NTV Telugu Site icon

NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

Nia

Nia

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల సంఘం నేత ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈరోజు తెల్లవారుజామున నుంచి సోదాలు చేపట్టారు. గత కొద్ది దశాబ్దాలుగా పౌర హక్కుల సంఘంలో వెంకటేశ్వర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వెంకటేశ్వర్లుకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో పాటు వారికి ఆశ్రయం ఇచ్చి సహకారం అందిస్తున్నారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఇక, మరింత సమాచారం కోసం వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు వెళ్లకుండా లోపలే ఉంచారు. ఆయన ఫోన్ డేటాను విశ్లేషించడంతో పాటు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే దానిపై ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఉన్న పలు పుస్తకాలలో ఉన్న సమాచారాన్ని ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తున్నారు.

Read Also: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ఇక, పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న అన్నపూర్ణ, అనూష నివాసంలో ఎన్ఐఏ తనిఖీలు చేస్తున్నారు. తిరుపతిలో ఉంటున్న న్యాయవాది క్రాంతి చైతన్య, నెల్లూరులో అరుణ, గుంటూరులో డాక్టర్ రాజారావులతో పాటు హైదరాబాద్‌లో నివసిస్తున్న భవాని, న్యాయవాది సురేష్ ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు ఇంటిపై, సంతమాగులూరులో ఓరు శ్రీనివాసరావు, రాజమండ్రి బొమ్మెరులో పౌర హక్కుల నేత నాజర్, హార్లిక్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగి కోనాల లాజర్, శ్రీకాకుళం జిల్లాలో కేఎన్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్కా కృష్ణయ్య ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.