Healy

Nikkey Healy

అమెరికా అధ్యక్ష బరి నుంచి నిక్కీ హేలీ (Nikki Haley) నిష్క్రమించనున్నారు. అధ్యక్ష పోటీకి కావాల్సిన మెజార్టీని ఆమె సాధించలేకపోయారు. దీంతో ఆమె బరి నుంచి తప్పుకునే పరిస్థితి నెలకొంది. దీంతో మరోసారి జో బైడెన్-ట్రంప్ మధ్యే ఫైటింగ్ జరగనుంది.

అగ్రరాజ్యం అమెరికాలో (USA) అధికార పీఠం కోసం జరిగే ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రత్యర్థులుగా ఉండేటట్లు కనిపిస్తోంది. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగాలని భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ (Nikki Haley) నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఆమె అధికారిక ప్రకటన చేయనున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

మంగళవారం జరిగిన ‘సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీల’ పోరులో ఈమె దారుణంగా ఓడిపోయారు. రిపబ్లికన్‌ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావడానికి 1,215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉంటుంది. కానీ ఫలితాల తర్వాత ట్రంప్‌నకు 995 మంది మద్దతు ఉండగా.. హేలీ ఖాతాలో 89 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ట్రంప్‌తో పోలిస్తే భారీ వెనుకంజలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోటీని విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు ఆమె ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్‌నకు పోటీగా.. నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామితో పాటు డజను మందికి పైగా బరిలోకి దిగారు. అయితే ప్రైమరీలు మొదలైన నాటి నుంచే ట్రంప్ ఆధిక్యంలో కొనసాగారు. దీంతో ప్రధాన పోటీదారులు వరుసగా రేసు నుంచి వైదొలిగారు. చివరగా మిగిలిన హేలీ కూడా పోటీని విరమించుకునేందుకు సిద్ధమయ్యారు. అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్‌ పోటీ ఖాయం కానుంది. అటు డెమోక్రాట్ల తరఫున బైడెన్‌ ముందంజలోనే ఉన్నారు. దీంతో మరోసారి బైడెన్-ట్రంప్ ఎన్నికల్లో తలపడనున్నారు. ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

ఇదిలా ఉంటే జో బైడెన్ ఆరోగ్యరీత్యా పోటీ నుంచి తప్పుకుంటారని వార్తలు వినిపించాయి. ఆయన స్థానంలో మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిచెల్ పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలను ఆమె ఖండించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మిచెల్ తేల్చిచెప్పారు.

Exit mobile version